డోనల్డ్ ట్రంప్ భారత పర్యటనతో అమెరికా-ఇండియా ట్రేడ్ వార్ సమసిపోతుందా?

నరేంద్రమోదీ, డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, నిధి రాయ్
    • హోదా, బీబీసీ బిజినెస్ రిపోర్టర్, ముంబై

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తొలిసారిగా భారత్‌లో పర్యటిస్తున్నారు. ఆయన ఫిబ్రవరి 24న దిల్లీ చేరుకుంటారు. ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన వ్యక్తికి ఆతిథ్యం ఇవ్వటానికి భారతదేశం చాలా ఉద్వేగంగా ఉంది. ఇందుకు అనేక రాజకీయ, వాణిజ్య కారణాలున్నాయి.

వేయి కోట్ల డాలర్ల - అంటే దాదాపు 70,000 కోట్ల రూపాయల మినీ వాణిజ్య ఒప్పందం ఈ పర్యటనలో కుదిరే అవకాశం ఉండటంతో రెండు దేశాల వాణిజ్య సంబంధాలకు ఈ పర్యటన చాలా ముఖ్యమైనదనే ప్రచారం జరుగుతోంది.

అయితే, ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ,'భారీ వాణిజ్య ఒప్పందా'న్ని భవిష్యత్తు కోసం దాచానని... అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు లేదా తర్వాత ఆ ఒప్పందాన్ని కుదుర్చుకోవాలన్నది అమెరికా ఆలోచన అని చెప్పారు.

ఇరు పక్షాల మధ్య విభేదాలు అపరిష్కృతంగానే ఉండటంతో ఇప్పటికే అమెరికా వాణిజ్య ప్రతినిధి రాబర్ట్ లైతీజర్ గత వారం తన భారత పర్యటనను రద్దు చేసుకున్నారు.

''భారతదేశం మాతో సరిగా వ్యవహరించలేదు. కానీ ప్రధానమంత్రి మోదీ అంటే నాకు చాలా ఇష్టం'' అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

అమెరికా, ఇండియా వాణిజ్య సంబంధాలు గడచిన మూడేళ్లు చాలా ఉద్రిక్తంగా సాగాయి.

భారత్, అమెరికా

ఫొటో సోర్స్, Getty Images

అమెరికా - భారత్‌ల మధ్య వాణిజ్య వివాదం ఏమిటి?

భారతదేశానికి చైనా తర్వాత రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అమెరికానే. ద్వైపాక్షిక వస్తువులు, సేవల వాణిజ్యం 2018లో రికార్డు స్థాయిలో 1,42,600 కోట్ల డాలర్లకు పెరిగింది.

అమెరికా తన తొమ్మిదో అతిపెద్ద సరకుల వాణిజ్య భాగస్వామి అయిన భారతదేశంతో 2019లో 23,200 కోట్ల డాలర్ల వాణిజ్య లోటు చవిచూసింది.

ఇరు దేశాల మధ్య గత మూడేళ్లలో వాణిజ్య రంగంలో ఉద్రక్తతలు పెరిగిపోయాయి. భారతదేశంతో అమెరికా వాణిజ్య లోటు తగ్గిపోవటం మొదలై.. అది చైనాతో అమెరికా వాణిజ్య లోటులో పదో శాతం కన్నా తక్కువగానే ఉన్నప్పటికీ.. అమెరికా ఆగ్రహాన్ని భారత్ తప్పించుకోలేకపోయింది.

ట్రంప్ ప్రభుత్వం భారతదేశం నుంచి ఉక్కు దిగుమతి మీద 25 శాతం సుంకం, అల్యూమినియం ఉత్పత్తుల మీద 10 శాతం సుంకం విధించటంతో అమెరికా - భారత్ మధ్య 'వాణిజ్య యుద్ధం' మొదలైంది.

ఈ సుంకాల విధింపు కొన్ని నెలల తర్వాత అమలులోకి వచ్చే వరకూ కూడా.. అమెరికా అధికార యంత్రాంగం ఆ నిర్ణయాలను పునఃపరిశీలించాలని భారతదేశం పదే పదే విజ్ఞప్తి చేసింది. ఎటువంటి ప్రతీకార చర్యలూ ప్రారంభించలేదు.

అమెరికా నుంచి దిగుమతులపై భారతదేశం అధిక సుంకాలు విధిస్తోందని బాహాటంగానే మాట్లాడిన అధ్యక్షుడు ట్రంప్.. భారత్‌ను ''ప్రపంచంలో సుంకాల రారాజు'' అని కూడా అభివర్ణించారు.

భారతదేశం ప్రతిస్పందిస్తూ అమెరికా నుంచి దిగుమతి అయ్యే 28 రకాల ఉత్పత్తుల మీద 2019 జూన్ 16 నుంచి అమలయ్యేలా ప్రతీకార సుంకాలు విధించింది. దీనిపై భారతదేశం మీద అమెరికా ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ)కు ఫిర్యాదు చేసింది.

డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Reuters

వాణిజ్య చర్చలు స్తంభించిపోవటంతో.. ఈ-కామర్స్‌ విషయంలో విభేదాల కారణంగా భారతీయుల హెచ్1-బి వీసా కోటాను 15 శాతానికి పరిమితం చేయటం గురించి కూడా అమెరికా కొంత కాలం ఆలోచించింది. భారతదేశపు సుంకాలు, సుంకాలతో నిమిత్తం లేని వాణిజ్య అవరోధాల మీద సెక్షన్ 301 దర్యాప్తు అవకాశాలను పెంచేది.

ఈ వాణిజ్య ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లటానికి భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, అమెరికా వాణిజ్య ప్రతినిధి రాబర్ట్ లైతీజర్‌లు 2019 నవంబర్ 13న సమావేశమయ్యారు. ఈ ప్రతిపాదిత ఒప్పందం మీద భారత ప్రతినిధులతో వివరంగా చర్చించటానికి నవంబర్ చివర్లో అమెరికా నుంచి ఒక ప్రతినిధి బృందం భారతదేశానికి వచ్చింది.

ఈ వాణిజ్య చర్చలకు సారథ్యం వహిస్తున్న అమెరికా వాణిజ్య ప్రతినిధి రాబర్ట్ లైటీర్... ట్రంప్‌తో పాటు వస్తున్న ప్రతినిధి బృందంలో రావటం లేదని అమెరికా శనివారం నాడు మీడియాకు తెలిపింది.

అమెరికా డెయిరీ, పౌల్ట్రీ రంగాలకు భారత మార్కెట్ అవకాశాలను మెరుగుపరచటానికి భారతదేశం కొన్ని కొత్త ప్రతిపాదనలు చేసినా కూడా.. భారతదేశంతో ఒక ప్యాకేజీని ఖరారు చేయటానికి ఈ నెల ఆరంభంలో రావలసిన లైతీజర్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. రెండు దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య అంశాల మీద విభేదాలు ఎంత తీవ్రంగా ఉన్నాయనేది ఇది చాటుతోంది.

డోనల్డ్ ట్రంప్ భారత పర్యటనకు ముందు.. అమెరికా తన అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితా నుంచి భారతదేశాన్ని తొలగించింది. ఈ జాబితాలో ఉండే దేశాలకు.. అనుచిత రాయితీలతో కూడిన ఎగుమతులతో అమెరికా పరిశ్రమలకు హాని చేస్తాయా అనే అంశంపై దర్యాప్తులకు మినహాయిపు ఉంటుంది.

యాపిల్

ఫొటో సోర్స్, Getty Images

భారతదేశం 'జీ20' సభ్యదేశం కాబట్టి, ప్రపంచ వాణిజ్యంలో 0.5 శాతం కన్నా ఎక్కువ వాటా కలిగి ఉంది కాబట్టి.. ఆ జాబితా నుంచి భారత్‌ను తొలగించింది అమెరికా.

అమెరికా మామూలుగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు మాత్రమే వర్తింపజేసే 'ప్రాధాన్యతనిచ్చే సాధారణ వ్యవస్థ (జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్ - జీఎస్‌పీ)' కింద భారతదేశం ఇంతకుముందు ప్రాధాన్యతా ప్రయోజనాలు పొందుతుండేది. అయితే అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితా నుంచి భారత్‌ను తొలగించటం.. దానిని పునరుద్ధరించుకోవటానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలకు ఎదురుదెబ్బగా పరిగణిస్తున్నారు.

భారతదేశానికి జీఎస్‌పీ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ ఏర్పాటు కింద నిర్దిష్ట భారతీయ ఉత్పత్తులు అమెరికా మార్కెట్‌లోకి సుంకాలు లేకుండా ప్రవేశించగలవు. కానీ భారత వాణిజ్య ప్రతిబంధకాలు తమ ఎగుమతుల మీద ప్రభావం చూపుతున్నాయని అమెరికా డెయిరీ, వైద్య పరికరాల రంగం చెప్పటంతో.. భారతదేశానికి జీపీఎస్ ప్రయోజనాన్ని 2019 జూన్ 5న అమెరికా ఉపసంహరించింది.

ఇరువైపులా చేపట్టిన చర్యలు ''రెండు దేశాల మధ్య ఒక మేరకు శత్రుత్వానికి కారణమయ్యాయి'' అని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మాజీ కార్యదర్శి అజయ్ దువా బీబీసీతో పేర్కొన్నారు.

''ట్రంప్ సుంకాలు పెంచటం.. గృహోపకరణాలు, మెకానికల్, ఎలక్ట్రికల్ యంత్రాలు, రసాయనాలు, ఉక్కు, ఆటో విడిభాగాల వాణిజ్యాన్ని చాలా వరకూ దెబ్బకొట్టింది. భారత ఎగుమతిదారులు అమెరికా మార్కెట్‌లో పోటీపడటం కష్టంగా మారింది. భారత ప్రతీకార చర్యలతో అమెరికా నుంచి దిగుమతి అయ్యే పండ్లు, పప్పులు వంటి ఉత్పత్తుల మీద తీవ్ర ప్రభావం ఉంది. కాలిఫోర్నియా నుంచి బాదం, అక్రోట్ దిగుమతులు, వాషింగ్టన్ నుంచి యాపిల్ దిగుమతుల మీద అత్యధిక ప్రతికూల ప్రభావం చూపింది'' అని అమెరికా - ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్య వేదిక (యూఎస్ఐఎస్‌పీఎఫ్) అధ్యక్షుడు, సీఈఓ డాక్టర్ ముకేశ్ అఘీ బీబీసీకి వివరించారు.

అమెరికా వీసా

ఫొటో సోర్స్, iStock

మనం ఏం కోరుతున్నాం?

జీఎస్‌పీ విశిష్ట హోదాను పునరుద్ధరించాలని, హెచ్1బి వీసా నిబంధనలను సడలించాలని భారత్ కోరుతోంది. అమెరికా తన డెయిరీ ఉత్పత్తులకు భారత మార్కెట్‌ను మరింత ఎక్కువగా తెరవాలని కోరుతోందని రాయిటర్స్ కథనం చెప్తోంది. వైద్య పరికరాల మీద సెస్‌ను, హార్లీ డేవిడ్సన్ బైకుల మీద సుంకాలను తగ్గించాలని కూడా అమెరికా కోరుతోంది.

డాక్టర్ ముకేశ్ అఘి బీబీసీతో మాట్లాడుతూ.. ''భవిష్యత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి భూమికను తయారు చేయటానికి పాక్షిక ఒప్పందం మంచి ప్రారంభం అవుతుంది. దానివల్ల మన ఆర్థికవ్యవస్థల మధ్య మరింత ప్రయోజనకరంగా బంధం నెలకొల్పటానికి విధానరూపకర్తలకు ఒక వేదిక లభిస్తుంది. పరిశ్రమ దృక్కోణం నుంచి చూస్తే ఈ ఒప్పందం మన మొత్తం ద్వైపాక్షిక సంబంధాలకు ఇంకా ఎక్కువ ఉత్తేజాన్నిస్తుందనేది నిజం. ఇరు పక్షాల్లో ఏ వైపునా రక్షణాత్మక వైఖరి మేలు చేయదు. దానివల్ల ఇప్పటివరకూ మనం సాధించిన వాస్తవ ప్రగతి నిజంగా కుంటుపడుతుంది'' అని చెప్పారు.

పాలు

ఫొటో సోర్స్, Getty Images

కలహ కారణం ఏమిటి?

అమెరికా, ఇండియాలు అనేక అంశాల మీద పరస్పరం తలపడుతున్నాయి.

''హార్లీ డేవిడ్సన్ మోటార్‌సైకిళ్లు, ఎలక్ట్రానిక్స్, ఐటీఏ ఉత్పత్తుల మీద సుంకాలు పెంచటం, వైద్య పరికరాల మీద ధరల నియంత్రణ, డెయిరీ ఉత్పత్తులు, డాటా లోకలైజేషన్‌కు మార్కెట్ తలుపులు తెరకపోవటం తదితర అంశాల విషయంలో అమెరికా ఆందోళన చెందుతోంది'' అని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఐఈఓ) డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ తెలిపారు.

అమెరికాకు చెందిన డెయిరీ ఉత్పత్తిదారులు తమ ఉత్పత్తులను భారత మార్కెట్లలో విక్రయించాలని కోరుకుంటున్నారు. అయితే.. వాళ్లు తమ జంతువులకు మాంసాహారం తినిపిస్తారు. అది భారత వినియోగదారుల మత విశ్వాసాలకు వ్యతిరేకం. కాబట్టి ఆ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవటానికి ముందు.. ఆయా ఉత్పత్తులు స్వచ్ఛమైనవంటూ అమెరికా విభాగం ధృవీకరించాలని భారత ప్రభుత్వం కోరినట్లు సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ ఒక కథనంలో చెప్పింది.

ఈ అంశం మీద ఇరు పక్షాలూ ఒప్పందానికి రాలేకపోయాయని అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ రీసెర్చ్ ఫెలో కాషిష్ పార్పియానీ బీబీసీతో పేర్కొన్నారు.

హార్లీ డేవిడ్సన్ బైక్

ఫొటో సోర్స్, Getty Images

''ఒకవైపు 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్తున్న మన కేంద్ర ప్రభుత్వం.. మరోవైపు ఇటువంటి హానికర వాణిజ్య ఒప్పందం మీద సంతకాలు చేయటానికి సిద్ధంగా ఉండటం విడ్డూరం. ఈ ఒప్పందం వినాశకర ప్రభావాన్ని రైతులే భరించాల్సి వస్తుంది. ఇటువంటి ఒప్పందం ద్వారా అమెరికా నుంచి ఏటా 42,000 కోట్ల విలువైన వ్యవసాయ, డెయిరీ, పౌల్ట్రీ ఉత్పత్తులు భారతదేశంలోకి దిగుమతి అవుతాయి'' అని రాష్ట్రీయ కిసాన్ మహాసంఘ్ ఇటీవల ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తంచేసింది.

ఈ ప్రతిపాదిత భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించటానికి ఈ సంస్థ ఫిబ్రవరి 17న దేశవ్యాప్త నిరసన నిర్వహించింది.

ఇదిలావుంటే.. ఇప్పటికే ఇరు దేశాల మధ్య విభేదాలకు ఒక కారణమైన వైద్య పరికరాల దిగుమతి మీద.. కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 2వ తేదీన ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అదనంగా సెస్ విధించింది.

''భారతదేశంలో దిగుమతి చేసుకున్న వైద్య పరికరాల మీద కొత్త ఆరోగ్య సెస్ విధించటం, కొన్ని వైద్య పరికరాల మీద సాంఘిక సంక్షేమ సర్‌చార్జ్ విధించటం వంటి విధానాల పట్ల మేం ఆందోళన చెందుతున్నాం. వీటివల్ల.. ఇతర దేశాల్లో లభించే సరైన వైద్య సాంకేతిక చికిత్సలు రోగులకు అందుబాటులో లేకపోవటం, తద్వారా చివరికి ఆరోగ్య సంరక్షణ వ్యయాలు పెరిగిపోవటం వంటి అనూహ్యమైన, ప్రతికూల పర్యవసానాలు ఉండగలవు'' అని అడ్వాన్స్‌డ్ మెడికల్ టెక్నాలజీ అసోసియేషన్ (అడ్వామెడ్) ఉపాధ్యక్షుడు అబీ ప్రాట్ ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు.

నరేంద్రమోదీ, డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, AFP

అంటే, వైద్య పరికరాల మీద సెస్ విధిస్తున్న బడ్జెట్ ప్రకటన కొత్త సమస్యను సృష్టించగలదు.

రాయిటర్స్ కథనం ప్రకారం.. గుండె సంబంధిత స్టెంట్లు, మోకాలి ఇంప్లాంట్ల మీద ధరల నియంత్రణను తొలగించాలని కూడా అమెరికా ప్రభుత్వం కోరుతోంది.

ఒకవేళ ట్రంప్ తన 'భారీ వాణిజ్య ఒప్పందాన్ని' ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నా అది సఫలమయ్యేది కాదని నిపుణులు భావిస్తున్నారు.

ఇప్పుడు జరగబోయే 1,000 కోట్ల డాలర్ల వాణిజ్య ఉప్పందం.. అమెరికా - ఇండియాల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పీడిస్తున్న విభేదాలన్నిటినీ పరిష్కరించకపోవచ్చు. అయితే.. దీనివల్ల గత రెండు, మూడేళ్లుగా పెరిగిన ఉద్రిక్తతలు కాస్త తగ్గి, ఇరు పక్షాలూ స్వల్ప ప్రయోజనాలు పొందేందుకు విశ్వసనీయమైన ముందడుగు పడుతుందని ఆశిస్తున్నారు.

''అమెరికా వ్యవసాయ, ఐసీటీ ఉత్పత్తులకు మరింత అధికంగా మార్కెట్ ప్రవేశానికి.. దానికి బదులుగా భారతదేశపు జీఎస్‌పీ ప్రయోజనాలను పాక్షింగా లేదా పూర్తిగా పునరుద్ధరించటానికి వీలు కల్పించవచ్చు'' అని అబ్జర్వర్ రీసెర్స్ ఫౌండేషన్ రీసెర్చ్ ఫెలో కాషిష్ పార్పియానీ అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)