దిల్లీ హింస: మారిన వరుడితో హాస్పిటల్‌లోనే పెళ్లి

- రచయిత, చింకీ సిన్హా
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఈశాన్య దిల్లీలో చెలరేగిన అల్లర్లతో అనేక కుటుంబాలు ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకి తరలి వెళ్లాయి. అలా వెళ్లిన వారిలో ఇంకొన్ని రోజుల్లో వివాహం కావల్సిన రుక్షార్ రుక్షతి కుటుంబం కూడా ఉంది.
ఆ రోజు రాత్రి భారీగా వర్షం కురుస్తోంది. ఆ రోజు రుక్షార్ రుక్షతి ముస్తఫాబాద్‌లోని హాస్పిటల్ మొదటి అంతస్తు నుంచి బయటకి వచ్చింది. ఆమె ఉండే ఇంటి చుట్టు పక్కల అల్లర్లు చెలరేగడంతో ఫిబ్రవరి 26వ తేదీ నుంచి ఆమె హాస్పిటల్లోనే కుటుంబంతో కలిసి ఉంటున్నారు.
ఆమె పొరుగింట్లో ఉండే పంకజ్ ఆ ఇంటికి కాపలా కాస్తున్నామని ఆమె కుటుంబానికి ఫోన్ చేసి చెప్పారు. ఆమె సోదరుడు అంజాద్ తాను స్నేహితులమని పంకజ్ చెప్పారు. అయన కూడా వారి రాక కోసం ఎదురు చూస్తున్నారు.
"మేము వాళ్లకి ఉండటానికి ఇల్లు ఇచ్చినందుకు మమ్మల్ని బెదిరించారు. కానీ వాళ్లెవరో మేము మీకు చెప్పలేము. కానీ రుష్కర్ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నానని" పంకజ్ చెప్పారు.

హాస్పిటల్లోనే నిశ్చయమైన పెళ్లి
అకస్మాత్తుగా నిశ్చయమైన తన పెళ్లితో అదే హాస్పిటల్‌లో ఉన్న పెళ్లి కొడుకు ఫిరోజ్ ఇంకా ఆశ్చర్యంలోనే ఉన్నాడు. రుక్షర్‌కి అతనితో వివాహం ముందుగా నిర్ణయించింది కాదు. కొన్ని అనుకోని పరిస్థితుల్లో కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయి. ఆమె పెళ్లి మార్చ్ మూడవ తేదీన జరగాల్సి ఉంది.
గురువారం సాయంత్రం ఎక్కడి నుంచో వచ్చిన మేఘాలు ఆమె జీవితంలో ఒక మార్పుకి శ్రీకారం చుట్టాయి.
ఆమె ఎరుపు రంగు లెహంగాని ధరించింది. అవి ఆమె పెళ్లి దుస్తులు కావు. హాస్పిటల్‌లో డాక్టర్ ఆమెకి ఆ బట్టలు బహుకరించారు. ఆమె పెళ్ళికి కొనుక్కున్న సామగ్రి అంతా ఇంటిలోనే ఉండిపోయింది.
ఫిబ్రవరి 24 వ తేదీన చేతిలో ఆయుధాలు పట్టుకుని నినాదాలు చేస్తున్న రౌడీ మూకలు ఢిల్లీలో ఆమె ఇంటి పై దాడి చేసినపుడు ఆమె కుటుంబం కట్టుబట్టలతో ఇంటి నుంచి పారిపోయి ఈ హాస్పిటల్లో తల దాచుకున్నారు.
23 ఏళ్ల ఫిరోజ్ లేత నీలి రంగు సూట్, నలుపు శాటిన్ షర్ట్ ధరించాడు. ఈ పెళ్లిని ఎలా తీసుకోవాలో అతనికి అర్ధం కావటం లేదు. ఇదంతా అనుకోకుండా జరిగిపోయింది. హాస్పిటల్ మొదటి అంతస్తులో వాళ్ళిద్దరి వివాహం జరిగింది.
వాళ్లిదరు ప్రేమలో పడ్డారని అక్కడ ఉన్న ఒకామె అన్నారు. ఆమె ఆ వివాహం చూడటానికి వచ్చిన అతిథి.
రుష్కర్ పెళ్ళి ముందు అతనితో ఖాయం కాలేదు. ఆమె పెళ్ళి పత్రికలో మరో పెళ్ళికొడుకు పేరు ఉంది.

పెళ్ళికి దారి తీసిన కారణాలు ఏమిటి?
రుష్కర్ తండ్రి బన్నీ ఖాన్ తూర్పు ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన గొడవలతో సర్వస్వము కోల్పోయామని ముందుగా నిశ్చయమైన పెళ్లి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పగానే ఆ పెళ్లి కొడుకు రుష్కర్‌ని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించారు. వాళ్ళు ఘజియాబాద్‌లో నివాసం ఉంటారు. దీంతో బన్నీ ఖాన్‌కి ఏమి చేయాలో పాలు పోలేదు.
తోపుడు బండి లాక్కునే బన్నీ ఖాన్ రుష్కర్ పెళ్ళికి వివాహ మండపం ఖరారు చేసి 5000 రూపాయిలు అడ్వాన్స్ కూడా చెల్లించారు. హల్వా తయారీకి మరో 1000 రూపాయిలు ఇచ్చారు.
ఆమె తల్లి 6000 రూపాయలతో పెళ్ళికి బట్టలు కొన్నారు.
తొమ్మిదివ తరగతి చదువుకున్న రుష్కర్ తాను పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తిని చూడలేదు. కానీ పెళ్లి బట్టలు చూసి చాలా ఉత్సాహపడ్డారు.
ఢిల్లీలో హింస చెలరేగిన రాత్రి ఆమె తన తండ్రి 30 సంవత్సరాల క్రితం కట్టించిన నాల్గు గదుల ఇంటిలో ఉంది. ఆ రాత్రి వాళ్ళు తమ పక్కింట్లో తల దాచుకున్నారు. కానీ, ఆ ఇంటివాళ్ళకి బెదిరింపులు రావడంతో ఆమెతో సహా ఆమె కుటుంబ సభ్యులు 16 మంది ఇంకొక ఇంటికి మారి అక్కడ నుంచి ముస్తఫాబాద్‌లో ఉండే అల్-హింద్ హాస్పిటల్ కి చేరుకున్నారు. వాళ్ళు చెప్పులు కూడా లేకుండా ఇంటిని వదిలిపెట్టారు. వెనక్కి వచ్చి పెళ్లి బట్టలు, సామాన్లు తీసుకునే పరిస్థితి లేదు. వాళ్లకి జరగాల్సిన పెళ్లి ఆగిపోయిందనే బాధ ఉంది.
అకస్మాత్తుగా నిర్ణయమైన పెళ్లి
"ఇది పరువుకు సంబంధించిన విషయం అవ్వడంతో నేను నా తమ్ముడు చుటాన్‌ని మా అమ్మాయిని తన ఇంటి కోడలిని చేసుకుంటాడేమోనని అడిగాను", అని బన్నీ ఖాన్ చెప్పారు.
ఫిరోజ్ వాళ్ళ నాన్నకి ఎదురు చెప్పలేకపోయారు. కానీ అతనికి ఇంకా కొంచెం సమయం తీసుకుని తన స్నేహితులతో, కొత్త బట్టలతో పెళ్లి చేసుకోవాలనే కోరిక ఉంది. ఫిరోజ్ జొమాటోలో డెలివరీ బాయ్ గా పని చేస్తున్నాడు. అతను 8వ తరగతి తర్వాత స్కూల్ మానేసారు. వాళ్ళు కృష్ణ నగర్ లో ఒక గదిలో అద్దెకి ఉంటారు. అతని దగ్గర ఇంకా కొంచెం సమయం ఉంటే అతను తనకి తన భార్యకి ఒక గది కట్టుకుని ఉండేవారు. కానీ, ఉన్న రెండు రోజుల్లో తనకి కొత్త సూట్ కుట్టించుకోవడానికే టైం లేదు. అతను నలుగురు పిల్లల్లో పెద్దవాడు. అతను రుష్కర్ వైపు ఒకసారి చూసి తల దించుకున్నారు. ఆ రాత్రికి ఆమె అతని సహచరిగా అతని ఇంటికి వెళ్తున్నారు.

ఇరుగు పొరుగు సహాయం
రుష్కర్ పెళ్లి అల్ హింద్ హాస్పిటల్‌లో నిశ్చయం అవ్వగానే హాస్పిటల్లో ఉండే ఒకామె మంగళవారం సంతకి వెళ్లి మెట్టెలు, ముక్కు పుడక కొని తెచ్చింది. వాటి ఖరీదు 30 రూపాయలు.
ఆమె వంటి మీద పెళ్లి రోజు ఇసుమంత బంగారం కూడా లేకపోవడం చూసి అఫ్రోజ్ బానోకి బాధ కల్గింది. ఆమె ఇరుగు పొరుగుని సహాయం అడగాలని నిర్ణయించుకుంది. ఆమె ఫిబ్రవరి 25 నుంచి అక్కడ కొంత మంది రోగులకు సహాయం చేయడానికి హాస్పిటల్‌కి వస్తోంది. అక్కడే ఉన్న రోగులకు ఆమె గుడ్లు , టీ తెచ్చి ఇచ్చింది. అపుడే ఆమె ఈ పెళ్లి గురించి విన్నది. ఆమె చుట్టు పక్కల వాళ్ళ సహాయం అడిగి పెళ్ళికి కావల్సిన ఏర్పాట్లు చేయాలని నిశ్చయించుకుంది. అఫ్రోజ్ పెళ్ళికి కావల్సిన ఏర్పాట్లు చేస్తానని ఆ కుటుంబానికి భరోసా ఇచ్చింది.
నయీమ్ అనే ఒక నగల వ్యాపారి వెండి మెట్టెలు డబ్బులు తీసుకోకుండా ఇచ్చారు.
పాత ముస్తఫాబాద్ నివాసం ఉండే షాహినా రియాజ్ తన బంగారు ముక్కు పుడుకని ఇచ్చింది. ఇంకొకరు గాజులు తెచ్చారు.
అఫ్రోజ్ భర్త పాత సామాన్లు అమ్మే వ్యాపారం చేస్తారు.

"మేమేమి ధనవంతులం కాదు, కానీ ఆమె అన్ని వదులుకుని మా ఊరు వచ్చింది. పెళ్లి అనేది జీవిత కాలపు జ్ఞాపకం. రోజులు చాలా బాధాకరంగా ఉన్నప్పటికీ మేమెంత చేయగలమో అంత చేస్తాం. జీవితం ముందుకి సాగుతూనే ఉంటుంది".
అందుకే ఆమె తనకి చేతనైనంత చేయడానికి కష్టపడింది. ఆమె పెళ్ళికూతురికి చెవి దుద్దులు, పట్టీలు కొన్నది. పెళ్లికొడుక్కి బట్టలు, సుగంధ ద్రవ్యాలు, మిఠాయి బహుకరించింది. అదేమీ పెద్ద ఖర్చు కాదని ఆమె అంటున్నారు.
వీటికి 8000 రూపాయిలు అయింది. కానీ ఆమె పెళ్లి ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఆమె కుటుంబం భయంతో ఏడుస్తూనే ఉన్నారు. మేము వాళ్ళకి ధైర్యం చెప్పి వీలయినంత సహాయం చేస్తామని చెప్పాం.
హాస్పిటల్ ని నడిపే మిరాజ్ అన్వర్ అతని సోదరుడు ఎం ఏ అన్వర్ పెళ్ళికి విందు ఏర్పాటు చేశారు. ఆమెకి ఎరుపు లెహంగా కొన్నారు.
చుట్టు పక్కల ఉండే మహిళలు కొన్ని పాతవి, కొన్ని కొత్తవి కృత్రిమ నగలు ఇచ్చారు. అక్కడే బ్యూటీ పార్లర్ నడిపే షమ పెళ్ళికూతురికి మేక్-అప్ చేశారు.
అఫ్రోజ్ పెద్ద కూతురి పెళ్ళిలో కొనుక్కున్న బట్టలని రుక్షణ చెల్లెళ్లకి ఇచ్చారు.

ముందు నిశ్చయమైన పెళ్లి పట్ల సుముఖత లేదని చెప్పిన రుష్కర్
ఫిరోజ్ ని ఇష్టపడుతున్నానని రుష్కర్ చెప్పారు. తనకి ముందు నిశ్చయమైన పెళ్లి కొడుకు కుటుంబం నచ్చలేదని చెప్పారు.
"వాళ్ళు మమ్మల్ని కానుకల కోసం ,పెళ్లి ఘనంగా చేయడం కోసం చాలా ఇబ్బంది పెట్టారు" అని అంది.
రుక్షణ తల్లి షమ పర్వీన్ మాత్రం కొత్త బట్టలు వేసుకోలేదు.
"తిను నా మూడవ కూతురు. అనుకున్నట్లే తన పెళ్లి చేయాలని అనుకున్నాం. ఇప్పట్లో ఇంటికి తిరిగి వెళ్లే పరిస్థితి కన్పించటం లేదు", అని ఆమె తల్లి బాధపడింది.
మేము చేయగలిగినంత చేశామని డాక్టర్ మీరజ్ ఇక్రం అన్నారు.
బన్నీ ఖాన్ ఇల్లు సురక్షితంగా ఉందని నేను చెప్పాను. వాళ్ళు త్వరలోనే ఇంటికి వెళతామని చెప్పారు.

ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనావైరస్ ఎంత వేగంగా విస్తరిస్తోంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్లు ఎక్కడి నుంచి వస్తాయి... ఒక్కసారిగా ఎలా వ్యాపిస్తాయి?
- కరోనావైరస్: కోట్లాది మంది ప్రాణాలు తీసిన స్పానిష్ ఫ్లూ నుంచి మనం నేర్చుకోగల పాఠాలేమిటి?
- కరోనావైరస్: శశిథరూర్ మెడలోని ఈ గాడ్జెట్ వైరస్‌లను అడ్డుకుంటుందా
- కరోనావైరస్: చైనాలో ఇళ్లకే పరిమితమైన కోట్లాది మంది ప్రజలు ఏం చేస్తున్నారు?
- దిల్లీలో అలర్లు చేయించేందుకు ముస్లింలకు డబ్బులు పంచారా? : Fact Check
- ఆల్కహాల్ తాగిన తర్వాత మీ శరీరంలో ఏం జరుగుతుంది? హ్యాంగోవర్ దిగాలంటే ఏం చేయాలి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









