బ్లాక్ ఈజ్ బ్యూటిఫుల్ ఉద్యమం ఎలా పుట్టిందంటే...

ఫొటో సోర్స్, Courtesy of the artist and Philip Martin Gallery,
- రచయిత, ప్రీసెయస్ అడేసినా
- హోదా, బీబీసీ కల్చర్
హర్లెంలో ఒక ఫొటోగ్రాఫర్, కొందరు మోడల్స్ కలిసి చేసిన ఒక ఫ్యాషన్ షో నేటికీ స్ఫూర్తినిచ్చే ఒక సాంస్కృతిక, రాజకీయ ఉద్యమానికి ఎలా దారి తీసింది?
అది 1962, జనవరి 28. న్యూయార్క్ నగరంలో హార్లెం పరిసరాల్లోని నైట్‌క్లబ్ పర్పుల్ మ్యానర్ బయట చాలామంది గుమికూడారు. అక్కడ ఓ ఫ్యాషన్ షో జరుగుతోంది. అది ఎంత పాపులర్ అయ్యిందంటే.. అప్పుడే అక్కడే ఆ ప్రదర్శన రెండోసారి కూడా జరిగింది. ఆ ప్రదర్శన నల్లజాతీయుల ప్రాతినిధ్యానికి సంబంధించిన ఒక ఉద్యమానికి తెర లేపింది.
నేచురల్లీ '62 పేరుతో ఆ ప్రదర్శనను ఆఫ్రికన్ జాజ్-ఆర్ట్ సొసైటీ & స్టూడియోస్ (ఏజేఏఎస్ఎస్ - అజాస్) నిర్వహించింది. ఈ బృందంలో ఫోటోగ్రాఫర్ క్వామే బ్రాత్‌వైట్, ఆయన సోదరుడు ఎలోంబే బ్రాత్తో సహా పలువురు కళాకారులు ఉన్నారు. క్వామే బ్రాత్వైట్ వయసు ఇప్పుడు 82ఏళ్లు. ఎలోంబే బ్రాత్ 2014లో మరణించారు.
ఆరోజు ఆ ఫ్యాషన్ షోలో నల్లజాతి మహిళలు పాల్గొన్నారు. పాశ్చాత్య సౌందర్య ప్రమాణాలకు దూరంగా ఆ రోజు క్యాట్‌వాక్ చేసిన మహిళలు ఆఫ్రికన్ తలకట్టుతో, లాగోస్, అక్రా, నైరోబీ సంప్రదాయ దుస్తులను సగర్వంగా ధరించారు. వారంతా నల్లని చర్మంతో, బ్లాక్ ప్రచురణలతో సహా సాధారణ ఫ్యాషన్ పత్రికలలో వచ్చే అమ్మాయిల్లా సన్నగా కాకుండా కాస్త బొద్దుగా ఉన్నారు.
"అప్పట్లో చాలా వివాదాలు నడిచాయి. ఏబొనీ పత్రికలో ఏబొనీ అమ్మాయి ఎందుకు కనిపించట్లేదని మేము నిరసన వ్యక్తం చేశాం" అని బ్రాత్వైట్ అప్పటి రోజులను గుర్తు చేసుకుంటూ తనీషా ఫోర్డ్‌కు చెప్పారు. తనీషా ఫోర్డ్ అపెర్చర్ పత్రిక ప్రచురించిన 'లిబరేటెడ్ త్రెడ్స్: బ్లాక్ వుమెన్, స్టైల్ అండ్ ద గ్లోబల్ పాలిటిక్స్ ఆఫ్ సౌల్' రచయిత.

ఫొటో సోర్స్, Courtesy of the artist and Philip Martin Gallery
గ్రాండసా మోడల్స్
అప్పట్లో ఆ ఫ్యాషన్ షోల్లో పాల్గొన్న మహిళలను గ్రాండసా మోడల్స్ అనేవారు. ఈ పదం గ్రాండాసాల్యాండ్ నుంచి వచ్చింది. ఆఫ్రికన్ జాతీయవాది కార్లోస్ కూక్స్ ఆఫ్రికాను గ్రాండసాల్యాండ్ అని ప్రస్తావించేవారు. క్వామే, అతని బృందం కార్లోస్ కూక్స్ బోధనలను అనుసరించేవారు.
ఆరోజు జరిగినది సాధారణ ఫ్యాషన్ షో కాదు. అది 1960, 70లలో విస్తృతంగా ప్రచారలోకి వచ్చిన నల్లరంగు అందమైనది (బ్లాక్ ఈజ్ బ్యూటిఫుల్) ఉద్యమానికి తెర లేపింది.
ప్రస్తుతం ఇది దక్షిణ కరోలినాలోని కొలంబియా మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో ప్రదర్శిస్తున్న బ్రాత్‌వైట్ ఛాయాచిత్ర ప్రదర్శన పేరు కూడా అదే.
"ఆరోజుల్లో బ్రాత్‌వైట్ మంచి ఫొటోగ్రాఫర్‌గా పేరు తెచ్చుకున్నారు. నల్లజాతీయుల ఫొటోలు విపరీతంగా తీసేవారు. అతని చేతిలో ఎప్పుడూ కెమేరా ఉండేది. కనిపించిన ప్రతీదానికీ ఫొటో తీసేవారు" అని ఫోర్డ్, బీబీసీ కల్చర్‌కు వివరించారు.
బ్రాత్‌వైట్ 1950, 60, 70 లలో స్టీవీ వండర్, బాబ్ మార్లేలవంటి అనేకమంది ప్రముఖ బ్లాక్ సంగీత కళాకారుల ఫొటోలు తీశారు. అలాగే అనేక ప్రదర్శనలలో గ్రాండసా మోడల్స్ ఫొటోలు చాలా తీశారు.
ఆయన తీసిన ఛాయాచిత్రాలే ఈ ఉద్యమాన్ని ప్రధాన స్రవంతిలోకి నడిపించాయి. అంతేకాకుండా అప్పుడు ఏం జరిగిందో అర్థం చేసుకోవడానికి మనకు ఈ ఫొటోలు తోడ్పడతాయి.

ఫొటో సోర్స్, Courtesy of the artist and Philip Martin Gallery
మెరుగైన సందేశం
స్టైల్ అనేది కంటికి కనిపించేదే కాకుండా అంతకన్నా మెరుగైన సందేశాన్ని సూచిస్తుందని బ్రాత్‌వైట్, అతని స్నేహితులు భావించేవారు. బ్లాక్ ఈజ్ బ్యూటిఫుల్ ఉద్యమంలో పాల్గొన్న నల్లజాతి స్త్రీలు, పురుషులు కూడా సాధికారతను, ఆత్మవిశ్వాసాన్ని లోపల నుంచీ, బయట నుంచీ కూడా అనుభూతి చెందాలని ఆకాంక్షించేవారు.
వీరంతా గార్వే బోధనలను అనుసరించేవారు. గార్వే 20 వ ప్రారంభంలో రాజకీయ ఉద్యమకారుడు. ఆర్థిక స్వాతంత్ర్యం ద్వారా నల్లజాతీయుల విముక్తి సాధ్యమని బోధించేవారు.
మొట్టమొదటి ఎనిమిది మంది గ్రాండసా మోడల్స్ కూడా గార్వే అనుచరులే.
"వారంతా మహిళలు, ఆఫ్రికన్ నేషనలిస్ట్ పయొనీర్ ఉద్యమం (ఏఎన్పీఎం) లో పాలు పంచుకున్నవారు. వారిలో విద్యావేత్తలు, రచయితలు, ఉపాధ్యాయులు, స్టైలిస్టులు కూడా ఉన్నారు. వీరు మొదటి నుంచీ గార్వేయిజం భావజాలన్ని అనుసరిస్తున్నవారు" అని బ్రాత్‌వైట్ కుమారుడు క్వామే బ్రాత్వైట్ జూనియర్ చెప్పారు. ఈయన గత ఆరేళ్లుగా తన తండ్రి తీసిన ఛాయాత్రాలను భద్రపరుస్తున్నారు.

ఫొటో సోర్స్, Courtesy of the artist and Philip Martin Gallery
"ఇది సాధికారతను సూచిస్తుంది. స్వయం సమృద్ధిని సూచిస్తుంది. ఇది నీ సంఘానికి నువ్వు ఇస్తున్న మద్దతు."
"అప్పట్లో నీగ్రోలు, నల్ల రంగు గలవాళ్లు అని ఆఫ్రికన్-అమెరికన్లను పిలిచేవారు. అలాంటి సమయంలో నల్లజాతీయులు (బ్లాక్) అని సంభోదించడం కూడా ప్రగతిశీలతను సూచిస్తుంది" అని జూనియర్ బ్రాత్‌వైట్ అభిప్రాయపడ్డారు.
1956లో బ్రాత్‌వైట్, అతని తమ్ముడు మ్యాన్‌హటన్‌లోని స్కూల్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఆర్ట్ విద్యార్థులతో కలిసి ఏజేఏఎస్ఎస్ స్థాపించారు. అప్పుడు అతనికి 18-19 యేళ్లుంటాయి. జాజ్ సంగీతంలో ఆసక్తి ఉన్నవారికోసం ఈ బృందాన్ని ఏర్పరిచారు. ఈ బృందంలోని ఒక సభ్యుడు తీసిన ఫొటోల నుంచి ప్రేరణ పొంది బ్రాత్వైట్ ఫొటోగ్రఫీ వైపు మళ్లారు.
"జాజ్ అనేది ఆఫ్రికన్-అమెరికన్ సంగీతం. ఇప్పుడు మాకు హిప్-హాప్ సంగీతం ఎలాగో అప్పట్లో జాజ్ అలా. అది తిరుగుబాటు సంగీతం."
"అవి పౌర హక్కుల ఉద్యమాలు మొదలవుతున్న రోజులు. వ్యక్తులుగా వాళ్ల అస్తిత్వాన్ని నిలబెట్టుకోవాలని ఆరాటపడుతున్న రోజులు" అని జూనియర్ బ్రాత్‌వైట్ వివరించారు.
"వియ్ విల్ బ్రీత్"

ఫొటో సోర్స్, Courtesy of the artist and Philip Martin Gallery
అమెరికాలో అహ్మద్ అర్బరీ, బ్రయోనా టేలర్, జార్జ్ ఫ్లాయిడ్ హత్యల తరువాత ప్రపంచ వ్యాప్తంగా ఊపందుకున్న బ్లాక్ లైవ్స్ మేటర్ నిరసనల నేపథ్యంలో బ్రాత్వైట్ ఫోటోగ్రఫీ ఉపయోగించి సంగీతకారులు మార్కస్ గిల్మోర్, నికోలస్ పేటన్, మార్క్ బాముతి జోసెఫ్ల సహకారంతో ఒక మల్టీమీడియా కథనానికి జూనియర్ బ్రాత్‌వైట్ శ్రీకారం చుట్టారు.
"వియ్ విల్ బ్రీత్" అనే గీతాన్ని ఈ వారంలో విడుదల చేయబోతున్నారు. ఈ మధ్య పాపులర్ అయిన "ఐ కాంట్ బ్రీత్" మంత్రాన్ని తలకిందులు చేస్తూ నల్లజాతీయుల హక్కులను ఎలుగెత్తి చాటే దిశలో ఈ ఆల్బమ్‌ను విడుదల చేయనున్నారు.
నల్లజాతీయుల తలకట్టు
అప్పట్లో ఫ్యాషన్ షోలో పాల్గొనే నల్లజాతీయులు ఆ షో అయిపోయిన తరువాత తమ సహజమైన ఉంగరాల జుత్తును నిటారుగా చేసుకునేవారు. ఉంగరాల జుత్తు ఉంటే తాము ఉద్యోగం చేస్తున్న చోట వివక్షను ఎదుర్కొనేవారు. ఈ పద్ధతులను మార్చాలని నల్లజాతీయులు తమ సహజ సౌందర్యాన్ని గర్వంగా బయటకు చూపించే పరిస్థితులు రావాలని అజాస్ బృందం భావించారు. అందుకని గ్రాండసా మోడల్స్ ఉంగరాల జుత్తుతో తమ సహజ సౌందర్యాన్ని ప్రదర్శించడం ఒక ముఖ్యమైన విషయంగా పరిగణించారు.
గ్రాండసా మోడల్స్ ఇచ్చే ప్రదర్శనలు పెరుగుతుండడం, ప్రసిద్ధ సంగీత కళాకారులు నీనా సైమన్ లాంటివారు కూడా ఉంగరాల జుత్తునే కొనసాగించడం నల్లజాతీయులలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది.
అయితే ఇది అంత సులువుగా జరగలేదు. 1950, 60లలో తలకట్టు మార్చి ప్రతిఘటించిన మహిళలు అనేక వివక్షలను, అవమానాలను ఎదుర్కొన్నారు.

ఫొటో సోర్స్, Courtesy of the artist and Philip Martin Gallery
తరువాత మెల్లమెల్లగా నల్లజాతీయుల సహజ సిద్ధ ఉంగరాల జుత్తుకు మార్కెట్ పెరిగింది. అందుకు తగ్గ ఉత్పత్తులు మార్కెట్లో లభ్యమవ్వడం మొదలయ్యింది.
ఈనాడు బ్లాక్ మోడల్స్ అందం, శైలికి విస్తృత ప్రచారం కల్పించే దిశలో అనేకమంది ఫొటోగ్రాఫర్లు కృషిచేస్తున్నారు.
బ్రాత్‌వైట్ తీసిన ఫొటోలు నేడు ఎందరో ఫొటోగ్రాఫర్లకు ప్రేరణగా నిలిచాయి.
"మా నాన్న అప్పట్లో బ్లాక్ పక్షపాతం వహించారు. ఆయన చెప్పిన కథలు వింటే అప్పట్లో అలా కాకుండా మరో విధంగా ఉండే అవకాశం లేదనిపించింది" అని జూనియర్ బ్రాత్‌వైట్ అన్నారు.
"మూడేళ్ల క్రితం నేను ఎల్ఏలో ఒక హై స్కూల్లో మాట్లాడడానికి వెళ్లినప్పుడు.. ఒక మహిళ నా దగ్గరకొచ్చి 'మీ నాన్నగారికి నా తరుపు నుంచి కృతజ్ఞతలు తెలియజేయండి. నాకు 12 ఏళ్లు ఉన్నప్పుడు ఆయన గురించి విన్నాను. ఆ తరువాతే నా అందం గురించి నాకు ఒక అవగాహన వచ్చింది. నా అందాన్ని నేను గుర్తించడం మొదలుపెట్టాను. అందుకు కారణం ఆయనే' అని చెప్పారు" అని జూనియర్ బ్రాత్‌వైట్ తెలిపారు.
గమనిక: క్వామే బ్రాత్‌వైట్ "బ్లాక్ ఈజ్ బ్యూటిఫుల్" ఫొటో ప్రదర్శన కొలంబియా మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో సెప్టెంబర్ 6 వరకు ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
- చైనా - భారత్ మధ్య 45 ఏళ్లుగా లేనంత గొడవలు ఇప్పుడెందుకు?
- ఆల్ఫ్స్ పర్వతాలపై భారతీయ పత్రికలు, 1966 విమాన ప్రమాదం నాటివేనా
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- కరోనావైరస్: ఇండియా గ్లోబల్ హాట్‌స్పాట్‌గా మారిపోతుందా?
- భారత్ - చైనా 1962 యుద్ధం: పిరికిపందల చర్యా లేక నమ్మకద్రోహమా?
- ‘ఉద్యోగం పోయింది.. అందుకే నా సెక్సీ ఫోటోలు అమ్ముకుంటున్నా’
- హైదరాబాద్ నుంచి ఇప్పటివరకు ఎంతమంది వెళ్లిపోయారు
- చైనా, ఇరాన్‌ల సీక్రెట్ డీల్: భారత్‌కు ఎంత నష్టం
- భారతీయ భార్య - చైనా భర్త.. వారిద్దరికీ ఓ కూతురు... వారి జీవితం ఇప్పుడెలా మారింది?
- విటమిన్-డి తీసుకుంటే వైరస్ రాకుండా కాపాడుతుందా
- 2 వేల సంవత్సరాల పురాతన అస్థిపంజరం.. మర్డర్ మిస్టరీలా ఉందంటున్న శాస్త్రవేత్తలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








