జాత్యహంకారంతో రెచ్చిపోయేవారు ఎదురుపడితే ఏం చేస్తారు

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, పబ్లో ఉచోవా
- హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్
యాంటీ-రేసిస్ట్, నాన్-రేసిస్ట్ లాంటి పదాలను వినే ఉంటారు. ఈ రెండింటికీ ఎంత తేడా ఉందో తెలుసా?
ఉదాహరణకు జాత్యహంకార వ్యాఖ్యలతో రేసిస్ట్‌లా ప్రవర్తించేవారు మీకు ఎదురుపడ్డారు అనుకోండి.. మీరు రేసిస్ట్ కాకపోతే.. అతడు చెప్పినదానికి తల ఆడించరు. అయితే అతడికి ఎదురు ప్రశ్నిస్తారా?
పక్కన నిలబడి అంతా ప్రశాంతంగా వినేవారిని నాన్-రేసిస్ట్ అంటారని న్యూయార్క్ టైమ్స్‌లో పనిచేసే ప్రముఖ రచయిత, సైకాలజిస్ట్ జాన్ అమేచి వివరించారు.
వారు ఏమీ చెప్పరు.. ఏమీ చేయరు.. విషయాన్ని పెద్దగా పట్టించుకోనట్లు ఉండిపోతారు.
కానీ యాంటీ రేసిస్ట్‌లు మాట్లాడతారని బీబీసీతో డాక్టర్ అమేచి చెప్పారు. ఎందుకంటే తాము ఎలాంటి మార్పు తీసుకురాలేనప్పటికీ.. తమ వైఖరి ఎంటో ప్రపంచానికి వారు తెలియజేసేందుకు దొరికే ఏ అవకాశాన్ని వారు వదిలిపెట్టరని వివరించారు.
నాన్-రేసిస్ట్, యాంటీ-రేసిస్ట్‌ల మధ్య భేదం మూలాలు దశాబ్దాల క్రితమే కనిపిస్తాయి. అయితే బ్ల్యాక్ లైవ్స్ మ్యాటర్ నిరసనలతో మళ్లీ అందరి దృష్టీ దీనిపై పడింది. ఆఫ్రికన్ అమెరికన్లపై పోలీసుల అరాచకాలకు కళ్లెం వేయాలని మొదలైన ఈ ఉద్యమం ప్రపంచం మొత్తానికీ పాకింది.
అసలు రేసిజం అంటే ఏమిటో మొదట తెలుసుకోవాలి.

ఫొటో సోర్స్, Reuters
రేసిజం అంటే ఏమిటి?
జాతుల ఆధారంగా వివక్ష, ద్వేషం చూపడం కంటే రేసిజం భిన్నమైనదని డిస్మాంటలింగ్ రేసిజం వర్క్స్ సంస్థ చెబుతోంది. అమెరికాలోని రేసిజానికి వ్యతిరేకంగా జరిగే సామాజిక ఉద్యమాల్లో సంస్థ క్రియాశీలంగా పాలుపంచుకుంటోంది.
రేసిజానికి సాంస్కృతిక, సంస్థాగతం, వ్యక్తిగతం అనే మూడు కోణాలుంటాయని సంస్థ చెబుతోంది.
మన వ్యక్తిగత చర్యలు వివక్ష పూరితంగా ఉన్నాయా లేదా అనే అంశాల ఆధారంగా రేసిస్టులను గుర్తించలేమని వివరిస్తోంది.
ఉదాహరణకు తెల్లజాతి ప్రజల విలువలు, నమ్మకాలు మాత్రమే మంచివని, మిగతావారివి కాదని భావించడాన్ని కల్చరల్ రేసిజం అని అంటారని సంస్థ చెబుతోంది.
సంస్థలు ఇలాంటి వివక్షకు పాల్పడితే దాన్ని సంస్థాగత లేదా ఇన్‌స్టిట్యూషనల్ రేసిజంగా పిలుస్తారని పేర్కొంది.
యాంటీ-రేసిజం అంటే?
''రేసిస్ట్ సమాజంలో మనం నాన్-రేసిస్ట్‌గా ఉంటే సరిపోదు.. యాంటీ రేసిస్టులుగా మారాలి'' అని స్వలింగ సంపర్కుల హక్కుల ఉద్యమకర్త, నల్లజాతి మహిళ అయిన ఏంజెలా డేవిస్ చెబుతుంటారు.
''యాంటీ రేసిస్ట్‌గా ఉండటమంటే సమాజంలో తమ హక్కులపై అవగాహనతో క్రియాశీలంగా ఉండటం. అంటే ప్రభుత్వ విధానాలు, చట్టాలు, ఆర్థిక వ్యవస్థ, రేసిస్టుల్లో మార్పుల కోసం కృషి చేయడం'' అని అమెరికన్ యూనివర్సిటీలోని యాంటీ రేసిస్ట్ రీసెర్చ్ అండ్ పాలసీ సెంటర్ తాత్కాలిక ఫ్యాకల్టీ డైరెక్టర్ మాలినీ రంగనాథన్ వివరించారు.
రేసిస్ట్ సొసైటీలను కదిలే ఎస్కలేటర్లతో డాక్టర్ బెవర్లీ టేటమ్ పోల్చారు. ఈ సొసైటీల్లో కొన్ని నిర్దేశిత కట్టుబాట్లు ప్రవర్తనా శైలిలు, సాంస్కృతిక భేదాలు ఉంటాయని ఆమె చెప్పారు. రేసిజం సైకాలజీపై ఆమె పరిశోధన చేస్తున్నారు.
''మీకు సంబంధం లేకుండా మీరు ఎస్కలేటర్‌పై నిలబడితే ముందుకు వెళ్లిపోతుంటారు. సమాజంలో నిబంధనల విషయంలోనూ అంతే..'' అని బీబీసీతో బెవర్లీ చెప్పారు.
''కొందరు.. వ్యవస్థ రేసిస్ట్‌గా ఉందని గుర్తించి.. ఎస్కలేటర్ ఎక్కకుండా పక్క నుంచి వెళ్లిపోతారు. వీరినే నాన్-రేసిస్ట్ అంటారు. అంటే వీరికి వివక్షపై అవగాహన ఉంటుంది. కానీ వీరు దానిలో పాలుపంచుకోరు.''
''వీరు పెద్దగా వివక్షపై శ్రద్ధ పెట్టరు. కానీ తెలియకుండానే వీరు సమాజంతో ముందుకు వెళ్తారు. వీరు పక్క నుంచి నడుచుకుంటూ వెళ్లినా అదే దారిలో వెళ్తారు.''

ఫొటో సోర్స్, Getty Images
''ఈ వ్యవస్థలో మార్పు తెచ్చేందుకు క్రియాశీలంగా ప్రయత్నిస్తూ కొందరు వ్యతిరేక దిశలో వెళ్తుంటారు. వీరినే యాంటీ రేసిస్ట్ అంటారు. వీరు ప్రశాంతంగా కూర్చోరు. క్రియాశీలంగా పనిచేస్తుంటారు.''
''యాంటీ రేసిస్ట్ అవ్వాలంటే ముందు వివక్షకు వ్యతిరేకంగా గొంతు విప్పాలి.''
''అంటే రేసిజం ఎదురు పడినప్పుడు వారు మౌనంగా ఉండిపోరు. ఇది యాంటీ రేసిస్టుల ప్రధాన లక్షణం''
''మీరు ఎక్కడికి వెళ్లినా..మీరు యాంటీ రేసిస్ట్ అని అందరికీ తెలిసేలా చేయాలి. అప్పుడు జాతి వివక్షపై పోరాటంలో మీరూ యోధుడిగా మారతారు'' అని అమేచీ అన్నారు.
''మన అందరిపైనా ఆ ప్రభావం ఉంటుంది. ఇప్పుడు దాన్నుంచి బయటపడటానికి ప్రయత్నించాలి'' అని అంటారు టేటమ్.
''బంధువులు, స్నేహితులు ఎవరైనా రేసిస్ట్‌లా మాట్లాడినా.. రేసిస్ట్ జోకులు వేసినా వెంటనే మాట్లాడండి''
''మీరు టీచర్ అయితే.. విద్యార్థులకు రేసిజంపై స్పష్టమైన అవగాహన కల్పించండి''
''మీరు తల్లిదండ్రులు అయితే.. పిల్లలతో దీని గురించి మాట్లాడండి. మూడు, నాలుగేళ్ల వయసు నుంచే పిల్లలకు ఈ విషయాలు అర్థమవుతాయి.''

ఫొటో సోర్స్, Getty Images
''మీరు మత పెద్ద అయితే.. రేసిజం దుష్ప్రభావాల గురించి అందరికీ తెలియజేయండి.''
''మీరు రియల్ ఎస్టేట్ ఏజెంటైతే.. మీ దగ్గరకు వచ్చేవారిని రేసిస్ట్ సమాజంలోకి వెళ్లకుండా చూడండి''
విద్యా బోధనలో దీని గురించి ప్రస్తావన లేకపోతే వివక్షను అడ్డుకోవడం కష్టమని డాక్టర్ టేడమ్ వివరించారు.
యాంటీ-రేసిస్ట్ పుస్తకాలు, ఆన్‌లైన్ ప్రతులను ఇటీవల సామాజిక ఉద్యమకారులు, నిపుణులు సోషల్ మీడియాలో షేర్ చేయడం మొదలుపెట్టారు.
రేసిజంపై చాలా మంచి పుస్తకాలున్నాయి. అయితే వీటికి ప్రజాదరణ కొంచెం తక్కువే. చరిత్రకారుడు ఇబ్రం కెండీ రాసిన హౌ టు బీ యన్ యాంటీరేసిస్ట్, సామాజిక విద్యావేత్త రాబిన్ డీ ఆంజెలో రాసిన వైట్ ఫ్రజిలిటి వాటిలో ఉన్నాయి.
టేటమ్ 1997లో రాసిన వై ఆర్ ఆల్ ద బ్ల్యాక్ కిడ్స్ సిట్టింగ్ టుగెదర్ ఇన్ కేఫెటేరియా? పుస్తకం కూడా వాటిలో ఒకటి.
"సమాజంలో ఏం జరుగుతుందో ఇవి మీకు చెబుతాయి. దీని వల్ల అసలు ఏమవుతుంతో తెలుస్తుంది" అని ఆమె వివరించారు.
"చాలా మంది ఇప్పటికీ కొంచెం సంశయంలోనే ఉంటారు. కానీ తెల్లజాతి ప్రజలు మాత్రం ఎప్పటికీ తమకు జార్జ్ ఫ్లాయిడ్‌కు జరిగినట్లు జరగదనే నమ్మకంతో ఉంటారు."

ఫొటో సోర్స్, Getty Images
"బాధితులు చెప్పేది వినండి"
తమ హక్కుల గురించి స్పష్టమైన అవగాహన ఉండేవారు.. రేసిజం బాధితుల గోడు కూడా జాగ్రత్తగా వినాలని హిలరీ మూర్ సూచిస్తున్నారు. ఆమె రేసిజంపై చాలా పుస్తకాలు రాశారు. నల్లజాతి హక్కుల కోసం పోరాడే షోయింగ్ అప్ ఫర్ రేషియల్ జస్టిస్ (ఎస్‌యూఆర్‌జే) బృందంలో ఆమె కూడా ఉన్నారు.
"ఒక్క నిమిషం మీ భయాలన్నీ పక్కన పెట్టండి. బాధితులు చెప్పేది వినండి. వారు ఎలాంటి సమాజాన్ని కోరుకుంటున్నారో ఆలకించండి" అని బీబీసీతో మూర్ చెప్పారు.
"వారు మంచి విద్యా, ఇల్లు, ఆరోగ్య సంరక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు."
"యాంటీ రేసిజం కోసం పోరాడుతున్న తెల్లజాతీయులను ఎస్‌యూఆర్‌జే ఒక వేదికపైకి తీసుకొస్తోంది. తెల్లజాతీయుల ఆధిపత్యానికి వ్యతిరేక ఉద్యమాన్ని తాము మొదలుపెట్టామని సంస్థ చెబుతోంది."
"ఈ వివక్షలో తమ పాత్ర కూడా ఉందని చాలా మంది తెల్లజాతీయులు భావించరు. మనం చేస్తున్న కృషి దాని వల్ల తుడిచి పెట్టుకుపోతుంది."
"తెల్లజాతీయులు కూడా సాయం చేస్తారనే భావన అందరిలోనూ కలిగించాలని మేం కృషి చేస్తున్నాం. ఆరోగ్యకర ప్రపంచంలో అందరమూ హాయిగా జీవించేందుకు ఇది దోహదపడుతుంది."

ఫొటో సోర్స్, Getty Images
ఇతరులతో కలవండి
యాంటీ-రేసిస్ట్‌గా తమ స్వరాన్ని ఇతరులతో కలిసి వినిపించాలని మూర్ సూచిస్తున్నారు. అది నిరసన అయినా.. వేరే ఏదైనా ఒంటరిగా వెళ్లొద్దని అంటున్నారు.
"వ్యక్తులుగా కంటే కూడా ఒక సంస్థగా సంయుక్తంగా పోరాడాలి. యాంటీ రేసిజం కోసం పోరాడే ఒక సంస్థను ఎంచుకుని దానితో కలిసి పోరాడండి."
రేసిజంపై జరిగే చర్చల్లో అందరూ పాలుపంచుకోవడం చాలా ముఖ్యమని ప్రొఫెసర్ రంగనాథన్ అన్నారు.
రేసిజం అమెరికా దాటి ఇతర దేశాలకూ పాకిందని.. నేడు ఇది కేవలం తెల్ల, నల్ల జాతి మధ్య సమస్యకాదని ఆమె వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌లో ఎగువ తరగతి, పెద్ద కులాలను ఆమె ఉదహరించారు. "అమెరికాలో నల్లజాతీయులపై రేసిజాన్ని వారు వెంటనే ఖండిస్తారు. కానీ తమ సమాజంలో ఉండే అసమానతలను అంగీకరించరు" అని ఆమె అన్నారు.
యాంటీ రేసిస్ట్ భావజాలం పెరగడానికి విదేశాల నుంచి వచ్చే సంఘీభావం తోడ్పడుతుందని ఆమె అన్నారు.
"అమెరికా, బ్రిటన్, బెల్జియం, ఫ్రాన్స్‌లలో సామ్రాజ్యవాదానికి ప్రతీకగా మారిన విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. అయితే ఇదేమీ తొలిసారి కాదు. దక్షిణాఫ్రికాలోనూ నిరసనల నడుమ వలసవాద విగ్రహాలను కూల్చివేశారు."
"బ్ల్యాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యమం ప్రపంచం మొత్తాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో..అలానే విదేశాల్లోని చాలా స్వరాలు అమెరికాలోని యాంటీ-రేసిజం ఉద్యమాన్ని బలోపేతం చేస్తున్నాయి."
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: గాలి ద్వారా వ్యాప్తి చెందడమంటే ఏంటి? దీని గురించి ఎందుకు తెలుసుకోవాలి?
- వ్యాక్సిన్ త్వరలో వచ్చేస్తుందనుకుంటే అది అత్యాశే: ప్రపంచ ఆరోగ్య సంస్థ
- కరోనా వైరస్ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా మందుల కొరతకి దారి తీయవచ్చా?
- కరోనావైరస్ భారత ఫార్మా పరిశ్రమను దెబ్బ తీస్తుందా?
- కరోనావైరస్ లాంటి అంటువ్యాధులు ఇటీవలి కాలంలోనే పుట్టుకొస్తున్నాయి... ఎందుకిలా?
- కరోనావైరస్: అన్ని వైరస్లు ఒకేసారి అంతమైపోతే ఏం జరుగుతుంది? మానవులు సుఖంగా బతకగలరా?
- కోవిడ్-19 టీకా కోసం ప్రపంచమంతా భారత్ వైపు ఎందుకు చూస్తోంది?
- కరోనావైరస్: మూలికా వైద్యానికి వైరస్ లొంగుతుందా? టీ తాగితే రాకుండా ఉంటుందా?
- పసుపు, మిరప వంటి మసాలా దినుసుల వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందా?
- రాగి వస్తువులపై బ్యాక్టీరియా బతకలేదు.. మరి అన్నిచోట్లా రాగి పూత పూస్తే వైరస్‌లను ఎదుర్కోవచ్చా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








