ఇరాన్ ఆరోగ్య శాఖ డిప్యూటీ మంత్రికి కరోనావైరస్.. స్పెయిన్‌లో వందల మందిని లోపలే ఉంచి హోటల్‌ను మూసేసిన ప్రభుత్వం

ఫొటో సోర్స్, Reuters
ఇరాన్ ఆరోగ్య శాఖ డిప్యూటీ మంత్రికి, ఆ దేశ ఎంపీకి కరోనావైరస్ సోకినట్లు తేలింది. చైనా వెలుపల కరోనావైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న దేశాల్లో ఇరాన్ ఒకటి.
తనకు కోవిడ్ 19 సోకిందని, దీంతో బయటి ప్రపంచంతో కలవకుండా ఏకాంతంగా ఉంటున్నట్లు ఇరాజ్ హరికి ఒక వీడియోలో తెలిపారు.
సోమవారం ఒక మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో కోవిడ్ 19 వ్యాప్తిపై అధికారులు అబద్ధాలు చెబుతున్నారన్న వాదనను తోసిపుచ్చారు. ఈ సమావేశంలో ఆయన పలుమార్లు తన నుదురును చేతి రుమాలుతో తుడుచుకుంటూ కనిపించారు.
ఇరాన్‌లో 95 కరోనా వైరస్ కేసులు సోకినట్లు ప్రకటించినప్పటికీ, వాస్తవానికి ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని తెలుస్తోంది.
తనకు కరోనా వైరస్ సోకిందని మంగళవారం ఇరాన్ రాజధాని నగరం టెహ్రాన్‌కు చెందిన ఎంపీ మహ్మూద్ సదెఘి ప్రకటించారు.
ఇరాన్‌లో మంగళవారం కోవిడ్-19తో మరో ముగ్గురు చనిపోయారు. దీంతో ఇరాన్‌లో కోవిడ్-19 మృతుల సంఖ్య 16కు పెరిగింది.
ఇరాన్ రాజధాని టెహ్రాన్ నుంచి 130 మందికి పైగా ప్రయాణికులతో టర్కీలోని ఇస్తాంబుల్‌కు వస్తున్న ఓ విమానాన్ని మంగళవారం రాజధాని అంకారాకు మళ్లించారు. వారందరినీ 14 రోజులపాటు నిర్బంధ పర్యవేక్షణలో ఉంచుతామని టర్కీ ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు.

ఫొటో సోర్స్, EPA
స్పెయిన్లో హోటల్‌ను మూసేసిన ప్రభుత్వం
స్పెయిన్లో ఓ హోటల్లో బస చేసిన ఇటలీ వైద్యుడికి కరోనావైరస్(కోవిడ్-19) సోకినట్లు నిర్ధరణ కావడంతో అధికార యంత్రాంగం ఆ హోటల్‌ను తాత్కాలికంగా మూసివేసింది.
'హెచ్10 కోస్తా అడెజీ ప్యాలస్ హోటల్' అనే ఈ నాలుగు నక్షత్రాల హోటల్ కేనరీ ఐలాండ్స్‌లో భాగమైన టెనెరీఫ్ దీవిలో ఉంది. ఇందులో వందల మంది గెస్ట్‌లు ఉన్నారు. అధికార యంత్రాంగం వారికి వైద్య పరీక్షలు జరిపిస్తోంది. హోటల్ గదుల్లోంచి బయటకు రావొద్దని నిర్వాహకులు వారికి స్పష్టం చేశారు.
కోవిడ్-19 ఉన్నట్లు సోమవారం నిర్ధరణ అయిన ఆ వైద్యుడిది ఇటలీలోని లాంబార్డీ ప్రాంతమని వార్తలు వచ్చాయి. లాంబార్డీ ప్రాంతంలో వ్యాపిస్తున్న కరోనావైరస్‌ను అడ్డుకొనేందుకు ఇటలీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
హోటల్లో ఉన్నవారిపై ఎంత స్థాయి పర్యవేక్షణ పెట్టాలనేది ఆలోచిస్తున్నామని స్పెయిన్ ఆరోగ్య విభాగ అధికార ప్రతినిధి వెరోనికా మార్టిన్ చెప్పారని వార్తాసంస్థ ఏఎఫ్‌పీ తెలిపింది. ప్రస్తుతం నిర్బంధ పర్యవేక్షణ గురించి చర్చించడం లేదని ఆమె చెప్పారు.


"ఆరోగ్య కారణాల దృష్ట్యా హోటల్‌ను తాత్కాలికంగా మూసేశాం. అధికారులు చెప్పే వరకు మీరు మీ గదుల్లోనే ఉండండి" అని రాసి ఉన్న ఓ నోట్‌ను హోటల్ నిర్వాహకులు తమ తలుపు కింద ఉంచారని చెబుతూ దాని ఫొటోను ఓ గెస్ట్ ఫేస్‌బుక్‌లో పెట్టారు.
తాము కూడా అలాంటి నోట్ చూశామని జాన్ టర్టన్ అనే మరో గెస్ట్ బీబీసీతో చెప్పారు. అయితే ఇతర గెస్ట్‌లు అల్పాహారం తినడానికి నడుస్తూ వెళ్లడం తనకు, తన భార్యకు వినిపించిందని తెలిపారు. పోలీసులు హోటల్ నుంచి ఎవరినీ బయటకు వెళ్లనివ్వడం లేదన్నారు.
తనకు ఇంకా వైద్యపరీక్షలు జరగలేదని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, Reuters
వైరస్ నిర్ధరణ అయిన వైద్యుడు ఈ హోటల్లో ఆరు రోజులు బస చేశారని, ఈ సమయంలో బహుశా ఐదారు వందల మంది హోటల్ ఖాళీ చేసి ఐరోపాలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి ఉంటారని మరో గెస్ట్ ఆందోళన వ్యక్తంచేశారు.
ఆ వైద్యుడిని స్పెయిన్లో శాంటాక్రజ్‌లోని యూనివర్శిటీ హాస్పిటల్ న్యూయెస్ట్రా సెనోరా డి కాండెలేరియాలో ఒంటరిగా ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆయనకు మరోసారి 'కరోనావైరస్' పరీక్షలు నిర్వహించనున్నారు.
ఇంతకుముందు స్పెయిన్లో ఇద్దరికి ఈ వైరస్ సోకినట్లు నిర్ధరణ అయ్యింది. బాధితులిద్దరూ విదేశీ పర్యటకులే. ఒకరిది జర్మనీ, మరొకరిది బ్రిటన్.
ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసుల సంఖ్య 80 వేలు దాటింది. వీటిలో అత్యధికం చైనాలోనే నమోదయ్యాయి.

ఫొటో సోర్స్, Reuters
ఐరోపా: ఇటలీలోనే అత్యధిక కేసులు
ఐరోపాలో కరోనావైరస్ కేసులు అత్యధికంగా ఇటలీలో బయటపడ్డాయి. ఇటలీలో మంగళవారం నాటికి 283 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. ఏడుగురు చనిపోయారు. లాంబార్డీ, వెనెటో ప్రాంతాల్లో కొన్ని చిన్న పట్టణాలను మూసివేశారు. రానున్న రెండు వారాలపాటు ప్రత్యేక అనుమతి లేకుండా ఎక్కడికీ వెళ్లడానికి వీల్లేదని 50 వేల మంది ప్రజలకు స్పష్టం చేశారు.
ఇటలీలో వైరస్ వ్యాపిస్తున్న సంకేతాలు వెలువడుతున్నాయి. టుస్కనీ, సిసిలీలలో మంగళవారం కొత్త కేసులు బయటపడ్డాయి. అయితే పర్యటకులకు ఇటలీ సురక్షితమైనదిగానే ఉందని ప్రధాని గ్యూసెప్పే కాంటే చెప్పారు.
చైనా: 2,663 మంది మృతి
కరోనావైరస్ తొలుత బయటపడిన చైనాలో ఇప్పటివరకు 77 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో 2,663 మంది చనిపోయారు. అత్యధిక కేసులు వుహాన్ నగరంలోనే నమోదయ్యాయి.
మంగళవారం దక్షిణ కొరియాలో వైరస్ బాధితుల సంఖ్య 977కి, మృతుల సంఖ్య 10కి పెరిగాయి.
అమెరికాలో 53 మందికి వైరస్ సోకినట్లు నిర్ధరణ అయ్యింది.
తీరంలో నిర్బంధ పర్యవేక్షణలో ఉంచిన డైమండ్ ప్రిన్సెస్ నౌక ప్రయాణికుల్లో మరొకరు చనిపోయారని, ఇందులో చనిపోయినవారి సంఖ్య నాలుగుకు చేరిందని జపాన్ తెలిపింది.
జపాన్లో వైరస్ బాధితులు 850 మందికి పైగా ఉన్నారు. వీరిలో అత్యధికులు నౌకలోనివారే.
కోవిడ్-19 ప్రపంచవ్యాప్త మహమ్మారిగా ఆస్కారముందని, దీనిని ఎదుర్కొనేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది.

ఇవి కూడా చదవండి:
- BBC Indian Sportswoman of the Year 2019: విజేత ఎవరో మార్చి 8న ప్రకటిస్తాం
- మోదీ ప్రభుత్వ విజయాలపై అహ్మదాబాద్‌లో ట్రంప్ చెప్పినవన్నీ నిజాలేనా? - బీబీసీ రియాల్టీ చెక్
- దిల్లీ హింస: ముస్లింలు అధికంగా ఉండే ఈ ప్రాంతంలో హింసకు కారకులెవరు? ప్రత్యక్ష సాక్షులు ఏం చెబుతున్నారు?
- "భారతదేశానికి మా మనసులో ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది"- ట్రంప్
- కరోనావైరస్ - ‘మహమ్మారిగా మారకముందే ఎదుర్కోండి’ - ప్రపంచ దేశాలకు డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక
- బంగారం ధర ఏడేళ్ళలో ఎన్నడూ లేనంత పెరిగింది... ఎందుకిలా?
- భూమి బల్లపరుపుగా ఉందని నిరూపిస్తానని ప్రాణాలు కోల్పోయాడు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









