ఫిన్‌లాండ్: వైమానిక దళం 100 ఏళ్లకు పైగా వాడుతున్న స్వస్తిక చిహ్నాన్ని నిశబ్దంగా తొలగించారు.. ఎందుకు?

ఫొటో సోర్స్, FINNISH MINISTRY OF DEFENCE
కొన్ని సంవత్సరాలుగా ఫిన్‌లాండ్ ఎయిర్ ఫోర్స్ చిహ్నంగా ఉన్న రెండు పక్షి రెక్కల మధ్య స్వస్తిక్ చిహ్నాన్ని నిశబ్దంగా తొలగించేశారు.
ఈ చిహ్నానికి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉన్నప్పటికీ, దీనిని ఎక్కువగా నాజీ జర్మనీకి, దాని నేరాలకు సంబంధించినదిగా చూస్తారు.
ఈ స్వస్తిక్‌తో కూడిన ఎంబ్లమ్‌ను ఉపయోగించటం ఆపేశామని ఫిన్‌లాండ్ ఎయిర్‌ఫోర్స్ ఇప్పుడు నిర్ధారించింది.
ఈ మార్పుని ముందు హెల్సింకి యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ టీవైనెన్ గుర్తించారు.
ఈ చిహ్నాన్ని వాడటం వలన ఫిన్‌లాండ్ దళాలకు ఏమైనా ఉపయోగం ఉందా అని ఆయన గతంలో ప్రశ్నించారు.
నాజీయిజం యూరప్‌ను అతలాకుతలం చేయటానికి చాలా ముందుగానే.. ఫిన్‌లాండ్ స్వంతంత్ర దేశంగా మారినపుడు 1918లో స్థాపితమైనప్పటి నుంచీ స్వస్తికను చిహ్నంగా వాడుతోంది.
1945 వరకు వాయు సేన విమానాల పై తెలుపు రంగు బ్యాక్ గ్రౌండ్ మీద నీలం రంగు స్వస్తిక్ చిహ్నంగా ఉండేది. నాజీ జర్మనీ, ఫిన్‌లాండ్ రెండూ కూటమి కట్టినప్పటికీ.. నాజీ జర్మనీకి తన మద్దతును తెలపటం ఈ చిహ్నం ఉద్దేశం కాదు.
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఈ చిహ్నాన్ని విమానాల నుంచి తొలగించినప్పటికీ , ఎయిర్ ఫోర్స్ యూనిట్లో కొన్ని చోట్ల, జెండాల పైన, యూనిఫామ్ల పైన ఇంకా కొనసాగుతోందని ఫిన్నిష్ ఎయిర్ ఫోర్స్ ప్రతినిధి బీబీసీకి చెప్పారు.
జనవరి 2017 నుంచి ఎయిర్ ఫోర్స్ దళానికి, ఎయిర్ ఫోర్స్ సేవా దళానికి వలయాకారంలో ఉన్న రెక్కల మధ్యలో ఉన్న బంగారు గద్ద చిహ్నంగా ఉందని, ఎయిర్ ఫోర్స్ తెలిపింది.
"దళం సభ్యులు యూనిఫామ్ మీద కూడా ఈ చిహ్నాలు వాడతారు. ఆ చిహ్నం ఎప్పటికప్పుడు అపార్థాలకు కారణమైంది. కాబట్టి ఈ పాత చిహ్నాన్ని ఉపయోగించటం అనవసరమని భావించాం'' ఫిన్‌లాండ్ ఎయిర్ ఫోర్స్ ప్రతినిధి చెప్పారు.

ఫొటో సోర్స్, ALAMY
స్వస్తిక అంటే ఏమిటి?
స్వస్తిక చిహ్నం సిలువ ఆకారంలో ఉండి కుడి వైపుకి కొన్ని వంపులు తిరిగి ఉంటుంది. సంస్కృతం లో స్వస్తికని సంక్షేమానికి అదృష్టానికి సూచికగా భావిస్తారు.
దీనిని భారతీయ సంస్కృతిలో కొన్ని వేల సంవత్సరాల నుంచి వాడుతున్నారు. 20వ శతాబ్దం మొదట్లో పశ్చిమ దేశాలలో ఇదొక ఫ్యాషన్ చిహ్నంగా మారింది.
1920లో అడాల్ఫ్ హిట్లర్ స్వస్తికని నేషనల్ సోషలిస్ట్ పార్టీ చిహ్నంగా ఎంచుకున్నారు. ఆ తర్వాతి దశాబ్దంలో ఈ పార్టీ జర్మనీలో అధికారంలోకి వచ్చింది. పశ్చిమ దేశాలలో స్వస్తికని హిట్లర్ కాలంలో చోటు చేసుకున్న మారణహోమాలకి, నాజీ పాలనకి ప్రతీకగా చూస్తారు.
ఫిన్‌లాండ్‌లో 1920ల నాటి భవంతులపై స్వస్తిక చిహ్నం కనిపిస్తుందని ప్రొఫెసర్ టీవైనెన్ చెప్పారు.
"దీనిని ఫిన్‌లాండ్లో కేవలం ఒక అలంకార చిహ్నంగానే చూస్తారు” అని ఆయన పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ప్రసిద్ధ ఫిన్‌లాండ్ కళాకారుడు ఆక్సెలి గాలెన్ కళ్ళెలా 1889లో ఈ చిహ్నాన్ని తన పెయింటింగ్‌లో వాడారు.
ఆయన చాలా చిత్రాలలో ఈ చిహ్నాన్ని స్వేచ్ఛకి గుర్తుగా వాడటం మొదలుపెట్టారు. ఆయన గీసిన చిత్రాలలో చిన్న చిన్న స్వస్తికలను చిత్రించడంతో, నాజీ గుర్తులను ప్రతిబింబించలేదు.
ఫిన్‌లాండ్ అధ్యక్షుని అధికారిక జెండా మీద కూడా ఈ గుర్తు కనిపిస్తుంది.
కానీ, ఈ చిహ్నాన్ని ఫిన్‌లాండ్ ఎయిర్ ఫోర్స్‌కి పరిచితం చేసింది స్వీడన్‌కి చెందిన ఎరిక్ వాన్ రోసెన్ అనే వ్యక్తి.
ఆయన స్వస్తికని అదృష్టానికి సంకేతంగా వాడేవారు. ఆయన 1918 లో ఫిన్‌లాండ్ ఎయిర్ ఫోర్స్ కి విమానాన్ని బహుకరించినప్పుడు దాని మీద నీలం రంగులో ఉన్న స్వస్తిక చిహ్నం ఉండేది. ఫిన్నిష్ ఎయిర్ ఫోర్స్ కి అదే తొలి విమానం. దీని పేరు తులిన్ టిప్ డి . ఆ తరువాత ఎయిర్ ఫోర్స్ తమ విమానాలన్నిటి మీద 1945 వరకు ఇదే చిహ్నాన్ని వాడటం మొదలు పెట్టింది.
1918లో నాజీ వాదం లేకపోవడం వలన, ఈ చిహ్నానికి నాజీ వాదానికి ఎటువంటి సంబంధం లేదని ఎయిర్ ఫోర్స్ భావించింది.

ఫొటో సోర్స్, Alamy
ఈ విమానాన్ని బహుకరించే సమయానికి రోసెన్‌కి నాజీయులతో ఎటువంటి సంబంధాలు లేనప్పటికీ , ఆయన 1930 నాటికి స్వీడన్ సోషలిస్ట్ ఉద్యమంలో ముఖ్య వ్యక్తిగా మారారు. ఆయన జర్మనీ లో ఒక నాజీ అధికారి హర్మన్ గోరింగ్ కి బావగారు కూడా. అతను హిట్లర్ కి స్నేహితుడు కూడానని ప్రొఫెసర్ టీవైనెన్ చెప్పారు.
వాన్ రోసెన్ గుర్తుగా కొన్ని ఎయిర్ ఫోర్స్ పతాకాలు, అలంకారాల మీద ఈ చిహ్నం ఉన్నప్పటికీ , ఎయిర్ ఫోర్స్ ప్రధాన దళం మీద ఈ చిహ్నం లేదని ఎయిర్ ఫోర్స్ ప్రతినిధి చెప్పారు.
స్వస్తికని నిషేధించాలని ఆయన ఎప్పుడూ డిమాండ్ చేయలేదని ప్రొఫెసర్ టీవైనెన్ బీబీసీ కి చెప్పారు.
“సైన్యం బాధ్యత దేశాన్ని రక్షించడం కానీ, స్వీడన్ కి చెందిన వ్యక్తి ఇచ్చిన చిహ్నాన్ని కాపాడటం కాదని” అన్నారు.
ఇలాంటి చిహ్నాలు ఉండటం వలన ఫిన్‌లాండ్ యువత సైన్యాన్ని చూసే దృక్పధాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని అన్నారు.
ఫిన్‌లాండ్ పొరుగు దేశమైన రష్యా ఈ చిహ్నం వలన ఫిన్‌లాండ్ ని శత్రువుగా చూసే అవకాశం ఉందని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ దేశానికి ఎప్పుడైనా ఏదైనా ముప్పు సంభవిస్తే పశ్చిమ దేశాలు ఫిన్‌లాండ్ కి మద్దతు తెలిపే విషయం పై కూడా ప్రభావం పడవచ్చని అన్నారు.
ఫిన్‌లాండ్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ఇంకా స్వస్తిక చిహ్నం ఉన్నప్పటికీ, ఎయిర్ ఫోర్స్ కేంద్ర దళంలో ఈ చిహ్నాన్ని తొలగించడం నెమ్మదిగా వాన్ రోసెన్ చిహ్నం నుంచి నెమ్మదిగా బయట పడే సంకేతాలు మాత్రం ఇస్తోంది.
ఇవి కూడా చదవండి:
- తమిళులు హిందీని ఎందుకు అంతలా వ్యతిరేకిస్తున్నారు...
- పాకిస్తాన్ బడ్జెట్: ఈ అప్పుల 'విషవలయం' నుంచి ఇమ్రాన్ ఖాన్ బయటపడేది ఎలా?
- కష్టమైన ఇంగ్లిష్ స్పెల్లింగుల్ని మార్చేయడం కరెక్టేనా?
- ట్రావెల్ ఫొటో పోటీలు 2019: చూపుతిప్పుకోనివ్వని ఫొటోలు... విజేతలు వీరే
- స్విట్జర్లాండ్: సమాన వేతనం, గౌరవం కోసం రోడ్డెక్కిన మహిళలు
- ఆంధ్రా సరిహద్దులో అరుదైన ఆదివాసీ తెగ 'రీనో'
- అర్థరాత్రి దాటినా నిద్ర పోవట్లేదా? మీ జీవ గడియారాన్ని అనుకూలంగా మార్చుకోవటం ఎలా?
- తియానన్మెన్ స్క్వేర్ నరమేధాన్ని సమర్థించిన చైనా మంత్రి, అసలు ఆరోజు ఏం జరిగింది
- భవిష్యత్ బాగుండాలంటే ప్రజాస్వామ్యాన్ని మార్చాల్సిందేనా?
- చైనాలో వ్యభిచార వ్యాపారం.. సెక్స్ బానిసత్వంలో మగ్గిపోతున్న ఉత్తర కొరియా అమ్మాయిలు
- శోభనం రాత్రి బెడ్షీట్లు ఏం నిరూపిస్తాయి? పురాతన వివాహ సంప్రదాయాలు నేటితరం మహిళల్ని ఎలా వెంటాడుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








