చైనాకు చెందిన చేపల వేట నౌకలు ఈక్వడార్‌ వైపు ఎందుకు వెళ్లాయి

వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా యునెస్కో గుర్తింపు పొందిన గలాపగోస్ దీవులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా యునెస్కో గుర్తింపు పొందిన గలాపగోస్ దీవులు

ఈక్వడార్‌లోని గలాపగోస్ దీవుల్లో భారీ సంఖ్యలో చైనాకు చెందిన ఫిషింగ్ నౌకలు కనిపించడంతో ఆ దేశం వెంటనే అప్రమత్తమైంది.

సుమారు 260 నౌకలు అంతర్జాతీయ జల సరిహద్దులను దాటి సున్నితమైన జీవావరణ ప్రాంతంలోకి ప్రవేశించకుండా చూడ్డానికి తీర ప్రాంతంలో కాపలాను ముమ్మరం చేశారు.

ప్రతి సంవత్సరం సముద్రంలో వేట కోసం చైనా నౌకలు ఈ ప్రాంతానికి వస్తాయి.

ఈక్వడార్ రక్షణ మంత్రి ఓస్వాల్డో జరిన్

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, ఈక్వడార్ రక్షణ మంత్రి ఓస్వాల్డో జరిన్

2017లో సుమారు 300 టన్నుల వన్య ఉత్పత్తులతో కూడిన ఒక చైనా నౌకను మెరైన్ రిజర్వులో పట్టుకున్నారు. అందులో చాలా వరకు సొర (షార్క్) చేపలున్నాయి.

"2017లో జరిగిన ఘటనలాంటిది పునరావృతం కాకుండా మేం అప్రమత్తంగా ఉంటూ తీరాన్ని పర్యవేక్షిస్తున్నాం" అని ఈక్వడార్ రక్షణ మంత్రి ఓస్వాల్డో జరిన్.. రిపోర్టర్లకు చెప్పారు.

ఈ విషయం గురించి తెలుసుకునేందుకు చైనా అధికారులను బీబీసీ సంప్రదించినప్పుడు వారి దగ్గర నుంచి ఎలాంటి సమాధానం లభించలేదు.

ఈ దీవులను రక్షించడానికి ఓ ప్రత్యేక వ్యూహాన్ని రచించినట్లు క్విటో మాజీ మేయర్ రాక్ సెవిళ్ల 'గార్డియన్‌'తో చెప్పారు.

"ఈ రక్షిత ప్రాంతంలో చైనా చేస్తున్న చేపల వేటను పట్టించుకోకుండా వదిలేస్తే గలాపగోస్ దీవుల్లో సముద్ర జాతులను సంరక్షించుకోవడానికి ఈక్వడార్ చేపట్టిన చర్యలన్నీ నిరుపయోగమవుతాయి" అని ఆయన అన్నారు.

తీర ప్రాంతానికి వాటిల్లిన ముప్పు గురించి ఈక్వడార్ ఇతర లాటిన్ అమెరికన్ దేశాలైన కొలంబియా, పెరు, చిలీ, పనామా, కోస్టారికాతో చర్చలు జరిపి ముప్పును ఎదుర్కోవడానికి ప్రాంతీయంగా ఒక సంయుక్త నిర్ణయం తీసుకుంటామని ఈక్వడార్ అధ్యక్షుడు లెనిన్ మొరెనో చెప్పారు.

ఆ ప్రాంతంలో నెలకొన్న సహజ వనరుల కారణంగా అంతర్జాతీయ మత్స్య వేట చేసే నౌకలతో ఎప్పుడూ ముప్పును ఎదుర్కొంటూ ఉంటామని ఆయన చెప్పినట్లు ఎల్ యూనివెర్సో పత్రిక పేర్కొంది.

గలాపగోస్ మెరైన్ రిజర్వులో భారీ సంఖ్యలో సొర చేప జాతులు, అంతరించిపోతున్న వేల్ చేపలు, హ్యామర్ హెడ్స్ ఉంటాయని చెబుతారు.

కొన్ని ప్రత్యేక రకాల వృక్ష జాతులు, వన్య జాతులకు నెలవుగా పేరు పొందిన ఈ దీవులను యునెస్కో వరల్డ్ హెరిటేజ్ ప్రదేశంగా గుర్తించింది.

చార్లెస్ డార్విన్ కూడా ఈ దీవుల్లోనే జీవ పరిణామం గురించి కూడా కొన్ని కీలకమైన పరిశోధనలు చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)