అఫ్గన్ ప్రభుత్వం, తాలిబన్‌ల మధ్య చర్చలు ప్రారంభం - BBC Newsreel

ఫొటో సోర్స్, Reuters
అఫ్గానిస్తాన్ ప్రభుత్వానికి, తాలిబన్‌లకు మధ్య తొలి శాంతి చర్చలు గల్ఫ్ దేశం ఖతార్‌లో మొదలయ్యాయి. వాస్తవానికి ఇవి నెల కిందటే జరగాల్సి ఉన్నా వివిధ కారణాల వల్ల ఆలస్యమైంది.
ఈ చర్చల కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఖతార్ రాజధాని దోహ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపేయో వీటిని చరిత్రాత్మకంగా పేర్కొన్నారు.
ఫిబ్రవరిలో అమెరికాకు, తాలిబన్‌లకు మధ్య ఒప్పందం కారణంగా ఈ చర్చలు జరుగుతున్నాయి.
అయితే అఫ్గానిస్తాన్‌లో హింస కారణంగా ఖైదీల విడుదల తదుపరి దశ కార్యక్రమం కొన్నాళ్లు నిలిచిపోయింది.
సరిగ్గా 19 ఏళ్ల కిందట తాలిబన్లు అమెరికా మీద దాడి చేసిన రోజునే అఫ్గానిస్తాన్ నుంచి ఒక బృందం చర్చల కోసం దోహ బయలుదేరి వెళ్లింది.
ఈ శాంతి చర్చలు ఫలప్రదంగా జరుగుతాయని తాము ఆశిస్తున్నట్లు అఫ్గానిస్తాన్ తరఫున చర్చల్లో పాల్గొంటున్న అబ్దుల్లా అబ్దుల్లా వ్యాఖ్యానించగా, మిగిలిన ఆరుగురు తాలిబన్ ఖైదీలను విడిచి పెట్టినందున తాము చర్చలకు వస్తున్నామని తాలిబన్‌లు గురువారం ప్రకటించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
‘భారత వ్యతిరేక చర్యలకు అఫ్గాన్ భూభాగాన్ని వాడుకోరాదు’
అఫ్గానిస్తాన్ భూభాగాన్ని ఎలాంటి భారత్ వ్యతిరేక చర్యల కోసం వాడుకోరని తాము ఆశిస్తున్నామని భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జయశంకర్ అన్నారు.
అఫ్గాన్ శాంతి చర్చలపై దోహాలో జరుగుతున్న వీడియో సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ విషయం స్పష్టం చేశారు.
శాంతిచర్చలు అఫ్గానిస్తాన్ నేతృత్వంలో, నియంత్రణలో జరగాలని.. అఫ్గానిస్తాన్ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతకు గౌరవించేలా.. మానవ హక్కులు, ప్రజాస్వామ్యానికి ఊతమిచ్చేలా ఈ చర్చలు ఉండాలని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇజ్రాయెల్‌తో బహ్రెయిన్ శాంతి ఒప్పందం
గల్ఫ్‌దేశాలతో శాంతి ప్రయత్నాలు చేస్తున్న ఇజ్రాయెల్ ఇటీవలే యూఏఈతో ఒక చరిత్రాత్మక శాంతి ఒప్పందం కుదుర్చుకుంది. తాజాగా బహ్రెయిన్, ఇజ్రాయెల్ మధ్య కూడా ఒక శాంతికి అంగీకారం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ట్విటర్‌లో వెల్లడించారు.
“నెల రోజుల వ్యవధిలో ఇజ్రాయెల్‌తో ఒప్పందం కుదుర్చుకున్న రెండో గల్ఫ్ దేశం బహ్రెయిన్’’ అంటూ ట్రంప్ ట్వీట్ చేశారు.
దశాబ్దాలుగా ఇజ్రాయెల్, అరబ్ దేశాల మధ్య విరోధం కొనసాగుతోంది. పాలస్తీనా వివాదాన్ని పరిష్కరిస్తేనే ఇజ్రాయెల్‌తో సంబంధాలు పెట్టకుంటామని అరబ్ దేశాలు గతంలో ప్రకటించాయి.
అయితే గత నెలలో ఇజ్రాయెల్, యూఏఈల మధ్య ఒక ఒప్పందం కుదరగా, ఇజ్రాయెల్‌తో చేతులు కలిపే తదుపరి దేశం బహ్రెయినేనని ప్రచారం జరిగింది. అనుకున్నట్లుగానే రెండు దేశాలు శాంతి ఒడంబడికపై సంతకాలు చేశాయి.
ఇజ్రాయెల్-పాలస్తీనా సంఘర్షణను పరిష్కరించే లక్ష్యంతో అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ జనవరిలో తన ‘మిడిల్ ఈస్ట్ పీస్ ప్లాన్’ను ప్రకటించారు. ఇజ్రాయెల్-యూఏఈల మధ్య ఒప్పందంలో ట్రంప్ కీలక పాత్ర పోషించారు. తాజాగా జరిగిన ఒప్పందంపై “ఇది శాంతిలో కొత్త శకం’’ అని ట్రంప్ ట్విటర్‌లో వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
- ట్రంప్ ప్రకటించిన మిడిల్ ఈస్ట్ పీస్ పాలసీలో ఏముంది?
- ఇజ్రాయెల్, యూఏఈల మధ్య ఒప్పందం పాలస్తీనాను నిరాశపరిచిందా?
- కరోనా వ్యాక్సీన్: ఆస్ట్రాజెనెకా క్లినికల్ ట్రయల్స్ నిలిచిపోవడం దేనికి సంకేతం? ఈ వ్యాక్సీన్ సురక్షితమేనా?
- కరోనావైరస్ కోరల్లో చైనా ఆర్థిక వ్యవస్థ.. దశాబ్దాల కాలంలో తొలిసారి కుదేలు
- వెస్ట్ బ్యాంక్ భూభాగాలను ఇజ్రాయెల్ ఎందుకు కబ్జా చేస్తోంది?
- జెరూసలెం.. ఎందుకంత పవిత్రం? ఎందుకంత వివాదాస్పదం?
- బీబీసీ సర్వే: పేద దేశాలు, పేద ప్రజలను తీవ్రంగా దెబ్బకొట్టిన కరోనా సంక్షోభం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








