భారత్-చైనా ఉద్రిక్తతలపై నేపాల్ ఎందుకు ఆందోళన చెందుతోంది?

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, నేపాల్ ప్రధానమంత్రి కె.పి.శర్మ ఓలి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, నేపాల్ ప్రధానమంత్రి కె.పి.శర్మ ఓలి
    • రచయిత, సురేంద్ర పూయల్‌
    • హోదా, బీబీసీ ప్రతినిధి, కాఠ్‌మాండూ

భారత్‌ చైనా దేశాల మధ్య గాల్వన్‌ లోయలో ఏర్పడ్డ ఘర్షణ వాతావరణంపై నేపాల్‌ ఆందోళన చెందుతోంది. ఇరుదేశాలు శాంతియుతంగా సమస్యలు పరిష్కరించుకోవాలని అంతర్జాతీయ నిపుణులు, నేపాల్‌కు చెందిన రిటైర్డ్ దౌత్యవేత్తలు విజ్జప్తి చేశారు. సైనిక ప్రతిష్ఠంభన ఇంకా ఎక్కువ కాలం కొనసాగరాదని, ఎందుకంటే దీనివల్ల ఈ మొత్తం ప్రాంతంపై ప్రభావం పడుతుందని వారు అంటున్నారు.

మంగళవారం సాయంత్రం 7:15 గంటల వరకు నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ దీనిపై స్పందించలేదు. కానీ, బీబీసీ హిందీతో మాట్లాడిన మాజీ దౌత్యవేత్తలు, వ్యూహాత్మక విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు లడఖ్ ప్రాంతంలో ఇండో-చైనా సరిహద్దులో శాంతిని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. భారత్, చైనా సంయమనం పాటించాలని, శాంతియుత పరిష్కారం కనుగొనాలని వారు కోరారు.

భారత్‌, చైనా సైనికులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత్‌, చైనా సైనికులు

దౌత్య చర్చలు అవసరం

సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోడానికి భారత్, చైనా దౌత్య చర్చలను వేగవంతం చేస్తాయని నేపాల్‌ మాజీ ఉపప్రధాని, విదేశాంగ మంత్రి సుజాతా కొయిరాలా ఆశాభావం వ్యక్తం చేశారు." భారత్, చైనా రెండింటితో మాకు మంచి సంబంధాలు ఉన్నాయి. వారి సంబంధాలు స్నేహం మరింత బలోపేతం కావాలని మేం కోరుకుంటున్నాము. భారతదేశం, చైనా మధ్య వివాదం ఆసియా ప్రాంతంలో చాలా ప్రభావం చూపిస్తుంది " అన్నారు సుజాతా కొయిరాలా.

నేపాల్ మాజీ విదేశాంగ మంత్రి, భారతదేశంలో దీర్ఘకాల రాయబారి భేఖ్ బహదూర్ థాపా ఇటీవల భారత్, చైనా మధ్య దౌత్య చర్చలను స్వాగతించారు. దీర్ఘకాల సరిహద్దు వివాదాలకు ఇరుపక్షాలు త్వరలో శాంతియుత పరిష్కారం కనుగొంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు."హింసాత్మక ఘర్షణలు ఇప్పుడు శాంతిని నెలకొల్పాలని సూచిస్తున్నాయి. లడఖ్, ఇతర ప్రాంతాలలో ఇండో-చైనా సరిహద్దు వివాదం మునుపటి యుద్ధానికి వారసత్వం. మరిన్ని సమావేశాలు నిర్వహించి దౌత్య, రాజకీయ పరిష్కారాలను కనుగొనడం ద్వారా ఇది పరిష్కారమవుతుంది" అన్నారు థాపా. నేపాల్‌, ఇండియాల మధ్య ఉన్న లింపియాధుర-లిపులేఖ్ వంటి సరిహద్దు వివాదాన్ని కూడా దౌత్య చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని భేక్ బహదూర్ థాపా సూచించారు.

రెండు బలమైన దేశాలు యుద్ధాన్ని కోరుకోవు

హిమాలయాల్లో వ్యూహాత్మక సరిహద్దులైన లడఖ్, కాశ్మీర్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్‌లలో తమ ఉనికిని బలోపేతం చేయడానికి చైనా, భారత్‌లు ఇటీవలి కాలంలో తమ మౌలిక సదుపాయాలను నిరంతరం అభివృద్ధి చేస్తున్నాయని నేపాల్ ఆర్మీకి చెందిన వ్యూహాత్మక విశ్లేషకుడు, రిటైర్డ్ మేజర్ జనరల్ బినోజ్ బాసెట్ చెప్పారు. .

కానీ భారతదేశం, చైనా రెండూ హిమాలయ సరిహద్దులను బలోపేతం చేశాయని, సైనికీకరణను ప్రోత్సహించాయని, అందువల్ల వారి సైనిక ప్రతిష్టంభన మరింత పెరగదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. "లడఖ్ ప్రాంతంలో ఇరుపక్షాలు సన్నాహాలు చేశాయి. వారు ప్రాథమికంగా యుద్ధానికి దూరంగా ఉండాలని కోరుకుంటారు. తాజా వాగ్వివాదాల తరువాత కూడా ఈ ప్రాంత స్థానిక కమాండర్లు చర్చలు ప్రారంభించారు. రెండుదేశాలు త్వరలో దౌత్య చర్చలను వేగవంతం చేస్తాయని, ఈ వివాదాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్థాయిలో పరిష్కరిస్తాయని నేను ఆశిస్తున్నా'' అన్నారు బినోజ్‌ బాసెట్‌

ఇండియా నేపాల్
ఫొటో క్యాప్షన్, ధార్‌చులా నుంచి లిపులేఖ్‌కు అనుసంధానించే రహదారి. ఇది కైలాష్ మానస సరోవర్ యాత్ర మార్గంగా ప్రసిద్ది చెందింది.

నేపాల్‌పైనా ప్రభావం

గల్వాన్ లోయలో ఘర్షణ గురించి సీనియర్ జర్నలిస్ట్, హిమాల్ సౌత్ ఏషియన్ వ్యవస్థాపక సంపాదకుడు కనక్ మణి దీక్షిత్‌తోపాటు పలువురు దక్షిణాసియాకు చెందిన జర్నలిస్టులు సోషల్ మీడియాలో ఆందోళన వ్యక్తం చేశారు. భారత్, చైనా మధ్య సైనిక ఉద్రిక్తతలు మరింత ప్రమాదకరమైన స్థాయికి చేరవని వారు ఆశాభావం వ్యక్తం చేశారు

హిమాలయ సరిహద్దుల్లో శాంతి నెలకొల్పే దిశగా భారత్, చైనా కృషి కొనసాగిస్తాయని సీనియర్ జర్నలిస్ట్, దేశ్‌కామ్‌ డాట్‌ కామ్‌ సంపాదకుడు యువరాజ్ ఘిమిరే ఆశాభావం వ్యక్తం చేశారు. "ఈ ప్రాంతంలో శాంతి ఉంటుందని మేము హృదయపూర్వకంగా ఆశిస్తున్నాము. భారతదేశం, చైనాల మధ్య సైనిక ఉద్రిక్తత పెరిగితే, నేపాల్‌పై కూడా దీని ప్రభావం పడుతుంది. ఎందుకంటే అది వారిద్దరితో సంబంధాలు కలిగి ఉంది. భారతదేశం, చైనాలు దౌత్యమార్గాల్లో ఉద్రిక్తతలను తగ్గించగలిగితే అది ప్రాంతీయ శాంతి వైపు మంచి అడుగు అవుతుంది" అన్నారు.

చైనా, భారత్‌లు రెండూ సంయమనంతో ప్రశాంతంగా ఉండాలని కాఠ్‌మాండూ పోస్ట్ మాజీ చీఫ్ ఎడిటర్, కాఠ్‌మాండూ థింక్ ట్యాంక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్‌ స్టడీస్ (ఐఐడిఎస్) సీనియర్ ఫెలో అఖిలేశ్‌ ఉపాధ్యాయ పిలుపునిచ్చారు.

1975 తరువాత మొదటిసారి చైనా, ఇండియా సైనికుల మధ్య హింసాత్మక ఘర్షణ పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. "రెండు పెద్ద దేశాలు పోరాడితే అది నష్టమే అవుతుంది. ఈ ప్రాంతంలోని నేపాల్‌వంటి చిన్నదేశాలు కూడా తీవ్రంగా ప్రభావితమవుతాయి. సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఇరుదేశాలు దౌత్య స్థాయిలో చర్చలు జరుపుతున్నాయి. శాశ్వత శాంతి వచ్చేవరకు దీన్ని కొనసాగించాలి '' అన్నారు అఖిలేశ్‌ ఉపాధ్యాయ.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)