కమలా హారిస్: అమెరికన్ రాజకీయ కొలనులో భారత సంతతి కమలం

కమలా హారిస్

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, కమలా హారిస్
    • రచయిత, సౌతిక్ బిశ్వాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష స్థానానికి పోటీ చేస్తున్న జో బిడెన్... తమ పార్టీ తరఫున ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా సెనేటర్ కమలా హారిస్‌ను ఎంచుకున్నారు.

అమెరికాలోని నల్లజాతి రాజకీయ నేతల్లో కమలా ప్రముఖురాలు. అయితే, ఆమెకు భారత్ మూలాలు కూడా ఉన్నాయి. వాటి పట్ల కూడా ఆమె గర్వం వ్యక్తం చేస్తుంటారు.

కమల ఆత్మకథ ‘ద ట్రూత్స్ వి హోల్డ్’ పుస్తకం 2018లో విడుదలైంది.

‘నా పేరును కమలా అని పిలవాలి. పంక్చుయేషన్ కోసం ఉపయోగించే కామా ( , ) పలికినట్లు పలకాలి’’ అని అందులో కమలా రాశారు.

‘‘కమల అంటే తామర లేదా కమలం అని అర్థం. భారత సంస్కృతిలో దానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. పైకి ఆ పూవు కొలనులో తేలియాడుతున్నట్లే కనిపిస్తుంది. కానీ, దాని వేళ్లు కొలను అడుగున బలంగా పాతుకుపోయి ఉంటాయి’’ అంటూ అమెరికన్లకు తన పేరు గురించి ఆ పుస్తకంలో వివరించారామె.

కమలా తల్లి తమిళనాడులోని చెన్నైలో జన్మించారు. తండ్రి జమైకాలో పుట్టారు.

కమలాకు మాయా అనే చెల్లెలు కూడా ఉన్నారు. చిన్నప్పుడు వారి ఇంట్లో ఎప్పుడూ నల్ల జాతి అమెరికన్ గాయకుల సంగీతం వినిపిస్తూ ఉండేది.

కమలా తండ్రి డోనల్డ్ హారిస్ స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్. తల్లి శ్యామల గోపాలన్ క్యాన్సర్ పరిశోధకురాలు, పౌర హక్కుల కార్యకర్త.

చెల్లెలు మాయాతో కమలాకు అనుబంధం ఎక్కువే

ఫొటో సోర్స్, THE WASHINGTON POST VIA GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, చెల్లెలు మాయాతో కమలాకు అనుబంధం ఎక్కువే

కమలాకు ఐదేళ్ల వయసు ఉన్నప్పుడే, ఆమె తల్లిదండ్రులు విడిపోయారు.

కమలా, మాయాలను వారి తల్లి ఒంటరిగానే పెంచారు.

ఆ ముగ్గురినీ కలిపి... వారికి తెలిసినవాళ్లు ‘శ్యామల అండ్ ద గర్ల్స్’ అని పిలిచేవాళ్లు.

కమలా, మాయాలకు వారి తల్లి... వారి నేపథ్యాన్ని ఎప్పుడూ గుర్తు చేస్తూ ఉండేవారు.

‘‘ఇద్దరు నల్ల జాతి అమ్మాయిలను పెంచుతున్నానని మా అమ్మ బాగా అర్థం చేసుకున్నారు. మాయాను, నన్ను తన కొత్త దేశం నల్ల జాతి అమ్మాయిలుగానే గుర్తిస్తుందని ఆమెకు తెలుసు. అందుకే, మాలో ఆత్మవిశ్వాసాన్ని ఆమె నూరిపోశారు’’ అని కమలా తన ఆత్మకథలో రాశారు.

‘‘కమలా హారిస్ భారత సంస్కృతిని ఆకళింపు చేసుకుంటూ పెరిగారు. కానీ, ఇప్పుడు ఓ ఆఫ్రికన్ అమెరికన్‌గా ఆమె గర్వంగా జీవిస్తున్నారు’’ అని గత ఏడాది వాషింగ్టన్ పోస్ట్ ఓ కథనం రాసింది.

2015లో సెనేట్‌కు కమలా పోటీ చేసినప్పుడు... ఆమెను ‘భారతీయ క్యాన్సర్ పరిశోధకురాలు, జమైకన్ ప్రొఫెసర్‌ల కూతురు’గా ఎకనామిస్ట్ మ్యాగజైన్ వర్ణించింది. కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌ పదవి చేపట్టిన తొలి మహిళ, తొలి ఆఫ్రికన్ అమెరికన్, తొలి ఏసియన్ అమెరికన్ కమలా హారిస్.

అయితే, తన గుర్తింపు విషయంలో కమలాకు మాత్రం ఎలాంటి అయోమయం లేదు. తనను తాను కేవలం ‘ఓ అమెరికన్’గా ఆమె వర్ణించుకుంటారు.

అయితే, కమలా గురించి బాగా తెలిసినవాళ్లు... ఆమె రెండు వర్గాలకూ దగ్గరగా ఉంటారని అభిప్రాయపడుతున్నారు.

కమలా ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి డెమొక్రటిక్ పార్టీ తరఫున అభ్యర్థిత్వం కోసం కూడా ప్రయత్నించారు. ఆ సమయంలో భారత సంతతి కమెడియన్ మిండీ కలింగ్‌తో కలిసి ఓ కుకింగ్ వీడియోలో ఆమె కనిపించారు. భారతీయ వంటకాన్ని వండుతూ, తమ దక్షిణ భారత నేపథ్యం గురించి ఇందులో వీళ్లిద్దరూ ముచ్చటించారు.

కమల తన యూట్యూబ్ పేజీలో ఈ వీడియోను పోస్ట్ చేశారు.

కమలా భారత నేపథ్యం గురించి ఇంకా చాలా మందికి తెలియదని, భారత సంతతి వాళ్లు ఆ విషయం గురించి తెలుసుకుని సంతోషపడుతున్నారని ఆ సమయంలో మిండీ ఆమెతో అన్నారు.

చిన్నప్పుడు దక్షిణాది వంటకాలు తిన్నారా అని ఆమెను ప్రశ్నించారు.

‘‘అన్నం, పెరుగు, ఆలుగడ్డ కూర, పప్పు, ఇడ్లీ’’ అంటూ చిన్నప్పుడు తాను ఇంట్లో తిన్న వంటల జాబితాను వివరించారు కమలా.

కమలా ఈ ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష పదవికి అభ్యర్థిత్వం కోసం కూడా ప్రయత్నించారు

ఫొటో సోర్స్, EPA/BIDEN CAMPAIGN/ADAM SCHULTZ

ఫొటో క్యాప్షన్, కమల ఈ ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష పదవికి అభ్యర్థిత్వం కోసం కూడా ప్రయత్నించారు

‘‘నేను భారత్‌లో అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళ్తుండేదాన్ని. మా అమ్మమ్మ శాకాహారి. ఆమె ఎటైనా వెళ్లినప్పుడు, గుడ్లతో ఫ్రెంచ్ టోస్ట్ చేసుకుందామని మా తాతయ్య అడుగుతుండేవారు’’ అని కమలా చిన్ననాటి విషయాలను గుర్తుచేసుకున్నారు.

తమ ఇంట్లో బిర్యానీ కూడా చేసుకునేవాళ్లమని కమలా తన పుస్తకంలో రాశారు.

కమలా హారిస్ 2014లో డగ్లస్ ఎమ్హోఫ్‌ అనే న్యాయవాదిని పెళ్లాడారు. డగ్లస్ యూదుడు.

భారతీయ, యూదు సంప్రదాయలను అనుసరిస్తూ తమ వివాహం జరిగిందని కమలా తన పుస్తకంలో రాశారు.

కమలా హ్యారిస్‌ను ఎక్కువగా నల్లజాతి అమెరికన్ రాజకీయ నేతగానే అక్కడివారు చూస్తుంటారు. జాతి విద్వేషానికి వ్యతిరేకంగా ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ ఉద్యమం జోరందుకున్న నేపథ్యంలో ఈ గుర్తింపుకు ప్రాధాన్యత కూడా పెరిగింది.

మరోవైపు భారతీయ అమెరికన్లు కూడా కమలాను తమలో ఒకరిగా చూసుకుంటున్నారు. ఆమె అభ్యర్థిత్వంతో అమెరికాలో ఉంటున్న భారతీయ, దక్షిణాసియా వర్గాలకు మరింత గుర్తింపు వస్తుందని ఆశిస్తున్నారు.

కమలాపై ఆమె తల్లి శ్యామల గోపాలన్ ప్రభావం చాలా ఎక్కువ. చాలా సార్లు ఆమె ఈ విషయం గురించి మాట్లాడారు. తన తల్లిని కమలా స్ఫూర్తిగా భావిస్తారు.

శ్యామలకు నలుగురు తోబుట్టువులు. దిల్లీ యూనివర్సిటీలో ఆమె చదువుకున్నారు. 19 ఏళ్ల వయసులోనే బెర్క్లీ యూనివర్సిటీకి దరఖాస్తు చేసుకుని, చదువు కోసం1958లో అమెరికాలో అడుగుపెట్టారు.

న్యూట్రిషన్, ఎండాక్రినాలజీలో డాక్టరేట్ చేసేందుకు వెళ్లిన శ్యామల... క్యాన్సర్ పరిశోధకురాలిగా మారారు.

‘‘ఆమెను అమెరికాకు పంపించడం మా అమ్మమ్మ, తాతయ్యలకు ఎంత కష్టమైన విషయమో నాకు తెలుసు. కమర్షియల్ జెట్ ప్రయాణాలు అప్పుడప్పుడే మొదలయ్యాయి. వాళ్లతో కాంటాక్ట్‌లో ఉండటం కూడా అప్పట్లో కష్టమే. కాలిఫోర్నియా వెళ్తానని మా అమ్మ అడిగినప్పుడు, వాళ్లు అడ్డు చెప్పలేదు’’ అని కమలా అన్నారు.

‘‘చదువు పూర్తైపోగానే, భారత్‌కు తిరిగివచ్చి పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటానని మా అమ్మ తన తల్లిదండ్రులకు మాట ఇచ్చింది. కానీ, ఆమె తలరాత మరోలా ఉంది’’ అని వివరించారు.

కమలా తల్లి తమిళనాడులోని చెన్నైలో జన్మించారు. తండ్రి జమైకాలో పుట్టారు

ఫొటో సోర్స్, Harris Family

ఫొటో క్యాప్షన్, కమల తల్లి తమిళనాడులోని చెన్నైలో జన్మించారు. తండ్రి జమైకాలో పుట్టారు

బెర్క్లీలో చదువుతున్నప్పుడు పౌర హక్కుల ఉద్యమంలో శ్యామల పాల్గొన్నారు. అక్కడే డోనల్డ్ హారిస్ ఆమెకు పరిచయమయ్యారు.

‘‘ఆమె పెళ్లి గురించి, అమెరికాలో ఉండిపోవాలని తీసుకున్ననిర్ణయం... ఆమె దృఢ సంకల్పానికి, ప్రేమకు నిదర్శనం’’ అని కమలా తన పుస్తకంలో రాశారు.

1964లో శ్యామల తన డాక్టరేట్ పూర్తి చేశారు. ఆ ఏడాదే కమలా పుట్టారు.

భారత్‌లో శ్యామల కుటుంబంలోనూ రాజకీయ వాతావరణం ఉండేది.

కమలా అమ్మమ్మ పెద్దగా చదువుకోలేదు. కానీ, గృహ హింస, కుటుంబ నియంత్రణ గురించి ఇతరులకు ఆమె అవగాహన కల్పించేవారు.

కమలా తాతయ్య భారత ప్రభుత్వంలో సీనియర్ దౌత్యవేత్త. ఆయన జాంబియాలో పనిచేశారు. ఆ దేశానికి స్వతంత్రం వచ్చాక, శరణార్థులకు పునరావాసం కల్పించేందుకు ఆయన కృషి చేశారు.

కమలా తన పుస్తకంలో తన భారత పర్యటనల గురించి ఎక్కువగా ప్రస్తావించలేదు.

తన మేనమామకు, చిన్నమ్మలతో తనకు సాన్నిహిత్యం ఉండేదని... ఫోన్ కాల్స్, లేఖలు, అప్పుడప్పుడు పర్యటనలతో వారితో టచ్‌లో ఉండేదాన్నని కమలా రాశారు.

కమల తల్లి శ్యామల 2009లో చనిపోయారు. అప్పటికి ఆమె వయసు 70 ఏళ్లు.

కమల అభ్యర్థిత్వం భారతీయ అమెరికన్ వర్గానికి చాలా గొప్ప విషయమని డెమొక్రాటిక్ పార్టీ కార్యకర్త శేఖర్ నరసింహన్ అన్నారు.

‘‘ఆమె మహిళ. రెండు జాతుల నేపథ్యం ఉంది. బిడెన్ ఎన్నికల్లో గెలవడానికి ఆమె చాలా ఉపయోగపడతారు. చాలా వర్గాలు ఆమెతో కనెక్ట్ అవుతాయి. ఆమె చాలా తెలివైనారు కూడా’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

‘‘భారతీయ అమెరికన్లు ఆమె విషయంలో ఎందుకు గర్వపడకూడదు? మాకు కూడా గుర్తింపు వస్తోందనడానికి ఇది సంకేతం’’ అని నరసింహన్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)