TrumpInIndiaBBC: "భారతదేశానికి మా మనసులో ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది" - డోనల్డ్ ట్రంప్

ట్రంప్, మోదీ

ఫొటో సోర్స్, Getty Images

భారత్‌లో తొలిసారి అధికారిక పర్యటన చేపట్టిన అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో భారీ బహిరంగ సభలో ప్రసంగించారు.

ప్రపంచంలోకెల్లా అతిపెద్ద క్రికెట్ స్టేడియమైన మోటేరా స్టేడియంలో 'నమస్తే' అంటూ ట్రంప్ తన ప్రసంగాన్ని మొదలుపెట్టగా, సభికుల నుంచి హర్షధ్వానాలు హోరెత్తాయి.

భారత్‌లో క్రికెట్, బాలీవుడ్‌, ఇతర రంగాల ప్రముఖులు, భారతీయ సంస్కృతి, పండగల గురించి ఆయన ప్రస్తావించారు.

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన అమెరికా, భారత్ మధ్య సంబంధాలను పెంపొందించడంపై ఆయన ఈ పర్యటనలో దృష్టి కేంద్రీకరిస్తున్నారు.

అడ్డగీత
News image
అడ్డగీత

"మా మనసులో భారత్‌కు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది" అని ట్రంప్ చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీపై ఆయన ప్రశంసలు కురిపించారు.

"ఆయన్ను అందరూ అభిమానిస్తారు. ఆయన చాలా గట్టివారు. మీరు (మోదీ) గుజరాత్‌కు గర్వకారణమైన నాయకుడు మాత్రమే కాదు, భారతీయులు తాము కోరుకొన్నది ఏదైనా కష్టపడి సాధించగలరనేదానికి కూడా మీరు నిదర్శనం" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

అహ్మదాబాద్, స్వామి వివేకానంద, ఇతర భారతీయ పదాలను పలకడంలో ట్రంప్ ఇబ్బంది పడ్డారు. వేదాలను 'వేస్టాస్' అని పలికారు.

ట్రంప్, మోదీ

ఫొటో సోర్స్, Twitter/@realDonaldTrump

మోటేరా స్టేడియం

భారత్‌కు అత్యాధునిక రక్షణ పరికరాలు అందిస్తామని, భారత సైన్యాన్ని మరింత బలోపేతం చేస్తామని ట్రంప్ చెప్పారు. మూడు బిలియన్ డాలర్లకు పైగా విలువైన అత్యాధునిక సైనిక హెలికాప్టర్స్, ఇతర సైనిక సామగ్రిని భారత సైన్యానికి అందించేందుకు రెండు దేశాలూ మంగళవారం ఒప్పందం చేసుకొంటాయని ప్రకటించారు.

ఉగ్రవాదంపై కలిసి పోరాడాలని భారత్-అమెరికా దృఢ సంకల్పంతో ఉన్నాయని ఆయన చెప్పారు. ఉభయ దేశాలూ ఉగ్రవాద బాధిత దేశాలేనన్నారు. పాకిస్తాన్‌తో అమెరికాకు సత్సంబంధాలు ఉన్నాయని, ఉగ్రవాదంపై పాకిస్తాన్‌తో కలిసి పని చేస్తున్నామని తెలిపారు.

"భారత్‌ను దేవుడు దీవించుగాక, అమెరికాను దేవుడు దీవించుగాక, మిమ్మల్ని(భారత్‌ను) మేం(అమెరికా) ఎంతో ప్రేమిస్తున్నాం" అంటూ ట్రంప్ తన ప్రసంగాన్ని ముగించారు.

ప్రధాని మోదీ తర్వాత ట్రంప్ మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడి ప్రసంగం కొనసాగుతుండగానే మధ్యలోనే సభికులు వెళ్లిపోవడం కనిపించిందని బీబీసీ ప్రతినిధి రజినీ వైద్యనాథన్ చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి మోటేరా స్టేడియానికి చేరుకోవడానికి ముందు మార్గమధ్యంలో అమెరికా అధ్యక్షుడు సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. 'ఈ అద్భుత పర్యటనకు ధన్యవాదాలు' అంటూ ప్రధాని మోదీని ఉద్దేశించి సందర్శకుల పుస్తకంలో ఆయన రాశారు.

ఆశ్రమంలో ట్రంప్, ఆయన భార్య మెలానియా- చరఖాతో నూలు వడికేందుకు ప్రయత్నించారు.

అహ్మదాబాద్ పర్యటన తర్వాత ట్రంప్ ప్రఖ్యాత పర్యటక కేంద్రం ఆగ్రా చేరుకున్నారు.

మెలానియా, ట్రంప్ (#TrumpInIndiaBBC Live)

ఫొటో సోర్స్, Getty Images

సబర్మతి ఆశ్రమంలో సందర్శకుల పుస్తకంలో ట్రంప్ సందేశం
ఫొటో క్యాప్షన్, సబర్మతి ఆశ్రమంలో సందర్శకుల పుస్తకంలో ట్రంప్ రాసిన మాట

వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశాలు తక్కువే

భారత్‌కు ప్రధానమైన వాణిజ్య భాగస్వాముల్లో అమెరికా ఒకటి. 2018లో భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం 142.6 బిలియన్ డాలర్లుగా ఉంది.

ఉభయ దేశాల మధ్య రాజకీయ, వ్యూహాత్మక బంధాలు పెరుగుతూ వస్తున్నా, వాణిజ్య అంశాల్లో మాత్రం విభేదాలు కొనసాగుతున్నాయి.

ట్రంప్ ప్రస్తుత పర్యటనలో ఉభయ దేశాల మధ్య కీలకమైన వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశాలు తక్కువ.

ఒకవైపు వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా భారత్ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న సమయంలో, ట్రంప్ పర్యటన జరుగుతోంది.

ఆయన పర్యటనకు కొన్ని గంటల ముందు కూడా సీఏఏకు సంబంధించి దిల్లీలో ఘర్షణలు జరిగాయి. సీఏఏ వ్యతిరేక గ్రూపులు, అనుకూల గ్రూపులు పరస్పరం రాళ్లు రువ్వుకొన్నాయి. పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసులు చెప్పారు.

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్‌ ది ఇయర్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)