బియాండ్ ఫేక్‌న్యూస్: ‘‘రండి.. ఫేక్‌న్యూస్‌పై కలిసి పోరాడదాం’’

- రచయిత, రూపా ఝా
- హోదా, హెడ్, బీబీసీ ఇండియన్ లాంగ్వేజెస్
మీడియాలో వచ్చే వార్తాకథనాలను విశ్లేషించుకోగలవారు, అవి ఎంత వరకు నిజమో అంచనా వేయగలవారు ఫేక్ న్యూస్‌ను వ్యాప్తి చేసే ఆస్కారం తక్కువ. ఈ నేపథ్యంలోనే బ్రిటన్, భారత్‌లలోని వివిధ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు మీడియాపై అవగాహన కల్పించేందుకు బీబీసీ జర్నలిస్టు బృందాలు వర్క్‌షాప్‌లు నిర్వహించాయి. వీటిని 'రియల్ న్యూస్' వర్క్‌షాప్‌లుగా వ్యవహరిస్తున్నాం.
భారత్‌లో 'బియాండ్ ఫేక్ న్యూస్(Beyond Fake News)' ప్రాజెక్టులో భాగంగా బీబీసీ ఈ వర్క్‌షాప్‌లు నిర్వహించింది. ఈ ప్రాజెక్టులో భాగంగానే నవంబరు 12న హైదరాబాద్, దిల్లీ, చెన్నై, అహ్మదాబాద్, పుణె,అమృత్‌సర్, లఖ్‌నవూ నగరాల్లో బియాండ్ ఫేక్ న్యూస్ సదస్సులను నిర్వహించనుంది.
తప్పుడు సమాచారం వ్యాప్తిని అడ్డుకోవడానికి బీబీసీ వరల్డ్ సర్వీస్ చేపడుతున్న అనేక కార్యక్రమాల్లో బియాండ్ ఫేక్ న్యూస్ ప్రాజెక్టు ఒకటి. మీడియా గురించి అవగాహన పెంచడంపైనే ప్రధానంగా దృష్టి పెడుతూ బీబీసీ ఈ కార్యక్రమాలు చేపడుతోంది.
బ్రిటన్‌లో ఇటీవలి కాలంలో విజయవంతమైన ఒక ప్రాజెక్టు తరహాలోనే బీబీసీ భారత్‌లో 'రియల్ న్యూస్' వర్క్‌షాప్ లను నిర్వహించింది. ఫేక్ న్యూస్ అంటే ఏమిటో తెలుసుకోవడంలోనూ, ఫేక్ న్యూస్‌ను ఎదుర్కొనే పరిష్కారాలను కనుగొనడంలోనూ విద్యార్థులకు సాయపడటమే రియల్ న్యూస్ వర్క్‌షాప్‌ల ఉద్దేశం.
భారత టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ(ట్రాయ్) సమాచారం ప్రకారం దేశంలో మొబైల్ కనెక్షన్లు వంద కోట్లకు పైగా ఉన్నాయి. కోట్ల మంది భారతీయులు అతి తక్కువ కాలంలోనే ఇంటర్నెట్ సదుపాయాన్ని వాడటం మొదలయ్యింది.
అత్యధికులు మొబైల్ ఫోన్‌లో ఇంటర్‌నెట్ వాడుతున్నారు. చాలా మంది చాట్‌యాప్స్ ద్వారా వార్తలు అందుకొంటున్నారు, షేర్ చేసుకొంటున్నారు. వ్యక్తుల మధ్య అనుసంధానానికి, వార్తలు పంపుకొనేందుకు ఈ యాప్స్ గొప్ప మార్గాలే.
అయితే ఎలాంటి అడ్డూ అదుపూ లేకుండా శరవేగంగా తప్పుడు సమాచారం వ్యాప్తి చెందడానికి కూడా ఇవి వాహకాలు కాగలవు. చాట్‌యాప్స్, ఇంటర్నెట్ ద్వారా ఇబ్బడిముబ్బడిగా వచ్చి పడే సమాచారంతో జనం గందరగోళానికి గురి కావొచ్చు.
అప్పుడు ఏది నిజమో, ఏది కాదో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలోనే వార్తాకథనాలను అర్థం చేసుకోవడంపైనా, వాటిలో నిజానిజాలను గుర్తించడంపైనా విద్యార్థులకు, యువతీయువకులకు శిక్షణ ఇవ్వడం చాలా అవసరమని బీబీసీ భావిస్తోంది.

విద్యార్థులపైనే దృష్టిని ఎందుకు కేంద్రీకరిస్తున్నామంటే...
వార్తల కోసం ఇంటర్నెట్, చాట్‌యాప్స్ వాడేది పిల్లలు, యువతీయువకులు మాత్రమే కాదు. అందరూ వాడతారు. అయినప్పటికీ, వర్క్ షాప్‌ల నిర్వహణలో విద్యార్థులు, యువతపైనే బీబీసీ దృష్టి కేంద్రీకరించాలనుకొంటోంది.
ఇందుకు రెండు కారణాలున్నాయి. మొదటిది-కుటుంబ సభ్యులు, స్నేహితుల కుటుంబాల ద్వారా అన్ని తరాల వారిని ప్రభావితం చేయగల శక్తి వారికి ఉంటుంది. రెండో కారణమేంటంటే- పిల్లలు ఇంటర్నెట్‌ను వాడుతూ పెరిగి పెద్దవారవుతున్నారు. కమ్యూనికేషన్ కోసం వీరు ఎక్కువగా చాట్‌యాప్స్ వాడుతుంటారు.
ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొనే, మీడియా, డిజిటల్ అక్షరాస్యతపై విద్యార్థులకు ప్రాథమిక అవగాహన కల్పించేలా, ఫోన్లలో వ్యాప్తి చెందే సమాచారం గురించి ఆలోచించేలా, ఫేక్ న్యూస్ వ్యాప్తిని వీరి పరిధి లోనైనా నియంత్రించేలా మేం వర్క్‌షాప్‌లను డిజైన్ చేశాం.
బీబీసీ భారత ప్రధాన కార్యాలయం ఉండే దిల్లీలోని పాఠశాలల్లో ఈ వర్క్‌షాప్‌లు నిర్వహించాం. విజయవాడ, చెన్నై, అహ్మదాబాద్, పుణె, అమృత్‌సర్‌లలోనూ బీబీసీ జర్నలిస్టు బృందాలు వీటిని నిర్వహించాయి.
ఇంగ్లిష్‌తోపాటు తెలుగు, తమిళం, హిందీ, గుజరాతీ, మరాఠీ, పంజాబీ భాషల్లో వీటిని నిర్వహించాం. నాలుగు గంటలపాటు సాగిన ఈ వర్క్‌షాప్‌లో వీడియోల ప్రదర్శన, పోటీలు, బృంద కార్యక్రమాలు, ఇతరత్రా ఉన్నాయి. ఫేక్ న్యూస్ సమస్యకు సొంతంగా పరిష్కారాలు కనుగొనేలా వర్క్‌షాప్ సందర్భంగా విద్యార్థులను ప్రోత్సహించాం.

వర్క్‌షాప్‌తో వచ్చిన అవగాహనతో, ఫేక్ న్యూస్ వ్యాప్తిని ఎదుర్కొనేందుకు వీరు పోస్టర్ల రూపకల్పన, గోడలపై బొమ్మల చిత్రణ, సంగీత, నృత్య ప్రదర్శనలు, నాటకాలతో కూడిన ప్రాజెక్టులు చేశారు. వీటిలో కొన్నింటిని నవంబరు 12న దిల్లీ, హైదరాబాద్, చెన్నై సహా దేశవ్యాప్తంగా జరిగే 'బియాండ్ ఫేక్ న్యూస్' సదస్సుల్లో విద్యార్థులు సమర్పించనున్నారు.
అదే వారంలో దేశంలోని వివిధ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీల) విద్యార్థులతో దిల్లీ శివారులోని గురుగ్రామ్‌లో గూగుల్ కార్యాలయంలో బీబీసీ 'హాకథాన్(hackathon)' నిర్వహించనుంది. ఇది టెక్నాలజీ సంబంధ మేధోమథన కార్యక్రమం. ఆన్‌లైన్‌లో ఫేక్ న్యూస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి సాంకేతిక పరిష్కారాలను కనుగొనేందుకు ఈ విద్యార్థులు కృషి చేయనున్నారు.

ఫేక్ న్యూస్‌ను అడ్డుకోకపోతే సమాజానికి తీవ్రమైన హాని
తప్పుడు సమాచారాన్ని అడ్డుకోకపోతే అది సమాజానికి తీవ్రమైన హాని కలిగిస్తుంది. నిజానిజాలను నిర్ధరించుకొని, సమగ్ర పరిశోధన, పరిశీలన జరిపిన తర్వాతే వార్తలు అందించే మీడియా సంస్థలపైనా ప్రజల్లో నమ్మకం సడలిపోయేలా చేస్తుంది.
ఫేక్ న్యూస్ సమస్యకు పరిష్కారం కేవలం ఒక్క కంపెనీతోనో, ఒక్క పరిశ్రమతోనో సాధ్యం కాదు. అన్ని పక్షాలూ కలసికట్టుగా పనిచేస్తేనే ఈ సమస్యను ఎదుర్కోగలం. అందుకే ఈ పోరాటంలో ప్రజలు, టెక్ కంపెనీలు, ఇతర మీడియా సంస్థలతో కలిసి సాగాలని బీబీసీ భావిస్తోంది. ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సంస్థలు, విద్యాసంస్థలతో కలిసి పనిచేయడంపై దృష్టి సారించాం.
ఫేక్ న్యూస్‌ను కట్టడి చేసే విషయంలో విద్యార్థులు, యువతలో మీడియా గురించి అవగాహన పెంచడం తొలి అడుగు. ఇదో ముఖ్యమైన చర్య కూడా. ఈ కార్యక్రమంలో భాగస్వామి కావడం బీబీసీకి గర్వకారణం. 'రియల్ న్యూస్'పై చర్చ జరగాల్సిన సమయం ఆసన్నమైంది.
ఇవి కూడా చదవండి:
- తెలంగాణ ఎన్నికలు.. బీబీసీ ప్రత్యేక కథనాలు
- హర్మన్‌ప్రీత్ కౌర్: టీమిండియా పురుష క్రికెటర్లతో సమానంగా క్రేజ్ తెచ్చుకున్న భారత మహిళా క్రికెటర్
- చరిత్ర: మొదటి ప్రపంచ యుద్ధం ప్రపంచాన్ని ఎలా మార్చేసిందంటే..
- ఈ దేశాల్లో పిల్లల్ని ఎందుకు తక్కువగా కంటున్నారు?
- ‘టెస్ట్ ట్యూ బ్‌లలో చెట్లు’.. ఎప్పుడైనా విన్నారా?
- హాలోవీన్‌ని తెలుగువాళ్లు ఎలా చేసుకుంటారు? - BBC Special
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








