పీవీ న‌ర‌సింహారావుపై సోనియాకు ఇప్పుడెందుకు అభిమానం కలిగింది.. టీఆర్ఎస్, బీజేపీలు ఆయన పేరును వాడుకుంటున్నాయనేనా

పీవీ నరసింహారావు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పీవీ నరసింహారావు
    • రచయిత, అనిల్ జైన్
    • హోదా, బీబీసీ న్యూస్‌ కోసం

మాజీ ప్ర‌ధాన మంత్రి పీవీ న‌ర‌సింహారావు మ‌ర‌ణించి దాదాపు 15 ఏళ్లు గ‌డిచాయి. అయితే ఇప్పుడు ఆయ‌న్ను కాంగ్రెస్ స్మ‌రించుకుంటోంది.

పీవీ శత జ‌యంత్యుత్స‌వాల నేప‌థ్యంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆయ‌న్ను కొనియాడారు. కాంగ్రెస్‌లో ఆయ‌న నిబద్ధ‌త‌తో ప‌నిచేశార‌ని ప్ర‌శంసించారు. ఆయ‌న నాయ‌క‌త్వంపైనా ప్ర‌శంస‌లు కురిపించారు.

ప్ర‌ధానిగా పీవీ సాధించిన విజ‌యాల‌పై ఇద్ద‌రు గాంధీలు వేర్వేరుగా ట్వీట్లు చేశారు. "పీవీ దార్శ‌నిక‌త‌తో దేశం కొత్త యుగంలోకి అడుగుపెట్టింది. ఆర్థిక వ్య‌వ‌హారాల‌కు సంబంధించి ఆయ‌న ధైర్యంగా నిర్ణ‌యాలు తీసుకున్నారు. అవి ఆధునిక భార‌త్ రూప‌క‌ల్ప‌న‌లో ఎంతో ఉప‌యోగ‌ప‌డ్డాయి"అని వారు కొనియాడారు.

ప్ర‌ధాని ప‌ద‌వితోపాటు కాంగ్రెస్ అధ్య‌క్షుడిగానూ పీవీ ప‌నిచేశారు. అయితే ఎప్పుడూ కాంగ్రెస్ అధినాయ‌కత్వం పీవీ సేవ‌ల‌ను కొనియాడ‌లేదు.‌

ప్ర‌ధాని ప‌ద‌వి నుంచి దిగిపోయిన త‌ర్వాత ఆయ‌న్ను ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. ఆయ‌న మ‌ర‌ణించి 15 ఏళ్లు గ‌డిచిన త‌ర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ఆయ‌న్ను ఎందుకు ప్ర‌శంసిస్తోంది?

కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో ఉంటే.. పీవీ, అలాంటి ఇత‌ర నాయ‌కుల‌ను సోనియా గాంధీ అస‌లు ప‌ట్టించుకొని ఉండ‌ర‌నే సంగతి తెలిసిందే.

సోనియా, రాహుల్

ఫొటో సోర్స్, EPA

ప్రేమ అలా పుట్టింది

పీవీ శ‌త జ‌యంత్యుత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకొని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌ల్లోని ప్రాంతీయ పార్టీలతోపాటు బీజేపీ కూడా పీవీ కార్డుతో రాజ‌కీయ ల‌బ్ధి పొందేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ కూడా త‌మ తీరు మార్చుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది.

గతంలో ఏ కాంగ్రెస్ నాయ‌కుడి జ‌యంతి లేదా వ‌ర్ధంతి స‌మ‌యాల్లో ట్వీట్లుచేసే ఆన‌వాయితీ కాంగ్రెస్‌లో లేదు.

దీన్ని అవ‌కాశ‌వాద రాజకీయాల‌కు ఉదాహ‌ర‌ణ‌గా చెప్పుకోవ‌చ్చు. గుర్తింపు కోసం చేసే రాజ‌కీయాలుగానూ అభివ‌ర్ణించొచ్చు.

పీవీ మ‌ర‌ణించిన త‌ర్వాత ఆయ‌న్ను పూర్తిగా ప‌క్క‌న‌పెట్టేశారు. అవ‌కాశ‌వాద రాజ‌కీయాల కార‌ణంగానే మ‌ళ్లీ ఇప్పుడు ఆయ‌న పేరు తెర‌మీద‌కు తెస్తున్నారు. ఆయ‌న పేరుతో రాజ‌కీయంగా ల‌బ్ధి పొందాల‌ని చూస్తున్నారు.

పీవీ శ‌త జ‌యంతిని పుర‌స్క‌రించుకొని ఏడాది మొత్తం ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు. అంతేకాదు ప‌త్రిక‌ల్లో ఆయ‌న ఫుల్‌పేజీ ప్ర‌క‌ట‌న‌లూ ఇచ్చారు. "తెలంగాణ ముద్దు బిడ్డ‌", "భార‌త్‌కు గ‌ర్వ కార‌ణం" లాంటి ప‌దాలు ప్ర‌క‌ట‌న‌లో క‌నిపించాయి.

కేసీఆర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కేసీఆర్

1977లో జాతీయ రాజ‌కీయాల్లోకి అరంగేట్రం చేయ‌క‌ముందు.. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగానూ పీవీ ప‌నిచేశారు.

పీవీ జ‌న్మ స్థ‌లం తెలంగాణ‌. ఆయ‌న బ్రాహ్మ‌ణుడు. ఆయ‌న్ను ప్ర‌శంసించ‌డం ద్వారా ఇటు తెలంగాణ సెంటిమెంట్‌తోపాటు బ్రాహ్మ‌ణుల‌నూ కేసీఆర్ బుజ్జ‌గించాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది.

తెలుగు దేశం పార్టీ (టీడీపీ) లోనూ ఇవే ల‌క్ష్యాలు క‌నిపిస్తున్నాయి. అందుకే పీవీకి భార‌త ర‌త్న ఇవ్వాల‌ని పార్టీ డిమాండ్ చేస్తోంది.

ఆంధ్ర‌‌, తెలంగాణ‌ల్లో పాగా వేయాల‌ని భాజ‌పా భావిస్తోంది. అందుకే ప్ర‌ధాన మంత్రి మోదీ, హోం మంత్రి అమిత్ షా ఇక్క‌డ ప‌ర్య‌టించేట‌ప్పుడు త‌ప్ప‌కుండా వారు పీవీని స్మ‌రించుకుంటారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అటు లోక్‌స‌భ‌, ఇటు శాస‌న స‌భ రెండు ఎన్నిక‌ల్లోనూ కాంగ్రెస్ ఘోర ప‌రాజ‌యం పాలైంది. ఎన్నిక‌లకు పీవీతో ఎలాంటి సంబంధ‌మూ లేదు. అయితే ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఎలాంటి అవ‌కాశాన్ని కాంగ్రెస్ విడిచిపెట్టాల‌ని అనుకోవ‌ట్లేదు.

విప‌క్షాలు పీవీపై ప్రేమ కురిపిస్తుండ‌టంతో కాంగ్రెస్ ‌కూడా త‌మ తీరు మార్చుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. ఆ దిశ‌గా ఇప్ప‌టికే చ‌ర్య‌లూ మొద‌లుపెట్టింది.

పీవీ శ‌త జ‌యంతిని పుర‌స్క‌రించుకుని ఈ ఏడాది మొత్తం ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ నిర్ణ‌యించింది. పీవీ సందేశాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌డ‌మే దీని ల‌క్ష్యం.

దీని ద్వారా ప్ర‌ధానిగా పీవీ సాధించిన విజ‌యాలు కాంగ్రెస్‌కే చెందుతాయ‌ని పార్టీ చెప్పే ప్ర‌య‌త్నం చేస్తోంది.

సోనియా, రాహుల్

ఫొటో సోర్స్, Getty Images

అయిన‌ప్ప‌టికీ కాంగ్రెస్‌కు గ‌ట్టి పోటీ ఎదుర‌వుతోంది. పీవీ జ‌యంత్యుత్స‌వాలు నిర్వ‌హించాల‌ని తెలంగాణ ప్ర‌దేశ్ క‌మిటీకి మాత్ర‌మే కాంగ్రెస్ సూచించింది. అయితే ప్ర‌ధాన మంత్రిగా పీవీ ఇత‌ర రాష్ట్రాల‌కూ సుప‌రిచితుడే.

పీవీ మాతృభాష తెలుగు. హిందీ, ఇంగ్లిష్‌ల‌ను ఆయ‌న బాగా మాట్లాడ‌గ‌ల‌రు. మ‌రోవైపు త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, మ‌రాఠీ, ఒడియా, బంగ్లా, ఉర్దూ, సంస్కృతం భాష‌లు ఆయ‌న‌కు తెలుసు. సొంత రాష్ట్రంతోపాటు మ‌హారాష్ట్ర‌, ఒడిశాల నుంచి కూడా ఆయ‌న లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు.

మూడు రాష్ట్రాల నుంచి ఎన్నికైన కాంగ్రెస్ నాయ‌కుల్లో ఇందిరా గాంధీ త‌ర్వాతి స్థానం పీవీదే. దేశ వ్యాప్తంగా ఆయ‌న జ‌యంతి ఉత్స‌వాల‌ను కాంగ్రెస్ నిర్వ‌హించుంటే కొంచెమైనా రాజ‌కీయ ప్ర‌యోజ‌నం ఉండేది.

అయితే, 135ఏళ్ల కాంగ్రెస్ చ‌రిత్ర‌లో ఎంతో మంది ప్ర‌ముఖులు ఉన్న‌ప్పటికీ.. నెహ్రూ-గాంధీ కుటుంబాల చుట్టూనే అంతా తిరుగుతుంది. వారినే ఎప్పుడూ స్మ‌రించుకుంటారు.

అందుకే కాంగ్రెస్‌ను ప్ర‌తిప‌క్షాలు కుటుంబ పార్టీగా అభివ‌ర్ణిస్తుంటాయి. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న చాలా మంది కాంగ్రెస్ ప్ర‌ముఖులు సైద్ధాంతికంగా తమ నాయకులేనని బీజేపీ చెప్పుకోవ‌డానికి ఇది ఉప‌యోగ‌ప‌డుతోంది.

మోదీ

ఫొటో సోర్స్, PIB

కాంగ్రెస్‌, బీజేపీల మ‌ధ్య తేడా..

స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్‌, సుభాష్ చంద్ర బోస్‌ల‌ను త‌మ నాయ‌కులుగా బీజేపీ చెప్పుకోవ‌డానికి ఇదే కార‌ణం.

మ‌రోవైపు ప్ర‌ధాన మంత్రి ఏ రాష్ట్రంలో ప‌ర్య‌టించినా పెద్ద పెద్ద కాంగ్రెస్ నాయ‌కుల పేర్ల‌ను స్మ‌రించుకుంటారు. ఉదాహ‌ర‌ణ‌కు అసోంలో గోపీనాథ్‌, ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌లో చ‌ర‌ణ్ సింగ్‌, హ‌రియాణాలో దేవీ లాల్‌.. ఇలా పేర్లు చెబుతూ వారి సిద్ధాంతాలు త‌మ పార్టీకి ద‌గ్గ‌ర్లో ఉంటాయ‌ని చెబుతుంటారు.

బీజేపీ ఇలా చెప్పుకొంటున్న‌ప్పుడు త‌మ ప్ర‌ముఖ నాయ‌కుల‌ను గుర్తు చేసుకోవ‌డానికి కాంగ్రెస్‌కు ఎందుకు స‌మ‌స్య వ‌స్తోంద‌నే ప్ర‌శ్న‌లు పుట్టుకొస్తున్నాయి.

సర్దార్ ప‌టేల్‌, చంద్ర‌బోస్ మాత్ర‌మే కాదు.. స్వాతంత్ర్యం కోసం త‌మ జీవితాల‌ను ప‌ణంగా పెట్టిన కాంగ్రెస్ నాయ‌కులు చాలా మందే ఉన్నారు. అయితే నేడు వారి పేర్లు కాంగ్రెస్ నాయ‌కుల నోట అంత‌గా విన‌ప‌డ‌వు.

నెహ్రూ, ఇందిర‌, రాజీవ్ గాంధీల జ‌యంతి, వ‌ర్ధంతిల‌ను నిర్వ‌హిస్తున్న‌ట్లు తొలి రాష్ట్ర‌ప‌తి రాజేంద్ర ప్ర‌సాద్‌, తొలి విద్యా మంత్రి మౌలానా ఆజాద్‌ల‌ను ఆల్ ఇండియా కాంగ్రెస్ క‌మిటీ నిర్వ‌హించిన‌ట్లు దాఖ‌లాలు లేవు.

లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి జ‌యంతి లేదా వ‌ర్ధంతి నాడు రాహుల్ లేదా సోనియా ఆయ‌న స్మార‌కాన్ని సంద‌ర్శించిన‌ట్లు ఎప్పుడూ వార్త‌లు చూడ‌లేదు.

జాతీయ స్థాయిలోనే కాదు.. ప్రాంతీయ స్థాయిలోనూ కాంగ్రెస్ హీరోలు క‌న‌ప‌డ‌రు. కాంగ్రెస్ త‌మ రాష్ట్రాల్లో బ‌లంగా వేళ్లూనుకోవ‌డానికి వారు ఎంత క‌ష్ట‌ప‌డిన‌ప్ప‌టికీ వారి పేర్లు వార్త‌ల్లో క‌నిపించ‌వు.

లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి
ఫొటో క్యాప్షన్, లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి

స్వాతంత్ర్య ఉద్య‌మ కాలం నాటి ప‌రిస్థితులే నేడు దేశంలో ఉన్నాయ‌ని రాహుల్ గాంధీ చాలాసార్లు చెబుతున్నారు. మ‌నం ఏ విలువ‌ల కోసం ఆనాడు ఉద్య‌మం చేప‌ట్టామో.. నేడు అవి ప్ర‌మాదంలో ప‌డ్డాయ‌ని వివ‌రిస్తున్నారు.

అయితే, నేటి కాలం స‌వాళ్ల‌ను రాహుల్ గాంధీ గుర్తించ‌గ‌లుగుతున్నారా? ఒక‌వేళ గుర్తిస్తే వాటిని ఎలా ఎదుర్కోబోతున్నారు?

కాంగ్రెస్ చ‌రిత్ర‌లోనే అత్యంత దారుణ‌మైన స్థితి నేడు ఎదుర్కొంటోంద‌నేది స‌త్యం. సైద్ధాంతికంగా, నాయ‌క‌త్వ ప‌రంగా నేడు కాంగ్రెస్ సంక్షోభంలో ఉంది.

ఏది ఏమైన‌ప్ప‌టికీ బీజేపీకి ప్ర‌తిప‌క్షం అన‌గానే కాంగ్రెస్ పేరే గుర్తుకు వ‌స్తుంది. ఎందుకంటే ఇది జాతీయ పార్టీ. ప్ర‌తి గ్రామంలోనూ పార్టీకి కార్య‌క‌ర్త‌లున్నారు.

స్వాతంత్ర్య ఉద్య‌మ కాలం నాటి ప‌రిస్థితులే నేడు దేశంలో ఉన్నాయ‌ని రాహుల్ నిజంగా న‌మ్మితే.. ఆనాడు కాంగ్రెస్ జెండా ప‌ట్టుకొని పోరాడిన నాయ‌కుల‌ను స్మ‌రించుకోవాలి. వారి విలువ‌ల‌ను నేడు పార్టీతో అనుసంధానించాలి.

సైద్ధాంతిక విభేదాల‌తో కాంగ్రెస్‌ను వీడిన సోష‌లిస్టు, వామ‌ప‌క్ష హీరోల‌పై పార్టీకున్న దృక్ప‌థాన్ని మార్చుకోవాలి.

పీవీ విష‌యంలో త‌మ వైఖ‌రి కొంత మార్చుకున్నట్టే.. మిగ‌తా నాయ‌కుల విష‌యంలోనూ కాంగ్రెస్ మారుతుందా? అనేదే నేడు అస‌లైన ప్ర‌శ్న‌.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)