కరోనావైరస్ లాక్‌డౌన్: పసిఫిక్ మహాసముద్రంలో ఓ నావికుడి పీడకల, 3 నెలల పాటు నీళ్లపైనే జీవితం

ఫొటో సోర్స్, PHOTO SUPPLIED: FMSRCC
- రచయిత, వెట్టే ట్యాన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
పసిఫిక్ మహాసముద్రంలో మూడేళ్లపాటు ఒంటరి యాత్ర చేయాలనుకున్న ఒక నావికుడి ఆలోచన, ఆశయం చివరకు ఒక పీడకలగా మిగిలింది. సముద్రంలోకి వెళ్లిన ఆయన్ను లాక్‌డౌన్ కారణంగా ఏ దేశమూ తమ తీరంలోకి అనుమతించలేదు. దాంతో ఆయన దాదాపు 3 నెలల పాటు సముద్రంలో ఒంటరిగా బతకాల్సి వచ్చింది.
ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా లాక్‌డౌన్ కారణంగా సరకులు దొరకవన్న భయంతో ఎక్కువ మొత్తంలో కొని ఇంట్లో నిల్వచేసుకుంటున్న వేళ ఆయన ఆహారం, పెట్రోలు లేకుండా సముద్రంలో ద్వీపాల మధ్య తిరుగుతూ.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఆయన ఇంటి పేరు వాంగ్. తన పేరు వెల్లడించడానికి ఆయన ఇష్టపడలేదు.
59 ఏళ్ల ఆ మాజీ నావికుడు సంవత్సరాల తరబడి సముద్రం మీద ప్రయాణించేందుకు చేసిన సాహసోపేత ప్రయత్నం ఇది. ఇందుకోసం ఆయన అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. తాను వెళ్లాలనుకున్న ప్రాంతాలలో వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా ఇంధనం సిద్దం చేసుకున్నారు.
సింగపూర్ నుంచి ఫిబ్రవరి 2న సముద్ర యాత్ర ప్రారంభించారు. ముందుగా ఫిలిప్పీన్స్ నుంచి పోలినేషియా వరకు ప్రయాణించాలన్నది ఆయన ఆలోచన. ఒక యాట్ (చిన్న పడవ)లో ప్రయాణిస్తే అక్కడికి వెళ్లేందుకు 4 నెలల సమయం పడుతుంది. అక్కడి నుంచి ఆ తర్వాత వివిధ ప్రాంతాలకు తన యాట్‌లోనే తిరగాలన్నది ఆయన ప్రణాళిక.
కానీ ఎంత మంచి ప్రణాళికలు వేసినా అవి ఒక్కోసారి విఫలమవుతాయని ఆయనకు అర్థమైంది. ముఖ్యంగా కరోనా మహమ్మారి కారణంగా ఆయన ప్రయత్నాలన్నీ తలకిందులయ్యాయి.

ఫొటో సోర్స్, MR WONG
దారుణంగా మారిన పరిస్థితులు
తొలి ప్రయాణపు సెషన్‌లో వాంగ్‌తో పాటు ఆయన ఇద్దరు స్నేహితులు కూడా కొంత దూరం ప్రయాణించారు.
ఫిబ్రవరి చివర్లో వారిద్దరు ఇండోనేషియాలో దిగిపోయారు. అక్కడి నుంచి వాంగ్ ఒక్కరే ప్రయాణం మొదలుపెట్టారు. అక్కడి నుంచి పపువా న్యూ గినీ చేరుకోవాలన్నది ఆయన ప్రయత్నం. అక్కడ తన యాట్‌కు ఇంధనం నింపుకోవడం, ఆహార పదార్థాలు కొనుక్కోవడం వంటి పనులు చేయాలనుకున్నారు. అయితే, కొద్దిరోజుల తర్వాత తన యాట్‌లో ఆటోపైలట్ వ్యవస్థ పని చేయడం మానేసింది.
''నేను ఇండోనేషియా జలాల్లోనే ఉన్నాను. బోట్ అక్కడే ఆపేసి కొంత విశ్రాంతి తీసుకుని రిపేర్ చేయించుకుందామని భావించాను. కానీ వాళ్లు నన్ను రానివ్వలేదు. లాక్‌డౌన్ మొదలైందని, వెళ్లిపోవాలని సూచించారు. దీంతో రిపేర్ చేసుకోకుండానే అక్కడి నుంచి బయలుదేరా'' అని వాంగ్ బీబీసీకి చెప్పారు.
ఆటోపైలట్ సిస్టం పని చేయడం లేదంటే.. బోటు నడిచినంతసేపు ఒక మనిషి దాన్ని పర్యవేక్షిస్తుండాలి. రాత్రిపూట గంటకోసారి మోగేలా అలారం సెట్ చేసి, వాంగ్ ప్రతిసారి తాను ఎక్కడున్నది చెక్ చేసుకుంటూ వెళ్లాల్సి వచ్చింది.
అప్పటికీ ఆయనకు అంతగా అదృష్టం కలిసిరాలేదు. పపువా న్యూ గినీ ప్రాంతానికి చేరుకునేసరికి ఇంటి నుంచి శాటిలైట్ ఫోన్ కాల్ వచ్చింది. పపువా న్యూ గినీలో కూడా లాక్‌డౌన్ విధించారని, దాని సరిహద్దులు కూడా మూసేశారన్నది ఆ ఫోన్ కాల్ సారాంశం.
దీంతో ఆయన ఒక చిన్నదీవిలో ఆగిపోవాలని అనుకున్నారు.
''అదో చిన్న ద్వీపం. 20- 30 కుటుంబాలు ఉంటున్నాయి. అక్కడ ఫోన్ లేదు, టీవీ లేదు, ఏమీ లేదు. చివరకు అక్కడి వాళ్లు కూడా లాక్‌డౌన్ ఉందంటూ నన్ను రానివ్వలేదు. అక్కడి నుంచి పంపేశారు. నేను ఇంకా కొన్ని చిన్నచిన్న దీవులకు వెళ్లాను. అందరూ నన్ను వెళ్లగొట్టారు'' అని గుర్తు చేసుకున్నారు వాంగ్.
''చివరికి తెలిసిందేంటంటే, దక్షిణ పసిఫిక్ ద్వీపాలన్నీ లాక్‌డౌన్‌లో ఉన్నాయని, ఎవరినీ తమ దేశంలోకి రానివ్వడం లేదని అర్థమైంది. కానీ, నేను నా యాత్రలో సగం దూరం వచ్చేశాను. తిరిగి వెనక్కి వెళ్లలేను. ఇక చివరకు తువాలు అనే దీవికి వెళ్లాలని నిర్ణయించుకున్నాను'' అని చెప్పారు వాంగ్.

ఫొటో సోర్స్, MR WONG
అలా అక్కడి నుంచి 13 రోజుల పాటు ప్రయాణించారు. ఏప్రిల్ 21న తువాలు ప్రాంతానికి చేరుకున్నారు వాంగ్. అప్పటికే తన యాట్‌లో వారాలపాటు ఒంటరిగా ఉన్నారు. దగ్గరున్న సరకులు అయిపోతున్నాయి.
''మొదట్లో నేను వైరస్ ప్రభావం లేని దేశాలలో ఆగుతూ అక్కడ ఆహార పదార్థాలు, ఇంధనం నింపుకుంటూ వెళ్లాలని అనుకున్నా. కానీ కూరగాయలు తొందరగా పాడయ్యాయి. నా పడవలో ఫ్రిజ్ ఉంది కాబట్టి, బంగాళా దుంపలు, మాంసంలాంటి వాటిని జాగ్రత్తగా దాచుకోగలిగాను'' అని వివరించారు వాంగ్.
''తువాలు దీవికి మరో రెండు గంటల్లో చేరతాననగా మెరైన్ అధికారులు నన్ను పసిగట్టారు. అక్కడి నుంచి వెనక్కి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించారు. నా దగ్గర పెట్రోలు లేదు, తినడానికి కూడా ఏమీ లేదు. నేను ఒడ్డు మీదకు వెళ్లను. నీళ్లలోనే ఉంటాను, దయచేసి ఉండనివ్వండని వారిని వేడుకున్నాను. ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్నానని బతిమాలాను. కానీ వారు నన్ను కదలొద్దు అన్నారు. కనీసం నాకు ఆహారం, ఇంధనం కొనుక్కునే అవకాశమైనా ఇవ్వండని వేడుకున్నా'' అని వెల్లడించారు.

- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా

1,000 లీటర్ల డీజిల్, నెలకు సరిపడా ఆహార పదార్థాలు ఇచ్చి, ఆయన దగ్గర 1,400 అమెరికన్ డాలర్లు (సుమారు రూ.లక్ష) వసూలు చేశారు.
“ఆహార పదార్థాలు, డీజిల్ తీసుకుని రెండు బోట్లు వచ్చాయి. అక్కడి దాకా తెచ్చి, సామాజిక దూరం కారణంగా మేం నీ దగ్గరకు రాలేమని వారు తేల్చి చెప్పారు. నా దగ్గరున్న చిన్న రబ్బరు బోటును వారివైపు విసిరేశాను. వాళ్లు ఆ సామాన్లన్నీ అందులో పెట్టారు. వాటన్నింటినీ నా బోటులోకి చేర్చడానికి చాలా సమయం పట్టింది'' అని వాంగ్ వివరించారు.
ఇక అక్కడి నుంచి బయలుదేరి ఫిజీ దీవులకు వెళ్లాలని వాంగ్ నిర్ణయించుకున్నారు. ఇదే సమయంలో ఆయన కుటుంబ సభ్యులు సింగపూర్ విదేశాంగ మంత్రి దగ్గరకు వెళ్లి విషయం చెప్పారు. ఫిజీలో ఆయన్ను ఆగనిచ్చేందుకు అనుమతి ఇప్పించాలని వారు కోరారు.

ఫొటో సోర్స్, MR WONG
అటువైపు నుంచి ఆదేశాల కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు. అంతకన్నా ఆయన దగ్గర వేరే మార్గం కూడా లేదు. అయితే ఆయన విధి మళ్లీ వక్రీకరించింది. ఆయన బోటు ఒక సముద్రపు దిబ్బను ఢీకొంది.
''ఏప్రిల్‌లో నా యాట్ ప్రొపెల్లర్ దెబ్బతింది. ఆ రోజు ఇంకా బాగా గుర్తుంది. భారీ గాలులు వీచాయి'' అని చెప్పారు వాంగ్.
హారోల్డ్ తుపాను తనకు 500 మైళ్ల దూరంలో ఉందని (926 కి.మీ.) తర్వాత ఆయనకు అర్థమైంది. ఆ తుపాను పసిఫిక్ దీవులపై తీవ్రప్రభావం చూపింది. డజన్ల సంఖ్యలో ప్రజలు చనిపోయారు.
''తుపాను చాలా దూరంలో ఉంది. కానీ దాని ప్రభావం నాకు అర్థమవుతూనే ఉంది. గాలులు బలంగా వీయడంతో నా బోటు సముద్రపు దిబ్బను ఢీకొట్టింది. దీంతో దాని ప్రొపెల్లర్ దెబ్బతిని పని చేయడం మానేసింది'' అని గుర్తుచేసుకున్నారు వాంగ్.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
నా యాత్ర కొనసాగిస్తా: వాంగ్
అదృష్టం బాగుండి ఆయన తమ తీరంలో అడుగుపెట్టేందుకు ఫిజీ ప్రభుత్వం అంగీకరించింది.
''నేను ఈ వార్త విని చాలా సంతోషించాను. ఫిజీ ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు. అలాగే నాకు సాయం చేసేందుకు ప్రయత్నించిన సింగపూర్ విదేశాంగ శాఖకు కూడా ధన్యవాదాలు'' అని వాంగ్ అన్నారు.
ఏప్రిల్ 29న ఒక బోటును పంపి వాంగ్ యాట్‌ను ఫిజీ తీరానికి చేర్చారు ఆ దేశపు నేవీ సిబ్బంది. అప్పటికే మూడు నెలలపాటు ఆయన సముద్రంలో తిరుగుతూ గడిపారు.
''ఆయన యాట్ చెడిపోవడం, సరకులు కూడా అయిపోవడంతో వాంగ్ తీవ్రంగా అలిసిపోయారు'' అని ఫిజీ కమాండర్ టిమ్ నటువా బీబీసీతో అన్నారు.
కస్టమ్స్, ఇమ్మిగ్రేషన్, హెల్త్, నేవీ విభాగాలకు సంబంధించి సింగపూర్, ఫిజీ ప్రభుత్వాల వివిధ మంత్రిత్వ శాఖలు సమన్వయంతో పని చేయడంతో ఆయన్ను వీలైనంత త్వరగా రక్షించగలిగామని కమాండర్ నటువా వెల్లడించారు.
ఫిజీ దేశపు జనాభా 8,80,000 ఉంటుంది. అక్కడ ప్రస్తుతం 18 కరోనా కేసులు నమోదయ్యాయి. పసిఫిక్ తీరంలో అతి తక్కువ కేసులు నమోదైన దేశాలలో ఫిజీ ఒకటి.
వాంగ్‌ను తీరానికి తీసుకెళ్లిన వెంటనే ఆసుపత్రికి తరలించారు. కరోనా టెస్టులు నిర్వహించారు. నెగెటివ్ అని రిపోర్టు వచ్చింది.
''నాకు ఒకవేళ పాజిటివ్ వచ్చి ఉంటే అది ఎలా వచ్చిందో మాత్రం నేను చెప్పలేను. ఎందుకంటే నేను నెలలపాటు మనుషులను కలవలేదు'' అని చమత్కరించారు వాంగ్.
చాలా దేశాలు మిమ్మల్ని వాళ్ల తీరానికి రానివ్వకపోవడం మీకెలా అనిపించింది? అని వాంగ్‌ను ప్రశ్నించగా... ''వాళ్ల సమస్యను కూడా అర్థం చేసుకోవాలి. ఒకవేళ వాళ్లు నన్ను రానిస్తే, నా వల్ల వాళ్ల దేశంలో ఎవరికైనా వైరస్ అంటుకుంటే వాళ్లు సమాధానం చెప్పుకోవాలి కదా'' అన్నారు వాంగ్.
''నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే, టీవీ, ఇంటర్నెట్ లేని దీవులు కూడా వైరస్ గురించి తెలుసుకోగలిగాయి. వాళ్లు వ్యాధి తీవ్రతను గుర్తించగలిగారు. ఇది చాలా గొప్ప విషయం'' అన్నారు వాంగ్.
ఆయన ఇప్పుడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఫిజీలో తన యాట్‌ను రిపేర్ చేయించుకుంటున్నారు. తన యాత్రను తిరిగి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుకుంటున్నారు.
''ఈ మహమ్మారి నుంచి మనమంతా బయట పడతామని నేను అనుకుంటున్నాను. ఇదంతా ముగిశాక, నేను నా యాత్రను మళ్లీ మొదలుపెడతా'' అని విశ్వాసంతో చెప్పారు వాంగ్.
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: కిమ్ జోంగ్ ఉన్ ఉత్తర కొరియాలో వైరస్ వ్యాప్తి చెందకుండా ఏం చేశారు?
- కరోనావైరస్: ఇళ్లలో తయారుచేసే మాస్కులు ఎంత భద్రం?
- హ్యాండ్ శానిటైజర్లకు ఎందుకింత కొరత?
- కరోనావైరస్: తొలి మేడిన్ ఇండియా టెస్టింగ్ కిట్ తయారు చేసిన భారతీయ శాస్త్రవేత్త
- ఆత్మీయులు చనిపోయినప్పుడు ఆకలి చచ్చిపోతుంది... ఆ శోకంలో ఆహారం ఊరటనిస్తుందా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








