టెనెట్: ఆమె కోసం ఆ ఇద్దరు మగాళ్లు సర్వం ధారపోయడానికి రెడీ అయ్యారు - క్రిస్టొఫర్ నోలన్ కొత్త సినిమా రివ్యూ

ఫొటో సోర్స్, WARNER BROS
- రచయిత, విల్ గోంపెర్ట్జ్
- హోదా, ఆర్ట్స్ ఎడిటర్
క్రిస్టొఫర్ నోలన్ ఓ అరుదైన కళాకారుడు.. మేధస్సుతో బ్లాక్‌బస్టర్ సినిమాలు తీసే దర్శకుడు. ఆయన సినిమా పల్స్‌ను పరుగులు పెట్టిస్తుంది. తల తిరిగిపోతుంటుంది.
కాలం, అంతరిక్షం, అంతఃచేతన వంటి సంక్లిష్ట అంశాలను విశ్లేషిస్తూ అద్భుత కాల్పనిక కథలకు అత్యద్భుత ప్రదర్శనను జోడించి ఉరకలు పెట్టే మహాకావ్యాలుగా తీర్చిదిద్దటంలో రిడ్లీ స్కాట్, స్టాన్లీ కుబ్రిక్‌లకూ అదే నైపుణ్యం ఉంది.
నోలన్ అంతకుమించి ఆరితేరినవాడు. ఇన్‌సెప్షన్ ఓ సైన్స్‌ఫిక్షన్ దోపిడీ సినిమా. ద డార్క్ నైట్ ఒక కామిక్-బుక్ థ్రిల్లర్.
ఇప్పుడు టెనెట్‌తో మళ్లీ అదే పని చేశాడు. భూగోళమంతా కలియదిరిగే సైన్స్‌ఫిక్షన్ స్పై డ్రామా ఇది. జాన్ డేవిడ్ వాషింగ్టన్ కథానాయక పాత్ర పోషించాడు. ముంచుకొస్తున్న మూడో ప్రపంచ యుద్ధంలో పొంచివున్న అణుధార్మిక ప్రపంచాంతం నుంచి మానవాళి మనుగడను రక్షించే మహత్తర కార్యం అతడు నెరవేర్చాలి.
అది చాలా పెద్ద పనే. కానీ నోలన్ చేపట్టినంత పెద్ద చాలెంజ్ మాత్రం కాదు. ఒకవైపు కరోనా మహమ్మారి మరోవైపు స్ట్రీమింగ్ దిగ్గజాలు - అడకత్తెరలో చిక్కుకున్న సినీ జగత్తును కాపాడటానికి టెనెట్‌తో బరిలోకి దిగాడు నోలన్.
అంతుచిక్కని జన్యుమార్పిడిలతో కంటికి కనిపించకుండా దాడిచేసే శత్రువు ఒకటైతే (కరోనావైరస్).. తిరుగుబాటు చేసిన అంతర్గత శత్రువు ఒకటి (స్ట్రీమింగ్ దిగ్గజాలు).. ఒక థీమ్‌గా చూస్తే ఇది కూడా నోలన్ సినిమాల్లో ఒకటిగా అనిపిస్తుంది.

ఫొటో సోర్స్, WARNER BROS
నోలన్ తన బాధ్యతల నుంచి వెనకడుగు వేయలేదు
టెనెట్ ఓ భారీ సినిమా. ఐమాక్స్ కెమెరాలు, 70 ఎంఎం ఫిల్మ్‌లను వాడారు. దాదాపు 20 కోట్ల డాలర్ల బడ్జెట్. వెండి తెర మీద వీక్షించటం కోసం చిత్రీకరించారు.
ఇది 'ఈవెంట్' సినిమా. మన ఇంద్రియాలన్నిటినీ ఉత్తేజపరుస్తుంది. లుడ్విగ్ గోరాన్సన్ సంగీతం మొదలుకుని.. డీఎన్‌ఈజీ విజువల్ ఎఫెక్ట్స్ వరకూ అద్భుత అనుభూతిని కలిగిస్తుంది టెనెట్.
స్టంట్స్, కెమెరా పనితనం, భారీతనం మెప్పిస్తాయి. అస్తిత్వ ముప్పులు, అచేతన మస్తిష్కం, అధునాతన భౌతికశాస్త్ర సిద్ధాంతాలను సీరియస్‌గా పట్టించుకునే వేదికగా.. బ్లాక్‌బస్టర్ వినోదాన్ని నోలన్ వినియోగించుకున్న తీరు కూడా బాగా నచ్చుతుంది.
కృత్రిమంగా చొప్పించిన కలలు (ఇన్‌సెప్షన్), విశ్వంలో ప్రత్యామ్నాయ ప్రపంచాల (ఇంటర్‌స్టెల్లార్) గురించి.. కొందరికే అర్థమయ్యే అద్భుత కథలు, కథనాలు అతడు గతంలో మనకు అందించాడు. అవి రెండూ సైన్స్ కన్నా ఎక్కువగా కల్పనలుగానే అనిపించాయి. కానీ టెనెట్ విషయంలో అలా కాదు. కాలం అనే భావన గురించి నమ్మలేని విషయాలు నమ్మదగ్గవిగా కనిపించేలా ఆయన రూపొందించారు. ఈ సినిమాకి రచయిత, దర్శకుడూ ఆయనే.
నిజానికి మీ బుర్రకు పని పెట్టే అంశాలు చాలా ఉన్నాయి. సినిమా టైటిల్‌లోనే క్లూ ఉంది. వాషింగ్టన్ పోషించిన కథానాయక పాత్ర అమాయకంగా చేరిన అతి రహస్య సమాజపు నైతిక ప్రవర్తనావళి (టెనెట్స్)ని మాత్రమే కాదు.. ముందు వెనుకలు ఒకేలా ఉండే దాని రూపం గురించి కూడా ఈ టైటిల్ చెప్తుంది. అంతేకాదు. కాలం గురించి మనం ఎలా ఆలోచించాలో కూడా నోలన్ ఈ టైటిల్‌తో పరోక్షంగా చెప్తున్నాడు. అంటే - అది రెండువైపులా పయనిస్తుంది - ముందుకు, వెనక్కు. ఒక్కోసారి ఒకేసారి రెండు దిశల్లోనూ ప్రయాణిస్తుంది.
భవిష్యత్తులో జరగబోయే సంఘటలను గతంలో పునఃసందర్శించవచ్చు. ఈ ఆలోచనను 'గ్రాండ్‌ఫాదర్ పారడాక్స్' వివరిస్తుంది. ఈ పారడాక్స్ ప్రకారం.. ఒక వ్యక్తి కాలంలో వెనక్కు ప్రయాణించి తన తల్లిదండ్రులు పుట్టకముందే తన తాతను చంపేస్తే.. అది తన మనుగడనే నిరోధిస్తుంది.

ఫొటో సోర్స్, Reuters
నోలన్ మన మెదడుకు పని పెట్టే కాలానికి సంబంధించిన భావనల్లో ఇది చాలా సులభమైనది.
కాలం తిరోగమనం, కాల విలోమం, కాలం రెండుదిశల నుంచీ వెనుకకు ప్రయాణించటం వంటి కాలగతి సైద్ధాంతిక భావనలు కూడా ఇందులో ఉన్నాయి.
ఇదంతా సంక్లిష్ట పదజాలంగా అనిపిస్తే.. దానిని తెరమీద చూపించటానికి ప్రయత్నించటం ఎలా ఉంటుంది? కథానాయకుడు ముందుకు వెళుతుంటే మిగతావన్నీ వెనక్కు ప్రయాణిస్తుండటం అందులో కార్లు ఢీకొనటం. ఒకే సమయంలో ఒకే చోట సహస్రాబ్దాల పాటు జరిగే ముష్టియుద్ధాలు. తూట్లు పొడుస్తూ చొచ్చుకుపోవటం కాదు.. తూట్లను పూడ్చివేసే బులెట్లు కనిపిస్తాయి.
కాలం గురించి మనకు ముందునుంచీ ఉన్న అభిప్రాయాలను నోలన్ సవాల్ చేస్తున్నాడు. కాలం ఏకగతిలో ముందుకుసాగుతుందన్న పరిమిత ఆలోచనను దాటి చూసే ప్రత్యామ్నాయ మార్గం ఉండవచ్చునని సూచిస్తున్నాడు.
ఈ విషయం మొదట్లో గందరగోళంగా ఉన్నా సినిమా మధ్యలోకి వచ్చే సమయానికి అర్థమైపోతుంది. అది ఎంతగా అర్థమవుతుందంటే.. చివర్లో కథలో మలుపులను ముందే ఊహించవచ్చు.

ఫొటో సోర్స్, WARNER BROS
నిజానికి కథా క్రమం మొత్తం ముందుగా ఊహించగలగటం వల్ల.. జటిలమైన భౌతికశాస్త్ర సంగతుల మీద బుర్ర పెట్టటానికి వీలవుతుంది.
ఇది జేమ్స్ బాండ్ తరహా. కథానాయకుడు మంచివాడు. ఒక పాశ్చత్య గూఢచారి. నైతికంగా బలమైన, అధికార సంస్థలకు అతీతమైన, రాజ్యం నడిపే రహస్య గూఢచార సంస్థ. చెడ్డవాడు ఆండ్రీ సటోర్. నీతిలేని రష్యా వ్యాపారి. కెనెత్ బ్రానాగ్ ఈ పాత్రను బలంగానే చేసినా అంత నైశిత్యం ప్రదర్శించలేదు.
అతడు బ్రిటిష్ ఆర్ట్ ఎక్స్‌పర్ట్ కాత్ (ఎలిజబెత్ డెబికి) భర్త. ఆమె ఒక అంతర్జాతీయ ఆక్షన్ హౌస్‌తో పనిచేస్తుంది. ఆమె తెలివితక్కువగా తన భర్తకు ఒక నకిలీ గోయా పెయింటింగ్ ఇస్తుంది. వృత్తిపరంగానూ వ్యక్తిగతంగానూ ఆమె చేసిన ఈ పొరపాటును వాడుకుని.. ఆమె తనను వదిలిపెట్టకుండా ఆంద్రే బ్లాక్‌మెయిల్ చేస్తుంటాడు. ఆమె తన బిడ్డను ఎప్పటికీ చూడకూడదని ఒప్పిస్తాడు. నార్త్ లండన్‌లోని ఒక సంపన్న ప్రిపరేటరీ స్కూల్‌లో చదువుతున్న తన చిన్నారి కొడుకు మాక్స్ (లారీ షెపర్డ్)ను స్కూలు నుంచి తీసుకువచ్చే సంతోషాన్ని ఆమెకు దూరం చేస్తాడు.
ప్రపంచపు గతం, వర్తమానం, భవిష్యత్తులు అన్నిటినీ తుడిచిపెట్టే ఏర్పాట్లు చేసేందుకు ఆంద్రే కఠోరంగా దీక్షబూనుతాడు. అతడిని ఆపటం కథానాయకుడి పని. దీనికి కాత్ కీలకం. ఇందులో ముక్కోణ ప్రేమకథ. ఇది కాగితం మీద బాగున్నా.. తెర మీద భావోద్వేగాలు పలికించలేకపోవటం, ఆమెకు ఆంద్రేకు మధ్య కానీ, ఆమెకు కథానాయకుడికి మధ్య కానీ, చివరికి చిన్నారి కొడుకు మాక్స్‌తో కానీ కెమిస్ట్రీ లోపించింది.

ఫొటో సోర్స్, WARNER BROS
ఆమె పట్ల అంతగా అనురాగం చూపని ఈ ఇద్దరు మగాళ్లు తమ సర్వమూ ఒడ్డటానికి ఎందుకు సిద్ధపడుతున్నారనేది మనకు అర్థంకాదు.
ప్రధాన పాత్రధారుల మధ్య అనుబంధం అంతగా ఎందుకు లోపించిందో నాకు తెలియదు. బహుశా స్క్రిప్టు కారణం కావచ్చు. లేదంటే పాత్రలను మరీ సరళంగా మలచివుండొచ్చు.
కథానాయకుడు ప్రొటాగనిస్ట్ పాత్రను వాషింగ్టన్ బాగానే పోషించాడు. రాబర్ట్ పాటిన్సన్ కూడా బ్రిటిష్ సాహసికుడు నీల్ పాత్రలో బాగానే నటించాడు.
బహుశా హై-డెఫినిషన్ చిత్రీకరణ, నటుల స్వేద రంధ్రాలు సైతం కనిపించేంతగా క్లోజప్ షాట్‌ల వల్ల.. కొన్ని సీన్లు ఇబ్బందికరంగా కనిపిస్తాయి.

ఫొటో సోర్స్, WARNER BROS
ఆమేరకు.. ఇది బాండ్ తరహా కాదు. అలాగని బాండ్‌కి భిన్నమైనదీ కాదు. బాండ్ తరహా స్థాయి భారీ ప్రదర్శన ఉండే యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి. బాండ్ తరహాలో పంచ్ డైలాగులు విసరటానికి కథానాయకుడు ప్రయత్నించే సీన్లూ ఉన్నాయి. నువ్వెలా చావాలనుకుంటున్నావు అని అడిగితే ''ముసలయ్యాక'' అని వెటకరిస్తాడు.
ఇది మామూలుగా అయితే బాండ్‌ను అనుకరించే యాక్షన్ స్పై సినిమాగా కనిపిస్తుంది. కానీ.. నోలన్ తన కథను పెద్ద సిద్ధాంతాలతో అల్లటం 'టెనెట్' విలక్షణత. ఇది.. కాలాన్ని మనం చూసే దృక్పథాన్ని వినూత్నంగా, సాహసోపేతంగా, ఆలోచనలను ప్రేరేపించే లోతైన పరిశోధనగా ఈ సినిమాను నిలుపుతుంది.
ఇది మిమ్మల్ని అతలాకుతలం చేయదు. కానీ మీ మెదడుకు పనిపెడుతుంది. అందుకోసం ఈ సినిమా చూడొచ్చు.
టెనెట్ సినిమా ఆగస్టు 26న బ్రిటన్‌లో విడుదలవుతుంది.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: భారత్‌లో గల్లంతవుతున్న కోవిడ్ మరణాలు ఎన్ని?
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- భారత్‌లో కోవిడ్-19 వ్యాక్సీన్ హ్యూమన్ ట్రయల్స్ రెండు, మూడు దశలకు డీసీజీఐ అనుమతి
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- శకుంతలా దేవిని హ్యూమన్ కంప్యూటర్ అని ఎందుకు పిలుస్తారంటే..
- జునాగఢ్ ఆశతో పాకిస్తాన్ కశ్మీర్‌ను చేజార్చుకుందా, ఈ సంస్థానం భారత్‌లో ఎలా కలిసింది?
- కెప్టెన్‌గా ధోనీ తీసుకున్న 10 అసాధారణ నిర్ణయాలు
- కేరళ విమాన ప్రమాదంలో రియల్ హీరోలు వీళ్లే.. సెల్యూట్ చేసిన పోలీసు అధికారి
- కరోనావైరస్: హంతక మహమ్మారిపై శాస్త్రవేత్తల వేటలో వెలుగు చూసిన నిజాలేమిటి?
- ‘నేను ఆక్స్ఫర్డ్ కరోనావైరస్ వ్యాక్సీన్ వేయించుకున్నా.. ఇప్పుడు నేనేం చేస్తానంటే..’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








