సౌదీ అరేబియా: మహిళలపై సడలించిన నిబంధనలను ఎలా అర్థం చేసుకోవాలి

సౌదీ అరేబియాలో 21 ఏళ్లు పైబడిన మహిళలు సంరక్షకుడి అనుమతి లేకుండా పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సౌదీ అరేబియాలో 21 ఏళ్లు పైబడిన మహిళలు సంరక్షకుడి అనుమతి లేకుండా పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

సౌదీ అరేబియాలో మహిళలు ఇకపై పురుషుడి తోడు లేకుండా విదేశాలకు వెళ్లొచ్చు.

ఇటీవల సవరించిన చట్టాల వల్ల మహిళలకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో ఒకసారి పరిశీలిద్దాం.

ఏం జరిగింది?

సౌదీ అరేబియా రాజు సల్మాన్ ఇటీవల అనేక పౌర చట్టాలకు సవరణలను ఆమోదించారు. కొత్త చట్టాల ప్రకారం 21 ఏళ్లు నిండిన సౌదీ మహిళ ఇకపై స్వతంత్రంగా పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పురుష సంరక్షకుడి అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లొచ్చు.

అంతేకాకుండా, మహిళలకు బిడ్డ జననం, పెళ్లి, విడాకులను రిజిస్టర్ చేసుకునే హక్కు కూడా కొత్త చట్టాలతో లభించాయి.

గతంలో ఒక మహిళ బయటకు వెళ్లాలంటే భర్త లేదా తండ్రి లేదా పురుష సంరక్షుడి అనుమతి తప్పనిసరి.

సౌదీ మహిళలు

ఫొటో సోర్స్, Getty Images

గార్డియన్‌షిప్ అంటే ?

సౌదీ అరేబియా గార్డియన్‌షిప్ పద్ధతి ప్రకారం, మహిళలు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా పురుషుడి మీదే ఆధారపడాలి.

ప్రతి మహిళకు పురుష సంరక్షుడు ఉండాలి. సాధారణంగా తండ్రి లేదా భర్త, కొన్నిసార్లు కుమారుడు, మగ బంధువు ఈ సంరక్షకుడి పాత్ర పోషిస్తారు.

తాము ఎక్కడ చదువుకోవాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి అనే నిర్ణయాలను మహిళలు తమ గార్డియన్ అంగీకారంతోనే తీసుకుంటారు.

సౌదీలో మహిళలు ఇకపై స్వతంత్రంగా ప్రయాణించవచ్చు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సౌదీలో మహిళలు ఇకపై స్వతంత్రంగా ప్రయాణించవచ్చు

ఇప్పుడే మార్పులు ఎందుకు ?

సౌదీలో మహిళలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారని అంతర్జాతీయ మానవహక్కుల సంఘాలు విమర్శలు చేస్తున్నాయి.

మహిళలు డ్రైవింగ్ చేయడానికి అనుమతి ఇస్తున్నట్లు ఇటీవల చట్టాల్లో మార్పులు తెచ్చిన తర్వాత సౌదీ ప్రభుత్వం మరింత విమర్శలకు గురైంది.

గతేడాది ఇస్తాంబుల్‌లోని సౌదీ కాన్సులేట్‌లో పాత్రికేయుడు జమాల్ ఖాషోగ్జీ హత్య ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది.

సౌదీలోని కొంతమంది ఉన్నత వర్గాల మహిళలు చాలా కాలంగా లింగ వివక్ష వేధింపుల మూలంగా ఇతర దేశాల్లో ఆశ్రయం పొందుతున్నారు.

మహిళలకు డ్రైవింగ్ అనుమతి రాకముందు దీనిపై పోరాడిన 12 మంది మహిళా కార్యకర్తలను 2018 మార్చిలో అరెస్టు చేశారు. కొంతమందిని విడుదల చేసినా మరికొంత మంది జైలులోనే ఉన్నారు.

మహిళలకు సంబంధించి అనేక సంస్కరణలు చేపట్టినప్పటికీ వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2018 లింగ వ్యత్యాస సూచీలో అట్టడుగున నిలిచిన 10 దేశాలలో ఒకటిగా సౌదీ అరేబియా నిలిచింది.

ఈ మార్పులను ఎలా అర్థం చేసుకోవాలి?

ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న.

ఈ మార్పులపై ట్విటర్‌లో సౌదీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ, ఇప్పటికీ మహిళలను జైలు నుంచి విడుదల చేయడానికి, గృహహింస నుంచి విముక్తి కల్పించడానికి పురుషుడి అంగీకారం కావాల్సిందే. పెళ్లి చేసుకోడానికి, సొంతంగా బతకడానికి కూడా గార్డియన్ అనుమతి కావాల్సిందే.

ఈ మార్పులు అమలులోకి వచ్చిన తరుణంలో శుక్రవారం ''గార్డియన్ అనుమతి లేకుండా వివాహం'' అనే హాష్‌ట్యాగ్ సౌదీలో ట్రెండ్ అయింది.

ఇవి కూడా చూడండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)