కరోనావైరస్‌ను ఎదుర్కోవడానికి భారత్ సన్నద్ధంగానే ఉందా

ఫొటో సోర్స్, AFP
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, ఇండియా కరస్పాండెంట్
జనాభారీత్యా ప్రపంచంలోనే రెండో అతి పెద్ద దేశమైన భారత్ కరోనావైరస్ వ్యాప్తిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందా?
60 దేశాల్లో 3 వేల మందికిపైగా మరణానికి కారణమైన కరోనావైరస్‌ను అరికట్టే సన్నద్ధతలో ముందు వరుసలో ఉన్న దేశాల్లో భారత్ ఒకటని చెబుతున్నారు.
కరోనావైరస్ వల్ల ఒకరు చనిపోయినట్లు చైనా అధికారిక మీడియా ప్రకటించిన ఆరు రోజుల తరువాత... ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనావైరస్‌ను ప్రపంచ ఆరోగ్య విపత్తుగా ప్రకటించడానికి రెండు వారాల ముందు... జనవరి 17 నుంచే తాము విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ ప్రారంభించామని భారత ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ చెబుతున్నారు.
మార్చి 6 వరకు భారత్‌లో 31 కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో 16 మంది ఇటలీ నుంచి వచ్చిన పర్యటకులు.
ఈ వైరస్‌పై ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. దిల్లీలో స్కూళ్లకు సెలవులిచ్చారు. తమ ఉద్యోగులకు కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధరణ కావడంతో కొన్ని కార్యాలయాలు తాత్కాలికంగా మూసివేశారు.
మంగళవారం వరకు భారతదేశంలోని 21 విమానాశ్రయాలు, 77 నౌకాశ్రయాలలో 6 లక్షల మందికిపైగా కరోనావైరస్ పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ చెప్పారు.
నేపాల్‌తో సరిహద్దులున్న అయిదు రాష్ట్రాల్లో 10 లక్షల మందికి పరీక్షలు నిర్వహించామని.. 27 వేల మందిని పరిశీలనలో ఉంచామని మంత్రి చెప్పారు.
ఇరాన్ నుంచి భారత్‌కు తిరిగొచ్చేవారి కోసం ఇరాన్‌లోనే ఒక స్క్రీనింగ్ ల్యాబ్‌ను భారత్ ఏర్పాటుచేస్తున్నట్లు ఆయన తెలిపారు.
రాష్ట్రాల్లోని ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయడం.. ఆరోగ్య కార్యకర్తలకు కరోనావైరస్ వ్యాప్తి నివారణకు సంబంధించి ముందుగానే శిక్షణ ఇవ్వడం వంటివన్నీ ఇప్పటికే చేసినట్లు హర్షవర్ధన్ చెప్పారు. ఈ వారాంతానికి దేశవ్యాప్తంగా కరోనావైరస్ పరీక్షల కోసం ఇప్పుడున్న 15 ల్యాబ్‌లతో కలిపి మొత్తం 34 ప్రయోగశాలలు పనిచేస్తాయని ఆయన ప్రకటించారు.
దేశీయంగా కొరత రాకుండా చూసేందుకు గాను ఎన్-95 మాస్కుల ఎగుమతి నిలిపివేసినట్లూ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇదంతా వినడానికి చాలా బాగుంది కానీ, ఇంకా పూర్తి సన్నద్ధత ఉందా అన్న ప్రశ్నలు మాత్రం వినిపిస్తున్నాయి.
ఈ వైరస్ ఎంతమందికి సోకిందన్న విషయంలో స్పష్టత లేదు. విమానాశ్రయాలు, నౌకాశ్రయాలలో పరీక్షలు చేసినప్పటికీ ఈ వైరస్ ఇంకుబేషన్ పీరియడ్ 14 నుంచి 24 రోజులు ఉంటుంది కాబట్టి స్క్రీనింగ్ పరీక్షల్లో కరోనావైరస్ లేనట్లు తేలినవారందరికీ నిజంగానే లేదా అన్న విషయంలో స్పష్టత లేదు.
''ఎయిర్‌పోర్టులు, సీపోర్టులో టెస్టులు చేయడం చాలా మంచి విషయం. అయితే, అది చాలదు. ఇతర సర్వేలెన్స్ వ్యవస్థలనూ ఉపయోగించాలి'' అని ప్రపంచ ఆరోగ్య సంస్థలో చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ అన్నారు.
పోలియోను సమర్థంగా నిర్మూలించడంలో, 2009లో స్వైన్ ఫ్లూ మహమ్మారిని ఎదుర్కోవడంలో, ఇటీవల ప్రాణాంతక నిఫా వైరస్‌ను కూడా విజయవంతంగా ఎదుర్కొన్న రికార్డు భారత్‌కు ఉంది.
భారత ప్రభుత్వం, ప్రపంచ ఆరోగ్య సంస్థ కలిసి చేపట్టిన నేషనల్ పోలియో సర్వేలెన్స్ ప్రాజెక్ట్ (ఎన్‌పీఎస్‌పీ) కమ్యూనిటీ సర్వేలెన్స్, కాంటాక్ట్ టెస్టింగ్‌కు ప్రసిద్ధి. ఇప్పుడు కరోనావైరస్ వ్యాప్తి నిరోధానికీ కమ్యూనిటీ సర్వేలెన్స్, కాంటాక్ట్ టెస్టింగ్ రెండూ అత్యంత అవసరం. (కరోనావైరస్ పాజిటివ్‌గా తేలిన మూడు రాష్ట్రాలకు చెందిన అయిదుగురితో సంబంధాలున్న 450 మందిని ఆరోగ్య కార్యకర్తలు ఇప్పటికే సంప్రదించారని అధికారులు చెబుతున్నారు).
ఇన్‌ఫ్లూయెంజా సర్వేలెన్స్ కార్యక్రమం కూడా భారత్‌లో ఉంది. హెచ్1ఎన్1తో కలిపి మొత్తం నాలుగు ఫ్లూ వైరస్‌లు భారత్‌లో ప్రబలంగా ఉన్నాయి.
సాధారణంగా శీతకాలంలో విజృంభించే ఈ వైరస్‌లు భారత్‌లో వేసవి, వర్షాకాలాల్లోనూ ప్రబలుతున్నాయి. కొన్ని వైద్య కళాశాలల్లో ప్రజలకు ఫ్లూ పరీక్షలు చేస్తారు.
ఈ ఇన్‌ఫ్లూయెంజా ప్రోగ్రాంను ఉపయోగించి కరోనావైరస్ నెగటివ్ శాంపిల్స్‌పై సర్వేలెన్స్ పెట్టి సమాజంలో ఇది విస్తరిస్తుందేమో తెలుసుకోవచ్చని వైరాలజిస్ట్‌లు అంటున్నారు. ''మేం తర్వగా డయాగ్నోజ్ చేయగలం. చాలావరకు కోవిడ్-19 ఇన్పెక్షన్లు తేలికపాటివే'' అన్నారు దిల్లీకి చెందిన సాంక్రమిక వ్యాధుల నిపుణులు లలిత్ కాంత్.
భారీస్థాయిలో ఇలాంటి వైరస్‌ల వ్యాప్తి సంభవించినప్పుడు ఇండియా సవాళ్లు ఎదుర్కొంటుంది. భారతదేశ ప్రజారోగ్య వ్యవస్థ దేశమంతటా ఒకేలా లేదు. రోగులు చేరడం పెరిగితే ఆసుపత్రులు ఏమాత్రం చాలవు. మాస్కులు, గ్లోవ్స్, మందులు, వెంటిలేటర్లు వంటివి సరిపడా ఉన్నాయా లేవా అనే విషయంలో స్పష్టత లేదు. పెద్ద స్థాయిలో వైరస్ వ్యాప్తి చెందితే ఎదుర్కోవడం భారత్‌కు ఇబ్బందేనని వైరాలజిస్ట్ జాకబ్ జాన్ అన్నారు.

ఫొటో సోర్స్, EPA
చైనా తరహాలో ప్రజలను నిర్బంధంలో ఉంచడం.. పెద్దసంఖ్యలో ప్రజలను ఆసుపత్రుల్లో చేర్చడం వంటివి భారత్‌లో సాధ్యం కాకపోవచ్చు.
ఇన్ఫెక్షన్ తక్కువ స్థాయిలో ఉంటే ఇళ్లలోనే చికిత్స చేయాలని.. ముదిరితేనే ఆసుపత్రుల్లో ఉంచాలని వైరాలజిస్టులు అంటున్నారు.
మరోవైపు భారత్‌లో హెల్త్ కేర్ డాటా అరకొరగా ఉండడంపైనా ఆందోళనలున్నాయి. వ్యాధులు, మరణాల నమోదు విషయంలోనూ భారత్ డేటాకు సరైన రికార్డు లేదు. మరణాల్లో 77 శాతమే నమోదవుతున్నాయని.. వైద్యులు మరణ కారణాలను కచ్చితంగా తెలిపే సందర్భాలూ తక్కువని టొరంటో కేంద్రంగా పనిచేసే సెంటర్ ఫర్ గ్లోబల్ రీసెర్చ్ అధ్యయనం తెలిపింది.

ఫొటో సోర్స్, AFP
అపోహలు.. తప్పుడు భావనలు..
వైరస్‌ను సమర్థంగా నిరోధించడంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అపోహలు, తప్పుడు అభిప్రాయాలు ఆటంకంగా మారే ప్రమాదం ఉంది.
వెల్లుల్లి, అల్లం, విటమిన్-సి, నిమ్మకాయ కలిపి తీసుకుంటే కరోనావైరస్ రాదని వాట్సాప్‌లో ఒక మెసేజ్ తిరుగుతోంది.
మరోవైపు ప్రభుత్వ శాఖ ఒకటి హోమియోపతి మందును ఒకదాన్ని సూచిస్తూ ప్రకటన చేసింది.
యోగాతో తగ్గుతుందని... గంజాయి పీల్చినా, గోమూత్రం తాగినా కరోనావైరస్ రాదని కూడా వాట్సాప్‌లో మెసేజ్‌లు వస్తున్నాయి.
ఇలాంటివాటిని ప్రజలు ఏమాత్రం పట్టించుకోరాదని.. ప్రజలు ప్రధానంగా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, చేతులు తరచూ శుభ్రంగా కడుక్కోవాలని, ఒకవేళ లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ స్పష్టం చేశారు.
ఆరోగ్య మంత్రి చెప్పినట్లు భయపడనవసరం లేకున్నా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం మాత్రం ఉంది.

ఇవి కూడాచదవండి.
- కరోనావైరస్: పదేపదే ముఖాన్ని చేతులతో తాకే అలవాటు మానుకోవడం ఎలా?
- అఫ్ఘానిస్తాన్: తాలిబాన్లతో చర్చలు జరిపిన మహిళ ఫాజియా కూఫీ కథ ఇదీ...
- అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు, ఎందుకు, ఎలా మొదలైంది?
- మారుతీ రావు ఆత్మహత్యపై అమృత స్పందన.. ‘తప్పు తెలుసుకుని పశ్చాత్తాపంతో చనిపోయి ఉండొచ్చు’
- BBC ISWOTY: భారత్‌లో మహిళలు క్రీడల్లో ఎక్కడున్నారు... బీబీసీ అధ్యయనంలో ఏం తేలిందంటే...
- ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2020: ఫైనల్స్‌కు చేర్చిన భారత బౌలర్ల కథ ఏమిటి?
- మీ స్మార్ట్ ఫోన్ రెండేళ్లకంటే పాతదా? అయితే జాగ్రత్త.. వంద కోట్ల ఆండ్రాయిడ్ డివైజ్‌లకు హ్యాకింగ్ ముప్పు
- ఇంటర్ విద్యార్థులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? దీనికి పరిష్కారం ఏంటి?
- ‘దేవుణ్ణి పూజించాలి, గే వివాహాలను నిషేధించాలి’ - రాజ్యంగంలో సవరణలు తీసుకొచ్చేందుకు సిద్ధమైన పుతిన్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









