ఇజ్రాయెల్ నుంచి యూఏఈకి 'శాంతి విమానం'.. పాలస్తీనియన్ల అసంతృప్తి

ఇజ్రాయెల్ విమానం

ఫొటో సోర్స్, EPA

ఇజ్రాయెల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)ల మధ్య ఈ నెల మొదట్లో జరిగిన చారిత్రాత్మక శాంతి ఒప్పందం తరువాత రెండు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరిచేందుకు ఇజ్రాయెల్‌ నుంచి యూఏఈకి మొట్టమొదటి విమానం బయలుదేరింది.

ఇజ్రాయెల్‌కు చెందిన ఈఎల్ ఏఎల్ విమానంలో యూఎస్, ఇజ్రాయెల్ అధికారుల బృందం మూడు గంటల పాటు ప్రయాణించి యూఏఈ చేరుకోనున్నారు.

ఈ విమానం మొట్టమొదటిసారిగా సౌదీ అరేబియాను దాటి ప్రయాణించనుంది. ఇన్నాళ్లూ ఇజ్రాయెల్ విమానాలకు సౌదీ అరేబియా గగనతలంలో ప్రవేశించే అనుమతి లేదు.

1948 లో ఇజ్రాయెల్ ఏర్పడిన తరువాత మధ్యప్రాచ్యంలో దీన్ని ఒక దేశంగా గుర్తించిన మూడు అరబ్ దేశాల్లో యూఏఈ మూడవది.

ఆగస్ట్ 13న ఇజ్రాయెల్, యూఏఈల మధ్య శాంతి ఒప్పందం జరిగింది. ఈ రెండు దేశాల మధ్య ఇదివరకూ దౌత్య సంబంధాలు లేనందువల్ల ఈ నిర్ణయాన్ని యూఎస్ ప్రకటించింది.

ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందానికి కారణమైన రహస్య చర్చలకు యూఎస్ సీనియర్ సలహాదారులు జార్డ్ కుష్నర్ నాయకత్వం వహించారు.

1972 నుంచీ తమ దేశంలో అమలులో ఉన్న ఇజ్రాయెల్ బహిష్కరణ చట్టాన్ని యూఏఈ శనివారం నాడు రద్దు చేసింది.

అంతేకాకుండా, ఈ నెల ప్రారంభంలో ఇరు దేశాల మధ్య టెలిఫోన్ సేవలు ప్రారంభమయ్యాయి.

జారెడ్ కుష్నర్ (మధ్యలో)

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఈ విమానంలో ప్రయాణిస్తున్న ప్రతినిధుల బృందంలో జారెడ్ కుష్నర్ (మధ్యలో) కూడా ఉన్నారు

ఎల్‌వై 971 విమానంలో డోనాల్డ్ ట్రంప్ అల్లుడు, సీనియర్ సలహాదారులు జార్డ్ కుష్నర్, ఇజ్రాయెల్ జాతీయ భద్రతా సలహాదారులు మెయిర్ బెన్-షబ్బాత్ ప్రయాణించనున్నారు. ఈ విమానం పేరులో ఉన్న సంఖ్య యూఏఈ అంతర్జాతీయ డయలింగ్ కోడ్‌ను సూచిస్తుంది.

ఇజ్రాయెల్, యూఎస్ బృందాలు ఎమిరేట్స్ ప్రతినిధులను కలిసి ఇరు దేశాలమధ్య సహాయ సహకారాల ప్రణాళికల గురించి చరిస్తాయి.

చర్చల అనంతరం ఇజ్రాయెల్‌కు తిరిగివచ్చే విమానం పేరు ఎల్‌వై972. ఇది ఇజ్రాయెల్ అంతర్జాతీయ డయలింగ్ కోడ్‌ను సూచిస్తుంది.

ఈ సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ "శాంతి కోసం శాంతి" అని హీబ్రూలో ట్వీట్ చేసారు.

ఈ పరిణామాన్ని అంతర్జాతీయంగా అనేక దేశాలు స్వాగతించాయి.

కానీ, పాలస్తీనియన్లు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక పాలస్తీనా రాష్ట్రం ఏర్పాటు చేస్తామని మాట ఇవ్వకుండానే ఇజ్రాయెల్‌ను ఒక దేశంగా అంగీకరించడం పాలస్తీనియన్లకు యూఏఈ చేసిన ద్రోహమని వారు ఆరోపిస్తున్నారు.

యూఏఈతో అధికారిక సంబంధాలు కొనసాగించడానికి వెస్ట్ బ్యాంక్‌లో ఉన్న ఒక పెద్ద భాగాన్ని తమ దేశంలో కలుపుకోవాలనుకున్న ఇజ్రాయెల్ ప్రణాళికలను నెతన్యాహూ రద్దుచేసారు.

యూఏఈకి ముందు ఈజిప్ట్, జోర్డన్ దేశాలు వరుసగా 1978, 1994 లలో చేసుకున్న శాంతి ఒప్పందాలననుసరించి ఇజ్రాయెల్‌ను అధికారికంగా గుర్తించాయి.

వాయువ్య ఆఫ్రికాలోని అరబ్ లీగ్ సభ్య దేశం మౌరిటానియా 1999లో ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలు ఏర్పరచుకున్నప్పటికీ 2010లో వాటిని రద్దుచేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)