దిల్లీలో 'స్కామ్' కాల్‌సెంటర్ గుట్టు రట్టు చేసిన బీబీసీ... ఇద్దరు హైటెక్ మోసగాళ్ళ అనుభవాలు

- రచయిత, రజనీ వైద్యనాథన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
బ్రిటన్‌కు చెందిన వేలాది మంది వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడిన ఓ కాల్ సెంటర్ వ్యవహారం బీబీసీ పరిశోధనలో బయటపడటంతో పోలీసులు ఆ నిర్వాహకుల్ని అరెస్ట్ చేశారు .
దిల్లీలోని గుర్గావ్ కేంద్రంగా పని చేస్తున్న ఆ కాల్ సెంటర్ కంప్యూటర్ సమస్యలకు సంబంధించి తలెత్తిన బూచిని చూపిస్తూ లక్షలాది రూపాయలను ఎలా దోచుకుంటోందో తెలిపే ఫుటేజ్‌ను బీబీసీ పనోరమా టెలీకాస్ట్ చేసింది.
అయితే, కాల్ సెంటర్ యజమాని అమిత్ చౌహాన్ మాత్రం కుంభకోణం జరిగిందన్న వార్తల్ని కొట్టి పారేశారు. కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు నిరాకరించారు.
ప్రస్తుతం చౌహాన్‌కు స్థానిక కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా దేశాలకు చెందిన బాధితులకు సంబంధించిన సుమారు 70 వేల కాల్ రికార్డింగులను కూడా బీబీసీ పనోరమా సంపాదించింది.
తన కంప్యూటర్‌పై పోర్నోగ్రాఫిక్ స్పైవేర్ సోకిందంటూ వచ్చిన నకిలీ హెచ్చరికల కారణంగా డబ్బులు సమర్పించుకొని నష్టపోయిన బాధితుల్లో పెర్రీ ఆడమ్స్ ఒకరు.
త్వరలోనే తన దగ్గర ఉన్న ఆధారాలతో భారతీయ పోలీసుల్ని సంప్రదిస్తానని ఆయన చెబుతున్నారు.
మరోవైపు బాధితులంతా వేర్వేరు దేశాలకు చెందిన వారు కావడంతో వారిని విచారించడం కష్టమైన ప్రక్రియ అని పోలీసులు అంటున్నారు. బాధితులు సమర్పించిన ఆధారాల మేరకే వారిపై చర్యలుంటాయని వారు స్పష్టం చేశారు.
ఆన్ లైన్ విజిలెంట్ అయిన జిమ్ బ్రౌనింగ్ నుంచి పనోరమా ఆధారాలను సేకరించింది. ఆయన కాల్ సెంటర్ కంప్యూటర్ సిస్టమ్స్‌ను హ్యాక్ చేసి వాళ్ల భవనంలోని సీసీ కెమెరాలను పూర్తిగా తన అదుపులోకి తీసుకున్నారు.

ఇలాంటి మోసాలకు పాల్పడ్డ ఇద్దరు వ్యక్తుల మనోగతం
ఇక ఇలాంటి మోసాలకు పాల్పడే వ్యక్తులు తాము చేసే పనుల్ని ఎలా సమర్ధించుకుంటూ ఉంటారు? ఎప్పటికైనా తిరిగి చట్టబద్ధమైన పనులు చేస్తూ కొత్త జీవితాల్ని మొదలుపెట్టే అకాశం ఉందా?
గతంలో డబ్బు కోసం ఇలాంటి స్కామ్‌లకు పాల్పడుతూ కొన్నాళ్ల తర్వాత తాము చేసిన తప్పు తెలుసుకొని తిరిగి సాధారణ జీవితాన్ని మొదలుపెట్టిన ఇద్దరు వ్యక్తుల్ని బీబీసీ ప్రతినిధి రజనీ వైద్యనాథన్ కలిశారు.
వారి మనోగతాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే, ఈ కథనంలో ఆ ఇద్దరి వ్యక్తుల విజ్ఞప్తి మేరకు వారి పేర్లను మార్చి ఇస్తున్నాం.
ఇది పీయూష్ (పేరు మార్చాం) కథ. నాలుగద్దాల గోడల నడుమ కూర్చొని సుమారు కోటి 80 లక్షల రూపాయలను ఎలా సంపాదించారో నాతో చెప్పుకొచ్చారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
"అది చాలా సులువుగా సంపాదించిన సొమ్ము (ఈజీ మనీ)." ఇది అతను నాతో చెప్పిన మాట. ఇక అక్కడ నుంచి తన కథను చెప్పడం మొదలుపెట్టారు. ఫ్యాన్సీ కార్లను, డిజైనర్ డ్రెస్సులను ఎలా కొంటూ ఎంజాయ్ చేసిందీ చెప్పుకొచ్చారు.
పీయూష్ ఓ గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చారు. కానీ, అమాయకమైన బాధితుల్ని మోసం చెయ్యడం అతనిలో ఉన్న మరో కోణం.
"రాక్ స్టార్ కావాలనుకుంటే అంత కన్నా ముందు మనం ఇంకేదో చెయ్యాలి." ఇది నాతో అతను అన్నమాట.
"అంటే దొంగలా మారడమా?" అని నేను అడిగాను.
"రైట్" అంటూ చాలా ప్రశాంతంగా సమాధానమిచ్చారు .


కాల్ సెంటర్ల మెరుపుల వెనుక మనకు తెలియని చీకటి కోణాలు
దిల్లీలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఉండే ఓ స్నేహితుని అపార్ట్‌మెంట్‌లో పీయూష్ నన్ను కలిశారు. నేను మాట్లాడిన యువకులందరిలోనూ ఒక్క విషయం కామన్‌గా ఉంది . వాళ్లంతా దేశంలోని స్కామ్‌లకు పాల్పడే కాల్ సెంటర్లలో పని చేస్తున్నారు.
నిజానికి విదేశాలకు నాణ్యమైన సేవలందించడంలో భారతీయ కాల్ సెంటర్లు పెట్టింది పేరు. కానీ, కొన్ని కాల్ సెంటర్ల మెరుపుల వెనుక మనకు తెలియని చీకటి కోణాలు కూడా ఉన్నాయి.
కాలేజీ చదువు పూర్తయిన 9 ఏళ్ల తర్వాత పీయూష్ ఈ స్కామ్‌లో భాగమయ్యారు. "నాకు ఎక్కడా మంచి జీతం ఇచ్చే ఉద్యోగం రాలేదు." అని పీయూష్ అన్నారు.
టెక్ స్కామ్‌లకు పీయూష్ పని చేస్తున్న కంపెనీ పెట్టింది పేరు. జనం కంప్యూటర్ల స్క్రీన్‌పై మీ కంప్యూటర్ పోర్నోగ్రాఫిక్ వైరస్ బారిన పడిందంటూ ఓ పాప్ అప్‌ను సదరు కంపెనీ పంపిస్తుంది . మరో మాల్ వేర్‌లో హెల్ప్ లైన్ నెంబర్‌ను కూడా ఇస్తుంది.

వృద్ధులే లక్ష్యంగా మోసాలు
సాధారణంగా ఆ పాప్ అప్ చూడగానే కంగారు పడ్డ కస్టమర్లు వాళ్లు ఇచ్చిన హెల్ప్ లైన్ నెంబర్‌కు కాల్ చేస్తారు. ఇక అక్కడ నుంచి మొదలవుతుంది అసలు కథ. లేని మాల్ వేర్ బూచిని చూపెట్టి పీయూష్ , అతని సహచరులు ఆ వ్యక్తి నుంచి డబ్బు గుంజడం మొదలుపెడతారు.
"నిజానికి జనాన్ని మోసం చెయ్యడం కూడా ఓ కళే."
ఇది పీయూష్ నాతో చెప్పిన మాట.
సాధారణంగా వృద్ధుల్నే లక్ష్యంగా చేసుకుంటామని ఆయన నాతో చెప్పారు .
అమెరికాలో చాలా మంది వృద్ధులు ఒంటరిగానే ఉంటారు. వాళ్లకు నా అన్న వాళ్లెవ్వరూ ఉండరు. దానికి తోడు వాళ్లలో చాలా మంది వైకల్యంతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్లను చాలా సులభంగా మోసం చెయ్యవచ్చునని అంటారు పీయూష్.
ఆయన వాలకం చూశాక, అస్సలు ఇంత దారుణంగా ఎలా ఆలోచిస్తారనిపించింది. ఆ బాధితుల స్థానంలో మీ బామ్మో, తాతయ్యో ఉంటే మీరు ఏం చేస్తారని నేను పీయూష్‌ని అడిగాను.
"నిజమే నాకు చాలా బాధేస్తుంది. కానీ, నేను డబ్బు కోసమే ఈ పని చేస్తున్నా. అంతే". ఇది పీయూష్ సమాధానం.
ఓ సారి తన టార్గెట్ చేరుకోవడంలో భాగంగా ఓ మహిళ దగ్గర మిగిలిన ఉన్న చివరి వంద డాలర్లను కూడా ఎలా బలవంతంగా తీసుకున్నది నాకు వివరించారు పీయూష్.
"ఓవైపు ప్రపంచమంతా క్రిస్మస్ వేడుకల్లో మునిగి తేలుతోంది. అదే సమయంలో ఆ కస్టమర్ దగ్గర కేవలం వంద డాలర్లు మాత్రమే ఉన్నాయి.
దాన్ని కూడా నేను బలవంతంగా తీసేసుకున్నాను. అందుకు ఆమె చాలా సేపు ఏడ్చింది. నా జీవితంలోనే అత్యంత బాధాకరమైన ఫోన్ కాల్ అది" అని పీయూష్ చెప్పారు.


సొంతంగా కాల్ సెంటర్ వ్యాపారం మొదలు పెట్టిన పీయూష్
తర్వాత పీయూష్ సొంతంగా తానే ఓ కాల్ సెంటర్‌ను మొదలుపెట్టారు. ఆ పని చెయ్యడం చాలా ఈజీ అని నాతో ఆయన చెప్పారు.
ఆఫీస్ స్పేస్‌ను అద్దెకు తీసుకొని అందులో ఓ మార్కెటింగ్ సంస్థ పెడుతున్నానని యజమానికి చెప్పారు.
తన క్లయింట్లంతా అమెరికాకు చెందిన వారు కావడంతో వారికి మనకు ఉండే కాల భేదం కారణంగా రాత్రి పూట కూడా తన స్టాఫ్ పని చెయ్యాల్సి ఉంటుందని చెప్పారు.
సంస్థ అధిపతిగా పీయూష్ కమస్టర్ల నుంచి ఎలా సొమ్ము కొట్టేయాలా... అన్న విషయంలో కొత్త కొత్త మార్గాల కోసం అన్వేషణ సాగిస్తూ ఉండేవారు.
అలా ఐఆర్ఎస్ పేరుతో ఓ స్కామ్ ఆయన మదిలో తట్టింది. 184 అమెరికన్ డాలర్లను తమకు చెల్లించడం ద్వారా వేలాది డాలర్ల ట్యాక్స్ రిఫండ్‌ను పొందవచ్చని చెప్పి ఫోన్ చేసి నమ్మించి జనాలను మోసం చెయ్యడమే ఈ స్కామ్ అసలు ఉద్ధేశం.
"ఒక వేళ వాళ్లు మేం చెప్పిన మొత్తం చెల్లించకపోతే పోలీసులు ఇంటికి వచ్చి మరీ అరెస్ట్ చేస్తారని భయపెడుతూ ఉంటాం" అని ఆయన నాతో చెప్పారు.
మొదట్లో తాను ఉద్యోగిగా ఉన్నప్పుడు అతను పని చేస్తున్న కంపెనీ ప్రతి డాలర్‌కు ఒక రూపాయి కమిషన్ ఇచ్చేది. ఉదాహరణకు 100డాలర్ల స్కామ్ చేస్తే సుమారు వందరూపాయలు వచ్చేది.
కానీ, ఓ కంపెనీకి అధిపతిగా మారిన తర్వాత డబ్బు ప్రవాహంలా వచ్చి పడటం మొదలయ్యింది. కొన్ని సార్లు నెలకు 50 వేల డాలర్లుకు పైగా సంపాదిస్తుండేవారు.

కష్టపడకుండానే బోలెడంత డబ్బు
ఇది మరో స్కామర్ కథ. ఆయన పేరు శామ్ (ఈయన పేరు కూడా మార్చాం). ఆయన అనుకోకుండా ఈ బిజినెస్‌లో అడుగుపెట్టారు.
శామ్ మొదటి సారిగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు... పెద్దగా కష్టపడకుండానే డబ్బులు సంపాదించడం గురించి తన స్నేహితుడి వద్ద విన్నారు..
ఇంటర్యూ జరిగే సమయంలో ఇదో సేల్స్ ఉద్యోగమని, అమెరికన్ కస్టమర్లకు తమ ఉత్పత్తుల గురించి చెప్పాల్సి ఉంటుందని అన్నారు.
కస్టమర్లతో మాట్లాడే తీరు గురించి శిక్షణ ఇచ్చే సమయంలో అతను ఏం చెయ్యబోతున్నాడో కొద్ది కొద్దిగా తెలిసింది.
సరిగ్గా ఓ నెల గడిచి తాము ఉద్యోగంలో అడుగు పెట్టిన తర్వాత ఇదంతా ఓ పెద్ద స్కామ్ అన్న సంగతి తనకు అర్థమయ్యిందని శామ్ నాతో చెప్పారు.
శామ్ వెనక్కి వెళ్లిపోదామనుకున్నప్పటికీ అప్పటికే చాలా ఆలస్యమైపోయింది.
"నాకు ఎలాంటి కాలేజీ డిగ్రీ లేకపోయినా ఓ ఎంబీఏ గ్రాడ్యుయేట్ కన్నా ఎక్కువ సంపాదించాలనుకునే వాణ్ణి" అంటూ నాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు.
"తాగి తందనాలాడటం, ఎప్పుడుబడితే అప్పుడు పార్టీలు.చేతి నిండా డబ్బున్నప్పుడు భవిష్యత్తు గురించి ఎలాంటి ప్రణాళికలు లేనప్పుడు అంతకన్నా ఇంకేం చేస్తాం."
అన్నారు నాతో శామ్.
డబ్బున్న వాళ్లే లక్ష్యం
అయితే ఈ పని చెయ్యడంలో శామ్ ఎప్పుడూ మదనపడుతూ ఉండేవాడని, కానీ ధనవంతుడవటమే తన ఏకైక లక్ష్యమని చెబుతూ ఉండేవాడని ఈ స్కామ్‌లో భాగస్వాములుగా ఉన్న మిగిలిన వ్యక్తులు నాతో చెప్పారు.
ఎప్పుడూ పొట్ట కూటికోసం సంపాదించుకునే వారి జోలికి వెళ్లేవాణ్ణి కాదని పెద్ద పెద్ద పార్టీలనే పట్టేవాడినని శామ్ నాతో అన్నారు.
అంటే, ఖర్చు పెట్టే స్థాయి ఉన్న వాళ్ల దగ్గర డబ్బు కొట్టేయడం న్యాయమేనని మీరు భావిస్తున్నారా ? అని నేను శామ్‌ను అడిగాను.
"అవును" అంటూ చాలా ఆత్మవిశ్వాసంతో జవాబు ఇచ్చారు.
జీవితంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మోసం చెయ్యకూడదని తాను నిర్ణయించుకున్న కొంతమంది వ్యక్తులతో ఇప్పటికీ టచ్‌లో ఉన్నానని శామ్ చెప్పారు.
అలాంటి వాళ్లలో ముగ్గురు బిడ్డల్ని పోషించేందుకు ఓ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్‌లో పని చేస్తున్న తల్లి కూడా ఉన్నారని అన్నారు.
ఆమె కంప్యూటర్‌కి సంబంధించిన ఎలాంటి సమస్య వచ్చినా శామ్ సాయం చేస్తారు. ఆమె క్రిస్మస్ కార్డ్స్ జాబితాలో శామ్ ఉన్నారు కూడా.
గతంలో డబ్బు కోసం తన తండ్రిపై ఆధారపడే వాడినని, ఇప్పుడు బాగా సంపాదించడంతో ఆయన వద్ద కూడా తన గౌరవం పెరిగిందని శామ్ చెప్పుకొచ్చారు .
మేం మాట్లాడుతుండగా ఆయన చేతికి ఉన్న రిస్ట్ వాచ్‌ను నాకు చూపించారు. దాని ధర సుమారు 29 వేల రూపాయలు ఉంటుంది. అది నిర్దేశించిన లక్ష్యాలను చేరుకున్నందుకు బాస్ తనకు ఇచ్చిన గిఫ్ట్ అని చెప్పారు.
అయితే, తన తండ్రికి కానీ స్నేహితులకు కానీ తాను ఇంత డబ్బు ఎలా సంపాదిస్తున్నానన్న సంగతి తెలియదని శామ్ అన్నారు. వాళ్లెప్పుడైనా ఏం చేస్తున్నావని అడిగితే ఓ ఐటీ కంపెనీలో సేల్స్‌మ్యాన్‌గా పని చేస్తున్నానని చెప్పేవాడినని అన్నారు.
తాను ఉద్యోగంలో చేరిన 6 నెలల తర్వాత తాను పని చేస్తున్న సంస్థపై పోలీసులు దాడి చేసి మూసివేయించారు. అరెస్ట్ కాకుండా శామ్ తప్పించుకోగల్గారు. కొన్నాళ్ల పాటు అలాంటి వ్యాపారం చేసే మరో సంస్థలో ఉద్యోగం చేశారు.
ఆయన బాస్‌ను ఒక్క రోజులోనే విడిచిపెట్టేశారు. మరో పేరుతో తన వ్యాపారాన్ని తిరిగి మొదలుపెట్టవచ్చని ఆయన అనుకున్నారు. నిజానికి పోలీసు నిఘా ఉన్నప్పటికీ వేరే పేరుతో కంపెనీని నడపటం ఈ తరహా సంస్థలకు చాలా సులభమైన విషయం. అందుకే వాళ్లు అదే పని చేస్తూ ఉంటారు.


గతంలో చేసిన తప్పులకు పశ్చాత్తాపం
ప్రస్తుతం శామ్ ఆ స్కామ్‌ల ప్రపంచం నుంచి బయటపడి ఓ పేరున్న టెక్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు.
అవసరంగా డబ్బుకి ఆశపడి చట్టు విరుద్ధమైన పనులు చేస్తే అరెస్ట్ అయ్యే ప్రమాదం ఉందని, చట్టబద్దమైన ఉద్యోగం చెయ్యడం ద్వారా దీర్ఘకాలిక ప్రయోజనం ఉంటుందని నా ద్వారా యువతకు చెప్పాలనుకున్నారు.
మరోవైపు పీయూష్ మాత్రం శామ్‌లా తన ఉద్యోగం గురించి తన కుటుంబానికి తెలియకుండా ఉంచలేదు.
"ప్రతి విషయం మా కుటుంబానికి చెప్పేశాను. నేను బాగా సంపాదిస్తూ ఉండటం వాళ్లకు సంతోషాన్ని కల్గించింది." అని నాతో చెప్పారు.
నేను పీయూష్‌తో మాట్లాడుతూనే యథాలాపంగా ఆయన వేసుకున్న జీన్స్ వైపు చూశాను.
అక్కడ ఇలా రాసి ఉంది.
"వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకో."
అయితే, సుమారు పదేళ్ల పాటు పియూష్ ఇలాంటి స్కామ్‌ల ద్వారా సంపాదించిన తర్వాత పోలీసుల భయంతో దాన్ని విడిచి పెట్టేశారు.
ఇన్నేళ్ల పాటు పోలీసులకు దొరకకుండా ఉండటం తన అదృష్టమని చెప్పిన పీయూష్ అప్పట్లో తాను చేసిన పనికి ఇప్పుడు చింతిస్తున్నారు.
అప్పట్లో చాలా చాలా బాగా అనిపించేదని... కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే తప్పనిపిస్తోందని పీయూష్ నాతో చెప్పారు.
పీయూష్ గతంలో తాను చేసిన అక్రమాల ద్వారా సంపాదించిన సొమ్ముతో చట్టబద్ధమైన మరో వ్యాపారాన్ని ప్రారంభించారు. కానీ, అంతా నష్టపోయారు.
ఆ తర్వాత ఏదీ సవ్యంగా సాగలేదని అన్నారు.
'ఏం చెయ్యగలను..? అంతా నా కర్మ!' అని ముగించారు .

ఇవి కూడా చదవండి
- కరోనావైరస్లు ఎక్కడి నుంచి వస్తాయి... ఒక్కసారిగా ఎలా వ్యాపిస్తాయి?
- సౌదీ అరేబియా: రాజు తమ్ముడు సహా ముగ్గురు సీనియర్ రాజకుటుంబ సభ్యుల నిర్బంధం
- పోలీసులమంటూ వాహనం ఆపి యువతిపై గ్యాంప్ రేప్; అలా ఎవరైనా ఆపితే ఏం చేయాలి?
- మారుతీ రావు ఆత్మహత్యపై అమృత స్పందన.. ‘తప్పు తెలుసుకుని పశ్చాత్తాపంతో చనిపోయి ఉండొచ్చు’
- కరోనావైరస్: ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్-19 గురించి మీ పిల్లలకు ఎలా చెప్పాలి?
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- ట్రాన్స్లేటర్ల ఉద్యోగాలకు కంప్యూటర్లు ఎసరు పెట్టగలవా?
- మీ స్మార్ట్ ఫోన్ రెండేళ్లకంటే పాతదా? అయితే జాగ్రత్త.. వంద కోట్ల ఆండ్రాయిడ్ డివైజ్‌లకు హ్యాకింగ్ ముప్పు
- అర్జెంటీనాలో 12,000 మంది నాజీల జాబితా.. వారు స్విస్ బ్యాంక్‌లో దాచిన లూటీ సంపద వెలుగు చూస్తుందా?
- కరోనావైరస్: పదేపదే ముఖాన్ని చేతులతో తాకే అలవాటు మానుకోవడం ఎలా?
- నెల్లూరు పల్లెలో అంతరిక్ష పరిశోధన... ఒక సైన్స్ టీచర్ ప్రేరణతో విద్యార్థుల ప్రయోగాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









