అయోధ్యలోని ఈ మూడు కట్టడాలు కూడా బాబ్రీ మసీదులేనా...

- రచయిత, నితిన్ శ్రీవాస్తవ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఉత్తరప్రదేశ్ అయోధ్యలో వివాదాస్పద బాబ్రీ మసీదు నిర్మాణం ఉండేది. దీనిని 1528లో నిర్మించారు.
హిందూ సంస్థలు దీనిని శ్రీరాముడి జన్మస్థలంలో కట్టిన ఆలయాన్ని కూల్చివేసి దానిని నిర్మించారని చెబుతున్నాయి.
అటు, మసీదు రికార్డుల ప్రకారం దానిని మొఘల్ పాలకుడు బాబర్, సేనాధిపతి మీర్ బాకీ నిర్మించినట్టు తెలుస్తోంది.
అయితే, బాబ్రీ మసీదును 1992లో కూల్చేశారు. కానీ, అదే ప్రాంతంలో అలాంటివే మరో మూడు మసీదులు ఉన్నాయి. వాటిని కూడా బాబర్ కాలంలోనే నిర్మించినట్టు చెబుతున్నారు.
అయోధ్యలో వివాదాస్పద స్థలానికి కొంత దూరంలో ‘మసీదు బేగమ్ బాలరస్’ ఉంటే, రెండో మసీదు ‘బేగమ్ బలరాస్‌పూర్’ ఫైజాబాద్ జిల్లాలోని దర్శన్ నగర్ ప్రాంతంలో ఇప్పటికీ ఉంది. ఇక బాబర్ కాలంలోనే నిర్మించారని చెబుతున్న మూడో మసీదు పేరు ‘మసీదు ముంతాజ్ షా’. ఇది లక్నో నుంచి ఫైజాబాద్ వెళ్లే దారిలో ముంతాజ్ నగర్‌లో ఉంది.
నేను స్వయంగా బాబ్రీ మసీదును చాలాసార్లు చూశాను అందుకే ఆకారంలో ఈ మూడూ దానికంటే చాలా చిన్నవని చెప్పగలను. కానీ దానికీ, విటికీ చాలా పోలిక ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది.
ఉదాహరణకు ఈ మూడు మసీదులకు కూడా మీనార్‌లు లేవు. బాబ్రీ మసీదులాగే వీటికి కూడా ఒక పెద్ద గుంబజ్, రెండు చిన్న గుంబజ్‌లు ఉన్నాయి.

మసీదులన్నిటికీ పోలిక
ఈ మూడే కాదు, ఈ ప్రాంతంలో గమనిస్తే అదే కాలానికి చెందిన చాలా మసీదులు కనిపిస్తాయి. అవి ఒకదానికొకటి చాలావరకూ పోలి ఉంటాయి అని లఖ్‌నవూకు చెందిన చరిత్రకారుడు రోహన్ తకీ చెప్పారు.
“ఈ మసీదుల నిర్మాణంలో రెండు ప్రత్యేకతలు కనిపిస్తాయి. మీనార్లు లేకపోవడం, మూడు గుంబజ్‌లు ఉండడం. ఈ మసీదులు అవధ్ నవాబుల తరం మొదలవడానికి దాదాపు 200 ఏళ్ల ముందువి. ఇక్కడ గమించాల్సిన విషయం ఏంటంటే, మనకు ఈ ప్రాంతంలో 16వ శతాబ్దం నాటి మసీదులే ఎక్కువగా కనిపిస్తాయి. వాటి గుంబజ్‌ల సంఖ్య ఒకటి లేదా మూడు నుంచి కనీసం ఐదు వరకూ ఉంటాయి. రెండు గుంబజ్‌ల మసీదులు ఇక్కడ ఎక్కడా కనిపించవు. ఎందుకంటే వీటిని దిల్లీ సల్తనత్ శైలిలో నిర్మించారు
మధ్యయుగ చరిత్రకారుడు, జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ హరభంస్ ముఖియా మొఘల్ పాలకుడు బాబర్ తన బాబర్ నామాలో రెండు సార్లు అయోధ్య ప్రాంతంలో ఉన్నానని చెప్పారని తెలిపారు.
బీబీసీతో మాట్లాడిన ఆయన “బాబర్ రెండు రోజులు ఈ ప్రాంతానికి చుట్టుపక్కలే ఉన్నారు. బహుశా అవధ్ రాచరిక సమస్యలు పరిష్కరించడానికి వచ్చుంటారు. పుస్తకంలో వివరాల ప్రకారం ఆయన వేటకు కూడా వెళ్లారు. అయితే అందులో ఏ మసీదు ప్రస్తావనా లేదు. కానీ, బాబర్ కాలంలో మసీదుల నిర్మాణం చాలావరకూ ఒకేలా ఉండేది” అన్నారు.

కట్టిన విధానం కూడా ఒకటే
ఆశ్చర్యం ఏంటంటే, ఇప్పుడు కూల్చివేసిన బాబ్రీ మసీదు కూడా జౌన్‌పూర్ సల్తనత్ నిర్మాణ శైలిని పోలే ఉంది. జౌన్‌పూర్‌లో ఇప్పటికీ ఉన్న అటాలా మసీదును పడమటి నుంచి చూస్తే అది అచ్చం బాబ్రీ మసీదులాగే కనిపిస్తుంది.
ఇక్కడ ఉన్న మూడు మసీదుల్లో రెండింటి పరిస్థితి దారుణంగా ఉంది. ముంతాజ్ నగర్‌లో ఉన్న మసీదు మాత్రం కాస్త రంగులు వేసి కనిపిస్తుంది.
ఈ చుట్టుపక్కల ఉండే హిందు లేదా ముస్లిం కుటుంబాలు కూడా ఈ మసీదులు బాబ్రీ మసీదు కాలం నాటివే అనుకుంటున్నారు.
తాము మూడు తరాల నుంచీ అక్కడే ఉంటున్నామని ‘మసీదు ముంతాజ్ షా’ దగ్గరే నివసిస్తున్న బీరేంద్ర కుమార్ చెప్పారు.
“నేను చాలా చిన్నవాడుగా ఉన్నప్పుడు, అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చేశారు. కానీ అప్పుడు మా నాన్న బతికున్నారు. తర్వాత ఆయన బాబ్రీ మసీదు, మన పక్కనున్న మసీదు అచ్చం ఒకేలా ఉంటాయని నాతో చాలాసార్లు చెప్పారు. ఒక మట్టి దిబ్బ మీద వాటిని కట్టిన విధానం కూడా ఒకేలా ఉంది” అన్నారు.

హడావిడిగా కట్టించారు
ప్రముఖ చరిత్రకారుడు సతీష్ చంద్ర తన ‘మెడీవల్ ఇండియా: ఫ్రం సల్తనత్ టు ద ముఘల్స్’ పుస్తకంలో కూడా అదే విషయం ప్రస్తావించారు
“మొదటి మొఘల్ పాలకులు, వారి సుబేదార్లు ఉపయోగించిన వాస్తుకళ ఒకేలా కనిపించేది. దీని ప్రారంభం బాబర్ కాలం నుంచే జరిగింది. మసీదుల నుంచి మొఘల్ సరాయ్ వరకూ అన్నీ ఒకదానికొకటి సరిపోలాయి” అని చెప్పారు.
అయితే, అయోధ్య-ఫైజాబాద్ చుట్టుపక్కల ఉన్న ఈ మూడు చిన్న మసీదులను ఎవరు ఎప్పుడు కట్టించారు అనడానికి ఎలాంటి రికార్డులూ లభించడం లేదు.
కానీ, వీటిని కట్టడానికి ఉపయోగించిన రాళ్లు, సున్నం లేదా బిల్డింగ్ మెటీరియల్ ఆధారంగా వాటిని కచ్చితంగా ఎప్పుడు కట్టారో సమయం తెలుసుకోవచ్చని కానీ రోహన్ తకీ అంటున్నారు.
“బాబర్ సేనాధిపతి మీర్ బాకీ ఈ మసీదులను చాలా హడవుడిగా కట్టించి ఉంటాడు. ఎందుకంటే సైన్యం ఎక్కడైనా బసచేస్తే, వేలాది మంది కొన్ని రోజులు అక్కడ ఆగేవారు. అప్పుడు వారికి ప్రార్థనలకు స్థలం అవసరమయ్యేది. దాంతో త్వరత్వరగా మసీదులు నిర్మించేవారు. మీకు ఫైజాబాద్ నుంచి జౌన్‌పూర్ మధ్యలో ఆ కాలానికి చెందిన అలాంటి మసీదులు ఎన్నో కనిపిస్తాయి. వాటి లోపలికి వెళ్లడానికి ఒక చిన్న తలుపు ఉండేది. వెనుక భాగంలో ఎలాంటి దారీ ఉండేది కాదు” అన్నారు.
ఇవి కూడా చదవండి:
- అయోధ్యలో రామమందిరం కింద టైమ్ కాప్స్యూల్?.. అందులో దాగిన రహస్యమేంటి
- పీవీ నరసింహారావు సోనియా గాంధీకి ఇప్పుడెందుకు గుర్తుకొచ్చారు?
- పౌడర్ రాసుకుంటే క్యాన్సర్ వస్తుందా?
- రొమ్ము క్యాన్సర్: ఈ అసాధారణ లక్షణాలు తెలుసుకోండి
- సొనాలీ బింద్రేకు క్యాన్సర్ ఎలా వచ్చింది
- బరువు పెరిగితే.. క్యాన్సర్ ముప్పు
- క్యాన్సర్ చికిత్సకు వంటింటి చిట్కాలు మేలు చేస్తాయా? హాని చేస్తాయా?
- మీరు ఏ లక్ష్యాన్ని అయినా సాధించేందుకు కావల్సిన ‘మైండ్ సెట్’ ఇదీ..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








