పౌరసత్వ చట్టంలో మార్పులు చేసిన నేపాల్.. ‘భారత్‌తో సంబంధాలను దెబ్బతీసేందుకే’ అని విమర్శలు

ఫొటో సోర్స్, NurPhoto
- రచయిత, సురేంద్ర ఫూయల్
- హోదా, బీబీసీ కోసం, ఖాట్మండు నుంచి
నేపాల్ పౌరులను పెళ్లి చేసుకునే విదేశీ మహిళలు ఆ దేశ పౌరసత్వం కోసం ఏడేళ్లు నిరీక్షించాల్సి వచ్చేలా నిబంధనలను ప్రతిపాదించాలని అక్కడి అధికార నేపాల్ కమ్యూనిస్టు పార్టీ (ఎన్‌సీపీ) నాయకులు నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రతిపాదనకు ఎన్‌సీపీ సెక్రటేరియట్ ఆమోదం తెలిపింది.
ఈ నిర్ణయంపై చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార ఎన్‌సీపీలోని కొందరు నేతలు కూడా దీన్ని తప్పుపడుతున్నారు.
నేపాల్ పౌరులను పెళ్లాడిన మహిళలు అక్కడి పౌరసత్వం (అంగీకృత్ నాగరికత) కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో తమ దేశ పౌరసత్వం వదులుకున్నట్లు రుజువు సమర్పించాల్సి ఉంటుంది.
భారతీయులను పెళ్లాడిన విదేశీ మహిళలు భారత పౌరసత్వానికి ఏడేళ్ల తర్వాతే అర్హత సాధిస్తారని, తమ నిబంధన కూడా అలాంటిదేనని ఎన్‌సీపీ నాయకులు అంటున్నారు.
రెండేళ్ల క్రితం నేపాల్ పార్లమెంటులో పెట్టిన పౌరసత్వ చట్టం 2006 సవరణ బిల్లులో కూడా ఈ ప్రతిపాదన ఉంది.
పెళ్లి తర్వాత పౌరసత్వం పొందేందుకు మహిళలకున్న ప్రాథమిక హక్కును ఈ నిబంధన హరించివేస్తుందని ప్రతిపక్ష నేపాలీ కాంగ్రెస్, జనతా సమాజ్‌బాదీ పార్టీలతోపాటు అధికార ఎన్‌సీపీ నాయకుల్లో కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నేపాల్, భారత్ ప్రజల మధ్య సంబంధాలు దెబ్బతింటాయని అంటున్నారు.

ఫొటో సోర్స్, RSS
పౌరసత్వ బిల్లుపై వివాదాలు కొనసాగుతూనే ఉండటం వల్ల సంస్కరణల అమలు, కొత్త చట్టం మరింత ఆలస్యమవుతుందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.
ఫలితంగా వేల మంది యువ నేపాలీలకు పౌరసత్వ ధ్రువీకరణ పత్రం అందడం లేదు.
పౌరసత్వ ధ్రువీకరణ పత్రం లేకుండా వివిధ ప్రభుత్వ పత్రాలను వాళ్లు పొందలేకపోతున్నారు. సిమ్ కార్డు పొందాలన్నా ఆ పత్రం అవసరమే.
పౌరసత్వ సవరణ బిల్లులో తీవ్ర చర్చనీయాంశమైంది విదేశీ వధువుల అంశమే. రెండేళ్లుగా రాజకీయ పార్టీల మధ్య ఈ విషయమై వాదోపవాదాలు నడుస్తున్నాయి.
పౌరసత్వ సవరణ బిల్లులోని అంశాలపై పార్లమెంటరీ కమిటీ సమావేశం సందర్భంగా, నేపాల్ పౌరులను పెళ్లాడిన వెంటనే విదేశీ మహిళలకు పౌరసత్వం ఇచ్చే విధానాన్ని రద్దు చేయాలని అధికార పార్టీ నాయకుల్లో కొందరు వాదించారు.
పౌరసత్వ చట్టం 2006 ప్రకారం నేపాల్ పౌరులతో వివాహమైన వెంటనే విదేశీ మహిళలకు నేపాల్ పౌరసత్వం వస్తుంది. అయితే, భారత్‌ను అనుకరించేలా ఈ విధానంలో మార్పు తెస్తున్నామని ఎన్‌సీపీ సీనియర్ నాయకుడు సుభాష్ చంద్ర నెంబాంగ్ అన్నారు. పార్టీకి చెందిన చట్టసభ సభ్యుల్లో ఎక్కువ మంది ఈ ఆలోచనతో ఏకీభవించారని చెప్పారు.

ఫొటో సోర్స్, REUTERS
కానీ, ఈ ప్రతిపాదనను ప్రతిపక్ష నేపాలీ కాంగ్రెస్ నాయకుడు బిమలేంద్ర నిధి వ్యతిరేకించారు. పౌరసత్వ చట్టం 2006లో విదేశీ వధువులకు పౌరసత్వం ఇచ్చే విషయం స్పష్టంగా ఉందని, దాన్ని మార్చాల్సిన అవసరం లేదని అన్నారు.
బిమలేంద్ర నిధి దక్షిణ తరాయి మధేశ్ ప్రాంతానికి చెందినవారు. ఈ ప్రాంతంలోనే జనక్‌పుర్‌ధామ్ ఉంది. శ్రీరాముడి భార్య సీత ఇక్కడే జన్మించారని భావిస్తారు. ఈ ప్రాంతంలో భారతీయులు, నేపాలీల మధ్య వివాహాలు ఇప్పటికీ సర్వసాధారణం.
‘‘వివాహమైన వెంటనే పౌరసత్వం పొందడం మహిళల ప్రాథమిక హక్కు. దాన్ని ఈ ప్రతిపాదన హరిస్తుంది. రామాయణ కాలం నుంచి భారత్, నేపాల్ మధ్య ఉన్న సంబంధాలను ఈ నిర్ణయం నాశనం చేస్తుంది’’ అని జనతా సమాజ్‌బాదీ పార్టీ సీనియర్ నాయకుడు రాజేంద్ర మహతో అన్నారు.
‘‘తరాయి, సమీపంలోని భారత ప్రాంతాల మధ్య సంబంధాలను దెబ్బతీయడానికి జరుగుతున్న ప్రయత్నమే ఇది. మా సాంస్కృతిక సంబంధాలపై దాడి చేస్తున్నారు. తరాయి ప్రాంతంలో ప్రతి ఇంటికీ... బిహార్, ఉత్తర ప్రదేశ్, ఇతర భారత రాష్ట్రాలవారితో చుట్టరికం ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వ ప్రతిపాదన అమల్లోకి వస్తే, దాని ప్రభావం చాలా లోతుగా ఉంటుంది’’ అని అన్నారు.

ఫొటో సోర్స్, EPA
విదేశీ వధువులు పౌరసత్వం కోసం ఏడేళ్లు నిరీక్షించాలన్న నిబంధన వివక్షపూరితమని ఎన్‌సీపీ నాయకురాలు బిందా పాండే అన్నారు.
‘‘మా పార్టీ ప్రస్తుత సంస్థాగత నిర్మాణంలో సొంత పత్రాలను, జాతీయ, అంతర్జాతీయ నిర్ణయాలను గానీ అనుసరించడం లేదు. నేపాల్ సమాజంలో మహిళలకు ఇంకా కొన్ని విషయాల్లో అనుమతి నిరాకరించడం అంగీకారయోగ్యం కాదు’’ అని కాఠ్‌మాండూ పోస్ట్‌తో ఆమె అన్నారు.
తరాయి ప్రాంతానికి చెందిన ప్రభు షా కూడా అధికార ఎన్‌సీపీలోనే ఉన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో ఉండే ప్రజల సంబంధాలు దెబ్బతినే అవకాశమున్న కారణంగా తాజా నిర్ణయంపై పార్టీ పునరాలోచించుకోవాలని ఆయన కూడా అభ్యర్థించారు.
అయితే, పౌరసత్వ చట్టంలో తెస్తున్న సంస్కరణల్లో తనకేమీ సమస్య కనిపించడం లేదని రాజ్యాంగ నిపుణుడు బిపిన్ అధికారి బీబీసీతో అన్నారు.
‘‘భారత్, అమెరికా సహా చాలా దేశాల్లో విదేశీ వధువులు పౌరసత్వం కోసం వేచి చూడాల్సి ఉంటుంది. ఇలా కొంత వ్యవధి విధించడం సరైనదే. పౌరసత్వాన్ని నెమ్మదిగా సంపాదించుకోవాలి. అది రాగానే పళ్లెంలో పెట్టి ఇచ్చే వస్తువు కాదు’’ అని అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్ చొరబాట్లకు గట్టిగా జవాబు ఇచ్చే భారత్ చైనాపై మౌనంగా ఎందుకు ఉంటోంది? దెబ్బకు దెబ్బ తీయవచ్చా? అడ్డంకులేంటి?
- మహిళలు తమకి కావలసినప్పుడు గర్భం ధరించగలిగే అవకాశం వస్తే ఈ ప్రపంచం ఎలా మారుతుంది?
- 1990ల్లో 13 నెలలపాటు నేపాల్‌ను భారత్ ఎందుకు దిగ్బంధించింది?
- కరోనావైరస్: కోవిడ్-19కు చికిత్స చేసే మందు ఎప్పుడు వస్తుంది? ప్రత్యామ్నాయంగా ఏం చేస్తున్నారు?
- ఇస్లామిక్ దేశాలు యోగాను ఎలా ఒప్పుకున్నాయి? యోగా నిజంగానే మతపరమైన అభ్యాసమా?
- ఎవరెస్ట్ ఎత్తు ఎంత? చైనా ఎందుకు మళ్లీ లెక్కిస్తోంది? 4 మీటర్ల తేడా ఎందుకు వచ్చింది?
- గల్వాన్ వ్యాలీ సరిహద్దుల్లో ఏం జరుగుతోంది?.. భారత్, చైనా సరిహద్దు ఘర్షణలకు ‘తెరవెనుక కారణాలు’ ఏంటి?
- డోనల్డ్ ట్రంప్: ‘భారత్, చైనాల సరిహద్దు వివాదంలో మధ్యవర్తిత్వం వహించేందుకు అమెరికా సిద్ధం’
- చైనా నుంచి భారత్ దిగుమతి చేసుకునే వస్తువులు ఏంటి? ఎగుమతి చేసే వస్తువులు ఏంటి? ఎక్కువ ఆధారపడేది ఎవరు?
- లిపులేఖ్, లింపాధురియాలపై నేపాల్ ఎందుకు పంతం పడుతోంది? భారత్‌పై కాలుదువ్విందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








