కరొనా ఎఫెక్ట్: వస్తుమార్పిడి కొత్త ట్రెండ్ కానుందా? మారుతున్న కాలానికి పాత పద్ధతులే కరెక్టా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జెస్సీకా జోన్స్
- హోదా, బీబీసీ వర్క్‌లైఫ్
ఒకపక్క ఆర్ధిక సంక్షోభం, మరొకపక్క ఒకరిని ఒకరు కలుసుకోలేని పరిస్థితులున్న ఈ కాలంలో వస్తుసేవల మార్పిడి విధానం అనూహ్యంగా పెరుగుతోంది. మరి ఇది కలకాలం కొనసాగుతుందా ?
లండన్‌లో నర్స్‌గా పని చేస్తున్న మార్జోరీ డ్యూనే కరోనా వైరస్‌తో ఏప్రిల్‌లో ఐదు రోజులపాటు ఆసుపత్రిలో గడిపారు. తిరిగి వచ్చిన వెంటనే ఆమె ఇటీవలే ఆవిర్భవించిన ‘బార్టర్ యునైటెడ్ కింగ్‌డమ్’ గ్రూప్‌లో సభ్యురాలిగా మారారు.
ఇంటిని శుభ్రం చేసే సమయంలో అవసరం లేని వస్తువులను సేకరించడం ఈ గ్రూప్ పని. ఈ కష్టకాలంలో ఇది ఆమెకు ఎంతో ఉపయోగపడింది. “దీని కారణంగా మా ఇంట్లో వాళ్లు భోజనం చేయగలిగారు’’ అని డ్యూనే చెప్పారు.
“నాలో వంట చేసి పెట్టే శక్తి లేదు. కిరాణా సరుకుల కోసం ఆన్‌లైన్‌లో చాలాఖర్చు పెట్టాను. ఇలాంటి సమయంలో భోజనం ఇంటికే రావడం చాలా పెద్ద సౌకర్యం” అని డ్యూనే చెప్పారు.
కరోనా మహమ్మారి కాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఇచ్చిపుచ్చుకోవడం, అమ్ముకోవడం, వస్తుమార్పిడికి మొగ్గు చూపుతున్నారు. తమ డబ్బును ఆదా చేసుకోవడంతోపాటు, స్థానికంగా తోటి వారికి దొరకని సరుకులను సరఫరా చేయడం ద్వారా కోవిడ్ సమయంలో ఇతరులకు సాయపడుతున్నారు.
ఆర్ధిక సంక్షోభం ముదురుతుండటం, భవిష్యత్తు మీద ఆందోళనలు పెరుగుతున్న ఈ సమయంలో వస్తుమార్పిడి ఒక ప్రత్యామ్నాయ విధానంగా మారింది.
వస్తు మార్పిడి- ఒక సహజ పరిష్కారం
వస్తుమార్పిడి విధానానికి ఫిజీ దేశంకన్నా మంచి ఉదాహరణ మరొకటి లేదు. డ్యూనే సభ్యురాలైన లండన్ గ్రూప్‌కు కూడా ఫిజీయే ఆదర్శం. ‘వెయిస్’ పేరుతో ఆ దేశంలో వస్తు మార్పిడి సంప్రదాయం చాలాకాలం నుంచి ఉంది. కోవిడ్ కారణంగా అది మరింత విస్తరించింది.
దేశంలోని ఎక్కువమందిని ఈ విధానంలో కలపడానికి ఫిజియన్లు టెక్నాలజీని చక్కగా వాడుకున్నారు.
“ఈ రోజుల్లో డబ్బులు సంపాదించడం, వాటిని ఖర్చుల కోసం బైటికి తీయడం చాలా కష్టమైన పని. అసలు నా దగ్గర డబ్బే లేకపోతే ఎలా అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. వస్తు మార్పిడి దీనికి చక్కని పరిష్కారం” అని మార్లీన్ దత్తా తెలిపారు. ‘బార్టర్ ఫర్ బెటర్ ఫిజీ’ అనే గ్రూపును ఆమె ఏప్రిల్ 21న ప్రారంభించారు. ఇప్పుడా గ్రూపులో 190,000మంది సభ్యులు ఉన్నారు. ఫిజీ జనాభాలో వీరు 20%మంది అవుతారు.
ఈ గ్రూపు మార్పిడి చేసే వస్తువులు సరుకులలో పందుల నుంచి వయోలిన్‌ల వరకు ఉంటాయి. అయితే ఎక్కువ డిమాండ్ ఉన్నవి మాత్రం నిత్యావసర సరుకులు, ఫుడ్ ఐటమ్‌లే.
“మేం ఈ ఫేస్‌బుక్ గ్రూపును ఏర్పాటు చేయడం వెనక ప్రధాన లక్ష్యం ఈ కరోనా కాలంలో ఏర్పడ్డ ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కోవడమే” అని దత్తా చెప్పారు.
కరోనా మహమ్మారి కారణంగా ఫిజీకి జీవనాధారంలాంటి పర్యటక రంగం పూర్తిగా దెబ్బతిన్నది. సుమారు లక్షమంది ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయారు. ఫిజీ జీడీపీలో పర్యాటక రంగం వాటా దాదాపు 30% ఉంటుంది. ఫిజీలోని మొత్తం ఉద్యోగులలో మూడింట ఒక వంతుమంది ఈ రంగంలోనే పని చేస్తున్నారు.
“ఆర్ధికంగా కష్టకాలంలో ప్రజలు వస్తు మార్పిడి విధానానికి కొత్త హంగులు అద్దారు’’ అని ‘ది ఆర్ట్ ఆఫ్ బార్టర్’ పుస్తక సహరచయిత షెరా డాలిన్ చెప్పారు. “గతలో వచ్చిన ఆర్ధిక సంక్షోభం సమయంలో కూడా ఇలాగే జరిగింది. ఆర్ధిక సమస్యలు మొదలు కాగానే ప్రజలు వస్తు మార్పిడివైపు మళ్లుతున్నారు’’ అని ఆమె అన్నారు.
గత ఆర్ధిక సంక్షోభం ప్రారంభ సమయంలో అమెరికాలో ఈ వస్తు మార్పిడి కోసం దాదాపు 300 గ్రూపులు ఏర్పడ్డాయని డాలిన్ చెప్పారు. “ఆ సమయంలో డాలర్‌ను సంపాదించడమే గగనంగా మారింది. వస్తు మార్పిడి చాలామందికి ఉపయోగపడింది” అని ఆమె అన్నారు.
ఫిజి దేశంలో ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా అనేక గ్రూపులు రాష్ట్రాలు, నగరాలు లేదంటే కమ్యూనిటీ స్థాయిలో ఈ తరహా గ్రూపులను ప్రారంభించాయి.
“మా స్నేహితులందరినీ ఇందులోకి ఆహ్వానించాను. అంతే, 24గంటల్లో 1,000మంది సభ్యులుగా మారి పోయారు” అని ఫేస్‌బుక్‌లో వస్తుమార్పిడి బృందాన్ని ఏర్పాటు చేసిన వెరోనికా కూన్ చెప్పారు. అమెరికాలోని నెవాడా రాష్ట్రంలో మార్చి 15న స్థాపించిన ఈ గ్రూపులో ఇప్పుడు 5,600మంది సభ్యులున్నారు. గోధుమ పిండి, గుడ్లు, క్రిమి సంహారకాలు, చిన్న పిల్లలకు వాడే న్యాపీస్‌లాంటివి ఈ గ్రూపులో ఎక్కువగా అమ్ముడవుతుంటాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఇది వస్తు మార్పిడి సమయం
వస్తువులతోపాటు ఇటీవల కొందరు వ్యక్తులు ఎంతో విలువైన మరో అంశాన్ని చేర్చారు. అదే టైమ్.
‘టైమ్ బ్యాంకింగ్’ అనే భావన 1970లలో జపాన్‌లో, 1992లో అమెరికాలో చాలా పాపులర్ అయ్యింది. టైమ్ బ్యాంక్‌లో సభ్యులైన వారు ఇతరులకు సహాయ పడటానికి ఒక గంట సమయాన్ని కేటాయిస్తారు. అందుకు ప్రతిఫలంగా ఇతరులు వారికి అవసరంలో సహాయపడతారు. పియానో క్లాసులు, పెయింటింగ్, లాంగ్వేజ్ టీచింగ్‌లాంటివి ఇందులో ఉంటాయి.
“ఒక సంస్థగా మాకు దీనిపై ఎంతో ఆసక్తి ఉంది. కరోనా కాలంలో మరో నాలుగు టైమ్ బ్యాంకులను ప్రారంభించాం’’ అని కెర్రి టైలర్ చెప్పారు. ఆయన యూకేలో 2002లో ప్రారంభించిన ఒక టైమ్‌బ్యాంకింగ్ సంస్థలో కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్ అండ్ కమ్యూనికేషన్స్ మేనేజర్‌గా పని చేస్తున్నారు.
“మా సంస్థలో ఇంత పెరుగుదల గతంలో ఎప్పుడూ లేదు’’ అని టైలర్ చెప్పారు.
కోవిడ్-19 సమయంలో యూకేలో టైమ్ బ్యాంకులు విస్తృతంగా ఉపయోగపడుతున్నాయి. గ్లూసెస్టర్‌లో ‘ఫెయిర్ షేర్స్’ టైమ్ బ్యాంకులో సభ్యులైనవారు ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్నవారికి ప్రిస్క్రిప్షన్లు ఇవ్వడం, షాపింగ్, ఫుడ్‌పార్సిల్స్ అందించడంలాంటి పనులు చేస్తున్నారు.
అవర్ టైమర్ అనే టైమ్ బ్యాంకు.. ఐసోలేషన్‌లో ఉన్న వారు మానసికంగా కుంగిపోకుండా వారి కమ్యూనిటీ వారితో వీడియో కాల్స్‌కు ఏర్పాటు చేసింది. తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారికి ఆరోగ్య సలహాలు ఇవ్వడంతోపాటు వారికి మానసికోల్లాసం కోసం క్విజ్‌లాంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు.
టైమ్ బ్యాంకింగ్ కాన్సెప్ట్‌లో తాము ఎవరికో సాయం చేస్తున్నామన్నది కాకుండా, తమకు అవసరం వచ్చినప్పుడు ఎవరో ఒకరు సాయం చేస్తారని సభ్యులు ఎక్కువమంది భావిస్తారని రెయాజ్ లిమాలియా అన్నారు. ఆమె ఫెయిర్ షేర్స్ టైమ్ బ్యాంక్‌ను నిర్వహిస్తున్నారు.
“ఛారిటీ అంటే కేవలం ఒక వ్యక్తికి ఇంకొ వ్యక్తి సాయం చేయడం అనుకుంటారు. కానీ దానివల్ల ఆ సాయాన్ని స్వీకరించేవారు ఇబ్బంది పడతారు. ఇది అలా కాకుండా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉంటుంది” అని లిమాలియా అన్నారు.
అయితే ఈ వస్తుమార్పిడి గ్రూపుల్లో ఉండేవారికి కాస్త సహనం ఉండాలంటారు డాలిన్. “ మనం డబ్బులిచ్చి కొనుక్కునేంత వేగంతో ఇందులో మనం వస్తువులను కొనుక్కోలేం’’ అన్నారామె. అంతేకాదు ఇందులో ఎలాగైనా ఒక వస్తువును సొంతం చేసుకోవాలన్న ఆలోచన ఉండకూడదు. తమ వస్తువుల విలువకు సమానమైన వస్తువులను మార్పిడికి పెట్టాల్సి ఉంటుంది. ఈ డీల్‌లో ఇరువురికి సమానమైన సంతృప్తి దక్కేలా ఉండాలి’’ అంటారు డాలిన్.

ఫొటో సోర్స్, Getty Images
వస్తు మార్పిడి వ్యాపారం
వస్తుమార్పిడి అంటే కేవలం వస్తువులను వ్యక్తిగతంగా మార్పిడి చేసుకోవడం, షాపింగ్‌లో సహాయం చేయడం మాత్రమే కాదు. వస్తుమార్పిడి ఈ విధానంలో కొన్ని వ్యాపార సంస్థలు, సంఘాలు కూడా పాలుపంచుకుంటూ వారి టర్నోవర్‌ను 10 నుంచి 15శాతం పెంచుకుంటున్నారు. ఇతర బిజినెస్‌లకు సర్వీసులను అందిస్తున్నాయి.
‘‘లాయర్లు, డాక్టర్లు, రిటైలర్లు, సర్వీస్ కంపెనీలు ఇలా చాలామంది ఈ మార్పిడి విధానంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు’’ అని రాన్ విట్నీ అంటున్నారు. రాన్ విట్నీ 1979 నుంచి అమెరికా కేంద్రంగా పని చేస్తున్న ‘ఇంటర్నేషనల్ రెసిప్రోకల్ ట్రేడ్ అసోసియేషన్’లో పని చేస్తున్నారు. ఈ సంస్థ వస్తు మార్పిడి విధానం ఆధునిక పోకడలను ప్రోత్సహిస్తుంది.
ఇందులోని సభ్యులు తమ ప్రొఫెషనల్ సర్వీసులను ఈ వస్తుమార్పిడి సంస్థలకు అందించవచ్చు. తర్వాత తమకు అవసరమైన వస్తువులను, సేవలను తాము ఇచ్చిన సర్వీసులు, సేవలకు ప్రతిఫలంగా పొందవచ్చు.
ఉదాహరణకు ఒక తోటమాలి స్థానిక డెంటిస్టుకు 5,000 డాలర్ల విలువైన పని చేసిపెడతారు. దీనికి ప్రతిఫలంగా అతను 5,000 డాలర్లను డెంటిస్టు దగ్గర వైద్యం చేయించుకోవడానికే వాడుకోవాలని నియమం ఏమీ ఉండదు. అతని ఖాతాలో 5,000 డాలర్ల సర్వీసు ఉంటుంది. ఈ మొత్తాన్ని వివిధ సర్వీసుల కోసం అతను ఉపయోగించుకోవచ్చు. ఇది ఒక రకంగా క్రెడిట్ కార్డ్‌లాంటిదంటారు విట్నీ.
మహమ్మారి కాలంలో ఈ వస్తుమార్పిడి గ్రూపుల్లో సభ్యుల సంఖ్య దాదాపు 20%శాతం పెరిగిందని విట్నీ చెబుతున్నారు. “డబ్బుకు చాలా కష్టంగా ఉంది. అప్పులు పుట్టడం లేదు. అందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా చాలామంది ఈ పద్ధతికి మొగ్గుతున్నారు” అని విట్నీ అంటున్నారు.

ఫొటో సోర్స్, Marlene Dutta
వస్తు మార్పిడి విధానానికి హద్దులేంటి ?
వస్తు మార్పిడి విధానం వల్ల చాలామంది ఒక బలమైన కమ్యూనిటీలో భాగమవుతున్నారు. అలాగని దీనికోసం ప్రజలు పూర్తిగా ఖర్చులు తగ్గించుకోకపోవచ్చు.
“చేతిలో డబ్బు లేకపోయినా పరస్పర సహకారంతో నడిచే ఈ విధానం కమ్యూనిటీ స్పిరిట్‌కు మంచి ఉదాహరణ. ఇంకా చెప్పాలంటే ఈ సర్వీసుల ద్వారా మామూలు వ్యాపారంలో లభించేదానికన్నా ఎక్కువే లభిస్తుంది” అని లండన్‌లోఇంపీరియల్ కాలేజ్ బిజినెస్ స్కూల్‌లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న డేవిడ్ మైల్స్ అన్నారు.
“కేవలం సర్వీసులు, వస్తువుల కోణంలోనే కాక సామాజిక, మానవీయ కోణంలో కూడా ఇది ఎంతో విలువైంది’’ అని ఆయన అన్నారు. ఇప్పుడు చాలా వేగంగా విస్తరిస్తున్నప్పటికీ దీనికీ కొన్ని పరిధులున్నాయి’’ అన్నారు ప్రొఫెసర్ మైల్స్.
“ఇది చిన్న చిన్న వస్తువులకు సంబంధించిది. ఇందులో మీ సర్వీసుకు ప్రతిఫలంగా కరెంటును కొనుక్కోలేరు’’ అన్నారు మైల్స్.
విస్తరించడం పెద్ద విషయం కాదని, అయితే దీనికి పరిమితులుంటాయని టైమ్ బ్యాంకింగ్ నిర్వాహకులు లిమాలియా అంటున్నారు. “కొన్ని చిన్న విషయాలే కొందరి జీవితాలలో పెద్ద మార్పులు తీసుకురావచ్చు’’ అన్నారాయన.
“మేం ఈ ప్రపంచాన్ని మార్చేయడం లేదు. కనీసం చిన్న నగరాన్ని కూడా మార్చేయలేం. కానీ కొద్దిపాటి సాయంతో చిన్నచిన్న మార్పులైతే చేయగలుగుతున్నాం’’ అన్నారు లిమాలియా.
ఇవి కూడా చదవండి:
- ఏడు నెలల గర్భంతో ఉన్న భార్యను తీసుకుని 1200 కిలోమీటర్లు స్కూటీపై ప్రయాణం
- శరీరంలో కరోనావైరస్ చనిపోయినా.. టెస్టుల్లో ‘పాజిటివ్’ అని తప్పుగా వస్తోందా?
- కోవిడ్-19 నుంచి కోలుకున్నా అనారోగ్యం ఎందుకు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? పిల్లల్లో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- ‘‘చాలాకాలంగా ఇలాగే చేస్తున్నాం కానీ ఎప్పుడూ గర్భం రాలేదు’’
- హైపర్సోనిక్ స్క్రామ్‌జెట్ టెక్నిక్.. ధ్వనికన్నా ఐదు రెట్ల వేగం గల క్షిపణులతో భారత్ సాధించేదేమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









