సౌదీ అరేబియా: రాజు తమ్ముడు సహా ముగ్గురు సీనియర్ రాజకుటుంబ సభ్యుల నిర్బంధం

ఫొటో సోర్స్, Reuters
సౌదీ అరేబియా రాజ కుటుంబంలో.. రాజు తమ్ముడు సహా ముగ్గురు సీనియర్ సభ్యులను పాలకులు నిర్బంధించారు. అందుకు కారణాలు వెల్లడించలేదు.
వారిలో ఇద్దరు సౌదీ రాజ్యంలో అత్యంత ప్రభావం గల ప్రముఖులు.
యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ అధికారం మీద తన పట్టును మరింత పెంచుకోవడంలో భాగంగా ఈ నిర్బంధాలు జరిగాయని భావిస్తున్నారు.
2017లో సౌదీ రాచకుటుంబ ప్రముఖులు, మంత్రులు, వ్యాపారవేత్తలు డజన్ల మందిని అరెస్ట్ చేయాలని యువరాజు ఆదేశించటంతో వారిని రియాద్‌లోని రిట్జ్ కార్లటన్ హోటల్‌లో నిర్బంధించారు.
వివాదాస్పదుడిగా వార్తల్లో ఉండే మొహమ్మద్ బిన్ సల్మాన్‌ను ఆయన తండ్రి 2016లో యువరాజుగా ప్రకటించినప్పటి నుంచీ.. సౌదీకి వాస్తవ పరిపాలకుడు ఆయనేనని పరిగణిస్తున్నారు.
తాజాగా సీనియర్ రాచకుటుంబ సభ్యులైన.. రాజు తమ్ముడు ప్రిన్స్ అహ్మద్ బిన్ అబ్దులజీజ్, మాజీ యువరాజు మొహమ్మద్ బిన్ నయేఫ్‌లతో పాటు రాయల్ కజిన్ నవాఫ్ బిన్ నయేఫ్‌లను నిర్బంధించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ విషయాన్ని వాల్ స్ట్రీట్ జర్నల్ వార్తా పత్రిక మొదటిసారిగా వెల్లడించింది. ఈ నిర్బంధాలు శుక్రవారం చోటుచేసుకున్నాయని చెప్పింది.
మొహమ్మద్ బిన్ నయేఫ్ 2017 వరకూ అంతర్గత వ్యవహారాల మంత్రిగా ఉన్నారు. ఆయనను యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ మూడేళ్ల కిందట ఆ పదవి నుంచి తొలగించి గృహనిర్బంధంలో ఉంచారు.
మొహమ్మద్ బిన్ నయేఫ్ అంతర్గత వ్యవహారాల మంత్రిగా ఉన్నపుడు అమెరికా ఇంటలిజెన్స్ అధికారులకు సన్నిహత, విశ్వసనీయ భాగస్వామిగా ఉండేవారని భావిస్తారు.
ప్రిన్స్ అహ్మద్ బిన్ అబ్దులజీజ్ (78) ప్రస్తుత పాలకుడైన రాజుకు స్వయానా తమ్మడు. రాజు సోదరుల్లో జీవించి ఉన్నది ఆయన ఒక్కరే. అబ్దులజీజ్ 2018లో యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్‌ను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే తన మాటలకు తప్పుగా భాష్యం చెప్పారని ఆయన ఆ తర్వాత వివరణనిచ్చారు.
వీరిద్దరూ సింహాసనం వారసత్వంలో ముందున్న 34 ఏళ్ల యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్‌కు.. ప్రత్యర్థులు కాగలరని పరిగణిస్తుంటారు.
ఈ రాచకుటుంబ సభ్యుల నివాసాలకు.. మాస్కులు, పూర్తిగా నల్లటి దుస్తులు ధరించిన గార్డులు వచ్చి సోదాలు నిర్వహించారని వాల్ స్ట్రీట్ జర్నల్ చెప్తోంది.

‘‘రాజకోట వ్యవహారాలు రహస్యంగానే ఉంటాయి’’
ఫ్రాంక్ గార్డెనర్, సెక్యూరిటీ కరెస్పాండెంట్
సౌదీ అరేబియాలో అత్యంత శక్తిమంతుడైన యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ తన స్థానాన్ని బలోపేతం చేసుకునే దిశగా చేపట్టిన చాలా ముఖ్యమైన చర్య ఇది.
దేశ నిర్మాత కింగ్ అబద్దులజీజ్ కొడుకుల్లో మిగిలివున్న వారిలో ఒకరు ప్రిన్స్ అహ్మద్ బిన్ అబ్దులజీజ్. పాలక కుటుంబంలో పెద్ద వయసు సభ్యులు ఆయనకు చాలా గౌరవం ఇస్తారు.
మరో సీనియర్ యువరాజు మొహమ్మద్ బిన్ నయేఫ్.. నిజానికి సింహాసన వారసుడిగా ఉన్నారు. కానీ మూడేళ్ల కిందట ఆయనను అకస్మాత్తుగా తొలగించి.. మొహమ్మద్ బిన్ సల్మాన్‌ను సింహాసన వారసుడయ్యే యువరాజుగా ప్రకటించారు.
ఆ ఉదంతానికి ముందు.. అంతర్గత వ్యవహారాల మంత్రిగా పనిచేసిన మొహమ్మద్ బిన్ నయేఫ్.. 2000 దశకంలో సౌదీ అరేబియాను చుట్టుముట్టిన అల్-ఖైదా తీవ్రవాదాన్ని ఓడించారని పేరు సంపాదించుకున్నారు.
వీరి నిర్బంధం గురించి అమెరికా మీడియాలో వచ్చిన వార్తలను అధికారికంగా నిర్ధారించటం, లేదా నిరాకరించటం జరగలేదు. సౌదీ అరేబియాలో రాజకోట వ్యవహారాలు అధికంగా రహస్యంగానే జరుగుతుంటాయి.

యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్.. తమ దేశంలో అనేక ఆర్థిక, సామాజిక సంస్కరణలు తెస్తామని 2016లో ప్రకటించినపుడు అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకున్నారు.
కానీ.. అనంతరం ఆయన వరుస కుంభకోణాల్లో వివాదాస్పదంగా మారారు. సీనియర్ జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్జీని 2018లో ఇస్తాంబుల్‌లోని సౌదీ రాయబార కార్యాలయంలో హత్య చేయటం అందులో ఒకటి.
యెమెన్‌లో కొనసాగుతున్న సంక్షోభం విషయంలో కూడా ఆయనపై విమర్శలున్నాయి. అక్కడ ప్రభుత్వ అనుకూల బలగాలకు సౌదీ అరేబియా మద్దతిస్తోంది. మహిళలు వాహనాలు నడిపేందుకు హక్కు వంటి కొన్ని హక్కుల మీద ఆంక్షలు తొలగించినప్పటికీ.. మహిళా హక్కుల కార్యకర్తల పట్ల కఠినంగా వ్యవహరించటం కూడా విమర్శలకు గురవుతోంది.
ఇటీవలి కాలంలో ప్రాణాంతకమైన కరోనావైరస్ వ్యాప్తిని నిరోధించటానికి సౌదీ అరేబియా చర్యలు చేపడుతోంది.
విదేశీ తీర్థయాత్రికులు తీర్థయాత్ర (ఉమ్రా)లో భాగంగా తమ దేశంలో ప్రవేశించకుండా అడ్డుకుంది. ఈ సంవత్సరం.. ముస్లింలకు ఎంతో పవిత్రంగా భావించే హజ్ యాత్ర జరుగుతుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఇస్లాం మతస్తులకు అత్యంత పవిత్ర నగరమైన మక్కాను శుభ్రం చేయటానికి గురువారం నగరం మొత్తం ఖాళీ చేయించారు.

ఇవి కూడా చదవండి:
- షెఫాలీ వర్మ: 16 ఏళ్ల క్రికెట్ రాక్ స్టార్
- అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు, ఎందుకు, ఎలా మొదలైంది?
- ప్రణయ్ హత్యకేసు నిందితుడు మారుతీ రావు ఆత్మహత్య
- పోలీసులమంటూ వాహనం ఆపి యువతిపై గ్యాంప్ రేప్; అలా ఎవరైనా ఆపితే ఏం చేయాలి?
- పీతల నీలి రంగు రక్తం ప్రతి ఏటా లక్షలాది ప్రాణాలను కాపాడుతోందని మీకు తెలుసా?
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు
- కరోనావైరస్లు ఎక్కడి నుంచి వస్తాయి... ఒక్కసారిగా ఎలా వ్యాపిస్తాయి?
- కరోనావైరస్: శశిథరూర్ మెడలోని ఈ గాడ్జెట్ వైరస్‌లను అడ్డుకుంటుందా
- జోసెఫ్ స్టాలిన్: అలనాటి సోవియట్ అధినేత జీవితం... ఇలా ముగిసింది
- కరోనావైరస్: పదేపదే ముఖాన్ని తాకే అలవాటు మానుకోవడం ఎలా?
- మీ స్మార్ట్ ఫోన్ రెండేళ్లకంటే పాతదా? అయితే జాగ్రత్త.. వంద కోట్ల ఆండ్రాయిడ్ డివైజ్‌లకు హ్యాకింగ్ ముప్పు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









