జమాల్ ఖషోగ్జీ: ఇస్తాంబుల్‌లో సౌదీ జర్నలిస్టు హత్య కేసులో ఐదుగురికి మరణ శిక్ష.. ముగ్గురికి జైలు

ఫొటో సోర్స్, AFP
సౌదీ అరేబియా జర్నలిస్టు జమాల్ ఖషోగ్జీ హత్య కేసులో ఐదుగురికి సౌదీ కోర్టు సోమవారం మరణ శిక్ష విధించింది. మరో ముగ్గురికి కారాగార శిక్ష వేసింది.
హత్యకు పాల్పడినందుకు, ఇందులో నేరుగా భాగస్వాములైనందుకు రియాద్ క్రిమినల్ కోర్టు ఐదుగురికి మరణ దండన, నేరాన్ని కప్పిపుచ్చినందుకు, చట్టాన్ని ఉల్లంఘించినందుకు ముగ్గురికి మొత్తం 24 ఏళ్ల జైలు శిక్ష విధించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది. మిగతా ముగ్గురు నిర్దోషులుగా తేలారని వివరించింది.
సౌదీ ప్రభుత్వాన్ని విమర్శించే ఖషోగ్జీని 2018 అక్టోబర్ 2న టర్కీలోని ఇస్తాంబుల్‌లో సౌదీ అరేబియా కాన్సులేట్‌లో సౌదీ ఏజెంట్ల బృందం హత్య చేసింది.
టర్కీకి చెందిన తన ప్రియురాలిని పెళ్లి చేసుకోవడానికి అవసరమైన పత్రాల కోసం ఆ రోజు కాన్సులేట్ లోపలికి వెళ్లిన ఖషోగ్జీ, తర్వాత కనిపించలేదు.
ఖషోగ్జీ హత్యకు గురయ్యారని ఆ తర్వాత వెల్లడైంది. హత్య కేసులో 11 మంది నిందితులపై రహస్యంగా విచారణ సాగింది.
59 ఏళ్ల ఖషోగ్జీ వాషింగ్టన్ పోస్ట్ పత్రిక కాలమిస్టు. ఆయన అమెరికాలో ఉండేవారు.

ఖషోగ్జిని ఒప్పించి లేదా బలప్రయోగంతో సౌదీకి తీసుకొచ్చేందుకు సౌదీ ఇంటెలిజెన్స్ విభాగం ఉపసారథి ఒక 'సంప్రదింపుల బృందాన్ని' ఇస్తాంబుల్‌కు పంపించారని, హత్యకు ఆ బృందం సారథే ఆదేశాలిచ్చారని సౌదీ డిప్యూటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ షాలన్ షాలన్ 2018 నవంబరులో మీడియాతో చెప్పారు.
ఖషోగ్జీకి, సౌదీ అధికారులకు మధ్య ఘర్షణ జరిగిందని, ఆ తర్వాత ఆయన్ను బలప్రయోగంతో నియంత్రించారని, అప్పుడు ఆయనకో డ్రగ్‌ను అధిక మోతాదులో ఇచ్చారని, అది మరణానికి దారితీసిందని దర్యాప్తు అధికారులు తేల్చారని షాలన్ పేర్కొన్నారు. ఖషోగ్జీ మృతదేహాన్ని ముక్కలు చేసి కాన్సులేట్ బయట వేచి ఉన్న మరో వ్యక్తికి అందజేశారని చెప్పారు.
ఖషోగ్జీని సౌదీకి తీసుకొచ్చే మిషన్ మొదలైనప్పుడు ఆయన్ను చంపాలనే ముందస్తు ఆలోచన లేదని పబ్లిక్ ప్రాసిక్యూషన్ దర్యాప్తులో తేలిందని షాలన్ సోమవారం రియాద్‌లో మీడియాతో చెప్పారు.
ఖషోగ్జీ హత్యలో సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ పాత్రపై దర్యాప్తు జరపాలని ఐక్యరాజ్యసమితి ప్రత్యేక అధికారి యాగ్నెస్ కాలమర్డ్ డిమాండ్ చేశారు. "ఖషోగ్జీది ముందస్తు ప్రణాళికతో చేసిన హత్య. దీనికి సౌదీ అరేబియానే బాధ్యత వహించాలి. హత్యపై దర్యాప్తు జరిపించాలి" అని ఆమె నిరుడు అక్టోబరులో తన నివేదికలో పేర్కొన్నారు.
కోర్టు తీర్పు తర్వాత కాలమర్డ్ స్పందిస్తూ- దర్యాప్తును, ప్రాసిక్యూషన్‌ను, న్యాయాన్ని అపహాస్యం చేయడం ఇంకా కొనసాగుతోందని ఆమె ట్విటర్లో విచారం వ్యక్తంచేశారు.

ఫొటో సోర్స్, AFP
హత్యలో ప్రమేయం లేదన్న యువరాజు సల్మాన్
ఈ హత్యలో తనకు ఎలాంటి ప్రమేయమూ లేదని యువరాజు చెప్పారు. అయితే ఇది సౌదీ ప్రభుత్వం కోసం పనిచేస్తున్న వ్యక్తులు చేసినందున సౌదీ నాయకుడిగా దీనికి పూర్తిగా బాధ్యత వహిస్తానని ఆయన ఈ ఏడాది అక్టోబరులో వ్యాఖ్యానించారు.
నిందితుల విచారణ రహస్యంగా సాగింది.
విచారణ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా జరగలేదని, అర్థవంతమైన జవాబుదారీతనానికి సౌదీ అధికార వ్యవస్థ అడ్డంకులు కల్పించిందని 'హ్యూమన్ రైట్స్ వాచ్' ఆక్షేపించింది.
ఖషోగ్జీ హత్య కేసు నేపథ్యంలో యువరాజు సీనియర్ సహాయక అధికారి సౌద్ అల్ ఖహ్తానీని ప్రభుత్వం తప్పించింది. తగిన ఆధారాల్లేకపోవడంతో ఆయనపై అభియోగాలు నమోదు చేయలేదని పబ్లిక్ ప్రాసిక్యూషన్ చెప్పింది.
ఇంటెలిజెన్స్ విభాగం మాజీ ఉపసారథి అహ్మద్ అల్-అసిరిపైనా విచారణ సాగింది. అయితే తగిన ఆధారాల్లేవనే కారణంతో ఆయన్ను నిర్దోషిగా తేల్చారు.
మొత్తం 31 మందిపై దర్యాప్తు సాగించామని, వీరిలో 21 మందిని అరెస్టు చేశామని, 11 మందిని నిందితులుగా కోర్టు ముందకు తీసుకెళ్లామని పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది.

ఫొటో సోర్స్, Reuters
ఖషోగ్జీ హత్యకు ముందు ఆయన చివరి క్షణాలుగా చెబుతున్న రికార్డింగ్స్ వివరాలను టర్కీలోని ప్రభుత్వ అనుకూల వార్తాపత్రిక 'సబా' ఈ ఏడాది సెప్టెంబరులో ప్రచురించింది. ఇవి కాన్సులేట్ లోపల జరిగిన రికార్డింగ్స్ అని, టర్కీ నిఘా వర్గాల నుంచి వీటిని పొందామని తెలిపింది.
ఖషోగ్జీని 'హిట్ స్క్వాడ్' అనే పేరున్న ఒక గ్రూప్ హత్య చేసిందని పత్రిక చెప్పింది. సౌదీ అరేబియా నుంచి వచ్చిన బృందంలోని ఫోరెన్సిక్ నిపుణుడు, ఖషోగ్జీ లోపలికి రాక ముందు ఆయన్ను 'బలి ఇవ్వాల్సిన జంతువు'గా పేర్కొన్నట్లు తెలిపింది.
కాన్సులేట్‌లో ఖషోగ్జీకి డ్రగ్ ఇచ్చారని, హంతకులతో ఖషోగ్జీ చివరగా తనకు ఆస్తమా ఉందని, తన నోటిని మూసి ఉంచవద్దని చెప్పారని, తర్వాత ఆయన స్పృహ కోల్పోయారని పత్రిక వివరించింది. తలకు ఒక సంచి వేయడంతో ఖషోగ్జీకి ఊపిరాడలేదని, ఆయన పెనుగులాడినట్లు అనిపించే శబ్దాలు కూడా రికార్డ్ అయ్యాయని పేర్కొంది.
సౌదీలో స్వతంత్ర భావాలుంటే అరెస్టు తప్పదన్న ఖషోగ్జీ
అఫ్గానిస్తాన్‌లో సోవియట్ జోక్యం, ఒసామా బిన్ లాడెన్ బలపడిన తీరు, ఇతర అంశాలపై ఖషోగ్జీ అనేక కథనాలు రాశారు.
ఒకప్పుడు సౌదీ రాజకుటుంబంతో ఆయనకు సన్నిహిత సంబంధాలుండేవి. సౌదీ సీనియర్ అధికారులకు సలహాదారుగానూ వ్యవహరించారు.
సౌదీ వ్యవహారాలపై గట్టి పట్టున్న ఖషోగ్జీ 2017లో అమెరికాకు వెళ్లిపోయారు.
అసమ్మతి స్వరం వినిపిస్తున్న వారిపై సౌదీ యువరాజు సల్మాన్ ఆదేశాల మేరకు జరుగుతున్న అణచివేత నుంచి బయటపడేందుకు దేశం నుంచి తనను తానే వెలి వేసుకుంటున్నానని ఆయన అప్పట్లో చెప్పారు.
హత్యకు గురికావడానికి కొన్ని రోజుల ముందు బీబీసీతో ఖషోగ్జీ మాట్లాడుతూ- స్వతంత్ర భావాలున్న అందరినీ సౌదీలో అరెస్టు చేస్తున్నారని విమర్శించారు.

ఫొటో సోర్స్, AFP
టర్కీ మీడియా కథనాల ప్రకారం 2018 అక్టోబర్ 2 నాటి పరిణామాలు:
తెల్లవారుజామున 03.28: అనుమానిత సౌదీ ఏజెంట్లతో మొదటి ప్రైవేట్ జెట్ ఇస్తాంబుల్ విమానాశ్రయంలో దిగింది.
05.05: సౌదీ కాన్సులేట్‌కు దగ్గర్లోని రెండు హోటళ్లలో వీరంతా దిగారు.
12.13: అనేక దౌత్య వాహనాలు కాన్సులేట్ వద్దకు వచ్చాయి. వాటిలో సౌదీ ఏజెంట్లు ఉన్నట్లు అనుమానాలు.
13.14: కాన్సులేట్‌లో ప్రవేశించిన ఖషోగ్జీ
15.08: కాన్సులేట్ నుంచి బయటికి వచ్చిన వాహనాలు. అవి దగ్గరలో ఉన్న సౌదీ కాన్సుల్ ఇంటికి వెళ్లాయి.
17.18: ఇస్తాంబుల్ చేరుకున్న రెండో ప్రైవేట్ జెట్.
17.33: ఖషోగ్జీ పెళ్లి చేసుకోవాలని భావించిన హటీస్ చెంగిజ్ కాన్సులేట్ బయట వేచి ఉండడం సీసీటీవీలో కనిపించింది.
18.20: రెండు ప్రైవేట్ జెట్‌లలో ఒకటి ఇస్తాంబుల్ నుంచి బయలుదేరి పోయింది. మరో జెట్ రాత్రి 9 గంటల సమయంలో వెళ్లిపోయింది.

నిందితుల్లో ఫాహద్ షాబిబ్ అల్‌బలావి, తుర్కి ముసీరఫ్ అల్‌షెహ్రి, వాలీద్ అబ్దుల్లా అల్‌షెహ్రి, మహెర్ అబ్దులజీజ్ ముత్రెబ్, డాక్టర్ సలాహ్ మొహమ్మద్ తుబాగీ మరణ శిక్షను ఎదుర్కొంటున్నారని ఐరాస ప్రత్యేక అధికారి కాలమర్డ్ జూన్‌లో చెప్పారు.
సలాహ్ మొహమ్మద్ తుబాగీ సౌదీ అంతర్గత వ్యవహారాల శాఖలో ఫోరెన్సిక్ నిపుణుడు.
మహెర్ అబ్దులజీజ్ ముత్రెబ్, యువరాజు సల్మాన్ ఒకప్పటి సీనియర్ సహాయక అధికారి ఖహ్తానీ తరపున పనిచేసిన నిఘా అధికారి అని అమెరికా చెబుతోంది.
నిందితులు ప్రభుత్వ ఉద్యోగులని, ఉన్నతాధికారుల ఆదేశాలకు వారు అభ్యంతరం చెప్పలేరని వారి తరపు న్యాయవాదులు కోర్టులో వాదించినట్లు కాలమర్డ్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- 'జమాల్ ఖషోగ్జీ హత్యకు... యువరాజుకు ఏ సంబంధం లేదు' - సౌదీ అరేబియా
- దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులు ఎందుకున్నాయి?
- ప్రపంచబ్యాంకు బాటలోనే ఏఐఐబీ.. రాజధాని ప్రాజెక్టు నుంచి వెనక్కు
- ఏపీలో ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి తెలంగాణలో రేప్ నిందితుల వరకు.. ఎన్కౌంటర్లలో నిజమెంత
- హైదరాబాద్ అత్యాచారం, ఎన్కౌంటర్: "మనం కోరుకునే న్యాయం ఇది కాదు"
- అత్యాచారాలు, హత్యలకు రవాణా సౌకర్యాలు సరిగా లేకపోవడం కూడా ఒక కారణమా...
- బెర్లిన్ వాల్ కూలిపోయి 30 ఏళ్లయ్యాక.. యూరప్ దేశాలు ఇప్పుడు అడ్డుగోడలు ఎందుకు నెలకొల్పుతున్నాయి?
- ‘ట్రంప్ మమ్మల్ని అమ్మేశాడు.. ప్రపంచం కళ్లు మూసేసుకుంది’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








