కరోనావైరస్ భారత ఫార్మా పరిశ్రమను దెబ్బ తీస్తుందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, బ్రజేష్ మిశ్రా
- హోదా, బీబీసీ ప్రతినిధి
జెనెరిక్ మందుల తయారీలో, వాటి ఎగుమతిలో భారత్ అగ్రస్థానంలో ఉంటుంది. 2019లో భారత్ 201 దేశాలకు జెనెరిక్ మందులు ఎగుమతి చేసింది. వీటి ద్వారా వందల కోట్లు ఆర్జించింది.
కానీ ఈ మందులు తయారు చేయడానికి భారత్ ఇప్పటికీ చైనామీదే ఆధారపడింది. ఈ మందుల ఉత్పత్తి కోసం చైనా నుంచి యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇన్‌గ్రెడియంట్స్(ఏపీఐ)ను దిగుమతి చేసుకుంటోంది. మందులు తయారీకి ఇది ముడి సరుకు.
చైనాలో కరోనావైరస్ వ్యాపించడంతో ఆ ప్రభావం దిగుమతులు-ఎగుమతులపై తీవ్రంగా ఉంది. ఏపీఐ దిగుమతులు ఆగిపోవడంతో చాల కంపెనీల మందుల ఉత్పత్తి తగ్గుతోంది. దీని ప్రభావం ముందు ముందు ప్రపంచవ్యాప్తంగా మందుల సరఫరాపై కనిపించే అవకాశం ఉంది.
భారత ప్రభుత్వ వాణిజ్య శాఖ గుర్తింపు పొందిన ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(టీపీసీఐ) రిపోర్టు ప్రకారం 2018-19లో భారత్ నుంచి జరిగిన మందుల ఎగుమతుల అంచనా విలువ 19.14 బిలియన్ డాలర్లు.
ఈ మందుల తయారీకి సుమారు 85 శాతం ఏపీఐ(ముడి సరుకు) చైనా నుంచి దిగుమతి అవుతుంది. భారత్‌లో ఏపీఐ ప్రొడక్షన్ చాలా తక్కువ. భారత్‌లో తయారయ్యే ఏపీఐ ఫైనల్ ప్రొడక్ట్ కోసం కూడా చైనా నుంచి కొన్ని వస్తువులు దిగుమతి చేసుకుంటారు. అంటే భారత కంపెనీలు ఏపీఐ ఉత్పత్తికి కూడా చైనాపై ఆధారపడ్డాయి.

ఫొటో సోర్స్, Getty Images
పెరుగుతున్న ఏపీఐ ధరలు
కరోనావైరస్ దెబ్బతో చైనా నుంచి జరిగే ఏపీఐ దిగుమతులపై ప్రభావం పడింది. అక్కడ నుంచి సరఫరా ఆగిపోవడంతో భారత్‌లో మందుల తయారీ కంపెనీలు ఇప్పుడు ఏపీఐని ఎక్కువ ధరలకు కొనాల్సి వస్తోంది.
ముంబయిలో ఉన్న ఆరతీ ఫార్మా సంస్థ చైనా నుంచి ఏపీఐ దిగుమతి చేసుకుంటుంది. మందుల తయారీ కంపెనీలకు దానిని అమ్ముతుంది.
ఈ సంస్థ యజమాని హేమల్ లాఠియా చైనా నుంచి వచ్చే ముడి సరుకు మొత్తం ఆగిపోయిందని చెప్పారు. అక్కడ నుంచి ఎలాంటి కన్‌సైన్‌మెంట్ రావడం లేదని, అది ఎప్పటికి వస్తుందో సమాచారం కూడా లేదని అన్నారు.
బీబీసీతో మాట్లాడిన ఆయన "భారత్‌లో తయారయ్యే ఏపీఐకి కూడా చైనాపై ఆధారపడాలి. అందుకే ఇక్కడ ఉన్న ఏపీఐ తయారీదారులపై కూడా ఆ ప్రభావం పడుతోంది. మేం చైనా నుంచి నేరుగా దిగుమతి చేసుకుంటున్న ఏపీఐ కూడా తగ్గిపోయింది" అన్నారు.
ఏప్రిల్ నాటికి ఎగుమతులు మళ్లీ ప్రారంభం కావచ్చని ఆయన భావిస్తున్నారు. కానీ నెల, నెలన్నర పాటు ఈ సమస్య ఇలాగే ఉండవచ్చని అంటున్నారు.
"ఏపీఐ పాత స్టాక్ ధరలు 10 నుంచి 15 శాతం పెరిగాయి. చైనా నుంచి ఏపీఐని దిగుమతి చేసుకుని, స్థానిక కంపెనీలకు అమ్మే సంస్థలు కూడా, ఇప్పుడు తమ స్టాక్ తగ్గిపోతుండడంతో ఏపీఐ ధరలు పెంచేసి అమ్ముతున్నాయి" అని హేమల్ చెప్పారు.

ఫొటో సోర్స్, AFP
భారత్‌లో ఏపీఐ ఉత్పత్తి ఎందుకు తక్కువ?
చైనాలో ఏపీఐ ఉత్పత్తి భారత్‌తో పోలిస్తే 20 నుంచి 30 శాతం చౌకగా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
అయితే చైనా నుంచి ఏపీఐ దిగుమతులు ఆగిపోవడంపై ఆందోళనలు వ్యక్తం కావడం ఇప్పుడే మొదటిసారి జరగడం లేదు. 2014లో కూడా దీని గురించి లోక్‌సభలో ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
అప్పుడు రెండు దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తలెత్తడంతో, చైనా ముడి సరుకుల సరఫరా ఆపేయవచ్చేమో అనే భారత్‌లో ఆందోళన వ్యక్తమైంది. ఆ సమస్య నుంచి బయటపడ్డానికి ప్రధానమంత్రి కార్యాలయంలో చర్చలు కూడా జరిగాయి. ఆ పరిస్థితి నుంచి బయటపడ్డానికి అప్పుడు ఒక టాస్క్‌ఫోర్స్ కూడా ఏర్పాటు చేశారు.
అప్పటి రసాయన, ఎరువుల శాఖ మంత్రి అనంత్ కుమార్ అవసరమైన మందుల జాబితాలో ఉన్న 12 మందుల తయారీకి కావాల్సిన ముడి సరుకుల్లో 80 నుంచి 90 శాతం చైనా నుంచి వస్తాయని చెప్పారు.
చైనాపై ఆధారపడడాన్ని తగ్గించేలా భారత్‌లో ఏపీఐ ఉత్పత్తిని పెంచాలని అప్పుడు టాస్క్ ఫోర్స్ సూచించినట్లు కొన్ని రిపోర్టులు చెబుతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఉత్పత్తి తగ్గిందా?
"చాలా కంపెనీలు ఇప్పుడు మందుల ఉత్పత్తిని తగ్గించడం లేదంటే తమ దగ్గర ఇప్పటికే ఉన్న స్టాక్‌తో పని నడిపించడం చేస్తున్నాయి. చాలా అవసరమైన వస్తువులను మాత్రమే కొంటున్నాయి. అదనపు స్టాక్ ఏ సంస్థలూ కొనడం లేదు. డిమాండ్ ఎక్కువ, సరఫరా తక్కువగా ఉంది. అందుకే ధరలు పెరుగుతున్నాయి. నెలన్నరలో సరఫరా మళ్లీ మొదలవకుంటే మా కష్టాలు, ధరలు కూడా పెరుగుతాయి" అని కూడా హేమల్ లాఠియా చెప్పారు.
మందులు తయారుచేసే కంపెనీ మాక్స్‌టార్-బయో జెనెటిక్స్ డైరెక్టర్ జగదీశ్ బన్సల్ కూడా "సుమారు 70 శాతం ఏపీఐ చైనా నుంచి దిగుమతి అవుతుంది. మా సంస్థ కాప్స్యూల్స్ తయారు చేస్తుంది. చైనా నుంచి దిగుమతి ఆగిపోవడంతో ఇంతకు ముందే స్టాక్ ఉంచిన వారు దానిని ఎక్కువ ధరలకు దాన్ని అమ్ముతున్నారు" అన్నారు.
"ఉన్న స్టాక్‌తో ఒక నెల వరకూ నడిపించగలం. నెలలోపు దిగుమతులు మొదలవకుంటే చాలా కష్టాల్లో పడిపోతాం" అని ఆయన చెప్పారు.
చైనా నుంచి ఏపీఐ దిగుమతులు ఆగిపోవడం వల్ల తన కంపెనీ మందుల ఉత్పత్తి తగ్గిపోతోందని, సరఫరా త్వరగా ప్రారంభించకపోతే, మందుల తయారీ ఆగిపోవచ్చని ఆయన చెబుతున్నారు.
అయితే, దీనివల్ల ప్రస్తుతానికి మందుల ధరలపై ఎలాంటి ప్రభావం ఉండకపోవచ్చని జగదీశ్ చెప్పారు. కానీ, చైనా నుంచి సరఫరాకు మరింత ఎక్కువ సమయం పడితే ఆ ప్రభావం కచ్చితంగా ధరలపై పడుతుంది అన్నారు.
దిల్లీ డ్రగ్స్ ట్రేడర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఆసిష్ గ్రోవర్ "చాలా కంపెనీలు రెండు మూడు నెలలు పని ఆగకుండా ఉండేలా స్టాక్ ఉంచుకుంటాయి. కానీ ఆ తర్వాత సమస్యలు రావచ్చు. అయితే ఒకటి రెండు నెలల్లో చైనా నుంచి ఏపీఐ దిగుమతులు మొదలవుతాయనే మేం ఆశిస్తున్నాం" అన్నారు.
"ప్రొడక్షన్ నడుస్తోంది. కానీ ఏపీఐ ధరలు పెరుగుతున్నాయి. ఏదైనా ఒక టాబ్లెట్ ధర హఠాత్తుగా పెరిగితే అది ప్రజలను సమస్యల్లో పడేయవచ్చు. చైనాలో కరోనావైరస్ వ్యాపించి ఉంది. కానీ దానికి సంబంధించిన ఏ మందులనూ ఇక్కడ నుంచి పంపించలేకపోతున్నాం. అందుకే ప్రస్తుతం మిగతా మందుల ధరలపై ప్రభావం పడడం లేదు" అని ఆశిష్ గ్రోవర్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రభుత్వ గణాంకాలు ఏం చెబుతున్నాయి
ఫార్మస్యూటికల్స్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(Pharmexcil) వార్షిక రిపోర్టు ప్రకారం 2018-19లో భారత్ నుంచి ఎగుమతి అయిన మొత్తం మందుల విలువ 19 బిలియన్ డాలర్లు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ డిమాండ్ ప్రకారం తయారుచేసే డీపీటీ, బీసీజీ వ్యాక్సిన్లలో సుమారు 65 శాతం భారత్‌లోనే తయారవుతాయి. 90 శాతం తట్టు టీకాలను భారత్ తయారుచేస్తుంది.
జెనెరిక్ మందులు తయారు చేసే ప్రపంచంలోని టాప్ 20 కంపెనీల్లో 8 భారత్‌లోనే ఉన్నాయి.
భారత్ నుంచి ఎగుమతి అయ్యే మందుల్లో 55 శాతం ఉత్తర అమెరికా, యూరప్ దిగుమతి చేసుకుంటాయి. భారత్ నుంచి మందులు దిగుమతి చేసుకునే దేశాల్లో అమెరికా అతిపెద్ద దిగుమతిదారు.
ఆఫ్రికా జెనెరిక్ మందుల మార్కెట్లో భారత్‌కు 50 శాతం వాటా ఉంది.
భారత్ 2018-19లో ప్రపంచంలోని 201 దేశాలకు 9.52 కోట్ల డాలర్ల మందులు ఎగుమతి చేసింది.
ఇప్పుడు చైనా నుంచి ఏపీఐ దిగుమతులు మరికొంత కాలం ఆగిపోతే భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా మందుల కొరత ఏర్పడవచ్చని, దానితోపాటు భారత ఆర్థికవ్యవస్థకు కూడా నష్టాలు రావచ్చని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: ఏ వయసు వారిపై ఎక్కువ ప్రభావం చూపుతుంది?
- కరోనా వైరస్-వుహాన్ : ఒక నగరాన్ని మూసేయడం సాధ్యమా? చైనా చర్యతో వైరస్ వ్యాప్తి ఆగిపోతుందా?
- కరోనా వైరస్: అన్ని దేశాలూ వణుకుతున్నా, థాయిలాండ్ మాత్రం చైనీయులకు తమ తలుపులు తెరిచే ఉంచింది.. ఎందుకు?
- టైఫాయిడ్ వ్యాప్తికి కారణమైనందుకు 26 ఏళ్లపాటు ఓ దీవిలో మహిళ బందీ
- పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై దాడి కేసు దర్యాప్తు ఎంతవరకు వచ్చింది
- కరోనావైరస్: అందర్నీ వణికిస్తున్న వైరస్ ఎన్నో ప్రాణులను కాపాడుతోంది
- ‘పిల్లలకు అన్నం పెట్టేందుకు నా జుట్టు అమ్ముకున్నా’
- కరోనావైరస్: వధువు, వరుడు లేకుండా పెళ్లి వేడుక జరిగింది
- ఇంట్లో కుళాయి తిప్పితే మద్యం వచ్చింది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









