'కరోనావైరస్ నుంచి కోలుకున్నాను... కానీ, కంప్యూటర్ స్క్రీన్ నన్ను దెయ్యంలా వెంటాడుతోంది'

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, వికాస్ పాండే
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారత్‌లో పెరుగుతున్న కోవిడ్-19 కేసులు మరో కొత్త సమస్యను సృష్టిస్తున్నాయి. ఈ వైరస్‌బారిన పడినవాళ్లలో కొందరు మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్ డిజార్డర్ రానున్న రోజుల్లో కరోనా తరహాలో మహమ్మారిగా మారే ప్రమాదముందని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రాజేశ్ తివారీకి 42 ఏళ్లు. ఆయనకు ఈ మధ్య ఒక ఫోబియా పట్టుకుంది. మొబైల్ ఫోన్‌కన్నా పెద్ద స్క్రీన్‌ను కనిపిస్తే భయపడిపోతున్నారు. టీవీ స్క్రీన్‌లు, కంప్యూటర్ మానిటర్‌లు తనను మింగేసే పెద్ద దెయ్యాల్లాగా ఆయనకు కనిపిస్తున్నాయి.
తివారీలో ఈ ప్రవర్తన ఈ మధ్యనే మొదలైంది. ఇటీవల ఆయన కరోనా బారినపడ్డారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఐదు రోజులపాటు ఐసీయూలో, కొన్నాళ్లు వెంటిలేటర్ మీద కూడా తివారీకి చికిత్స అందించాల్సి వచ్చింది.
మూడు వారాలు ఆసుపత్రిలో ఉన్న తివారీ మెల్లగా కోలుకున్నారు. అయితే ఆసుపత్రి నుంచి బైటికి వచ్చినా, తాను మరో ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు ఆయనకు అర్ధమైంది.
“నాకిప్పుడు ఆరోగ్యం బాగానే ఉంది. కానీ హాస్పిటల్ నుంచి వచ్చిన తొలి రోజుల్లో నేను చాలా ఇబ్బంది పడ్డాను’’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు తివారీ.
ఆయన క్షేమంగా ఇంటికి చేరడంతో కుటుంబ సభ్యులంతా ఉప్పొంగిపోయారు. కానీ తివారీ ఏదో సమస్యతో ఇబ్బంది పడుతున్నారని కుటుంబ సభ్యులకు కూడా అర్ధమైంది. ఒకరోజు టీవీని చూసి తివారీ పెద్దగా అరిచారు. దాన్ని పగలగొట్టడానికి ప్రయత్నించారు. అప్పటి నుంచి కుటుంబ సభ్యులెవరూ టీవీ ఆన్ చేయడం లేదు. ఇంట్లో ల్యాప్‌టాప్ తెరవడానికి ఎవరికీ అనుమతి లేదు.

ఫొటో సోర్స్, Getty Images
ఐసీయూలో ఉన్నప్పుడు నిత్యం బీప్ శబ్దాలు చేస్తూ కనిపించిన కంప్యూటర్ స్క్రీన్‌లు, మానిటర్‌లను ఆయన తన మనసు నుంచి తీసేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ సాధ్యం కావడం లేదు.
అమిత్ శర్మది కూడా ఇదే తరహా కథ. 49 ఏళ్ల శర్మ కోవిడ్ బారినపడి 18 రోజులు ఐసీయూలో ఉండి వచ్చారు. అక్కడ మనషులు చనిపోతుండటాన్ని ఆయన కళ్లారా చూశారు. యువకులు, ముసలివాళ్లు, మహిళలు ఇలా తన చుట్టూ ఉన్న అనేకకమంది తన కళ్ల ముందే మరణించడం ఆయన గమనించారు.
“ఒకరోజు నా పక్క బెడ్ మీద ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. కొన్ని గంటలపాటు వారి మృతదేహాలు అక్కడే ఉన్నాయి’’ అని గుర్తు చేసుకున్నారు శర్మ.
“ఆ దృశ్యాలను నేను మనసు నుంచి తీసేయలేకపోతున్నాను. కోవిడ్ నన్ను చంపేస్తుందని ఇప్పటికీ భయంగానే ఉంది ’’ అన్నారు శర్మ.

ఫొటో సోర్స్, XAVIER GALIANA
ఆసుపత్రి నుంచి వచ్చాక శర్మలో పెద్ద మార్పు కనిపించింది. ఆయన ఎక్కువసేపు మౌనంగా ఉంటున్నారని ఆయన మామ వెల్లడించారు. “ఒకవేళ మాట్లాడినా ఆసుపత్రిలో తన కళ్ల ముందు చనిపోయిన వారి గురించే చెబుతున్నారు’’ అని శర్మ మామ తెలిపారు.
“కోవిడ్ వైరస్ బారినపడి చికిత్స తీసుకున్నవారు, ముఖ్యంగా ఐసీయూ, వెంటిలేటర్‌ల మీద ట్రీట్‌మెంట్ పొందిన వారిలో మానసిక రుగ్మతలు ఎక్కువగా కనిపిస్తున్నాయి’’ అన్నారు ముంబైలోని పీడీ హిందూజా ఆసుపత్రిలో సీనియర్ సైకియాట్రిస్ట్‌గా పని చేస్తున్న వసంత్ ముంద్రా. “ఆసుపత్రిలో గడపడంతో మెదడు అలసిపోయి ఉంటుంది. ఇక కోవిడ్ వార్డుల్లో కనిపించే దృశ్యాలు మనిషి ఆలోచనలను మార్చేస్తాయి” అన్నారు ముంద్రా.
“కోవిడ్ వైరస్ బాధితులు బంధువులను, స్నేహితులను కలుసుకోవడానికి, మాట్లాడటానికి వీలుండదు. వాళ్ల చుట్టూ డాక్టర్లు, నర్సులు తిరుగుతుంటారు. వారు కూడా నిత్యం పీపీఈ కిట్లు ధరించి కనిపిస్తారు. అది కూడా పేషెంట్లలో డాక్టర్ల మీద అపనమ్మకం కలగడానికి, అనుమానాలు, భయాలు పెరగడానికి కారణమవుతుంది. అందుకే వాళ్లు కోలుకోవడానికి కూడా సమయం పడుతుంది’’ అన్నారు డాక్టర్ ఫతాహుదీన్. ఆయన ఎర్నాకుళం మెడికల్ కాలేజీలో క్రిటికల్ కేర్ విభాగంలో పని చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కోవిడ్ నుంచి కోలుకునే ప్రక్రియ ఒంటరితనంతో కూడుకున్న వ్యవహారం. ప్రాణభయం ఉన్న బాధితుల్లో కోవిడ్ చికిత్స తర్వాత మానసిక సమస్యలు, ఒత్తిళ్లు కొనసాగుతాయి. కుంగుబాటు, ఆందోళన, నిత్యం గతాన్ని గుర్తు చేసుకోవడం, భయం, భ్రాంతిలాంటివి పెరుగుతాయని డాక్టర్ ముంద్రా చెబుతున్నారు.
కరోనా వైరస్ కారణంగా ఏర్పడే మానసిక సమస్యల గురించి ఎవరూ ఆలోచించడంలేదని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్వహించే ప్రెస్ మీట్లు, అప్పుడప్పుడు మీడియాలో ప్రస్తావన తప్ప దానిపై పూర్తిగా దృష్టి పెట్టడం లేదంటున్నారు నిపుణులు. “ఇండియాలో మానసిక చికిత్సలకు ఎంత తక్కువగా ప్రాధాన్యముందో కోవిడ్ మహమ్మారి కాలంలో బైటపడింది” అన్నారు ప్రముఖ మానసిక వైద్య నిపుణులు సౌమిత్రా పథారే.
భారతదేశంలో మానసిక చికిత్సలకు అవసరమైన సదుపాయాలులేవని, చిన్నపట్టణాల్లో ఈ తరహా మానసిక సమస్యలు పెరుగుతున్నాయని, కొందరు తమలో మార్పును గుర్తించలేకపోతున్నారని వైద్య నిపుణులు అంటున్నారు.
"మానసిక సమస్యలకు చికిత్స కోసం సదుపాయాలు ఎక్కువగా పెద్ద పట్టణాలకే పరిమితమయ్యాయి. దాదాపు 80 నుంచి 90శాతంమంది ప్రజలకు ఈ చికిత్స అందుబాటులోలేదు" అని డాక్టర్ పథారే చెప్పారు. కరోనా మహమ్మారి సమయంలో ఈ లోపం స్పష్టంగా కనిపిస్తోందని ఆయన అన్నారు. ఈ పరిస్థితిని గమనించి ప్రభుత్వం తక్షణం చర్యలు చేపట్టకపోతే భారతదేశం కరోనా తర్వాత మానసిక రుగ్మతల మహమ్మారిని ఎదుర్కోవాల్సి ఉంటుందని డాక్టర్ పథారే హెచ్చరించారు.

ఫొటో సోర్స్, Getty Images
ముందు ఇలాంటి సమస్యల మీద ప్రజలకు అవగాహన కల్పించడం మొదటి చర్యని, తర్వాత మానసిక ఆరోగ్య కేంద్రాలపై, ముఖ్యంగా చిన్నపట్టణాల్లో వాటి ఏర్పాటుపై దృష్టి పెట్టడం ప్రభుత్వాలు చేయాల్సిన పని అని పథారే అంటున్నారు. “ఇది ఒక రోజులో జరిగేది కాదు. కానీ ఎక్కడో ఒకచోట మొదలుపెట్టాలి” అని స్పష్టం చేశారు పథారే.
కరోనా మహమ్మారి కాలంలో మానసిక సమస్యలు పెరగడాన్ని తాము గమనించామని అన్నారు ఢిల్లీలోని ఫోర్టిస్ ఆసుపత్రి మానసిక చికిత్సల విభాగంలో పనిచేస్తున్న కామ్న చిబ్బర్. నెలలపాటు సాగిన లాక్‌డౌన్, భవిష్యత్తు మీద బెంగ, నిత్యం జాగ్తత్తగా ఉండాల్సి రావడంలాంటి అంశాలన్నీ ప్రజల మానసిక ఆరోగ్యం మీద ప్రభావం చూపాయంటారు కామ్నా.
కుంగుబాటు, ఆందోళన అనే సమస్యలతోనే ఎక్కువమంది తమ వద్దకు వస్తున్నారని కామ్నా తెలిపారు.రోజులు గడుస్తున్న కొద్దీ సమస్య తీవ్రత పెరుగుతోందని అంటున్నారామె.
కరోనా చికిత్స తర్వాత బాధితుల్లో మానసిక సమస్యల అంశంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరముందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
“మనం ప్రజలను కోవిడ్ నుంచి రక్షిస్తున్నాం. కానీ వారిని కుంగుబాటు, పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (PTSD)లాంటి సమస్యలకు వదిలేయకూడదు’’ అన్నారు డాక్టర్ ఫతాహుదీన్.
(పేషెంట్ల గుర్తింపును గోప్యంగా ఉంచేందుకు వారి పేర్లను మార్చాం)
ఇవి కూడా చదవండి:
- అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేసుకుని, ఆత్మహత్య చేసుకున్న రైతు కథ
- ఆత్మీయులు చనిపోయినప్పుడు ఆకలి చచ్చిపోతుంది... ఆ శోకంలో ఆహారం ఊరటనిస్తుందా
- మానసిక ఒత్తిడి వల్ల తొందరగా చనిపోతారా....
- బీటిల్స్ మ్యూజిక్ బ్యాండ్ భారత్‌లో ఓ గుండె పగిలిన ప్రేమికుడికి ఎదురుపడినప్పుడు...
- శుక్ర గ్రహంపై జీవం ఉందా.. శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు
- 1988లో భారత సైన్యం మాల్దీవులలో అడుగు పెట్టినపుడు ఏం జరిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








