కరోనావైరస్: చైనాలో ఇళ్లకే పరిమితమైన కోట్లాది మంది ప్రజలు ఏం చేస్తున్నారు?

ఫిట్‌నెస్

ఫొటో సోర్స్, Reuters

కరోనావైరస్ ప్రభావంతో చైనాలో కోట్లాది మంది ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ పరిస్థితుల్లో తమ వినియోగదారులకు అందుబాటులో ఉండేందుకు, కాస్తో కూస్తో ఆదాయం సమకూర్చుకునేందుకు ఇక్కడి వ్యాపారులు విభిన్న మార్గాలను ఎంచుకుంటున్నారు.

కరోనా వ్యాప్తికి మూలబిందువైన హుబే ప్రావిన్సులో 5.6 కోట్ల మందికి పైగా ప్రజలు కఠిన ఆంక్షల మధ్య గడుపుతున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో ఎవరూ తమ గ్రామాలు, నివాస సముదాయాలను దాటి బయటకు రావడంలేదు.

కరోనా‌వైరస్ వ్యాప్తిని నిలువరించేందుకు చైనా ప్రభుత్వం విధించిన ఆంక్షల ప్రభావం దాదాపు 50 కోట్ల మంది మీద పడిందని అంచనా.

News image

తమ ఇబ్బందుల గురించి ప్రపంచానికి తెలియజేసేందుకు, బోర్ కొట్టకుండా కాస్త కాలక్షేపం చేసేందుకు అనేక మంది ఇంటర్నెట్‌ను ఎంచుకుంటున్నారు.

చైనాలోని సోషల్ మీడియా సైట్ వీబోలో "boring" అనే పదం కోసం శోధనల సంఖ్య జనవరి 26న 626 శాతం పెరిగిందని 'ది పేపర్' పేర్కొంది. "ఇంట్లో బోర్ కొట్టినప్పుడు ఏం చేయాలి?" లాంటి ప్రశ్నలు అడగడం ఆ వెబ్‌సైట్‌లో ఇప్పుడు ఓ ట్రెండ్‌గా మారింది.

దీంతో, తమ వినియోగదారులతో టచ్‌లో ఉండేందుకు చైనాలోని సంస్థలు విభిన్న మార్గాలను ఎంచుకుంటున్నాయి.

వ్యాయామం చేస్తున్న యువతి

ఫొటో సోర్స్, iStock

ఇంట్లోనే వ్యాయామ వీడియోలు

కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడంలో భాగంగా చైనా వ్యాప్తంగా జిమ్‌లను మూసివేశారు. ఇప్పుడు చాలా జిమ్‌లు తమ వినియోగదారులకు ఆన్‌లైన్‌లో క్లాసులు చెప్పడం ప్రారంభించాయి. ఆరోగ్యంగా ఉండేందుకు ఇంట్లోనే ఎలా వ్యాయామం చేయవచ్చో ఫిట్‌నెస్ ట్రైనర్లు సూచనలు చేస్తున్నారు.

చైనాలో బాగా వినియోగించే మెసేజింగ్ యాప్ 'వీచాట్' ద్వారా తాము వ్యాయామ తరగతులు అందిస్తున్నామని షాంఘైలోని ఎఫ్45 జిమ్ జనరల్ మేనేజర్ లారెన్ హోగన్ బీబీసీతో చెప్పారు.

ట్రైనర్లు ఫిట్‌నెస్ వీడియోలను రికార్డు చేసి వినియోగదారులకు ఆన్‌లైన్‌లో ప్రసారం చేస్తారు. కొందరు యాప్‌లోనే ఛాలెంజ్ పోటీలు కూడా పెడుతున్నారు.

ఈ ఆన్‌లైన్ తరగతులకు వినియోగదారుల నుంచి మంచి స్పందన వస్తోందని లారెన్ అంటున్నారు.

చైనాలోని ఇతర వ్యాయామ శిక్షణ సంస్థలు కూడా తమకు తోచిన విధంగా వినియోగదారులతో అనుసంధానం అవుతున్నాయి. బీజింగ్‌లోని గ్రావిటీ ప్లస్ అనే సంస్థ ఆన్‌లైన్ తరగతులు నిర్వహించడంతో పాటు, అదనపు ఆదాయం కోసం జిమ్‌ పరికరాలను అద్దెకు కూడా ఇస్తోంది. ఆ పరికరాలను తీసుకెళ్లి వినియోగదారులు తమ ఇంట్లోనే వ్యాయామం చేసుకోవచ్చు.

డీజే

ఫొటో సోర్స్, ThE PAPER

ఫొటో క్యాప్షన్, డీజేలు ఆన్‌లైన్‌‌లో ప్రత్యక్షప్రసారాలు చేస్తూ వినియోగదారులను ఆకర్షిస్తున్నారు

నైట్ క్లబ్బులు మూసివేశారు. సంగీత కచేరీ కార్యక్రమాలు రద్దయ్యాయి. దాంతో, చైనాలోని అనేక మంది డీజేలు, క్లబ్బులు కలిసి 'క్లౌడ్ క్లబ్బింగ్' వైపు మళ్లారు.

క్లౌడ్ క్లబ్బింగ్‌లో డీజీ సెట్స్‌ను ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిస్తూ, సందేహాలు పంపుకుంటూ నిజంగా క్లబ్బులో ఉన్నామన్న అనుభూతి పొందవచ్చు.

సాధారణంగా చైనాలోని డౌయిన్, టిక్‌టాక్‌ యాప్‌లలో క్లౌడ్ క్లబ్బింగ్ ఈవెంట్లు జరుగుతుంటాయి.

అలాంటి క్లౌడ్ క్లబ్బింగ్‌ కార్యక్రమాలతో 'TAXX షాంఘై' అనే క్లబ్ జనాలను భలే ఆకర్షిస్తోంది.

"ఇటీవల మా స్నేహితులు చాలామంది ఎప్పుడూ ఇంట్లోనే ఉండాల్సి వస్తోంది. చాలా బోర్ కొడుతోందని అన్నారు. దాంతో, ఉల్లాసభరితమైన సంగీతాన్ని ఆన్‌లైన్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయడం ప్రారంభించాం. ఆ సంగీతం వింటే మనసుకు ప్రశాంతత వస్తుంది. ఈ కార్యక్రమానికి మంచి స్పందన వస్తోంది. టిప్స్ రూపంలో 75 లక్షల రూపాయల దాకా ఆదాయం వస్తోంది. అయినా, ఆ డబ్బు మా అద్దెలకు సరిపోదు’’ అని 'TAXX షాంఘై' మేనేజర్ రువాన్ లియాంగ్‌లియాంగ్ చెప్పారు.

చైనాలోని పలు నగరాల్లో భారీ ఎత్తున సంగీత కచేరీలు నిర్వహించిన స్ట్రాబెర్రీ మ్యూజిక్ ఫెస్టివల్ నిర్వాహకులు... ఇప్పుడు "హాయ్! నేను కూడా ఇంట్లోనే ఉన్నాను" పేరుతో ఇండోర్ మ్యూజిక్ ఫెస్టివల్‌ను నిర్వహించింది. అది ఐదు రోజుల పాటు జరిగింది. అందులో ముందుగా రికార్డు చేసిన మ్యూజిక్ షోలను ఆన్‌లైన్‌లో ప్రసారం చేశారు.

చవుదుకుంటున్న యువతి

ఫొటో సోర్స్, Getty Images

పుస్తకాల సంగతి ఏంటి?

ఇప్పటికే ఆన్‌లైన్ అమ్మకాలతో తీవ్రంగా సతమతమవుతున్న పుస్తకాల దుకాణాలకు కరోనావైరస్ దెబ్బతో కష్టాలు మరింత పెరిగాయి.

తమ వినియోగదారులకు చేరువయ్యేందుకు ఈ దుకాణదారులు కూడా కొత్త మార్గాలను అనుసరిస్తున్నారు.

కొనుగోలుదారులెవరూ ఎవరూ రాకపోతే తాము దుకాణాన్ని ఎక్కువ కాలం నడపలేమని, మూసివేయాల్సి వస్తుందని గ్వాంగ్‌ఝౌ నగరంలోని '1200 బుక్‌స్టోర్' యజమాని సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు. దానికి ఆయన ఫాలోవర్లు చాలామంది సానుకూలంగా స్పందించారు.

ఈ కష్టాలను కాస్త అధిగమించేందుకు చాలా బుక్ షాపులు ఆన్‌లైన్‌లో ఆర్డర్లు తీసుకోవడం ప్రారంభించాయి. తమ దగ్గర అందుబాటులో ఉన్న పుస్తకాల వివరాలను సోషల్ మీడియాలో ప్రజలకు తెలియజేస్తూ, ఆర్డర్ చేయాలని కోరుతున్నారు.

స్పోర్ట్స్ ఉమెన్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)