వరవరరావు, సాయిబాబాలకు బెయిల్ ఎందుకు రావడం లేదు?

జీఎన్ సాయిబాబా

ఫొటో సోర్స్, A S VASANTHA

ఫొటో క్యాప్షన్, జీఎన్ సాయిబాబా
    • రచయిత, హరికృష్ణ పులుగు
    • హోదా, బీబీసీ ప్రతినిధి

గత కొద్దికాలంగా దిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ సాయిబాబా, విరసం నేత వరవరరావు ఆరోగ్యం విషయంలో వారి బంధువులు, అభిమానుల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం వారికి జైలులో సరైన వైద్య సదుపాయాలు కల్పించడంలేదని, కరోనా పేరుతో చంపేయడానికి కుట్ర చేస్తోందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండగా, వారి ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లున్నాయని, కేసుల్లో తీవ్రత దృష్ట్యా వయసు, ఆరోగ్య కారణాలతో బెయిల్‌ ఇవ్వవలసిన అవసరం లేదని ప్రభుత్వం న్యాయస్థానాల్లో వాదిస్తోంది.

దిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ సాయిబాబా బెయిల్‌ పిటిషన్‌ను విచారించిన బాంబే హైకోర్టు నాగ్‌పూర్‌ బెంచ్‌, ఆయన కోరినట్లు ఆరోగ్య కారణాలపై బెయిల్‌ ఇవ్వడం కుదరదని మంగళవారం స్పష్టం చేసింది.

2017 మార్చి నుంచి ప్రొఫెసర్‌ సాయిబాబా నాగ్‌పూర్‌ సెంట్రల్ జైలులో ఉంటున్నారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై యుఏపీఏ చట్టం కింద నమోదైన కేసుల్లో విచారణ అనంతరం ఆయనకు కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఆయనతో పాటు మరో నలుగురికి కూడా శిక్షపడింది.

అయితే తాను ప్రస్తుతం 90శాతం అంగవైకల్యంతో బాధపడుతున్నానని, జైలులో తనకు కోవిడ్‌-19 వైరస్‌ సోకే ప్రమాదం ఉందని, తన ఆరోగ్య సమస్యలు తీవ్రమవుతాయని సాయిబాబా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా తనకు 45 రోజుల బెయిల్‌ ఇవ్వాలని తన న్యాయవాది నిహాల్‌సింగ్‌ రాథోడ్‌ ద్వారా ఆయన పిటిషన్‌ దాఖలు చేశారని పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది. తన ఆనారోగ్యంతోపాటు క్యాన్సర్‌తో బాధపడుతున్న తన తల్లిని చూసేందు బెయిల్‌ ఇవ్వాలని ఆయన పిటిషన్‌లో కోరారు.

వసంత, సాయిబాబా (పాత ఫొటో)

ఫొటో సోర్స్, A S VASANTHA

ఫొటో క్యాప్షన్, వసంత, సాయిబాబా (పాత ఫొటో)

ప్రభుత్వ వాదన ఏంటి?

ప్రొఫెసర్‌ సాయిబాబాకు బెయిల్‌ పొందే అర్హత లేదని ప్రభుత్వం తరఫు న్యాయవాది బాంబే హైకోర్టులో వాదించారు. "ఇతరులతో కలవడానికి వీలులేని జైలుగదిలో ప్రొఫెసర్‌ సాయిబాబా ఉన్నారు. ఆయనకు కరోనా వైరస్‌ సోకే అవకాశం లేదు'' అని స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ పి.కె. సత్యనాథన్‌ కోర్టుకు వెల్లడించినట్లు పీటీఐ పేర్కొంది. జైలులోకరోనా బారిన పడిన వారంతా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారని, ప్రస్తుతం ఆ జైలులో కోవిడ్‌-19 సోకిన వారు ఎవరూ లేరని, ఈ కారణాలుగానీ, ఆయన తల్లి ఆరోగ్య విషయంగానీ బెయిల్‌ ఇవ్వడానికి సరిపోవని సత్యనాథన్‌ కోర్టుకు వివరించినట్లు పీటీఐ పేర్కొంది. " ఆయన బయటకు వెళితేనే కోవిడ్‌-19 సోకే ప్రమాదం ఎక్కువగా ఉంది'' అని సత్యనాథన్‌ కోర్టుకు తెలిపారు.

నాగ్‌పూర్‌ జైలులో ఆయనకు ఎలాంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు లేవని, కోవిడ్‌-19 టెస్టుల్లో కూడా ఆయనకు నెగెటివ్‌ వచ్చినట్లు ఆసుపత్రి చీప్‌ మెడికల్‌ ఆఫీసర్‌ తెలిపారని, బెయిల్ నిరాకరిస్తూ తన తీర్పులో వెల్లడించింది బాంబే హైకోర్టు నాగ్‌పూర్‌ బెంచ్‌.

సాయిబాబా

ఫొటో సోర్స్, A S VASANTHA

"ఇప్పుడున్న పరిస్థితుల్లో న్యాయస్థానం ఆయనకు బెయిల్ ఇవ్వకపోవడం అత్యంత దారుణమైన నిర్ణయం'' అని సాయిబాబా సహచరి వసంత కుమారి బీబీసీతో అన్నారు.

నాగ్‌పూర్‌ జైలు అధికారులు చెప్పిన దాని ప్రకారం 200మంది ఖైదీలకు, 60 మంది సిబ్బందికి ఇప్పటి వరకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు పీటీఐ వెల్లడించింది.

నాగ్‌పూర్‌ జైలులో కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువగా ఉన్నాయని, ప్రస్తుతం ఆ జైలులో ఉన్న మానవ హక్కుల కార్యకర్త ప్రొఫెసర్‌ సాయిబాబాను విడుదల చేయాలంటూ రాష్ట్రపతికి లేఖలు, ఈ-మెయిల్స్‌ పంపాలని SAR (Scholars At Risk) అనే హక్కుల ఉద్యమ నెట్‌వర్క్‌ ట్విటర్‌లో ప్రజలను కోరింది.

సాయిబాబా ఆరోగ్య సమస్యలేంటి ?

సాయిబాబాకు ఐదేళ్ల వయసులోనే పోలియో సోకింది. రెండు కాళ్లు నడవడానికి వీలు లేకుండా ఉన్నాయి. చిన్నతనం నుంచి ఆయన వీల్‌చైర్‌కే పరిమితమయ్యారు. 2014 నుంచి జైలులో ఉన్న కాలంలో అనేక ఆరోగ్య సమస్యల ఎదుర్కొన్నారు. నరాలు దెబ్బతినడం, పాంఖ్రియాస్‌, హైపర్‌ టెన్షన్‌లాంటి సమస్యలను ఎదుర్కొన్నారు.

తన ఆరోగ్యం రీత్యా బెయిల్‌ ఇవ్వాలని ఆయన గతంలో కూడా కోరారు. అయితే ఆయనపై మోపిన ఆరోపణల దృష్ట్యా వికలాంగుడన్న దయతో బెయిల్ ఇవ్వలేమని ఒక సందర్భంలో గడ్చిరౌలి సెషన్స్‌ కోర్టు వ్యాఖ్యానించింది.

ప్రస్తుతం ఆయన కరోనా సోకుతుందన్న ఆందోళనతోపాటు, మందులు సరిగా అందడం లేదని, తన తల్లి క్యాన్సర్‌తో బాధపడుతున్నందున ఆమెను చూడాలని కోరుకుంటూ బెయిల్‌ పిటిషన్‌ పెట్టుకున్నారు. "నాగ్‌పూర్‌ జైలులో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి'' అని వసంత కుమారి బీబీసీతో అన్నారు. "ఆయన నాకు ఫోన్‌ చేసినప్పుడు అక్కడి పరిస్థితులు చెప్పారు. తనకు కోవిడ్‌ సోకే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జైలు సిబ్బంది ఆయనకు ఏమాత్రం సహాయం చేయడం లేదు. ఆయన తనంత తానుగా అన్ని పనులు చేసుకోలేరు. ఆయన కోసం ఎవరూ రావడం లేదు'' అని వసంత కుమారి ఆవేదన వ్యక్తం చేశారు. "నేను ఇక్కడ చనిపోయినా పట్టించుకునేలా లేరని సాయిబాబా చెప్పారు'' అని వసంత కుమారి బీబీసీతో అన్నారు.

సాయిబాబా

ఫొటో సోర్స్, A S VASANTHA

ఫొటో క్యాప్షన్, సాయిబాబా (పాత ఫొటో)

విరసం వరవరరావుది అదే పరిస్థితి

బీమా-కోరేగావ్‌ కేసులో రెండేళ్లుగా జైలులో ఉంటున్న విరసం నేత వరవరరావు ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించిందని కుటుంబ సభ్యులు ఇటీవల ఆందోళన వ్యక్తం చేశారు. 80ఏళ్లకు పైబడ్డ వృద్ధాప్యంలో ఆయన విచారణను ఏ విధంగా ప్రభావితం చేస్తారని కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. మెదడును దెబ్బతీసే ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని, ఆయనకు బెయిల్ ఇవ్వాలని కుటుంబ సభ్యులు కోరారు. అయితే ఎన్‌ఐఏ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది.

ప్రస్తుతం వరవరరావు ముంబయిలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన్ను కలుసుకోడానికి అనుమతించాలని, ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత ఇవ్వాలంటూ కుటుంబ సభ్యులు వేసిన పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిగింది. అయితే ఆసుపత్రి నిబంధనలు ఒప్పుకుంటే వరవరరావు కుటుంబ సభ్యులు ఆయన్ను కలుసుకోడానికి తనకు అభ్యంతరం లేదని ఎన్‌ఐఏ కోర్టుకు తెలిపింది.

కోర్టు అనుమతించినా, కుటుంబ సభ్యులు ఆయన్ను కలుసుకోవడానికి వీలవుతుందని అప్పుడే చెప్పలేమని వరవరరావు సన్నిహితులు, వీక్షణం పత్రిక ఎడిటర్‌ ఎన్‌.వేణుగోపాల్‌ బీబీసీతో అన్నారు. " 'సబ్జెక్ట్‌ టు' అంటూ కోర్టు ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం చేతిలో పెట్టింది. వాళ్లు అనుమతిస్తారని గ్యారంటీ లేదు'' అన్నారు వేణుగోపాల్‌. "మేం వారిని సంప్రదించే ప్రయత్నం చేస్తున్నాం'' అని ఆయన వెల్లడించారు.

ఇప్పుడు కుటుంబ సభ్యులు వరవరరావును కలుసుకోడానికి వీలయ్యేది, లేనిదీ హాస్పిటల్‌ ప్రొటోకాల్‌ నిర్ణయిస్తుంది. "బెయిల్ ఇవ్వకుండా ఉండేందుకు ప్రభుత్వం, ఎన్‌ఐఏ కుట్ర చేస్తున్నాయి'' అని వేణుగోపాల్ ఆరోపించారు.

వరవరరావు

ఫొటో సోర్స్, FACEBOOK/BHASKER KOORAPATI

ఫొటో క్యాప్షన్, వరవరరావు

హక్కుల కార్యకర్తలకు బెయిల్ తిరస్కరణలు

ఇటీవల వరవరరావు, తాజాగా సాయిబాబా, సుధాభరద్వాజ్‌, షోమాసేన్‌ల బెయిల్‌ పిటిషన్‌లను న్యాయస్థానాలు తిరస్కరించాయి. వీరిలో ఎక్కువమంది ఆరోగ్యం వయసు కారణాలు చూపి బెయిల్‌ పిటిషన్‌లు వేస్తున్నారు. ముఖ్యంగా కోవిడ్‌-19 తీవ్రత నేపథ్యంలో బెయిల్‌ కోరుతున్నారు.

వీరిపై ఉన్న ఆరోపణలు తీవ్రమైనవి కాబట్టి బెయిల్‌ ఇవ్వవద్దని విచారణ సంస్థలు వాదిస్తున్నాయి. "ఆమె జాతి వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు స్పష్టమైన ఆధారాలున్నాయి. అందుకే బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదు'' అని న్యాయవాది సుధా భరద్వాజ్‌ బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా అదనపు సొలిసిటర్‌ జనరల్ అనిల్‌ సింగ్‌ బాంబే హైకోర్టులో వాదించినట్లు ఫస్ట్‌పోస్ట్ మేగజైన్‌ వెల్లడించింది.

బీమా కోరెగావ్‌ కేసులో సుధా భరద్వాజ్‌ విచారణను ఎదుర్కొంటూ 2018 సెప్టెంబర్‌ నుంచి మహారాష్ట్రలోని బైకుల్లా జైలులో ఉంటున్నారు. ఆమె కూడా ఆరోగ్య కారణాలు చూపుతూ బెయిల్‌ పిటిషన్‌ వేశారు.

వరవరరావు ఆరోగ్యంపై పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం కావడమే కాక ప్రభుత్వం, విచారణ సంస్థల తీరుపై విమర్శలు కూడా వినిపించాయి. " 80ఏళ్ల వయసులో వరవరరావు కరోనాను అడ్డంపెట్టుకుని బెయిల్‌ పొందడం ద్వారా లబ్దిపొందుతాడని ఎన్‌ఐఏ కోర్టులో వాదించినట్లు తెలిసి నేను షాకయ్యాను. నోట మాట రాలేదు'' అని రచయిత, హక్కుల కార్యకర్త లలితా రామదాస్‌ వ్యాఖ్యానించినట్లు "ఇండియన్‌ కల్చరల్‌ ఫోరం' ఒక వ్యాసంలో పేర్కొంది. "నా తండ్రిని అంతమొందించడానికి ఎన్‌ఐఏ కరోనా మహమ్మారిని వాడుకుంటోంది'' అని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వరవరరావు కుమార్తె పావన ఆరోపించారు.

వరవరరావు విడుదల కోరుతూ రాసిన లేఖ

ప్రభుత్వ ఉద్దేశం ఏంటి?

"అర్బన్‌ నక్సలైట్ల రూపంలో వీరంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, వారు సమాజంలో ఉంటే అరాచకం ప్రబలడం ఖాయమని ప్రభుత్వం గట్టిగా నమ్ముతోంది" అని న్యాయవాది కె.మధుసూదన్‌రావు బీబీసీతో అన్నారు. "కేసు తీవ్రంగా ఉండి, నిందితులపై ఆధారాలు గట్టిగా ఉన్నాయని భావించినప్పుడు కోర్టులు వయసును పరిగణనలోకి తీసుకోవు" ఆయన వివరించారు. "గట్టి ఆధారాలు ఉండబట్టే కోర్టులు వీరికి బెయిల్‌ నిరాకరిస్తున్నాయని విచారణ సంస్థలు, ప్రభుత్వం చెబుతున్నాయి'' అని మధుసూదనరావు వ్యాఖ్యానించారు.

వరవరరావు, సాయిబాబా, సుధాభరద్వాజలాంటి హక్కుల నేతలను విడుదల చేయాలన్న డిమాండ్లు వినిపిస్తుండగానే ఎల్గార్‌ పరిషద్‌ కేసులో దిల్లీ యూనివర్సిటీకి చెందిన మరో ప్రొఫెసర్‌ హానీ బాబును ఎన్‌ఐఏ మంగళవారం అరెస్టు చేసింది. ఈ కేసులో అరెస్టయిన వారిలో ఆయన 12వ వ్యక్తి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)