జింబాబ్వే : విద్యా వ్యవస్థలో భారీ సంస్కరణలు... పిల్లల్ని బడికి పంపకపోతే తల్లిదండ్రులకు రెండేళ్ళ జైలు శిక్ష

జంబాబ్వే ఆర్థిక సంక్షోభం

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, జింబాబ్వేలో పెద్ద ఎత్తున విద్యా సంస్కరణలు

విద్యా వ్యవస్థలో భారీ సంస్కరణలకు సిద్ధమయ్యింది జింబాబ్వే. ముఖ్యంగా డ్రాపౌట్స్ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఇకపై తల్లిదండ్రులు తమ పిల్లల్ని పాఠశాలకు పంపకపోతే రెండేళ్ల వరకు జైలు శిక్ష తప్పదని హెచ్చరిస్తోంది.

దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో గడిచిన కొన్నేళ్లుగా పాఠశాలలకు వచ్చే పిల్లల సంఖ్య తగ్గుతూ వస్తోంది.

దీంతో పిల్లలకు 16 ఏళ్లు వచ్చేంత వరకు స్కూలుకి వెళ్లడం తప్పనిసరి చేసింది జింబాబ్వే ప్రభుత్వం.

సర్కారు అంచనాల ప్రకారం దేశంలోని కొన్ని ప్రాంతాల్లో సుమారు 20% చిన్నారులు బడి ముఖం చూడటం లేదు.

News image

ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టం ప్రకారం ఇకపై ఫీజు చెల్లించలేదన్న నెపంతో కానీ, గర్భం దాల్చారన్న కారణంతో కానీ విద్యార్థుల్ని బడి నుంచి వెళ్లగొట్టడం నేరం.

జింబాబ్వే వల్నరబిలిటీ అసెస్మెంట్ కమిటీ లెక్కల ప్రకారం గత ఏడాది ఫీజు చెల్లించలేదన్న నెపంతో ప్రాథమిక పాఠశాల విద్యార్థుల్లో ఏకంగా 60 శాతం మందిని ఇంటికి పంపించి వేశారు .

1980లో జింబాబ్వేకి స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశానికి తొలి అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన రాబర్ట్ ముగాబే ప్రవేశపెట్టిన విద్యా విధానాలకు సర్వత్రా ప్రశంసలు లభించాయి.

ఆ దేశంలోని నల్ల జాతీయుల్లో అక్షరాస్యత పెంచడం కోసం ఆయన ఏకంగా 100 ప్రభుత్వ పాఠశాలల్ని ప్రారంభించి ఉచిత విద్యనందించారు.

ఫలితంగా ఒకప్పుడు ఆఫ్రికాలోనే అత్యధిక అక్షరాస్యత కల్గిన దేశంగా జింబాబ్వే పేరుగాంచింది.

అయితే 1990 తర్వాత ఉచిత విద్యా పథకం నిలిచిపోయింది. ఆ తర్వాత దశాబ్దంలోనే దేశ విద్యా విధానంలో ఒడిదొడుకులు మొదలయ్యాయి.

జింబాబ్వే సంక్షోభం

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, జింబాబ్వేలో పిల్లల్ని బడికి పంపకపోతే తల్లిదండ్రులకు జైలు

జింబాబ్వే ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మార్పులేంటి ?

విద్యా చట్టంలో కొత్తగా తీసుకొచ్చిన సవరణల ప్రకారం జింబాబ్వేకి చెందిన ప్రతి చిన్నారి కచ్చితంగా 12 ఏళ్ల పాటు పాఠశాలకు వెళ్లి తీరాలి. గతంలో ఇది 5 ఏళ్లకే పరిమితమై ఉండేది.

ఈ విషయంలో అమ్మ, నాన్నలను కూడా బాధ్యుల్ని చేయనున్నారు.

తమ బిడ్డల్ని పాఠశాలకు పంపండంలో విఫలమైన తల్లిదండ్రులకు రెండేళ్ల వరకు జైలు లేదా స్థోమత ఉన్నట్టయితే సుమారు 20 వేల రూపాయల జరిమానా విధిస్తారు.

ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక సంక్షోభం నేపద్యంలో తల్లిదండ్రులు విద్య ప్రాధాన్యాన్ని గుర్తించేలా చేసేందుకు తీసుకున్న సాహోసోపేతమైన నిర్ణయమని బీబీసీ హరారే ప్రతినిధి షింగై న్యొక అన్నారు.

ఉచిత విద్యను అందిస్తామని, పాఠశాలల కొరతను తీరుస్తామని గతంలో హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు తన బాధ్యతల నుంచి తప్పించుకునేందుకు చేస్తున్న ప్రయత్నం ఇది అని కొందరు భావిస్తున్నారు .

చిన్న వయసులో పెళ్లిళ్లు కావడం, గర్భం దాల్చడం, పాఠశాలలు అందుబాటులో లేకపోవడం కూడా డ్రాపౌట్స్ పెరిగడానికి కారణాలని బీబీసీ ప్రతినిధి చెప్పారు .

బడికి విద్యార్థులు ఎందుకు గైర్హాజరవుతున్నారు ?

బడికి విద్యార్థులు ఎందుకు గైర్హాజరవుతున్నారు ?

షింగై నియోకా, బీబీసీ ప్రతినిధి, హరారే

తినడానికి తిండి సంపాదించడమే కష్టమైపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో జింబాబ్వే ప్రజలు తమ పిల్లల చదువుపై ఖర్చుపెట్టే పరిస్థితిలో లేరు .

విద్యార్థులుండే ప్రాంతాన్ని బట్టి ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఫీజు భారతీయ కరెన్సీలో ఏడాదికి సుమారు 2వేల రూపాయల నుంచి 50వేల రూపాయల వరకు ఉంటోంది.

2018లో తల్లిదండ్రులు తాము సంపాదించిన మొత్తంలో మూడో వంతు పిల్లల చదువు కోసమే ఖర్చు పెట్టారని జింబాబ్వే వల్నరబిలిటీ అసెస్మెంట్ కమిటీ చెబుతోంది.

జింబాబ్వే సంక్షోభం

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, ప్రభుత్వ గుర్తింపు లేని పాఠశాలల్లో యూనిఫాంల విషయంలో పెద్దగా పట్టింపులు లేవు

జింబాబ్వేలో ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో రాజధానిలోని అత్యంత నిరుపేద ప్రాంతాల్లో ఎప్ వర్త్ లాంటి పాఠశాలలు ఇళ్లల్లోనూ, ఖాళీ ప్రదేశాల్లోనూ తాత్కాలికంగా తరగతుల్ని నిర్వహిస్తున్నాయి.

నిజానికి వాటికి ప్రభుత్వ గుర్తింపు లేదు. అవి చట్ట విరుద్ధమైనవి కూడా. అయితే ఇందులో చేరిన పిల్లలు నెలకు కేవలం 3 డాలర్లు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది.

అది కూడా వారికి ఎప్పుడు వీలైతే అప్పుడు ఇవ్వవచ్చు.

తమ పాఠశాలలో పిల్లలు ఎప్పుడు తీసుకురాగల్గితే అప్పుడు ఫీజను తీసుకొచ్చి ఇవ్వవచ్చని ఈ తరహా బడిని నిర్వహిస్తున్న యునైస్ మరొంగ అన్నారు.

ఏకరూప దుస్తుల(యూనిఫాంలు) విషయంలోనూ పెద్దగా పట్టింపులు లేవు. ఈ పాఠశాలల్లో పిల్లలు కూర్చునేందుకు బల్లలు ఉండవు, చదువుకునేందుకు టెక్స్ట్ పుస్తకాలు ఉండవు.

కేవలం టీచర్ దగ్గర మాత్రమే టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. ఈ తరహా పాఠశాలల్లో ఉన్న లోపం ఇదే .

ప్రభుత్వ పాఠశాలల సంఖ్య తగ్గిపోవడంతో ఈ తరహా పాఠశాలల సంఖ్య గణనీయంగా పెరిగింది. దేశ వ్యాప్తంగా సుమారు 2వేల బడులు ఉంటాయని స్వచ్చంద సంస్థల అంచనా.

ఎలిజిబెత్ చిబండ ఓ చిరు వ్యాపారి. ఆర్థిక సంక్షోభం కారణంగా తన వ్యాపారం నిలిచిపోవడంతో తన బిడ్డను స్వగ్రామానికి పంపించివేసినట్టు ఆమె చెప్పారు.

ఊళ్లో కూడా ఆమె ఏమీ చెయ్యడం లేదు. ప్రతి ఒక్కరూ కచ్చితంగా స్కూలుకి వెళ్లాల్సిన స్థితిలో గ్రేడ్ త్రి చదవాల్సిన విద్యార్థి ఇంట్లో ఉంటే నాకు సిగ్గుగానే ఉంది. ఆరేళ్ల నా కొడుకును కూడా ఇంకా స్కూలుకి పంపలేదు. అని ఎలిజబెత్ తన ఆవేదన వ్యక్తం చేశారు.

జింబాబ్వే సంక్షోభం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2014 ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం జింబాబ్వేలోని 89% వయోజనులు చదవగలరు, రాయగలరు.

జింబాబ్వేలో రాబర్ట్ ముగాబే తర్వాత అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన ఎమర్షన్ మనంగాగ్వా దేశ ఆర్థిక వ్యవస్థకు అంతో ఇంతో జీవం పోస్తారని అంతా భావించారు.

కానీ పరిస్థితులు అంత కన్నా అధ్వాన్నంగా తయారయ్యాయి. ఇప్పటికీ ద్రవ్యోల్బణంతో అతలాకుతలమైపోతోంది జింబాబ్వే.

విదేశీ నిల్వలు పడిపోయాయి. ఆహారం, ఇంధనం, విద్యుత్ కొరత తీవ్రంగా ఉంది. ఒకప్పుడు ఆహార ఎగుమతుల్లో ముందుండే దేశం ఇప్పుడు తీవ్ర కరవుతో అల్లాడిపోతోంది .

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)