విచ్ఛిన్న యుగంలో విశ్వసనీయ వార్తలు: బీబీసీ అనుసరిస్తున్న మార్గాల గురించి సంస్థ డైరెక్టర్ జనరల్ టోనీ హాల్ ఏం చెప్పారంటే...

ఫొటో సోర్స్, Getty Images
దిల్లీలో జరిగిన అంతర్జాతీయ వాణిజ్య సదస్సులో బీబీసీ డైరెక్టర్ జనరల్ టోనీ హాల్ ప్రసంగం ఇది...
‘‘దిల్లీకి రావడం చాలా ఆనందంగా ఉంది.
చివరగా ఇక్కడికి నేను రెండేళ్ల క్రితం వచ్చాను. ఇక్కడున్న మా న్యూస్ బ్యూరో విస్తరణ, కొత్త భారతీయ భాష సర్వీసుల ప్రారంభం సందర్భంగా అప్పుడు వచ్చాను.
అప్పుడు, ఇప్పుడూ మా లక్ష్యం... ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మందికి బీబీసీ నుంచి విశ్వసనీయ వార్తలు అందించడమే.
గత ఏడాది కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మరణం గురించి తెలిసినప్పుడు కూడా మళ్లీ ఆ విషయమే నాకు గుర్తుకువచ్చింది.
ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఆయనతో మాట్లాడే అవకాశం దొరికింది. 70ల్లో దేశంలో అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడు, 18 నెలల జైలు జీవితం అనుభవించినప్పుడు తన అనుభవాలేంటో జైట్లీ నాతో పంచుకున్నారు.
ఓ చిన్న ట్రాన్సిస్టర్ రేడియోను తాను దొంగతనంగా జైల్లోకి తీసుకువెళ్లానని, గార్డులు లేవకముందు ఉదయం ఆరు గంటలకు దాని ద్వారా బీబీసీ వరల్డ్ సర్వీస్ వార్తలు వినేవాడినని ఆయన నాతో అన్నారు.
తనకు ప్రపంచమంతటా ఏం జరుగుతుందో, దేశంలో ఏం జరుగుతుందో తెలిపిన జీవధార అదని ఆయన అప్పుడు అన్నారు. నిర్బంధంలో, భయంలో, అనిశ్చితిలో బతుకుతున్న చాలా మందికి కూడా అది 90 ఏళ్లుగా అలాగే ఉంది.
వార్తల్లో విశ్వసనీయత అంశం గురించి నేను కొద్ది సేపటి తర్వాత మాట్లాడతా. మొదట విశ్వసనీయత గురించి నేను విస్తృతంగా మాట్లాడాలనుకుంటున్నా.
ప్రభుత్వ ప్రజాస్వామ సంస్థలు, వ్యాపారం, మీడియాపై విశ్వసనీయత గురించి... ప్రజాస్వామ్యంపై విశ్వసనీయత గురించి.
ఈ కొత్త విచ్ఛిన్న యుగంలో ఏం మారింది? మీడియా దీనికి ఎలా స్పందించాలి? అనే విషయాల గురించి నేను కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నా.

ప్రజాస్వామ్యంపై విశ్వాసం
ఎడెల్మన్ ట్రస్ట్ బారోమీటర్ ప్రారంభం సందర్భంగా ఈ ఏడాది మొదట్లో నేను మాట్లాడా.
వ్యాపారాలు, ప్రభుత్వం, మీడియా, ఎన్జీఓల్లో విశ్వసనీయత గురించి 28 దేశాల్లో చేసే వార్షిక సర్వే ఇది.
గత 20 ఏళ్లలో వచ్చిన మార్పు గురించి ఇదో ఆసక్తికర కథ చెబుతుంది.
బ్రిటన్‌లో ప్రజాస్వామ్య సంస్థలపై విశ్వాసం పడిపోయిందన్నది ఇందులో స్పష్టమైంది.
జాతీయ చర్చల్లో తమ గొంతుల్ని వినిపించుకోవడం లేదని చాలా మంది ప్రజలు అనుకుంటున్నారు. తమ ప్రయోజనాలు నెరవేరడం లేదని చాలా వర్గాలు భావిస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఏంతో కొంత స్థాయిలో మనం ఈ సరళిని చూస్తున్నామని నాకు తెలుసు.
ఇందులో ఓ గణాంకం నాకు కొట్టొచ్చిన్నట్లు అనిపించింది.
ఆటోమేషన్, ఆర్థికమాంద్యం, పోటీ, వలసల వల్ల తమ ఉద్యోగం పోతుందేమోనని ప్రతి పది మందిలో ఎనిమిది మంది భయపడుతున్నారు.
భయాలు ఆశను నులిమేస్తాయి. సామాజిక ప్రగతి మీద చాలా మంది విశ్వాసం కోల్పోతున్నారు.
ఫలితం... ప్రజాస్వామ్యంపై, దాన్ని నడిపే సంస్థలపై విశ్వాసం దెబ్బతింటోంది.

వ్యాపారంపై విశ్వాసం
మీడియా, ప్రభుత్వాల కన్నా వ్యాపారాలు చాలా దేశాల్లో విశ్వసనీయ సంస్థలుగా ఉంటుండటం గత కొన్నేళ్లుగా పెరుగుతూ వస్తోంది. ఇదో కొత్త సరళి.
ఒకప్పుడు సమాజాల్లోని సమస్యల కోసం రాజకీయ నాయకుల వైపు చూసిన ప్రజలు, ఇప్పుడు వ్యాపార నాయకుల వైపు చూస్తున్నారు.
న్యాయమైన వేతనాల నుంచి ఆటోమేషన్, కార్బన్ ఉద్గారాలు, ఇంటర్నెట్ నియంత్రణ వరకూ ప్రభుత్వాల కోసం వేచిచూడకుండా, సీఈఓలే మార్పుకు బాటలు వేయాలని ముప్పాతిక శాతం మంది జనాలు నమ్ముతున్నారు.
ఇటీవల నేను ఓ పెద్ద అంతర్జాతీయ టెక్ సంస్థ అధిపతితో మాట్లాడా. 2030 కల్లా నీతిగా నడిచే సంస్థలే మనుగడలో ఉంటాయని ఆయన అన్నారు.
వ్యాపారాల విజయాలు ఏం చేస్తున్నారన్నదానిపైనే కాదు, ఎలా చేస్తున్నారన్నదానిపైనా ఆధారపడి ఉంటాయనేది స్పష్టమైన విషయం.
అత్యున్నత ఆదర్శాలు పాటించే వాళ్లే అత్యుత్తమ విజేతలుగా ఉంటారు.

మీడియాపై విశ్వాసం
మీడియా రంగానికీ ఇది వర్తిస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నా.
ప్రపంచ మీడియాకు గత దశాబ్దం నిజంగా విచ్ఛిన్నకర కాలమే.
నకిలీ వార్తలు కొన్నేళ్లలోనే మన సమాజపు రక్త ప్రవాహంలో విషపు చుక్కల్లా మారాయి. విశ్వసనీయతను దెబ్బతీసి, ప్రజాస్వామ్యాన్ని అవ్యవస్థీకృతం చేస్తున్నాయి.
మన ప్రగతిని తప్పుదోవ పట్టించడానికి, మనలో చీలికలు తేవడానికి, ఓటర్ల నిర్ణయాలను ప్రభావితం చేయడానికి... చివరికి హింసను రెచ్చగొట్టి, ప్రాణ నష్టం జరగడానికి నకిలీ వార్తలు ఎలా ఉపయోగపడుతున్నాయో మనం ప్రపంచమంతటా చూస్తున్నాం.
ప్రజాస్వామ్యం బలహీనంగా ఉండి, డిజిటల్ అక్షరాస్యత లేని దేశాల్లో నకిలీ వార్తల వ్యాప్తి ఇప్పుడు తక్షణం పరిష్కారించాల్సిన సంక్షోభంగా మారింది.
నకిలీ వార్తల వ్యాప్తి ఆయుధాలు రోజురోజుకూ అధునాతనంగా తయారవుతున్నాయి.
'డీప్‌ఫేక్' వీడియో టెక్నాలజీతో మనం ఎవరు, ఏదైనా చేసినట్లు చూపించే శక్తి ఉన్న యుగంలోకి అడుగుపెడుతున్నాం.
అబద్ధం నుంచి వాస్తవాన్ని వేరు చేసి చూపడం ఇదివరకెప్పుడూ ఇంత కఠినంగా లేదు.
సోషల్ మీడియా రాక ఈ సరళిలో వేగాన్ని విపరీతంగా పెంచింది.

ఫొటో సోర్స్, Getty Images
తమ అభిప్రాయాలను ప్రతిబింబించే వార్తా సంస్థలనే ప్రజలు ఎంచుకోవడం ఎక్కువైంది. వాళ్లు సవాలు చేయడం లేదు.
సోషల్ మీడియాలో ఊకదంపుడు సమాజంలో చీలికలను పెంచుతోంది. వాదనకు ఒకవైపు (మన వైపు వాదనను) మాత్రమే చూసేలా చేస్తోంది అది.
ఆన్‌లైన్‌లో నిత్యం జర్నలిస్టులకు బెదిరింపులు వస్తుండటం నాకు ఆందోళన కలిగిస్తోంది. కేవలం కొందరు వినడానికి ఇష్టపడని అభిప్రాయాలను వినిపిస్తున్నందుకే ఇది.
సంప్రదాయ జర్నలిజాన్ని పరిష్కారంగా కాకుండా, తరచూ సమస్యగా చూస్తున్నారు.
జర్నలిస్టులను వాళ్ల పని వాళ్లను చేయనివ్వకుండా, వాళ్లను లక్ష్యంగా చేసుకునేందుకు, ట్రోల్ చేసేందుకు, బెదిరించేందుకు ప్రయత్నాలు జరుగుతుండటాన్ని మనం రోజూ చూస్తున్నాం.
భౌతికంగా ముప్పులను, హింసను కూడా జర్నలిస్టులు ఎదుర్కోవాల్సి వస్తోంది. దిల్లీ అల్లర్ల సమయంలో కూడా మనం ఇది చూశాం.

అంతిమంగా ఇది భావ ప్రకటన స్వేచ్ఛ మీద దాడికి ప్రతీక. నిర్భయంగా, ప్రయోజనాలేవీ ఆశించకుండా వాస్తవాలు వెలికి తీసే బాధ్యతపై దాడి. నిజం ఎంత అసౌకర్యంగా ఉన్నా, అధికారానికి ఎదురునిలబడి దాన్ని చెప్పడంపై దాడి.
ప్రజాస్వామ్యాలుగా, సమాజాలుగా మనం దీనిపై తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
నిజాన్ని చూపిస్తే నడవలేని ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం కాదు.
జరుగుతున్న విషయాన్ని అంగీకరిస్తూ, వాదనకు రెండు వైపులా ఉన్న పక్షాలు చర్చించుకోలేని సమాజం బలహీన సమాజం అవుతుంది.
ప్రపంచవ్యాప్తంగా ముదురుతున్న కరోనావైరస్ సంక్షోభం మనం దేన్ని పణంగా పెడుతున్నామో స్పష్టం చేస్తోంది.
అవసరమైన సమాచారాన్ని స్థిమితంగా, కచ్చితంగా, వాస్తవంగా ప్రజలకు అందించడం ఎంత అవసరమో ఇది గుర్తుచేస్తోంది.

విచ్ఛిన్న యుగంలో విశ్వసనీయ వార్తలు
అందుకే, సంప్రదాయ మీడియా మునుపటి కన్నా ఇప్పుడే చాలా ముఖ్యమైన పాత్రను పోషించాల్సి ఉందని నేను నమ్ముతున్నా.
మన పునాదుల్లో ఉన్న విలువలు, మన పనిని నిర్వచించే మంచి జర్నలిజం సూత్రాల అవసరం ఇప్పుడు ఇంకా చాలా చాలా ఎక్కువ ఉంది.
మీడియా విశ్వసనీయత పట్ల మనకున్న చిత్తశుద్ధిని రెండింతలు చేసుకుని, వార్తల్లో సమగ్రత కోసం మునుపటి కన్నా గట్టిగా నిలబడేందుకు మనకు గొప్ప అవకాశం వచ్చిన సందర్భం ఇది.
దీన్ని చేసేందుకు బీబీసీ అనుసరిస్తున్న ఐదు మార్గాల గురించి నేను మీకు చెప్పదల్చుకున్నా.

ఫొటో సోర్స్, Facebook/ETGlobalBusinessSummit
1. ప్రపంచంలో ఎక్కువ మందిని చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నాం
రాజకీయ ప్రభావాలు లేకుండా, అత్యున్నత ప్రమాణాలతో, నిష్పక్షపాతంగా వార్తలు అందిస్తూ బీబీసీ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయ వార్తా సంస్థల్లో ఒకటిగా ఉంది.
ప్రతి వారమూ మేం 43 కోట్ల మందికి వార్తలు చేరవేస్తున్నాం. బీబీసీ వరల్డ్ సర్వీస్ రేడియో, బీబీసీ వరల్డ్ న్యూస్‌కిది ఆల్‌టైమ్ రికార్డు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రోతలు, పాఠకులు, వీక్షకుల కోసం మేం ఇంకా చేయొచ్చన్న విషయం మాకు తెలుసు.
అందుకే బీబీసీ వరల్డ్ సర్వీస్‌లో 1940ల తర్వాత ఇప్పుడే మేం అతిపెద్ద విస్తరణ చేపట్టాం.
ఇప్పుడు బీబీసీ 42 బాషల్లో సేవలు అందిస్తోంది. నైరోబీ నుంచి బ్యాంకాక్, బెల్‌గ్రేడ్ వరకూ బ్యూరోలను విస్తరించింది.
భారత్‌లో ఇప్పటికే ఉన్న హిందీ, తమిళ్ సర్వీసులకు తోడుగా తెలుగు, గుజరాతీ, మరాఠీ, పంజాబీ సర్వీసులు మొదలుపెట్టాం. మొత్తంగా భారత్‌లో తొమ్మిది భాషల్లో (ఇంగ్లీషు, బెంగాలీ, ఉర్దూలతో కలిపి) సేవలందిస్తున్నాం.
ఇప్పుడు భారత్‌లో లక్షల మందికి తమ సొంత భాషలో బీబీసీ వార్తలు చేరుతున్నాయి.
దిల్లీలోని మా బ్యూరో వీడియో, టీవీ, డిజిటల్ కంటెంట్ ప్రొడక్షన్‌కు దక్షిణాసియా మొత్తానికే కేంద్రంగా ఉంది.
యువతను, మరింత మంది మహిళలను పాఠకులు, వీక్షకులుగా మార్చుకోవాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. సంప్రదాయ వార్తా సర్వీసులకు వీరిని చేరుకోవడం మరింత కష్టం.
ప్రపంచవ్యాప్తంగా మేం ఇదే దృక్పథంతో సాగుతున్నాం.

2. నకిలీ వార్తలపై పోరాడుతున్నాం
గత ఏడాది బీబీసీ 'బియాండ్ ఫేక్ న్యూస్' ప్రాజెక్టును చేపట్టింది. మా అంతర్జాతీయ నెట్‌వర్క్‌లన్నింటిలో విస్తృతంగా డాక్యుమెంటరీలు, ప్రత్యేక కథనాలు, ఫీచర్లు రూపొందించాం.
మనం ఎదుర్కొంటున్న అంశాల గురించి అవగాహన పెంచడం, మీడియా అక్షరాస్యతను మెరుగుపరచడం లక్ష్యంగా ఈ ప్రాజెక్టును చేపట్టాం.
నకిలీ వార్తలు ప్రైవేట్ నెట్‌వర్క్‌ల ద్వారా ఎలా వ్యాపిస్తాయన్నదానిపై భారత్, నైజీరియా, కెన్యాల నుంచి వరల్డ్ సర్వీస్ చేసిన పరిశోధనకు అవార్డు కూడా వచ్చింది.
పెద్ద ఎన్నికల జరుగుతున్నప్పుడు ప్రజాస్వామ్యానికి మద్దతుగా నిలవడం మేం దృష్టి పెట్టిన ప్రధాన అంశాల్లో ఒకటి. మా వరల్డ్ సర్వీస్ విస్తరణ కారణంగా అసత్య వార్తల మూలాలపై పోరాటంలో మేం మరింత చేయగలుగుతున్నాం.
ప్రచారంలో ఉన్న విషయాల్లో ఏవీ అసత్యాలో, ఏవి వాస్తవాలో ఎప్పటికప్పుడు పరిశీలించి, వెలికితీసే అంతర్జాతీయ ఫ్యాక్ట్ చెకింగ్ సర్వీస్- బీబీసీ రియాల్టీ చెక్‌ను తీసుకువచ్చాం.
భారత్‌లో ఎన్నికల సమయంలో మా రియాల్టీ చెక్ బృందం సోషల్ మీడియాలో ప్రచారమైన చాలా విషయాల గురించి వరుస కథనాలు చేసింది. బీబీసీ సర్వేలంటూ ప్రచారంలోకి వచ్చిన నకిలీ వార్తలు కూడా వాటిలో ఉన్నాయి.

3. క్షేత్ర స్థాయిలో ఉండటంపై దృష్టి పెట్టాం
అంటే, ప్రత్యక్షంగా, ఘటన జరిగిన చోటు నుంచి నిపుణులైన జర్నలిస్టులతో కథనాలు అందించడం.
ఆయా అంశాల్లో నిపుణులై ఉండి, వాస్తవాలను సరిగ్గా అర్థం చేసుకుని విశ్వసనీయ వ్యాఖ్యానాలను ఇవ్వగల రిపోర్టర్లు కావాలి.
బీబీసీ అంతర్జాతీయ న్యూస్ సర్వీస్‌ల విషయంలో ఇక్కడి సమాజాల్లో భాగమైన స్థానిక జర్నలిస్టులు కావాలి.
అందుకే భారత్‌లో బీబీసీ విస్తరణ కోసం దేశవ్యాప్తంగా 150 మంది జర్నలిజం సిబ్బందిని తీసుకున్నాం.
ఇటీవల దిల్లీ అల్లర్ల సమయంలోనూ ఫైసల్ మహమ్మద్ లాంటి వివిధ భాషల రిపోర్టర్‌లతోపాటు భారత్‌లోని మా ప్రతినిధి యోగితా లిమాయో ప్రపంచానికి ఆ వార్తలను అందించారు.

4. సమయం తీసుకుంటున్నాం
వార్తను ఎప్పటికప్పుడు వేడిగా అందించాలనే తపనలో పడిపోతూ, విషయాన్ని పూర్తిగా తెలుసుకోకుండానే వార్తలు ఇవ్వడం ఈ రోజుల్లో సాధారణమైపోయింది.
హెడ్‌లైన్స్ నుంచి ఒక అడుగు వెనక్కు వేసే జర్నలిజంపైనే బీబీసీ దృష్టి పెట్టింది. మా పాఠకులు, వీక్షకులకు మరింత వివరణ, విషయ నేపథ్యం అందించడం మా ఉద్దేశం.
అంటే, పరిశోధనాత్మక (ఇన్వెస్టిగేటివ్) జర్నలిజంపై మరింత శ్రద్ధ పెట్టాం.
ఆఫ్రికా ఐ బృందం దీనికి గొప్ప ఉదాహరణ. ఆఫ్రికా ఖండవ్యాప్తంగా ప్రభుత్వాలు చేసిన పనులకు బదులు చెప్పేలా చేసేందుకు దీన్ని సృష్టించాం.
కామెరూన్‌లో ఓ వీడియో ఫుటేజీ గురించి వాళ్లు చేసిన క్లిష్టమైన విశ్లేషణనే అక్కడి సైన్యం చేతిలో సామాన్య మహిళలు, చిన్నారుల హత్యలకు గురైన విషయాన్ని రుజువు చేసింది.
నిజమైన మార్పులను తీసుకువచ్చేది ఇలాంటి జర్నలిజమే.

ఫొటో సోర్స్, Twitter/rupa_jha
నైజీరియాలో కోడీన్ దగ్గు మందును మత్తుమందులా వాడుతున్న ఉదంతం, దాని తయారీ వెనుకున్న భారీ క్రిమినల్ నెట్‌వర్క్ గురించి ఆఫ్రికా ఐ చేసిన విచారణ అక్కడి చట్టంలో వెంటనే మార్పు తెచ్చింది.
బాగ్దాద్‌లో షియా మతగురువుల ఆధ్వర్యంలో బాలికలపై సాగుతున్న లైంగిక వేధింపుల ఉదంతాన్ని కూడా ఇటీవల మా పరిశోధన బయటపెట్టింది.
ఆఫ్రికా ఐ స్ఫూర్తిగా, వీటి తరహాలోనే మరిన్ని చోట్ల ఇలాంటి విచారణలు చేయాలని అనుకుంటున్నాం.
భారత్ సహా వివిధ ప్రాంతాల్లో కొత్త విచారణ బృందాలను ఏర్పాటు చేయాలనుకుంటున్నాం.
సమయం తీసుకోవడంలో ఇంకో ముఖ్యమైన విషయం ఉంది.
అది మన ప్రపంచ భవిష్యతును తీర్చిదిద్దే అంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టడం.
వాతావరణ మార్పులు... జనాభా వృద్ధి, వృద్ధుల పెరుగుదల... శారీరక, మానసిక ఆరోగ్య సంక్షోభాలు... ఏది మన జీవితాలను ఏలా మార్చోబోతుంది...
రాబోయే ఏళ్లలో మనమందరం ఎదుర్కోవాల్సిన అతి పెద్ద అంశాల గురించి.

ఫొటో సోర్స్, Twitter/ET_GBS
5.మార్పు కోసం మిగతావారితో పనిచేయడం
గత వేసవిలో ఓ ప్రత్యేక సదస్సులో బీబీసీతో కలిసిరావాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా మీడియా సంస్థలను నేను ఆహ్వానించా.
ఉమ్మడి లక్ష్యాల కోసం భిన్నమైన బృందాలను ఏకం చేయడం బీబీసీ పబ్లిక్ సర్వీస్ పవర్‌లో భాగం.
ఈ విషయంలో అది ఫేస్‌బుక్, గూగుల్, ట్విటర్, ద వాల్ స్ట్రీట్ జర్నల్, ద హిందూ, ఇలా మరెన్నింటితోనో భాగస్వామ్యం నిర్మించుకోవడం.
ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన నకిలీ వార్తలు, పక్షపాతం, తప్పుడు సమాచార వ్యాప్తి సమస్యలను కలిసి ఎదుర్కొనే మార్గాలను వెతకడం... సరైన పరిష్కారం ఆలోచించి, దాన్ని అమల్లో పెట్టడం దీని లక్ష్యం.
దీన్ని మేం 'ట్రస్టెడ్ న్యూస్ ఇనిషియేటివ్' అని పిలుస్తున్నాం.
దీని ప్రణాళికల్లో భాగంగా ముందస్తు హెచ్చరికలు చేసే వ్యవస్థను మేం ప్రారంభించాం. ఎన్నికల సమగ్రతను దెబ్బతీసే, వైరల్ అయ్యే తప్పుడు సమాచారం గురించి భాగస్వాములను ముందే ఇది అప్రమత్తం చేస్తుంది.
రెండు ఎన్నికల్లో మేం దీన్ని పరీక్షించాం. ఇది పని చేస్తోంది.
నిజమైన మార్పును తీసుకువచ్చే స్థాయిలో మనం కలిసి చర్యలు చేపట్టవచ్చనడానికి ఇది మంచి ఉదాహరణ.

ముగింపు
నేను ఇదో మంచి అవకాశం వచ్చిన సందర్భం అని అన్నాను.
వార్తలపై, సమాచారంపై ప్రజల్లో తిరిగి విశ్వాసం కల్పించేందుకు ఇది అవకాశం.
ఈ దశాబ్దంలోని ప్రారంభ సంవత్సరాలే భవిష్యతు తప్పుడు వార్తలదో... లేక స్వచ్ఛమైన, నిష్పక్షపాత వార్తలదో నిర్ణయిస్తాయి.
వార్తల్లో సమగ్రతను కాపాడుకోవడం వల్లే ప్రజాస్వామ్యంపై విశ్వాసాన్ని బలపరుచుకోగలిగిన రోజు వస్తుందని నేను నమ్ముతా. ప్రజాస్వామ్య సంస్థలు, సమాజంపై విశ్వాసం పెరుగుతుందని భావిస్తున్నా.
ధన్యవాదాలు.’’
ఇవి కూడా చదవండి:
- మునిగిపోతున్న రాజధాని.. రూ.2.52 లక్షల కోట్లతో కొత్త రాజధాని నగరం నిర్మాణానికి ప్రణాళికలు
- పీతల నీలి రంగు రక్తం ప్రతి ఏటా లక్షలాది ప్రాణాలను కాపాడుతోందని మీకు తెలుసా?
- కరోనావైరస్: చైనాలో రెండు రాష్ట్రాల మధ్య చిక్కుకుపోయిన క్యాన్సర్ పేషెంట్... ఆ తర్వాత ఏమైంది?
- దిల్లీ అల్లర్లపై భారత్‌ను ఇరాన్ ఎందుకు విమర్శించింది?
- కరోనావైరస్: శశిథరూర్ మెడలోని ఈ గాడ్జెట్ వైరస్‌లను అడ్డుకుంటుందా
- సెన్సెక్స్ పతనం: ఒక్క రోజులో 6.5 లక్షల కోట్ల సంపద ఆవిరైపోవడానికి కారణాలేంటి?
- కరోనావైరస్లు ఎక్కడి నుంచి వస్తాయి... ఒక్కసారిగా ఎలా వ్యాపిస్తాయి?
- బీబీసీ పరిశోధన: అఫ్ఘానిస్తాన్‌లో 70 శాతం భూభూగంపై తాలిబాన్ పట్టు
- ఇదో బానిసల మార్కెట్... వేలాది మహిళలను ఆన్‌లైన్‌లో అమ్మేస్తున్నారు: బీబీసీ రహస్య పరిశోధన
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








