శుక్ర గ్రహంపై జీవం ఉందా.. శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు

శుక్రగ్రహం

ఫొటో సోర్స్, JAXA/ISAS/AKATSUKI PROJECT TEAM

ఫొటో క్యాప్షన్, శుక్రగ్రహం
    • రచయిత, జోనాథన్‌ అమోస్‌
    • హోదా, బీబీసీ సైన్స్‌ కరస్పాండెంట్‌

శుక్ర గ్రహంపై ఆవరించిన వాతావరణంలో జీవం ఉండే ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఆ గ్రహం మీద ఒక వాయువుకు సంబంధించిన ఆధారాలు కనుగొన్న శాస్త్రవేత్తలు ఆ వాయువు అక్కడికి ఎలా వచ్చిందో తెలుసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.

శుక్రుడిపై ఉన్న ఆ గ్యాస్‌ పేరు ఫాస్ఫిన్. ఒక ఫాస్పరస్‌ అణువుతో మూడు హైడ్రోజన్‌ అణువులు కలవడం వల్ల ఈ వాయువు ఏర్పడుతుంది.

ఫాస్ఫిన్ భూమి మీద జీవంతో ముడిపడి ఉన్న వాయుడు. పెంగ్విన్‌ వంటి జంతువుల కడుపులో ఇది ఉంటుంది. అలాగే, ఆక్సిజన్‌ తక్కువగా ఉండే చిత్తడి నేలల్లో బతికే సూక్ష్మజీవులు కూడా ఫాస్ఫీన్‌లో మనుగడ సాగిస్తుంటాయి.

పారిశ్రామికంగా కూడా ఫాస్ఫీన్‌ను తయారు చేయవచ్చు. కానీ శుక్రుడిపై ఫ్యాక్టరీలు లేవు. పెంగ్విన్‌లూ లేవు.

మరి ఆ గ్యాస్‌ అక్కడ ఎలా ఉంది.. శుక్రుడి ఉపరితలానికి 50 కిలోమీటర్ల దూరంలో ఎలా ఆవరించి ఉంది? యూకేలోకి కార్డిఫ్‌ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ జేన్‌ గ్రీవ్స్‌, ఆయన సహచరులు ఇదే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

శుకగ్రహ ఉపరితలం చిత్రం

ఫొటో సోర్స్, DETLEV VAN RAVENSWAAY/SPL

ఫొటో క్యాప్షన్, శుకగ్రహ ఉపరితలం చిత్రం

శుక్రగ్రహం మీద ఫాస్ఫీన్‌ గ్యాస్‌ ఆనవాళ్లను వివరిస్తూ నేచర్‌ ఆస్ట్రానమీ జర్నల్‌కు వీరు ఒక పరిశోధనా పత్రాన్ని సమర్పించారు. ఇక్కడ ఈ గ్యాస్‌ ఎలా ఏర్పడిందో కనుగొనేందుకు తాము చేసిన ప్రయత్నాలను వివరించారు.

శుక్రుడి మీద గ్యాస్‌ ఉందని తెలుసుకుని ఆశ్చర్యపోయామని బీబీసీలో ప్రసారమయ్యే ‘స్కై ఎట్‌ నైట్‌’ కార్యక్రమంలో వారు వెల్లడించారు.

ఇప్పటివరకు మన దగ్గరున్న శుక్రుడి సమాచారం, అక్కడి పరిస్థితులను తెలిసిన వారెవరూ ఆ గ్యాస్‌ అక్కడికి ఎలా వచ్చిందో మాత్రం చెప్పలేకపోతున్నారు. కానీ అక్కడ జీవం ఉందనడాన్ని కొట్టిపారేయలేని పరిస్థితి.

“నా కెరీర్‌ అంతా విశ్వాంతరాళంలో ఎక్కడ జీవం ఉందో వెతకడంలో గడిపాను. ఇప్పుడు అది సాధ్యమవుతుందని నాకనిపిస్తోంది’’అని ప్రొఫెసర్‌ గ్రీవ్స్‌ వ్యాఖ్యానించారు. “ మా పరిశీలనలో ఏవైనా లోపాలున్నాయేమో చెప్పాలని కూడా మేం కోరుతున్నాం.

మా పేపర్ ఇంటర్నెట్‌లో అందరికీ అందుబాటులో ఉంది’’ అన్నారు గ్రీవ్స్‌

ఒక ఫాస్ఫరస్ అణువు, మూడు హైడ్రోజన్ అణువులు కలిస్తే ఫాస్ఫీన్ ఏర్పడుతుంది

ఫొటో సోర్స్, ESO/M.Kornmesser/L.Calcada/Nasa

ఫొటో క్యాప్షన్, ఒక ఫాస్ఫరస్ అణువు, మూడు హైడ్రోజన్ అణువులు కలిస్తే ఫాస్ఫీన్ ఏర్పడుతుంది

శాస్త్రవేత్తల బృందం ఏం కనుక్కుంది?

శుక్రుడి మీద ఫాస్ఫీన్‌ ఉన్నట్లు హవాయి ద్వీపంలోని జేమ్స్‌ క్లార్క్‌ మాక్స్‌వెల్ టెలిస్కోప్‌ సహాయంతో ఈ బృందం గుర్తించింది. ఆ తర్వాత చిలీలోని అటకామ లార్జ్‌ మిల్లీమీటర్‌/సబ్‌మిల్లీ మీటర్‌ అర్రే (ALMA) నుంచి పరిశీలించి దీన్ని నిర్ధారించుకుంది.

ఈ ఫాస్ఫీన్ గ్యాస్‌ వీనస్‌ ఉపరితలానికి 50 నుంచి 60 కిలోమీటర్ల దూరంలో వ్యాపించింది. కనిపించడానికి చిన్నదే అయినా ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా అది చాలా పెద్దది అంటున్నారు.

ఎందుకింత ఆసక్తి?

సౌర కుటుంబంలో జీవం ఉండొచ్చని ఇంతవరకు శాస్త్రవేత్తలు భావిస్తున్న గ్రహాల్లో శుక్రుడు లేడు. భూమితో పోలిస్తే అది ఒక నరకంలాంటిది.

అక్కడ 96 శాతం వాతావరణం కార్బన్‌ డయాక్సైడ్‌తో నిండి ఉంది. అక్కడ ఉపరితల ఉష్ణోగ్రతలు 400 డిగ్రీ సెంటిగ్రేడ్‌కన్నా ఎక్కువగా నమోదవుతాయి.

స్పేస్‌ ప్రోబ్‌లు అక్కడ దిగిన కొద్దినిమిషాలకే చెడిపోయాయి. ఉపరితలానికి 50 కిలోమీటర్ల పైన అంటే కొంచెం ఫరవాలేదు అనిపించే పరిస్థితులు ఉంటాయి. అలాంటప్పుడు అక్కడ జీవం ఉండే అవకాశం ఉందా, ఉంటే ఎక్కడ ఉంది అన్నది కనుక్కోవాల్సి ఉంది.

ఎందుకీ సందేహాలు ?

శుక్రుడి మీద ఉండే మేఘాలు 75-95 శాతం సల్ఫ్యూరిక్‌ ఆమ్లంతో నిండి ఉంటాయి. భూమి మీద ఉన్న జీవంలాంటిది ఇక్కడ ఉండటం దాదాపు అసాధ్యం.

శుక్రుడి మీద ఉండే వివిధ సమ్మేళనాలపై అమెరికాలోని మసాచుసెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (MIT)లో బయెకెమిస్ట్‌గా పని చేస్తున్న డాక్టర్‌ విలియం బెయిన్స్‌ విస్తృతమైన పరిశోధనలు చేశారు.

ఫాస్ఫీన్‌ ఏర్పడటానికి అగ్నిపర్వతాలు, పిడుగులు, ఉల్కలు ఏమైనా కారణమయ్యాయా అన్న అంశాన్ని ఆయన పరిశీలించారు. అక్కడి రసాయన చర్యలు ఫాస్ఫీన్‌ను తయారు చేయడానికి పదివేల రెట్లు బలహీనంగా ఉన్నాయని డాక్టర్‌ బెయిన్స్‌ అన్నారు.

సల్ఫ్యూరిక్‌ యాసిడ్‌ ప్రభావం నుంచి బయటపడటానికి అక్కడున్న సూక్ష్మజీవులు ఇప్పటి వరకు మనకు తెలియని భిన్నమైన జీవ చర్యను లేదా రక్షణకవచాన్ని ఉపయోగించి ఉంటాయని బెయిన్స్‌ అభిప్రాయపడ్డారు.

“ నీటి మీద ఆధారపడే జీవం, సల్ఫ్యూరిక్‌ ఆమ్లం నుంచి రక్షణపొందడానికి ఒక కవచం ఏర్పాటు చేసుకుంటుంది’’ అని బెయాన్స్‌ బీబీసీ స్కై ఎట్ నైట్‌కు వివరించారు.

“మనం మాట్లాడుకునే జీవం తన చుట్టూ టెఫ్లాన్‌కంటే కఠినమైన షెల్‌లోకి వెళ్లి రక్షణ పొందుతుంది. కానీ అవి ఎలా తింటాయి, వాయువులను ఎలా మార్పిడి చేసుకుంటాయి అన్నదే పెద్ద ప్రశ్న’’ అన్నారు బెయాన్స్‌.

శుక్రుడి మీద ఫాస్ఫీన్ ఉన్నట్లు టెలీస్కోప్ లు కూడా గుర్తించాయి

ఫొటో సోర్స్, ESO

ఫొటో క్యాప్షన్, శుక్రుడి మీద ఫాస్ఫీన్ ఉన్నట్లు టెలీస్కోప్ లు కూడా గుర్తించాయి

శాస్త్ర ప్రపంచం ఏమంటోంది ?

అయితే ఈ పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు శుక్రుడి మీద జీవం ఉందని చెప్పలేదు. ఫాస్ఫీన్‌ కారణంగా అక్కడ జీవం ఉండటానికి ఉన్న అవకాశాలను పరిశీలించేందుకు, అసలు అక్కడ ఆ వాయువు ఎలా ఏర్పడిందన్న దానిపై పరిశోధనలు జరపడానికి అవకాశం ఉందని మాత్రమే వివరించారు.

ప్రొఫెసర్‌ గ్రీవ్స్‌ బృందం కనుగొన్న అంశాలు వీనస్‌ మీద మరిన్ని పరిశోధనలకు అవకాశం కల్పిస్తాయని శాస్త్రవేత్త డాక్టర్‌ కాలిన్‌ విల్సన్‌ అన్నారు. ఆయన యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ పంపిన వీనస్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రోబ్‌ (2006-2014) ప్రాజెక్టులో పని చేశారు.

“ ఇదొక గొప్ప పరిశీలన. దీని ద్వారా శుక్రుడికి సంబంధించిన అనేక కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఆస్కారం ఏర్పడింది. జీవం ఉందని ఇప్పటికిప్పుడు చెప్పలేకపోయినా, అసలు ఆ వాయువు అక్కడికి ఎలా వచ్చింది అన్నదానిపై పరిశోధన చేస్తే చాలా కొత్త విషయాలు తెలుస్తాయి’’ అని కాలిన్‌ విల్సన్‌ బీబీసీతో అన్నారు.

అయితే యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ మినిస్టర్‌లో ఆస్ట్రోబయాలజిస్టుగా పని చేస్తున్న ప్రొఫెసర్‌ లెవీస్‌ డార్ట్‌నెల్‌ మాత్రం అంగారకుడు, గురుగ్రహానికి చెందిన ఉపగ్రహాలు, శనిగ్రహాల మీద తప్ప మరెక్కడా జీవం ఉండే అవకాశంలేదని అన్నారు.

“వీనస్‌ మేఘాలలో జీవం ఉందంటే అది విచిత్రమే. అదే నిజమైతే మన గెలాక్సీలో ఎక్కడైనా జీవం సాధ్యమేనని భావించాల్సి ఉంటుంది. జీవం మనుగడ సాగించడానికి భూమిలాంటి వాతావరణాలే అక్కర్లేదు. మన పాలపుంతలోని అత్యంత వేడితోపాటు సల్ఫ్యూరిక్‌ ఆమ్లాన్ని కూడా భరించి శుక్రుడులాంటి గ్రహాల మీద జీవం మనుగడ సాగించగలదు అని భావించాలి’’ అన్నారు లెవీస్‌

సోవియట్ ప్రోబ్స్

ఈ గుట్టును విప్పేదెలా ?

ఈ రహస్యాన్ని కనుక్కోవాలంటే శుక్రుడి వాతావరణాన్ని మాత్రమే పరిశీలించేందుకు ఒక ప్రోబ్‌ను పంపాలి.

2030నాటికి ఒక మిషన్‌ను పంపడానికి వీలుగా ప్రాజెక్టును డిజైన్‌ చేయాల్సిందిగా శాస్త్రవేత్తలను నాసా కోరింది. నాసా రూపొందించే మిషన్‌లు చాలా ప్రభావవంతమైనవి, ఖరీదైనవి కూడా. వీనస్‌ కోసం దాని వాతావరణంలో తిరగడానికి వీలుగా బెలూన్లతో తయారు చేసే ఏరోబోట్‌ మిషన్‌కు ప్రతిపాదన వచ్చింది.

“1985లో రష్యా ఇదే తరహాలో వెగా బెలూన్లతో ఒక మిషన్‌ను పంపింది’’ అని గుర్తు చేశారు మసాచుసెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీకి చెందిన ప్రొఫెసర్‌ సారా సీగర్‌.

“సల్ఫ్యూరిక్‌ ఆమ్లం నుంచి రక్షణ పొందడానికి టెఫ్లాన్‌ రక్షణ కల్పించారు. అది వీనస్‌ పై వాతావరణంలో గాలిలో ఎగురుతూ నమూనాలను సేకరించింది’’ అని ఆమె వెల్లడించారు.

“తగిన జాగ్రత్తలు తీసుకుని మనం కూడా కొన్ని నమూనాలను సేకరించవచ్చు. జీవాన్ని గుర్తించే క్రమంలో అవసరమైతే మైక్రోస్కోప్‌లను కూడా పంపవచ్చు’’ అన్నారామె.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)