ట్రంపా, బైడెనా? అమెరికాకు అధ్యక్షుడు ఎవరైతే చైనాకు మేలు?

ట్రంప్, బైడెన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ట్రంప్, బైడెన్
    • రచయిత, కరిష్మా వస్వానీ
    • హోదా, ఆసియా బిజినెస్ కరస్పాండెంట్

అమెరికాకు అధ్యక్షుడు కాబోయే వ్యక్తి దేశీయంగా అనుసరించాలనుకుంటున్న విధానాలను గ్రహించడానికి డెమొక్రటిక్, రిపబ్లికన్ అభ్యర్థులు నిర్వహించే జాతీయ సమ్మేళనాలు అక్కడి ఓటర్లకు మంచి అవకాశం.

కానీ ఈసారి ఎన్నికలకు ముందు రెండు పార్టీల అభ్యర్థులు చైనాకు కూడా కీలక సంకేతాలిచ్చారు.

చైనా టెక్నాలజీ సంస్థల్లోని కొందరు నాకు చెప్పిన ప్రకారం.. వారు ట్రంప్ మరో నాలుగేళ్లు అధ్యక్షుడిగా కొనసాగడం కంటే జో బైడెన్ అధ్యక్షుడవడం బాగుంటుందనుకుంటున్నారు.

అయితే, బైడెన్ పాలనలోనూ చైనా విషయంలో కఠినంగా వ్యవహరించే అవకాశాలున్నా ఆ కాఠిన్యం రాజకీయ కోణంలో కాకుండా వాస్తవాల ఆధారంగా ఉండొచ్చని చెబుతున్నారు.

శ్వేతసౌధంలో ఎవరున్నా సరే చైనా విషయంలో కఠిన వైఖరే అవలంబిస్తారని చైనా టెక్ సంస్థలు నమ్ముతున్నాయి.

అమెరికాలో అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో చైనా కంపెనీలు ప్రధానంగా ఆందోళన చెందుతున్న మూడు అంశాలేమిటి.. తమ ప్రయోజనాలను పరిరక్షణకు అవి ఏం చేస్తున్నాయో చూద్దాం.

తెగతెంపులు (డీకప్లింగ్)

ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్, ఆయన ప్రభుత్వంలోని వ్యక్తులు ఇటీవల కాలంలో ఎక్కువగా వాడుతున్న పదం ఇది. చైనాతో మూడు దశాబ్దాల వాణిజ్య సంబంధాలను అమెరికా తెంచుకోవడం గురించి వారు మాట్లాడుతున్నారు.

అమెరికా కర్మాగారాలు తమ సప్లయ్ చైన్‌లను చైనా ప్రధాన భూభాగం నుంచి వెనక్కు వచ్చేలా చేయడం.. అమెరికాలో పెద్ద ఎత్తున కార్యకలాపాలు సాగిస్తున్న టిక్‌టాక్, టెన్సెంట్ వంటి చైనా సంస్థలను అమెరికా సంస్థలకు అమ్మేయమని బలవంతం చేయడం వంటివన్నీ ఈ డీకప్లింగ్ పరిధిలో కనిపిస్తున్నాయి.

రిపబ్లికన్ పార్టీ ఓవర్సీస్ లాబీ గ్రూప్ వైస్ చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ సాలమన్ యూ ''ట్రంప్ పాలనలో డీకప్లింగ్ మరింత జోరందుకుంటుంది'' అని చెబుతున్నారు.

అమెరికా జాతీయ భద్రతకు ముప్పు రాకూడదన్నదే దీని వెనుక ప్రధాన ఉద్దేశమని సాలమన్ చెబుతున్నారు.

అయితే, ఈ తెగతెంపులు అనుకున్నంత సులభమేమీ కాదు.

యాంట్ ఫైనాన్షియల్ గ్రూప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, యాంట్ ఫైనాన్షియల్ గ్రూప్

డీలిస్టింగ్

చైనాపై పూర్తిగా దృష్టిపెట్టిన ట్రంప్ అమెరికాలో లిస్ట్ అయిన చైనా కంపెనీలకు కొత్త నిబంధనలు తీసుకొస్తూ 2022 జనవరి నాటికి ఆ పరిధిలో నడుచుకోవాలని డెడ్‌లైన్ పెట్టారు.

ఒకవేళ అలా చేయకపోతే ఆయా సంస్థలపై నిషేధం విధిస్తారు.

అయితే, బైడెన్ కనుక అధ్యక్షుడైతే నిషేధం వరకు వెళ్లకపోవచ్చు కానీ నిబంధనలు మాత్రం ట్రంప్ తరహాలోనే కఠినంగా ఉండే అవకాశముందని భావిస్తున్నారు.

''శ్వేతసౌధంలో ఉన్నా.. సెనేట్‌లోనైనా, కాంగ్రెస్‌లోనైనా.. ఎక్కడున్నా ఒక డెమొక్రాట్ చైనా విషయంలో ట్రంప్ కఠిన విధానాలనే తానూ అమలు చేయాలనుకుంటే అందులో ఎంతో కొంత వెసులుబాటు కల్పించకుండా అమలు చేయకపోవచ్చు'' అని హాంకాంగ్ కేంద్రంగా పనిచేసే జీఎఫ్‌ఎం అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థలోని ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ తారిక్ డెన్నిసన్ అభిప్రాయపడ్డారు.

అమెరికాలో ఏ సమస్య ఉన్నా దానిని ప్రత్యర్థి పార్టీపై నెట్టలేనప్పుడు చైనాపై నెట్టేయడాన్ని అటు రిపబ్లికన్లు, ఇటు డెమొక్రాట్లలో చూస్తున్నామని తారిక్ అన్నారు. ఆ పద్ధతిలో ఏమీ మార్పు రాదని తారిక్ అన్నారు.

ఇప్పటికే అమెరికాలో లిస్టయిన కంపెనీలలో ఈ డీలిస్టింగ్ ఆందోళన పెద్దగా లేకపోయినా అమెరికాలో కంపెనీలు స్థాపించాలనుకుంటున్న చైనా సంస్థలు, వ్యాపారవేత్తలలో మాత్రం ఆందోళన ఉంది.

చైనాలోని అతిపెద్ద డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ గ్రూప్ యాంట్ ఈ వారం పబ్లిక్ ఇష్యూకు వచ్చినప్పటికీ అది హాంకాంగ్, షాంఘైలకు మాత్రమే పరిమితమైంది. అమెరికాలో తన షేర్లను విక్రయించే ప్రయత్నం చేయలేదు.

మిగతా చైనా సంస్థలూ ఇదే బాట పట్టే సూచనలున్నాయి.

ట్రంప్, జిన్ పింగ్

ఫొటో సోర్స్, Getty Images

డీగ్లోబలైజేషన్

గత మూడు దశాబ్దాలలో ప్రపంచీకరణ వల్ల బాగా లబ్ధి పొందిన దేశాల్లో చైనా ఒకటి. గ్లోబలైజేషన్ వల్ల కోట్లాది మంది చైనీయుల జీవన ప్రమాణాలు పెరిగాయి.

అయితే, ట్రంప్ ప్రభుత్వం ఇది మారాల్సిన సమయం ఆసన్నమైందంటోంది.. చైనా ధనికంగా మారుతుంటే అమెరికా పేదదైపోతుందన్నది ట్రంప్ ప్రభుత్వ వాదన.

అందుకు తగ్గట్లుగానే ట్రంప్ పాలనలో డీగ్లోబలైజేషన్‌కు అడ్డుకట్టపడింది. స్వేచ్ఛావాణిజ్యం తగ్గింది.. అమెరికాకు ఎవరైనా వచ్చే పరిస్థితి మారింది.

ఇప్పుడు ఎన్నికల తరువాత ట్రంపే మళ్లీ గెలిచినా, బైడెన్ గెలిచినా ఈ విధానంలో మార్పు రాదన్న విషయం చైనాకూ అర్థమైంది.

''చైనా విషయంలో అమెరికా ప్రాథమిక ఆలోచనాధోరణి మారదు'' అని చైనాలోని పాలక కమ్యూనిస్ట్ పార్టీ కనుసన్నల్లోని పత్రిక 'గ్లోబల్ టైమ్స్' ఇటీవల రాసుకొచ్చింది.

ప్రపంచీకరణ తీసుకొచ్చిన సహజ పరిణామాల్లో 'సురక్షిత ప్రపంచం' ఒకటి.

ఒకరితో ఒకరి వ్యాపారం సాగుతుంటే ఇద్దరి మధ్య యుద్ధానికి అవకాశం తక్కువ.

రెండు మిలటరీ సూపర్ పవర్స్ మధ్య యుద్ధం తప్పదేమో అన్నది ఆసియాలోని అనేక సంస్థల్లో ఉన్న ఆందోళన. సౌత్ చైనా సీలో చైనా ఈ వారం క్షిపణులను ప్రయోగించడంతో ఈ ఆందోళనలు పెరిగాయి.

చైనా, అమెరికా సంబంధాలను రీసెట్ చేయడం ఆ రెండు దేశాలకే కాదు మిగతా ప్రపంచానికీ ప్రమాదకరం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)