డోనల్డ్ ట్రంప్‌కు అహ్మదాబాద్‌లో 70 లక్షల మంది స్వాగతం పలకడం సాధ్యమేనా...

ట్రంప్ పర్యటన

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రాక్సీ గాగ్డేకర్ చారా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ రెండ్రోజుల పర్యటన కోసం ఈ నెల 24న భారత్‌కు రాబోతున్నారు. ఆయన వచ్చే విమానం నేరుగా అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దిగనుంది. అక్కడి నుంచే ఆయన పర్యటన ప్రారంభం కానుంది.

తన పర్యటన గురించి ఇటీవల ట్రంప్ అమెరికాలో మాట్లాడుతూ చెప్పిన ఓ విషయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

అడ్డగీత
News image
అడ్డగీత

అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి మోటెరా (సర్దార్ వల్లభ్‌భాయ్) స్టేడియం వరకూ తనకు దారి పొడవునా స్వాగతం పలుకుతూ 50-70 లక్షల మంది జనం ఉంటారని మోదీ తనతో చెప్పినట్లు ట్రంప్ అన్నారు.

అహ్మదాబాద్ లాంటి నగరంలో ట్రంప్ కోసం 70 లక్షల మంది జనం రావడం అస్సలు సాధ్యమయ్యే పనికాదని మోదీ విమర్శకులు అంటున్నారు.

మరోవైపు, అహ్మదాబాద్ అధికారులు రెండు లక్షల మంది జనం రావొచ్చని అంచనా వేస్తున్నారు.

ట్రంప్ పర్యటన

ఫొటో సోర్స్, Getty Images

బీజేపీ కార్యకర్తలు రాత్రింబవళ్లు శ్రమించినా, అంత మంది జనాన్ని తీసుకురాలేరని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అర్జున్ మోద్వాడియా అన్నారు.

''ట్రంప్ మహాత్మ గాంధీ కాదు. అంతటి జనం గాంధీకే వస్తారు'' అని ఆయన వ్యాఖ్యానించారు.

అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సమాచారం ప్రకారం నగర జనాభా 68 లక్షలు. ఈ లెక్కన నగర జనాభా అంతా కదిలి ట్రంప్ కోసం రోడ్లపైకి వచ్చినా, 70 లక్షలు చేరరు.

ట్రంప్ రోడ్ షోకి దాదాపు లక్ష మంది జనం రావొచ్చంటూ అహ్మదాబాద్ మున్సిపల్ కమిషనర్ విజయ్ నెహ్రా కొన్ని రోజుల క్రితం ట్వీట్ చేశారు.

మొటెరా స్టేడియం

ఫొటో సోర్స్, GUJARAT INFORMATION

మోటెరా స్టేడియంలో 1.1 లక్షల మంది కూర్చునేందుకు సామర్థ్యం ఉందని, స్టేడియం బయట కూడా అదనంగా జనాలు కూర్చునేందుకు ఏర్పాట్లు చేశామని అహ్మదాబాద్ కలెక్టర్ కేకే నిరాలా బీబీసీతో చెప్పారు.

''స్టేడియం బయట 15 వేల నుంచి 30 వేల మంది వరకూ జనం ఉండొచ్చు. ఈ దశలో స్పష్టంగా ఏమీ తెలియదు'' అని ఆయన అన్నారు.

అయితే, ఈ అంకెలన్నింటినీ కలిపినా ట్రంప్‌కు మోదీ ఇచ్చినట్లుగా చెబుతున్న మాట నెరవరే పరిస్థితి కనిపించడం లేదు.

ట్రంప్ చెప్పినంత జనాన్ని అహ్మదాబాద్‌ రోడ్లపై ఊహించుకోవడమే తనకు కష్టంగా ఉందని రాజకీయ విమర్శకుడు మనీషీ జనీ అన్నారు.

''ఇక్కడ చివరగా పెద్ద స్థాయిలో జనం వచ్చింది నెహ్రూ కోసమే. అప్పుడు నేను చిన్న పిల్లాడిని. నెహ్రూను చూడాలనుకుని వచ్చినవాళ్లలో నేనూ ఉన్నా. అలాంటి దృశ్యం అహ్మదాబాద్‌లో పునరావృతం కాదు'' అని అన్నారు.

ట్రంప్ పర్యటన

ఫొటో సోర్స్, Reuters

జనం ఎక్కడి నుంచి వస్తారు?

ట్రంప్ రోడ్ షో కోసం జనాలను తీసుకువచ్చేందుకు అహ్మదాబాద్‌లో ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఎయిర్‌పోర్ట్ నుంచి సబర్మతీ ఆశ్రమం వరకూ, అక్కడి నుంచి మోటెరా స్టేడియం వరకూ రోడ్లకు ఇరువైపులా రెయిలింగ్స్ ఏర్పాటు చేశారు.

జన సమీకరణ బాధ్యతలను ప్రభుత్వం, అధికార పార్టీ బీజేపీ పంచుకుంటున్నాయి.

మోటెరా స్టేడియానికి జనాలను తీసుకువచ్చేందుకు రాష్ట్ర బీజేపీ నాయకత్వం, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నాయి.

ట్రంప్ పర్యటన

ఫొటో సోర్స్, Getty Images

రోడ్ షో కోసం జనాలను రప్పించేందుకు అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, నగరంలోని బీజేపీ నాయకత్వం చర్యలు తీసుకుంటున్నాయి.

అహ్మదాబాద్‌లో 13 అసెంబ్లీ, 3 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి.

''రోడ్ షో కోసం జనాలను రప్పించేందుకు మొత్తం నాయకత్వమంతా ప్రయత్నిస్తోంది. చుట్టపక్కల నియోజకవర్గాల నుంచి జనాలను స్థానిక బీజేపీ నాయకులు సమీకరిస్తారు. రోడ్ షోకు చేరుకోవడంలో వారికి సహకరిస్తారు'' అని అహ్మదాబాద్ మేయర్ బిజల్ పటేల్ బీబీసీతో చెప్పారు.

ట్రంప్ పర్యటనకు జన సమీకరణ కోసం బీజేపీ జిల్లా స్థాయి నేతలతో కొన్ని దఫాలు సమావేశాలు జరిపినట్లు పార్టీ అధికార ప్రతినిధి భరత్ పాండ్య తెలిపారు.

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్‌ ది ఇయర్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)