డోనల్డ్ ట్రంప్: అమెరికా అధ్యక్ష ఎన్నికను వాయిదా వేయాలి

ఫొటో సోర్స్, Reuters
నవంబరులో జరగాల్సిన అధ్యక్ష ఎన్నికలను వాయిదా వేయాలని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ సూచించారు. పోస్టల్ ఓటింగ్‌తో మోసాలు జరిగే అవకాశముందని, తప్పుడు ఫలితాలూ రావొచ్చని ఆయన అన్నారు.
ప్రజలందరూ సుక్షితంగా, భద్రతంగా, మునుపటిలా ఓటు వేసే సమయం వచ్చేవరకూ ఎన్నికను వాయిదా వేయాలని ఆయన సూచించారు.
ట్రంప్ చెబుతున్న లోపాలకు ఎలాంటి గట్టి ఆధారాలూ లేవు. పైగా పోస్టల్ ఓటింగ్‌ను ఆయన విమర్శించడం ఇదేమీ తొలిసారి కాదు.
కరోనావైరస్ వ్యాప్తి చెందుతుండటంతో పోస్టల్ ఓటింగ్ విధానాన్ని మరింత సరళం చేయాలని అమెరికాలోని రాష్ట్రాలు భావిస్తున్నాయి.
అమెరికా రాజ్యాంగం ప్రకారం.. ఎన్నికలను వాయిదావేసే అధికారం అధ్యక్షుడికి లేదు. ఎలాంటి వాయిదా అయినా కాంగ్రెస్ ఆమోదంతోనే చేయాల్సి ఉంటుంది. ఈ రెండు సభలపై అధ్యక్షుడికి ఎలాంటి ప్రత్యక్ష అధికారాలూ ఉండవు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ట్రంప్ ఏమన్నారు?
"అందరూ పోస్టల్ విధానంలో ఓటువేస్తే.. ఈ ఎన్నికలు చరిత్రలోనే అత్యంత మోసపూరితమైన ఎన్నికలుగా మిగిలిపోతాయి. అమెరికాకు ఇది సిగ్గుచేటు" అని ఆయన వరుస ట్వీట్లు చేశారు.
ఇలాంటి విధానంలో విదేశాలు జోక్యం చేసుకునే అవకాశముంటుందని ఆయన అన్నారు. అయితే దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలూ ఆయన చూపించలేదు.
"ఓటింగ్‌ను విదేశాలు ప్రభావితం చేస్తాయని డెమోక్రాట్లు అంటుంటారు. అయితే మెయిల్-ఇన్ ఓటింగ్ విధానంలో విదేశాలు జోక్యం చేసుకోవడం చాలా తేలిక" అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇప్పటికే ప్రయోగాత్మకంగా పోస్టల్ ఓటింగ్ నిర్వహించిన చోట.. ఈ విధానం విధ్వంసకరమైనదని తేలినట్లు రుజువైందని ట్రంప్ చెప్పారు.
జూన్‌లో న్యూయార్క్‌లో జరిగిన డెమోక్రటిక్ పార్టీ ప్రాథమిక ఎన్నికల్లో పోస్టల్ ఓటింగ్ విధానాన్ని ఉపయోగించారు. అయితే కౌంటింగ్‌కు చాలా ఎక్కువ సమయం పట్టింది. ఫలితాలు ఇప్పటికీ తేలలేదు.
సరిగా నింపకపోయినా, నిర్దేశిత సమయం కంటే ముందే పంపినట్లు పోస్ట్‌మార్క్‌లు లేకపోయినా ఆ బ్యాలెట్లను లెక్కించరనే ఆందోళనలు వ్యక్తమైనట్లు అమెరికా మీడియా పేర్కొంది. అయితే, చాలా రాష్ట్రాలు ఎప్పటి నుంచో పోస్టల్ విధానంలో ఓటింగ్ నిర్వహిస్తున్నాయి.
కాంగ్రెస్ ఆమోదం లేకుండా వాయిదా అసాధ్యం
ఆంటొనీ జుర్కర్ విశ్లేషణ
కాంగ్రెస్ ఆమోదం లేకుండా అధ్యక్ష ఎన్నికను ట్రంప్ వాయిదా వేయలేరు. ప్రతినిధుల సభలో ఆధిక్యం డెమోక్రాట్లదే. ఈ విషయం ఆయనకు తెలియకపోయుంటే ఇప్పటికే ఎవరో ఒకరు చెప్పుంటారు.
వచ్చే ఎన్నికలో వ్యతిరేకంగా ఫలితాలు వస్తే అంగీకరిస్తారా? అనే ప్రశ్నకు సమాధానం ఆయన చాలాసార్లు దాటవేశారు. ఈ తరుణంలో వాయిదా గురించి ఇలాంటి ప్రశ్నలు అడిగితే రాజకీయ దుమారం చెలరేగుతుందని ఆయన తెలుసుకోవాలి.కరోనావైరస్ ముప్పు భయంతో చాలామంది పోస్టల్ ఓటింగ్ ద్వారానే ఓటు వేయబోతున్నారు. ఈ ఫలితాలను తప్పు పట్టేందుకు ట్రంప్ చేయాల్సిందంతా చేస్తున్నట్లు కనిపిస్తోంది. పోస్టల్ బ్యాలెట్ విధానం గురించి ఆయన పదేపదే ఆరోపణలు చేస్తున్నారు. ఒకవేళ ఆయన ఓడిపోతే ఈ ఎన్నిక విధానాన్నే బలి పశువును చేసేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారని విమర్శలు అంటున్నారు.
రెండో త్రైమాసిక ఆర్థిక వృద్ధి గణాంకాల నుంచి అందరి దృష్టి మళ్లించే ప్రయత్నంలో భాగంగానే ఆయన ఈ ట్వీట్లు చేసుండొచ్చు. ఆర్థిక అభివృద్ధి పెరుగుదలపై ఆశలు పెట్టుకుని ఎన్నికకు ప్రచారం చేస్తున్నారు. అయితే ఇప్పడు ఆర్థిక వ్యవస్థ పతనం బాటలో ఉంది.
కారణం ఏదైనప్పటికీ.. విజయంపై నమ్మకమున్న అభ్యర్థి ఎన్నిక వాయిదా వేయాలని ట్వీట్ చేయరు. ఇలాంటి సూచనలకూ ఇది సంకేతమూ కావొచ్చు.
దీనిపై ఎవరేమన్నారు?
ఎన్నికలను అధ్యక్షుడు వాయిదా వేయగలరా? అని రిపోర్టర్లు ప్రశ్నించినప్పుడు.. చట్టాలకు సంబంధించి తానేమీ మాట్లాడబోనని విదేశాంగ మంత్రి మైక్ పాంపేయో వ్యాఖ్యానించారు. ఈ అంశాన్ని న్యాయ శాఖ చూసుకుంటుందని, అందరూ విశ్వసించే ఎన్నికే జరగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.మరోవైపు ట్రంప్‌కు ఎన్నికను వాయిదావేసే అధికారం లేదని అమెరికా ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ చైర్ఉమన్ ఎలెన్ వీంట్‌రాబ్ వ్యాఖ్యానించారు. అమెరికన్లు అందరూ కోరుకున్నట్లే ఎన్నిక నిర్వహించేందుకు రాష్ట్రాలకు మరిన్ని నిధులు ఇవ్వాలని కోరారు.
ట్రంప్ సూచనలను డెమోక్రాట్లు తప్పుపట్టారు. ఏ విధంగానూ అధ్యక్షుడు ఎన్నికను వాయిదా వేయలేరని న్యూ మెక్సికో సెనేటర్ టామ్ ఉడాల్ వ్యాఖ్యానించారు.
ఆయన ఎలాంటి మోసపూరిత సిద్ధాంతాలను తీసుకొచ్చినా ఎన్నిక అనుకున్న సమయానికే జరుగుతుందని ఇల్లినాయిస్ కాంగ్రెస్ ప్రతినిధి రాజా కృష్ణమూర్తి వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి.
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై సీబీఐ విచారణకు సుప్రీం 'నో'
- శకుంతలా దేవిని హ్యూమన్ కంప్యూటర్ అని ఎందుకు పిలుస్తారంటే..
- చైనాకు చెందిన చేపల వేట నౌకలు ఈక్వడార్ వైపు ఎందుకు వెళ్లాయి
- ఆక్స్ఫర్డ్ వ్యాక్సీన్ తయారీ బృందానికి నేతృత్వం వహిస్తున్న సారా గిల్బెర్ట్ ఎవరు
- వరవరరావు, సాయిబాబాలకు బెయిల్ ఎందుకు రావడం లేదు?
- రియా చక్రవర్తి ఎవరు, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జీవితంలోకి ఎలా వచ్చారు?
- అయోధ్యలోని ఈ మూడు కట్టడాలు కూడా బాబ్రీ మసీదులేనా...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








