భారత్ - నేపాల్ కొత్త మ్యాప్: రెండు దేశాల మధ్య ఘర్షణలకు చైనా ఎలా ఆజ్యం పోస్తోంది?

ఫొటో సోర్స్, AFP
- రచయిత, అన్బరసన్ యతిరాజన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
నేపాల్ పార్లమెంట్ ఈ వారంలో తమ దేశ కొత్త మ్యాప్‌ను అధికారికంగా జారీ చేయవచ్చు. అందులో మూడు ప్రాంతాలను కూడా చేర్చడం గురించి దానికి బలమైన పొరుగు దేశం భారత్‌తో గొడవ కూడా మొదలైంది.
కొత్తగా తయారు చేసిన మ్యాప్‌లో హిమాలయాల్లోని ఒక చిన్న ప్రాంతాన్ని కూడా చేరుస్తున్నారు. కానీ దానివల్ల ప్రపంచంలోని బలమైన దేశాలు భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి.
భారత్ తమ దేశ సార్వభౌమాధికారాన్ని పట్టించుకోవడం లేదని నేపాల్ ప్రజలు నిరసన, ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇటీవల కొన్ని నెలలుగా భారత్- నేపాల్ సరిహద్దు దగ్గర జరుగుతున్న రోడ్డు పనులతో ఉద్రిక్తతలు పెరిగాయి. ఎందుకంటే భారత్ జారీ చేసిన కొత్త మ్యాప్‌లో ప్రాంతాలను భారత్‌లో భాగంగా చూపించారు.

ఉద్రిక్తతలు ఎందుకు పెరిగాయి?
ఇటు, భారత్, చైనా సైన్యం మధ్య ఇప్పటికే ఉత్తర లద్దాఖ్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అక్కడ చాలా వారాల వరకూ ఇరు దేశాల సైనికుల మధ్య ఉద్రిక్తత పరిస్థితి కొనసాగింది.
చైనా ఉసికొల్పడం వల్లే నేపాల్ తమ మ్యాప్‌ను మారుస్తోందని మీడియా కొంతమంది భారత అధికారులు ఆరోపిస్తున్నారు.
నేపాల్, భారత్ మధ్య సుమారు 1880 కిలోమీటర్ల ఓపెన్ సరిహద్దు ఉంది.
రెండు దేశాలు 98 శాతం సరిహద్దును కవర్ చేసిన మ్యాప్‌కు తుది రూపం ఇచ్చాయి. కానీ పశ్చిమ నేపాల్లోని లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురా ప్రాంతాల గురించి ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
మొత్తం 370 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ మూడు ప్రాంతాలూ ఉన్నాయని నేపాల్ అధికారులు చెబుతున్నారు. లిపులేఖ్ పాస్ భారత్‌లోని ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని చైనా టిబెట్ ప్రాంతంతో కలుపుతుంది.

నేపాల్ నుంచి వివాదం
భారత్, నేపాల్, చైనా మధ్య సరిహద్దు వివాదాలు ఉన్నాయి. భారత్ జమ్ము-కశ్మీర్‌ను జమ్ము-కశ్మీర్, లద్దాఖ్‌గా విభజించిన తర్వాత నవంబర్‌లో తమ కొత్త మ్యాప్ జారీ చేసింది.
ఈ మ్యాప్‌లో నేపాల్‌తో వివాదంలో ఉన్న ప్రాంతాలను భారత్‌లో భాగంగా చూపించారు.
నేపాల్ విదేశాంగ మంత్రి ప్రదీప్ గ్యావలీ బీబీసీతో “రెండు దేశాల మధ్య అంతర్జాతీయ సరిహద్దులను ద్వైపాక్షిక ఒప్పందాల ద్వారా నిర్ణయిస్తారు. ఏకపక్ష చర్యలతో వాటి ఉనికి గురించి చెప్పడం సరికాదు” అన్నారు.
1816లో జరిగిన సుగౌలీ సంధి తప్ప భారత్, నేపాల్ పశ్చిమ సరిహద్దులను నిర్ణయించే ఒప్పందం వేరే ఏదీ లేదు. ఆ సంధిలో మూడు ప్రాంతాలు నేపాల్ సరిహద్దుల్లోకి వస్తాయని స్పష్టంగా రాసి ఉంది.
భారత్ చర్యకు సమాధానంగా నేపాల్ గత నెలలో కొత్త మ్యాప్ ప్రచురించింది. అందులో వివాదిత ప్రాంతాలను నేపాల్ సరిహద్దుల్లో ఉన్నట్టు చూపించింది. దాంతో భారత్ ఆగ్రహించింది.

ఫొటో సోర్స్, EPA
సుగౌలీ సంధి
భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తమ ప్రకటనలో “ఇలాంటి అనుచిత వాదనలు చేయద్దని, భారత సర్వాధికారాలను, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని మేం నేపాల్ ప్రభుత్వాన్ని కోరుతున్నాం” అని చెప్పింది.
మ్యాప్ మార్పుల కోసం నేపాల్ పార్లమెంటులో పెట్టిన బిల్లు ఈ వారం ఆమోదం పొందుతుందని భావిస్తున్నారు.
నేపాల్ 1816లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సేనల చేతిలో ఓడిపోయాక తమ పశ్చిమ ప్రాంతంలో ఒక భాగాన్ని వదులుకుంది. ఆ తర్వాత సుగౌలీ సంధి ప్రకారం కాలీ నది జన్మస్థానాన్ని భారత్, నేపాల్ సరిహద్దుగా నిర్ణయించారు. కానీ కాలీ నది మూలం గురించి రెండు దేశాలు అభిప్రాయాలు వేరువేరుగా ఉన్నాయి.
ఆ సంధిలో నదికి సంబంధించి స్పష్టమైన వివరాలు ఇవ్వలేదని, ఏళ్ల తర్వాత మెరుగైన సర్వే టెక్నాలజీ సాయంతో ఆ మ్యాప్ తయారు చేశామని భారత్ చెబుతోంది.

కార్టోగ్రాఫిక్ యుద్ధం
ఇటీవల కార్టోగ్రాఫిక్ వార్ రెండు దేశాల జాతీయ భావాలను మరింత తీవ్రం చేసింది. కాలాపానీ ప్రాంతం నుంచి భారత్ తమ సైనికులను తొలగించాలని నేపాల్ కోరింది.
నేపాల్‌లో భారత రాయబారిగా పనిచేసిన రాకేష్ సూద్ “ప్రాంతీయ జాతీయవాదంపై రెండు వైపుల నుంచీ వస్తున్న ప్రకటనలు, రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలకు అంత మంచిది కాదు” అన్నారు.
నిజానికి ఈ మూడు ప్రాంతాలు గత 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలంగా భారత నియంత్రణలో ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ఉండేవారు భారత పౌరులు. భారత్‌కు పన్నులు చేల్లిస్తున్నారు. భారత ఎన్నికల్లో ఓట్లు వేస్తున్నారు.
నేపాల్ నేతలు మాత్రం తమ దేశం దశాబ్దాలపాటు రాజకీయ సంక్షోభంలో చిక్కుకుందని, దాంతో మావోయిస్టు కార్యకలాపాలు తీవ్ర స్థాయికి చేరాయని, అందుకే తాము భారత్‌తో సరిహద్దు వివాదం అంశాన్ని లేవనెత్తలేకపోయామని చెబుతున్నారు.
నేపాల్ ఎంత కీలకం
లాండ్‌లాక్ దేశం కావడంతో నేపాల్ చాలా ఏళ్లుగా భారత దిగుమతులపైనే ఆధారపడింది. నేపాల్ అంశాల్లో భారత్ కీలక పాత్ర పోషించింది.
కానీ ఇటీవల కొన్నేళ్లుగా భారత్ ప్రభావం నుంచి నేపాల్ దూరమైంది. మెల్లమెల్లగా నేపాల్లో పెట్టుబడులు పెడుతూ, రుణాలు ఇచ్చిన చైనా ఆ లోటును భర్తీ చేసింది.
చైనా తమ ‘బెల్డ్ అండ్ రోడ్ ఇనీషియేటివ్’(బీఆర్ఐ)లో నేపాల్‌ను ఒక కీలక భాగస్వామిగా చూస్తోంది. ప్రపంచ వాణిజ్యాన్ని పెంచుకోలనే పెద్ద లక్ష్యంతో నేపాల్ మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటోంది.
షీ జిన్‌పింగ్ 1996లో జియాంగ్ జెమిన్ తర్వాత నేపాల్లో పర్యటించిన మొదటి చైనా అధ్యక్షుడుగా నిలిచారు. ఆ సమయంలో రెండు దేశాలు తమ సంబంధాలను వ్యూహాత్మక భాస్వామ్యంగా మార్చుకోడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి.

ఫొటో సోర్స్, AFP
లిపులేఖ్ అంశం
దక్షిణాసియా అంశాల్లో నిపుణుడు, షాంఘై ఫుదాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డింగ్లీ షేన్ “నేపాల్ సుదీర్ఘ కాలంగా భారత్ ప్రభావంలో ఉంది. కానీ ఇప్పుడు చైనాకు దగ్గరవడంతో వారికి చైనా మార్కెట్, వనరులు ఉపయోగించుకునే అవకాశం లభించింది. ఆదేశం భారత్, చైనాతో తమ సంబందాలను సంతులనం చేసుకోగలుగుతుందా అనేదే ఇప్పుడు ప్రశ్న” అన్నారు.
భారత్‌కు లిపులేఖ్ అంశం భద్రతతో ముడిపడిన విషయం. 1962లో చైనాతో జరిగిన యుద్ధం తర్వాత లిపులేఖ్ పాస్ నుంచి చైనా ఆక్రమణలకు పాల్పడుతుందేమోనని భారత్‌లో ఆందోళన ఉండేది. దానితోపాటూ భవిష్యత్తులో ఎలాంటి ఆక్రమణలూ జరగకుండా రక్షించుకోడానికి వ్యూహాత్మకంగా హిమాలయ దారులపై పట్టు కోసం కూడా ఆసక్తిగా ఉంది. అప్పటి నుంచి ఈ పాస్ వివాదాస్పద అంశంగా మారింది.
ఈ ఏడాది మేలో భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇక్కడ 80 కిలోమీటర్ల పొడవున్న రహదారిని ప్రారంభించారు. ఆ రహదారి ద్వారా ఆ మార్గంలో ప్రయాణించే హిందూ భక్తుల సమయం చాలావరకూ తగ్గుతుంది. కానీ దానివల్ల నేపాల్‌తో దౌత్య సంబంధాలు చెడిపోయాయి.
నేపాల్‌లో భారత వ్యతిరేక గళం
భారత్ చర్యతో ఆగ్రహించిన నేపాలీలు కాఠ్‌మాండూలోని భారత రాయబార కార్యాలయం బయట వ్యతిరేక ప్రదర్శనలు చేశారు. ఆ ప్రాంతం నుంచి సైనికులను తొలగించాలని భారత్‌ను డిమాండ్ చేశారు. చాలామంది సోషల్ మీడియాలో #Backoffindia ద్వారా తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నేపాల్ సర్వే విభాగం మాజీ డైరెక్టర్ జనరల్ బుద్ధి నారాయణ్ శ్రేష్ఠ్ “మేం 1976లో ఒక మ్యాప్ ప్రచురించాం. అందులో లిపులేఖ్, కాలాపానీ రెండూ నేపాల్ సరిహద్దులో చూపించాం. కేవలం లింపియాధురా ఉండిపోయింది. అది ఒక పొరపాటు” అన్నారు.
అయితే ఈ సరిహద్దు వివాదానికి ముందు నుంచీ నేపాల్లో భారత వ్యతిరేక గళం వినిపిస్తోంది. 2015లో మధేసీ సమాజం తిరుగుబాటు చేసిన సమయంలో హింస చెలరేగింది. తమకు మరిన్ని హక్కులు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఆ సమయంలో భారత్ నుంచి జరిగే వస్తువుల ఎగుమతులను అడ్డుకున్నారు.
తమను ఆర్థిక దిగ్బంధం చేయాలన చూశారనే నేపాల్ ఆరోపణలను భారత్ కొట్టిపారేసింది. కానీ నేపాల్లో ఆ మాటను నమ్మేవారు చాలా కొద్దిమందే ఉన్నారు.
ఐదు నెలల దిగ్బంధం నేపాల్‌లో జనజీవనాన్ని అస్తవస్త్యం చేసింది. చాలా మందికి దానివల్ల కూడా కోపమొచ్చింది. దాంతో 2015లో భూకంపం వల్ల జరిగిన నష్టం తర్వాత పునర్‌నిర్మాణ పనుల్లో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి.

ఫొటో సోర్స్, ISHWAR RAUNIYAR
చైనా జోక్యం చేసుకుంటోందా?
నేపాల్ ఈ అంశాన్ని పరిష్కరించడానికి ఇష్టపడడం లేదని, చైనా మద్దతు వల్లే ఆ దేశం అలా చేస్తోందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు ఆరోపించారు.
భారత సైనిక చీఫ్ జనరల్ ఎంఎం నరవణే “నేపాల్ వేరే ఎవరి గురించో తన కష్టాలు పెంచుకుంది” అని బహిరంగంగా అన్నారు.
ఈ ప్రకటనను చైనా జోక్యంగా చూశారు. భారత్‌లోని కొన్ని రైట్ వింగ్ మీడియా చానళ్లు సరిహద్దు వివాదంపై నేపాల్‌ను ‘చైనా ప్రాక్సీ’ అని కూడా అన్నాయి. అది నేపాలీలకు నచ్చలేదు.
అయితే ప్రొఫెసర్ షేన్ మాత్రం ఇందులో చైనా హస్తం లేదని భావిస్తున్నారు. నేపాల్ ఇప్పుడు భారత్‌తో ఇలా ప్రవర్తించడం వెనుక ఎక్కడా చైనా పాత్ర లేదని నాకు వ్యక్తిగతంగా అనిపిస్తోంది” అన్నారు.
ఇన్ని జరిగినా చైనా ఇప్పటివరకూ ఈ విషయంలో మౌనంగానే ఉంటూ వచ్చింది. అయితే ఆ దేశ విదేశాంగ శాఖ “ఆ ప్రాంతంలో పరిస్థితులు మరింత దిగజారేలా, భారత్, నేపాల్ ఏకపక్ష నిర్ణయాలు ఏవీ తీసుకోవని మేం ఆశిస్తున్నాం” అని చెప్పింది.
రెండు దేశాలూ ఉమ్మడి ఒప్పందంతో చర్చల ద్వారా మాత్రమే ఈ అంశాన్ని పరిష్కరించుకోగలవు. కానీ ఒకప్పుడు అత్యత సన్నిహితంగా ఉన్న నేపాల్ పట్ల భారత్ ఇప్పుడు అసంతృప్తిగా ఉందనేది సుస్పష్టం.
నేపాల్ పార్లమెంటు కొత్త మ్యాప్‌ను ఆమోదించాక, భారత్ చర్చల నుంచ తప్పించుకోవడం కష్టం అవుతుంది. ఇరు దేశాల ఎంతోమంది మాజీ దౌత్యవేత్తలు భారత్‌తో చర్చలు ప్రారంభించాలని అపీల్ చేస్తున్నారు.
“ప్రస్తుతానికి గత కొన్ని నెలలుగా భారత్ దృష్టి మొత్తం కరోనా మహమ్మారిని నియంత్రించడంపైనే ఉంది. కానీ నేపాల్‌తో చర్చలకు అది ఒక అవకాశం తీసుకోవాలి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయినా ఈ అంశంపై మాట్లాడాలి” అని రాకేశ్ సూద్ అన్నారు.
అయితే సరిహద్దుల్లో వ్యూహాత్మక క్షేత్రాన్ని వదులుకోవడం భారత్‌కు కష్టం అవుతుంది. అటు నేపాలీ నేతలు దీన్నుంచి ఏమీ సాధించకుండానే తమవారి మధ్యే కష్టపడాల్సి ఉంటుంది. రెండు వైపులా ఈ మార్గం చాలా సుదీర్ఘంగా ఉంటుంది.
భారత్ తన స్థితిని మరింత కఠినతరం చేసి, నేపాల్లో తమ ప్రభావాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తే అది మరిన్ని భారత వ్యతిరేక గళాలను వినాల్సి వస్తుంది.
భారత్, చైనా మధ్య శత్రుత్వం నేపాల్‌కు చాలా లబ్ధి చేకూర్చవచ్చు. కానీ అలా అది ఆసియాలో పవర్‌గేమ్ మధ్య చిక్కుకుని విలవిల్లాడే ప్రమాదం కూడా ఉంది.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ కేసులు: టాప్ టెన్ దేశాల్లో భారత్.. జూన్, జులై నెలల్లో దేశంలో పరిస్థితి ఎలా ఉంటుంది?
- భారత్-చైనాల మధ్య ఉద్రిక్తతలు ఎందుకు పెరుగుతున్నాయి? ‘సరిహద్దు’ తెర వెనుక ఏం జరుగుతోంది?
- గృహ హింస: ‘లాక్డౌన్ నాకు ఆలోచించుకునేంత సమయం ఇచ్చింది.. నా భర్త నుంచి నేను విడిపోవాలనుకుంటున్నా’
- సైకిల్ జ్యోతి: తినడానికీ సమయం దొరకట్లేదు, బిహార్‌లో రాజకీయ నాయకులు, అధికారులు, జర్నలిస్టులతో ‘పీప్లీ లైవ్’ను తలపిస్తున్న ఇల్లు
- ఎవరెస్ట్ ఎత్తు ఎంత? చైనా ఎందుకు మళ్లీ లెక్కిస్తోంది? 4 మీటర్ల తేడా ఎందుకు వచ్చింది?
- ఇదో బానిసల మార్కెట్... వేలాది మహిళలను ఆన్లైన్లో అమ్మేస్తున్నారు: బీబీసీ రహస్య పరిశోధన
- ఆరాంకో: ప్రపంచంలో అత్యధిక లాభాలు సంపాదించే కంపెనీ షేర్ మార్కెట్లోకి ఎందుకొస్తోంది?కరోనావైరస్: సౌదీ అరేబియా ఎప్పుడూ లేనంత కష్టాల్లో కూరుకుపోయిందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








