బీబీసీ సర్వే: పేద దేశాలు, పేద ప్రజలపై ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపిన కరోనావైరస్ సంక్షోభం

లాక్‌డౌన్‌లు అమలు చేయడంతో వివిధ దేశాలపై ఆర్థికంగా తీవ్ర ప్రభావం పడింది

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, లాక్‌డౌన్‌లు అమలు చేయడంతో వివిధ దేశాలపై ఆర్థికంగా తీవ్ర ప్రభావం పడింది

కరోనావైరస్ మహమ్మారి ప్రభావం పేద దేశాలపైనే అత్యధికంగా పడిందని, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అసమానతలను మరింత పెంచిందని బీబీసీ నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది.

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన దాదాపు 30 వేల మంది ఈ సర్వేలో పాల్గొన్నారు.

కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు లాక్‌డౌన్‌లు అమలు చేయడంతో వివిధ దేశాలపై ఆర్థికంగా తీవ్ర ప్రభావం పడింది.

పేద దేశాల్లో ఉంటున్నవారు, యువత పెనుసవాళ్లను ఎదుర్కొంటున్నామని సర్వేలో చెప్పారు.

తమ ఆదాయం పడిపోయినట్లు పేద దేశాల్లో 69 శాతం మంది చెబితే, ధనిక దేశాల్లో 45 శాతం మంది చెప్పారు.

జాతి, లింగాన్ని బట్టి కూడా ప్రభావాల్లో తేడాలు కనిపించాయి. పురుషుల కన్నా మహిళలు ఎక్కువ ఇబ్బందులు పడ్డారు.

అమెరికాలో తెల్లజాతివారి కన్నా నల్లజాతివారిలో కోవిడ్ ఇన్ఫెక్షన్ బారినపడుతున్నవారి నిష్పత్తి ఎక్కువగా ఉంది.

బీబీసీ వరల్డ్ సర్వీస్ కోసం గత జూన్‌లో 27 దేశాలవ్యాప్తంగా గ్లోబ్‌స్కాన్ ఈ సర్వే నిర్వహించింది. జనం జీవితాలపై కోవిడ్ చూపించిన ప్రభావం గురించి ప్రశ్నలు అడిగింది.

‘‘ఈ మహమ్మారి సమయంలో మనమంతా కలిసికట్టుగా దీనిని ఎదుర్కొంటున్నామన్న ప్రచారం ప్రధానంగా సాగింది. కానీ, వాస్తవం పూర్తిగా వేరు. చాలా దేశాల్లో వ్యవస్థీకృతంగా వెనుకబడి ఉన్నవాళ్లపైనే అధిక ప్రభావం పడిందని సర్వే ఫలితాలు సూచిస్తున్నాయి’’ అని గ్లోబ్‌స్కాన్ ‌చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్రిస్ కౌల్టర్ బీబీసీతో అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ప్రజలపై కరోనావైరస్ ప్రభావం

పెరుగుతున్న అసమానతలు

పేద దేశాల ప్రజలపై కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం చూపిందని, ఇప్పటికే ఉన్న అసమానతలను మరింత పెంచిందని సర్వే తేల్చింది.

ఆర్గనైషన్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవెలప్‌మెంట్ (ఓఈసీడీ) సభ్య దేశాలకు, మిగతా దేశాలకు మధ్య కోవిడ్ ప్రభావంలో స్పష్టమైన తేడా ఈ సర్వేలో కనిపించింది. అభివృద్ధి చెందిన 37 దేశాలు ఏర్పాటు చేసుకున్న సంఘం ఓఈసీడీ.

కోవిడ్ వల్ల తమ ఆదాయంపై ప్రభావం పడిందని ఓఈసీడీ దేశాల్లో 45 శాతం మంది చెబితే, మిగతా దేశాల్లో 69 శాతం మంది ఇలా చెప్పారు.

యూరప్, ఉత్తర అమెరికాల కన్నా లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలపై కరోనావైరస్ తీవ్ర ప్రభావం చూపింది.

అత్యధికంగా కెన్యాలో 91%, థాయిలాండ్‌లో 81%, నైజీరియాలో 80%, దక్షిణాఫ్రికాలో 77%, ఇండోనేసియాలో 76%, వియత్నాంలో 74% మంది ప్రజలు కోవిడ్ ప్రభావం తమపై పడిందని చెప్పారు.

ఈ దేశాల్లో అల్పాదాయ వర్గాల వాళ్లు తమ దగ్గర డబ్బు మరింత తగ్గిపోయిందని చెప్పారు.

మరోవైపు ఆస్ట్రేలియా, కెనడా, జపాన్, రష్యా, బ్రిటన్ లాంటి దేశాల్లో మాత్రం ఎక్కువగా సంపాదిస్తున్నవారే ఎక్కువ ప్రభావం ఎదుర్కొంటున్నారు.

వివిధ తరాలపై కోవిడ్ ప్రభావం ఇలా ఉంది

తరాల మధ్య అంతరం

యువతరానికి, వృద్ధులకు మధ్య కరోనా సంక్షోభ ప్రభావాల్లో తేడాలు కనిపిస్తున్నట్లు సర్వేలో అభిప్రాయాలు వెల్లడయ్యాయి.

ముందు తరాల కంటే తాము కఠినమైన సవాళ్లు ఎదుర్కొంటున్నామని యువత అభిప్రాయపడ్డారు. ఉద్యోగావకాశాలు, విద్యావకాశాలు తగ్గడం, సామాజిక దూరం దీనికి కారణాలు కావొచ్చు.

కరోనావైరస్ సంక్షోభం తమ జీవితాలపై తీవ్ర ప్రభావం చూపిందని జనరేషన్ జెడ్‌లో (1996 తర్వాత పుట్టినవారు) 55% మంది, మిలీనియల్స్‌లో (1981 నుంచి 1996 మధ్య పుట్టినవారు) 56% మంది అభిప్రాయపడ్డారు.

మరోవైపు జనరేషన్ ఎక్స్‌లో (1965 నుంచి 1980 మధ్య పుట్టినవారు) 49% మంది, బేబీ బూమర్స్ (1946 నుంచి 1964 మధ్యలో పుట్టినవారు) 39% మంది మాత్రమే ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఆర్థికపరంగా ప్రభావానికి గురయ్యామని జనరేషన్ జెడ్‌లో 63% మంది చెబితే, బేబీ బూమర్స్‌లో 42% మంది చెప్పారు.

తమపై శారీరకంగా గానీ, ఆర్థికపరంగా గానీ కోవిడ్ సంక్షోభం ప్రభావం చూపించలేదని ప్రపంచవ్యాప్తంగా సగటున 39 శాతం మంది చెప్పారు.

వృద్ధుల్లోనైతే ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. బేబీ బూమర్స్, అంతకన్నా ముందు తరాలవారిలో 56 శాతం మంది తమపై శారీరక, ఆర్థిక ప్రభావాలు లేవని చెప్పారు.

‘పేద దేశాల్లో అసమానతలు మరింత పెరిగాయి’

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ‘పేద దేశాల్లో అసమానతలు మరింత పెరిగాయి’

సర్వేలో తేలిన ఇంకొన్ని ముఖ్య విషయాలు

  • ప్రతి పది మందిలో దాదాపు ఆరుగురు కోవిడ్ వల్ల తాము ఆర్థికపరమైన ప్రభావం ఎదుర్కొన్నామని చెప్పారు.
  • ఆర్థిక ప్రభావం పురుషుల కన్నా తమపై ఎక్కువగా ఉందని మహిళలు అంటున్నారు. జర్మనీ (32% మహిళలు : 24% పురుషులు), ఇటలీ (50%:43%), బ్రిటన్ (45%:38%)ల్లో ఈ వ్యత్యాసం ఎక్కువగా కనిపించింది.
  • అమెరికాలో తమ కుటుంబంలో ఎవరో ఒకరు కరోనావైరస్ బారినపడ్డారని తెల్లజాతి వారిలో ఏడు శాతం మంది చెబితే, నల్లజాతి వారిలో 14 శాతం మంది చెప్పారు.
  • కోవిడ్ వల్ల తీవ్ర ప్రభావాలు ఎదుర్కొన్నామని పిల్లలున్నవారిలో 57% మంది, పిల్లలు లేనివారిలో 41% మంది చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)