భారత రత్న జాబితాలో దక్షిణాది వారికి తగిన ప్రాముఖ్యం లభించటం లేదా?

ఫొటో సోర్స్, G VENKET RAM
- రచయిత, పద్మ మీనాక్షి
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారత ప్రభుత్వం వివిధ రంగాలలో విశిష్ట సేవలందించిన వ్యక్తులకు అత్యున్నత పురస్కారం ‘'భారత రత్న”ను ఇచ్చి సత్కరిస్తుంది. ఈ అవార్డును ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి ఇవ్వాలని పలువురు సినీ ప్రముఖులు, బాలు అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.
వివిధ భారతీయ భాషల్లో 40,000 వరకు పాటలు పాడి, భారతీయుల గుండెల్లో అజరామరంగా నిలిచిపోయిన బాల సుబ్రహ్మణ్యానికి భారత రత్నను ఇచ్చి గౌరవించాలని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.
ఈ మేరకు సోమవారం నాడు జగన్, ప్రధాని మోదీకి రాసిన లేఖలో... "సంగీత సామ్రాజ్యంలో ఐదు దశాబ్దాల పాటు విశేష ప్రతిభ ప్రదర్శించిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు భారతరత్న ఇవ్వడం అత్యున్నత స్థాయి గుర్తింపునిచ్చినట్లు అవుతుంది. ఆయనకు అదే నివాళి" అని పేర్కొన్నారు.
‘‘వివిధ భాషల్లో పాటలు పాడడమే కాకుండా అత్యుత్తమ నేపథ్య గాయకుడిగా ఆరు జాతీయ అవార్డులను గెలుచుకున్నారు. తెలుగు సినిమాల్లో అత్యుత్తమ గాయకుడిగా 25 రాష్ట్ర స్థాయి నంది అవార్డులను సాధించారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్ర అవార్డులను కూడా అనేకం గెలుచుకున్నారు" అని ఆ లేఖలో రాసారు.
"బాలు ఫిలింఫేర్ అవార్డు, ఫిలింఫేర్ దక్షిణాది ఉత్తమ గాయకుడుగా ఆరు అవార్డులు పొందారు. 2016లో భారత సినీ రంగ ప్రముఖుడుగా (ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్) ఆయనకు వెండి నెమలిని ప్రదానం చేసారు. ఎస్పీ బాలుకు కేంద్ర ప్రభుత్వం 2001లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్ అవార్డులను ఇచ్చి గౌరవించింది" అని తెలిపారు.
ఈ వినతిపై ప్రముఖ సినీ నటుడు కమలహాసన్ స్పందించారు.
“మీకు కృతజ్ఞతలు, సీఎం” అంటూ కమల్ హాసన్ ట్వీట్ చేసారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
బాల సుబ్రహ్మణ్యం కోసం మీరు చేసిన విన్నపం ఒక్క తమిళనాడులోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న ఎందరో అభిమానుల కోరిక అని కమల్ హాసన్ ట్వీట్లో రాశారు.
కొంత మంది బాలు అభిమానులు కూడా ఆయనకు భారత రత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
బాల సుబ్రహ్మణ్యంకి భారత రత్న ఇవ్వాలంటూ బెంగళూరుకి చెందిన బాలు అభిమాని గిరీష్ కుమార్ చేంజ్.ఓఆర్జీ ద్వారా పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ద్వారా ఆయన సంతకాల సేకరణ చేస్తున్నారు. గిరీష్ బీబీసీతో మాట్లాడారు.
చిన్నప్పటి నుంచి బాలు అభిమాని అయిన గిరీష్ ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలోనే బాలుకి భారత రత్న ఇవ్వాలని ఫేస్ బుక్‌లో ఉన్న బాలు సంగీత ప్రేమికుల గ్రూపులో ప్రతిపాదించినట్లు చెప్పారు.
“నేను సంతోషంతో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు కూడా బాలు పాటలే నాకు ఆసరా. నా జీవితంలో భారత మాజీ ప్రధాని వాజ్‌పేయి, బాల సుబ్రహ్మణ్యం మాత్రమే నాకు ఆదర్శ వ్యక్తులు” అని ఆయన అన్నారు.
అయితే, ఈ లోపు బాలు మరణం తమను పూర్తిగా కృంగదీసిందని, 50 సంవత్సరాల పాటు సినీ సంగీత ప్రపంచానికి సేవలందించిన బాల సుబ్రహ్మణ్యంకి భారత ప్రభుత్వం అత్యున్నత గౌరవం ఇచ్చి ఇప్పటికైనా సత్కరించాలనే ఉద్దేశ్యంతోనే పిటిషన్ వేసినట్లు బీబీసీకి తెలిపారు.
మంగళవారం నాటికి ఈ పిటిషన్‌పై 34000 మంది సంతకాలు చేశారు.
దక్షిణాదివారికి భారత రత్న ప్రదానం చేయటంలో వివక్ష కనిపిస్తోందా?
ఇటీవలి కాలంలో తెలుగు ప్రజలు భారత మాజీ ప్రధాని పివి నరసింహా రావుకి, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకి కూడా భారత రత్న ఇవ్వాలనే డిమాండ్ చేశారు.
"బాల సుబ్రహ్మణ్యంకి భారత రత్న ఇవ్వాలనే డిమాండ్ చాలా సబబైన డిమాండ్" అని ఆర్ధికవేత్త, మాజీ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సలహాదారునిగా వ్యవహరించిన పరకాల ప్రభాకర్ అన్నారు.
"సమకాలీన కాలంలో సంగీత విద్వాంసులలో, సినీ గాయకులలో బాలుకి మించిన వారు లేరు" అని అయన అన్నారు.
‘‘ఇటీవల కాలంలో భారత రత్న పొందిన వారి జాబితాను పరిశీలిస్తే దక్షిణాది వారికి ముఖ్యంగా తెలుగు వారికి లభించిన ప్రాముఖ్యం అసలు లేదనే చెప్పాలి’’ అని ఆయన అన్నారు. దీనిని సరిచేసుకోవల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందని ఆయన అభిప్రాయ పడ్డారు.
బాల సుబ్రహ్మణ్యం, నరసింహారావు, రామారావు లాంటి వ్యక్తులకు భారత రత్న ఇవ్వకపోవడం ఆ పురస్కారానికే చిన్నతనం తప్ప, వారి వ్యక్తిత్వానికి, సేవలకు కాదని ఆయన అన్నారు.
భారత రత్న అర్హులకు ఇస్తున్నారనే భావన ప్రజల్లో కలగాలంటే వీరి ముగ్గురికీ కూడా భారత రత్న ఇచ్చి తీరాల్సిందేనని ఆయన అభిప్రాయ పడ్డారు.

ఫొటో సోర్స్, SPB/FACE BOOK
‘మా నాన్నే మాకు భారత రత్న’
అయితే, సోమవారం నాడు నిర్వహించిన పత్రికా సమావేశంలో బాల సుబ్రహ్మణ్యం కుమారుడు ఎస్పీ చరణ్ మాట్లాడుతూ, "మా నాన్నగారే మాకు భారత రత్న. ఆయనే లేనప్పుడు మాకు భారత రత్న ఎందుకు" అని అన్నారు.
గతంలో బాల సుబ్రహ్మణ్యం తాను పాల్గొనబోయే కార్యక్రమంలో తన బిరుదులను వాడవద్దని విజ్ఞప్తి చేస్తూ కార్యక్రమ నిర్వాహకులకు తన చేతి రాతతో రాసిన లేఖ కూడా బాలు మరణానంతరం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ లేఖలో “దయ చేసి నా పేరులో డాక్టర్, పద్మ భూషణ్, గాన గంధర్వ లాంటి విశేషణాలు వేయకండి " అని బాలు అభ్యర్ధించారు.
భారత రత్నను ఎవరికి ఇస్తారు?
దేశంలో వివిధ రంగాలలో అత్యుత్తమ సేవలందించిన వ్యక్తులకు భారత ప్రభుత్వం భారత రత్న పురస్కారం ఇచ్చి సత్కరిస్తుంది. ఇది దేశంలోనే అత్యున్నత పురస్కారం.
దేశంలో భారత రత్న, పద్మ విభూషణ్ అత్యున్నత పురస్కారాలుగా పేర్కొంటారు. భారత ప్రభుత్వం ఈ అవార్డులను ప్రదానం చేయడం 1954 నుంచి మొదలయింది.
దీనిని కళలు, సాహిత్యం, సైన్స్, రాజకీయం, క్రీడలు ఇలా పలు రంగాలలో విశేష ప్రతిభ కనబరిచిన వారికి ఇస్తారు. ఈ అవార్డును ప్రదానం చేయడానికి లింగ, మత, జాతి, వృత్తిపరమైన బేధాలు ఏమీ లేవు.
తమ తమ రంగాలకు అత్యున్నత సేవలు అందించి అంతర్జాతీయంగా దేశానికి ఖ్యాతి తెచ్చిన వారి సేవలను గుర్తించేందుకు ప్రభుత్వం వారికి భారత రత్న ఇచ్చి సత్కరిస్తుంది.
భారత రత్న అవార్డును ఇచ్చేందుకు ప్రధాన మంత్రి, దేశాధ్యక్షుడికి సిఫార్సు చేస్తారు. ఈ అవార్డు ప్రదానానికి అధికారికంగా ఎటువంటి సిఫారసులు చేయవలసిన అవసరం లేదు. గతంలో ఏడాదికి నలుగురికి కూడా భారతరత్న ప్రదానం చేసినప్పటికీ.. ప్రస్తుతం ముగ్గురికి మాత్రమే ఈ పురస్కారం ఇవ్వాలని నిబంధనలు మార్చారు.
ఈ అవార్డులో నగదు బహుమానం ఏమీ ఉండదు. దేశాధ్యక్షుడు సంతకం చేసిన సర్టిఫికెట్ తో పాటు ఒక మెడల్ బహుకరిస్తారు.
ఈ అవార్డును అవార్డు గ్రహీత పేరు ముందు గాని, వెనుక గాని వాడుకోవడాన్ని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 18 (1) నిషేధిస్తుంది. కానీ, అవార్దు గ్రహీత తన బయో డేటాలోఈ విషయాన్ని పొందుపర్చుకోవచ్చు.
ప్రతీ సంవత్సరం భారత రత్న పురస్కారాన్ని ఇవ్వాలనే నియమం లేదు. రాగి ఆకు రూపంలో ఉండే ఈ పతకంపై సూర్యుని ప్రతిబింబం ఉండి హిందీలో భారత రత్న అనే పదాలు చెక్కి ఉంటాయి. అవతలి వైపు నాలుగు సింహాల గుర్తు సత్యమేవ జయతే అనే లక్ష్యం రాసి ఉంటాయి.

ఫొటో సోర్స్, knowindia.gov.in
కేంద్ర ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఈ అవార్దును అందుకున్న తొలి వ్యక్తి చంద్రశేఖర వెంకట రామన్.
ఈ అవార్దును విదేశీయులకు కూడా ప్రదానం చేయవచ్చు. ఈ అవార్దును 1980లో మదర్ థెరెసాకి ప్రదానం చేశారు. ఆ తరువాత 1990లో ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, నెల్సన్ మండేలాకి కూడా ఇచ్చారు.
ఇప్పటి వరకు భారత రత్న అందుకున్న తెలుగు వ్యక్తులు, దక్షిణాది వారిలో ఇంజనీరింగ్ సేవలందించిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య, మాజీ దేశాధ్యక్షులు సర్వేపల్లి రాధాకృష్ణన్, సి రాజగోపాలాచారి, సీవీ రామన్, జాకిర్ హుస్సేన్, వీవీ గిరి, కె. కామరాజ్, ఎంజీ రామచంద్రన్, ఏపీజే అబ్దుల్ కలాం, చిదంబరం సుబ్రమణియం, సీఎన్ఆర్ రావు ఉన్నారు.
సంగీత ప్రపంచంలో ఈ పురస్కారాన్ని పొందిన వారిలో ఎంఎస్ సుబ్బులక్ష్మి, పండిట్ రవిశంకర్, లతా మంగేష్కర్, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్, పండిట్ భీంసేన్ జోషి ఉన్నారు.
1954 నుంచి 2019 వరకూ మొత్తం 48 మందికి భారత రత్న పురస్కారాన్ని ప్రదానం చేయగా అందులో 12 మంది దక్షిణ భారతీయులు.
వీరిలో తమిళ నాడు నుంచి 8 మందికి, కర్నాటక నుంచి ముగ్గురికి, తెలంగాణ (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్- జాకిర్ హుస్సేన్) నుంచి ఒకరికి భారత రత్న లభించింది.
ఇవి కూడా చదవండి:
- బాల గంగాధర్ తిలక్: కుల వివక్షను, స్త్రీల అణిచివేతను బలంగా సమర్థించారా?
- ‘ఆలయ ప్రవేశాన్ని సమర్థించిన గాంధీ హరిజన బాంధవుడేనా?’
- చైనా - భారత్ సరిహద్దు సంఘర్షణ: 21వ శతాబ్దపు అతిపెద్ద జగడం ఇదేనా?
- భారత్, చైనాల సంబంధాల్లో మార్పులు రాబోతున్నాయా? మోదీ, జిన్పింగ్ భేటీ సాధ్యమేనా?
- ‘నీకు జీవితంలో తోడు దొరకదని శకుంతల దేవి చెప్పారు.. ఇప్పటికీ ఒంటరిగానే ఉన్నాను’
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- ఆనందం కోసం 'సెక్స్'ను ఆశ్రయించకుండా మహిళలు నిగ్రహం పాటించాలని గాంధీ ఎందుకన్నారు?
- అయోధ్యలో రామమందిరం కింద టైమ్ కాప్స్యూల్?.. అందులో దాగిన రహస్యమేంటి
- బాబ్రీ మసీదు విధ్వంసాన్ని పీవీ నరసింహారావు ఎందుకు ఆపలేదు?
- ‘తిలక్ ఇంకొన్నాళ్లు బతికుంటే భారత్-పాకిస్తాన్లు విడిపోయేవి కాదు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








