భారత్-నేపాల్ సరిహద్దు వివాదం: మానస సరోవర యాత్రకు సమస్యలు ఎదురవుతాయా?

కైలాస మానస సరోవర యాత్ర

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కైలాస మానస సరోవర యాత్ర
    • రచయిత, సురేంద్ర ఫుయాల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అక్కడకు వెళ్లాలని ఎంతోమంది కలలు కంటారు. హిమాలయాల మధ్యలో ఆ అద్భుత అందాలను ఊహించుకుంటారు.

విశాలమైన పీఠభూములు, ఎత్తుపల్లాల మైదానాల నుంచి ఇక్కడకు చేరుకునే యాత్రికులు, ప్రకృతి ప్రేమికులకు చుట్టూ కనుచూపుమేరలో ఎత్తైన పర్వత శిఖరాలను చూసి మైమరచిపోతారు.

దీని మధ్య భాగం రాయి, గ్రానైట్‌ లాంటి ముదురు గోధుమ రంగులో ఉంటుంది. పర్వత శిఖరాలను తెల్లటి మంచు కప్పేసి ఉంటుంది.

ఆ మంచు మొత్తం కరిగి నేలపై ఉన్న ఒక విశాలమైన సరస్సులోకి చేరుతుంటుంది. అక్కడి అందాలను మాటల్లో వర్ణించాలంటే అసాధ్యం.

ఆ ప్రాంతానికి ఉన్న అద్భుతమైన సాంస్కృతిక, ప్రకృతిక ప్రాధాన్యం వల్ల సన్యాసులు, లామాలు, బౌద్ధులు, హిందువులు, జైనులు ఇలా ఎంతోమంది అక్కడికి వస్తుంటారు.

కైలాస మానససరోవరానికి మీకు స్వాగతం

భారత్, నేపాల్, భూటాన్, చైనా, టిబెట్‌కు చెందిన ఎంతోమంది భక్తులు దీనిని శివపార్వతుల సహా ఎంతోమంది దేవతలు కొలువైన ప్రదేశంగా భావిస్తారు.

అందుకే, కైలాస మానస సరోవర యాత్రను జీవితంలో ఒక్క సారైనా చేయాల్సిన తీర్థయాత్రగా చెబుతారు.

కానీ అక్కడికి చేరుకోవడానికి రెండు మూడు వారాలు(మీరు ఎక్కడి నుంచి వచ్చారు అనేదానిపై ఆధారపడి) పడుతుంది.

ఈ యాత్రను విమానాల్లో, జీపులో, కాలినడకన కూడా చేస్తారు. అత్యంత కఠినమైన ప్రయాణం తర్వాత ప్రజలు ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన భౌగోళిక ప్రాంతం, అంటే హిమాలయ పర్వత ప్రాంతాల్లోకి చేరుకుంటారు.

కైలాస మానస సరోవర యాత్ర

ఫొటో సోర్స్, Getty Images

అనిశ్చితి, అడ్డంకులు

ఉత్తరాఖండ్-లిపులేఖ్ రోడ్ లింక్ నుంచి ఈ యాత్రను చాలా తక్కువ సమయంలో పూర్తయ్యేలా చేయడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది.

ఈ ఏడాది మే 8న భారత రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ రోడ్ లింకును ప్రారంభించారు. కానీ ఈ దారిలో కూడా ఎన్నో అనిశ్చితులు, అడ్డంకులు ఉన్నాయి.

వీటిలో మొదటిది. ఈ ఏడాది కైలాస మానస సరోవర యాత్ర అనిశ్చితిలో పడింది. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 మహమ్మారి వ్యాపించడమే దీనికి కారణం.

చైనా అధికారులు ఇక్కడకు చేరుకునే ప్రతి విదేశీ పర్యాటకుడు 14 రోజుల మెడికల్ క్వారంటీన్‌లో ఉండడాన్ని తప్పనిసరి చేశారు.

టిబెట్‌లో కూడా అలాంటి కొన్ని నిబంధనలే అమలవుతున్నాయి. వీటన్నిటి ప్రభావం జూన్, జులై, ఆగస్టు నెలల్లో కైలాస మానస సరోవర యాత్రకు వచ్చే పర్యాటకులపై పడుతుందని నేపాల్, టిబెట్, చైనా ట్రావెల్ ఏజెంట్లు, అధికారులు చెబుతున్నారు.

టిబెట్ ప్రభుత్వ పర్యవేక్షణలో ఉండే వెబ్‌లైట్ Tibet.cn ప్రకారం చైనాలో మెల్లమెల్లగా సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరోవైపు పర్యాటకుల సాంస్కృతిక, ప్రాకృతిక సౌందర్యం ఉన్న ప్రాంతాలను సందర్శించాలని కోరుకుంటున్నట్టు చెబుతున్నారు.

అయితే, ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 వల్ల దారుణంగా మారిన పరిస్థితులపై ఆందోళనలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

ఉదారహణకు, అరుణాచల్ ప్రదేశ్ ఉత్తరాన తూర్పు టిబెట్‌లోని ప్రముఖ న్యింగ్చీ నగరంలో జనం పర్యటక ప్రదేశాలను సందర్శించడాన్ని నిషేధించారు. లాసా, న్గారీలో కూడా అలాంటి నిబంధనలే ఉన్నాయి. కైలాస పర్వతం, మానస సరోవరం సరస్సు ఈ ప్రాంతాల్లోనే ఉన్నాయి.

కైలాస మానస సరోవర యాత్ర

ఫొటో సోర్స్, Getty Images

జులై-ఆగస్టు నాటికి సాధ్యమవుతుందా?

Tibet.cn వెబ్ సైట్ ప్రకారం టిబెట్ పీఠభూమిలో కరోనా మహమ్మారిని అదుపు చేస్తున్నట్టే కనిపిస్తోంది. చైనాలో కోవిడ్-19 వ్యాపించిన తర్వాత టిబెట్‌లో ఎమర్జెన్సీ రెస్పాన్స్ అమలు చేశారు. ఆ ప్రాంతంలో ఆక్సిజన్ కొరత, పరిమిత వైద్య సదుపాయాలు ఉండడం వల్ల వ్యాదివల్ల చాలా నష్టం జరగవచ్చని అది హెచ్చరించింది.

“ఆగస్టు ముందు కెరూంగ్ దగ్గర నేపాల్-చైనా, టిబెట్ సరిహద్దులు, లిపులేఖ్ దగ్గర మిగతా ప్రాంతాలు తెరుస్తారని తాము చాలా ఆశలు పెట్టుకున్నామని లాసాలో ‘ఎక్స్ ప్లోర్ టిబెట్’ అనే ట్రావెల్ ఏజెన్సీ నడిపే ట్రావెల్ ఆపరేటర్లు ఈమెయిల్ ద్వారా తెలిపారు.

మరోవైపు మొత్తం టిబెట్‌లో అనిశ్చితి పరిస్థితి కూడా కొనసాగుతోంది.

ట్రావెల్ ఏజెంట్లు తమ ఈమెయిల్లో 2015లో వచ్చిన భూకంపం తర్వాత ఝాంగ్మూ (కాఠ్‌మాండూ ఉత్తర కోదారీ దగ్గర)ను ఇంకా మూసేసే ఉన్నారు. కైలాస మానస సరోవర యాత్ర కోసం మనం రోడ్డు మార్గంలో వెళ్లాలంటే కెరూంగ్ నుంచి ప్రవేశించడం ఒక్కటే మార్గం” అన్నారు.

అయితే కరోనా మహమ్మారి వల్ల జులై ఆఖరు వరకూ పర్యటకులు ఎవరికీ టిబెట్‌లో వ్రవేశించడానికి అనుమతి లేదు.

ఆగస్టు నాటికి పరిస్థితి కుదుట పడతాయని, దక్షిణాసియా యాత్రికులు కైలాస మానస సరోవర యాత్రకు రావచ్చని వారు చెబుతున్నారు.

“స్వదేశీ పర్యటకుల కోసం టిబెట్ చైనా ప్రాంతం మెల్లమెల్లగా తెరుచుకుంటోంది. టిబెట్, నేపాల్, భారత్ గుండా వచ్చే దక్షిణాసియా యాత్రికులకు చైనా స్వాగతం పలకడానికి మరికొంత కాలం పట్టచ్చు” అని నేపాల్‌లో టిబెట్ టూర్లు ఏర్పాటు చేసే తెన్జింగ్ నోర్బు లామా చెప్పారు.

“మా టిబెట్ మిత్రులు కైలాస మానస సరోవర యాత్రకు ఆగస్టు లేదా సెప్టెంబరులో అనుమతించవచ్చని చెబుతున్నారు. అది కరోనా మహమ్మారి పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది” అన్నారు,.

ఈ ప్రాంతంలో ప్రవేశించడానికి భక్తులు, పర్యటకులు చైనా టూరిస్టు వీసా తీసుకోవాలి. దానితోపాటూ టిబెట్ ప్రభుత్వం నుంచి ప్రత్యేక పర్మిట్ కూడా అవసరం.

దిల్లీకి ఆగ్నేయంగా 750 కిలోమీటర్ల దూరంలో ఉన్న లిపులేఖ్ మానస సరోవర యాత్రను ఆరు రోజులు తగ్గిస్తుంది. అత్యంత తక్కువ సమయంలో అది పూర్తయ్యేలా చేస్తుంది.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

యాత్ర చుట్టూ ఎన్నో సమస్యలు

కానీ, లిపులేఖ్ పాస్ నుంచి వెళ్లడానికి కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. అంటే, ఇక్కడ నుంచి ఒకసారి వెయ్యి మంది భారత యాత్రికులకు వెళ్లడానికి మాత్రమే అనుమతి ఇస్తారు అని తెన్జింగ్ నోర్బూ చెప్పారు.

లిపులేఖ్ నుంచి కాకుండా వేరే ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఉన్నాయి. నేపాల్ సిమికోట్, కొరోలా, కెరూంగ్ లేదా కోదారీ సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాల నుంచి యాత్రకు వెళ్లవచ్చు.

ఈ మార్గాల్లో వెళ్లే పర్యాటకుల సంఖ్యలో ఎలాంటి పరిమితులు లేవని స్థానిక టూర్ ఆపరేటర్లు చెప్పారు.

ఆగ్నేయ, తూర్పు భారత్ నుంచి వచ్చే వారికి మూడో ప్రత్యామ్నాయం కూడా ఉంది. సిక్కింలోని గాంగ్‌టక్, నాథులా పాస్ మీదుగా మానస సరోవరం చేరుకోవడం.

నేపాల్ మీదుగా వెళ్లాలనుకునే భారత పర్యటకులకు మానససరోవర యాత్రకు లక్షన్నర(జీపుల్లో) నుంచీ రెండు లక్షలు(హెలికాప్టర్‌లో) వరకూ ఖర్చవుతుందని తెన్జింగ్ నోర్బూ చెప్పారు.

జూన్‌లో సాగా దావా(హిమాలయ ప్రాంతాల్లో ఉన్న బౌద్ధుల పండుగ), జులై చివర్లో గురు పూర్ణిమ సందర్భంగా నేపాల్‌కు దూరంగా పశ్చిమంగా ఉన్న టిబెట్‌లోని బెరూంగా పట్టణం, కైలాస మానస సరోవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో జనం కిటకిటలాడుతారు.

భారత ప్రభుత్వం ప్రణాళికలు విజయవంతం అయితే, మరికొన్ని నెలల్లో జీపు యాత్రల కోసం లిపులేఖ్ రోడ్డు లింక్ సిద్ధం అవుతుంది.

దిల్లీ నుంచి జీపుల్లో 750 కిలోమీటర్ల దూరంలోని లిపులేఖ్ చేరుకునే పర్యటకులు తర్వాత ఐదు కిలోమీటర్లు నడిచి టిబెట్ చేరుకోవాల్సి ఉంటుంది.

కైలాస మానస సరోవర యాత్ర

మన శక్తికి పరీక్ష పెట్టే యాత్ర

కానీ, ఈ యాత్రకు వెళ్లేవారు ఆరోగ్యంగా, చురుగ్గా ఉండడం చాలా అవసరం. వారు సముద్రమట్టానికి 200 మీటర్ల ఎత్తు (దిల్లీ) నుంచి. ఒక్కసారిగా 1200 మీటర్ల ఎత్తుకు(కాఠ్‌మాండూ) చేరుకోడానికి, ఎగుడుదిగుడు దారుల్లో సముద్ర మట్టానికి 5200 మీటర్ల ఎత్తు వరకూ(లిపులేఖ్) తీసువెళ్లే జీపుల్లో ప్రయాణించడానికి సన్నద్ధంగా ఉండాలి.

అంత కష్టపడి ప్రయాణం చేసిన తర్వాత వారు నడిచి వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉండాలి.

హిమాలయ ప్రాంతాల్లో గాలి మైదానాల్లో ఉన్నట్లు ఉండదు. చాలామందికి ఆక్సిజన్ సపోర్ట్ అవసరం అవుతుంది. కోవిడ్-19 వ్యాపించిన ప్రస్తుత సమయంలో అలాంటి వారు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే టిబెట్‌లో తగినన్ని ఆస్పత్రులు, వైద్య సదుపాయాలు లేవు.

లిపులేఖ్ లేదా నేపాల్, సిమికోట్ మీదుగా టిబెట్‌లో ప్రవేశించాక పర్యటకులు మరో 150 కిలోమీటర్లు సుదీర్ఘ యాత్ర చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మాత్రమే యాత్రికులు కైలాస పర్వతం(6638 మీటర్లు) చుట్టూ 43 కిలోమీటర్లు ప్రదక్షిణ ప్రారంభించడం సాధ్యం అవుతుంది.

కైలాస పర్వతానికి దక్షిణంగా మానస సరోవరంతోపాటు మరో సరస్సు కూడా ఉంది. ఇవి ఆసియాలోని సింధు, సత్లెజ్, ఘాఘ్రా, బ్రహ్మపుత్ర లాంటి ప్రముఖ నదులకు మూలం అయ్యాయి.

మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకం అయిన ‘కైలాస మానస సరోవర యాత్ర’ ఇప్పటికీ ఒక కలగానే మిగిలిపోయింది. దానికి గ్రౌండ్‌వర్క్‌ లో చాలా సవరణలు చేయాల్సిన అవసరం ఉందని ట్రావెల్ ఏజెంట్లు చెబుతున్నారు.

అంతే కాదు, లిపులేఖ్ వరకూ చేరుకోవడం కూడా అంత సులభం కాదు. అక్కడ ఎత్తుగా ఉన్న హిమాలయాలను ఎక్కాల్సి ఉంటుంది. అవి సముద్ర మట్టానికి 5200 మీటర్ల ఎత్తులో ఉంటాయి.

భారత్, నేపాల్ జెండాలు

భారత్-నేపాల్ సరిహద్దు వివాదం

ఈ పర్యటన చేయాలనుకునే యాత్రికులకు వ్యక్తిగత సమస్యలే కాకుండా ప్రభుత్వాలతో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

భారత్, నేపాల్ మధ్య లిపులేఖ్ సరిహద్దు వివాదంగా మారింది. భారత ప్రభుత్వం నిర్మించిన లిపులేఖ్ ప్రాజెక్టును నేపాల్ తీవ్రంగా వ్యతిరేకించింది.

గుంజీ కాలాపానీ నుంచి లిపులేఖ్ వరకూ మోదీ ప్రభుత్వం ఇటీవల ఏకపక్షంగా లింక్ రోడ్ ప్రారంభించడంపై నేపాల్ ప్రజలు, నేతలు, విమర్శకులు అసంతృప్తితో ఉన్నారు.

నేపాల్ గత 200 ఏళ్లుగా లిపులేఖ్ నుంచి లిపియాధురా వరకూ ఉన్న ప్రాంతాన్ని తమదిగా భావిస్తోంది. ఈ వారం నేపాల్ క్యాబినెట్ దీనిపై ఒక కొత్త రాజకీయ పటం కూడా జారీ చేసింది. అందులో లిపియాధురా, కాలాపానీ, లిపులేఖ్‌ను నేపాల్ మహాకాళి నదికి పశ్చిమ సరిహద్దుగా చూపించారు.

భారత రక్షణ మంత్రి లిపులేఖ్ లింకు రోడ్ ప్రారంభించిన 10 రోజులకు నేపాల్‌లోని కేపీ ఓలీ ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.

ఆరు నెలల క్రితం భారత ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసిన సమయంలో తమ కొత్త రాజకీయ పటం జారీ చేసింది. అందులో నేపాల్‌తో తమ సరిహద్దు లిపులేఖ్ తర్వాత ప్రారంభం అవుతుందని భారత్ చూపిస్తోంది.

ఇక, మానస సరోవర యాత్ర విషయానికి వస్తే, మహాకాళి నదికి రెండు వైపులా ట్రెకింగ్ దారులు ఉన్నాయి. ఇవి చాలా పాతవి. యాత్రికులను అవి హిమాలయాల్లో అత్యంత కఠిన ప్రాంతాల్లో నుంచి తీసుకెళ్తాయి.

టిబెట్ నుంచి మానస సరోవరం చేరుకునే ఈ దారులు పర్యటకుల శారీరక, మానసిక సామర్థ్యానికి పరీక్షలా నిలుస్తాయి.

భారత్‌కు చెందిన ఇండో-నేపాల్ బోర్డర్ పోలీస్ 1960లో జరిగిన భారత్-చైనా యుద్ధం ముందు నుంచీ ఇక్కడ కాలాపానీ ప్రాంతంలో గస్తీ కాస్తున్నాయి.

నేపాల్ కూడా సమీప గ్రామాల్లో కొన్ని పోలీసు బలగాలను మోహరించింది. మే మధ్యలో అది ఛంగ్రూ గ్రామం దగ్గర సరిహద్దు రక్షణకు సాయుధ పోలీసు బలగాలను కూడా మోహరించింది.

కానీ, ఇరు దేశాల భద్రతా బలగాలు యాత్రికులతో ఎప్పుడూ వినయంగా, సౌమ్యంగా వ్యవహరిస్తాయి.

లిపులేఖ్ ప్రాంతానికి మరో ప్రాముఖ్యత కూడా ఉంది. ఇక్కడ అపీ నంపా సంరక్షణ క్షేత్రంలో ఉన్న పర్వతం గురించి వివాదం ఉంది.. ఇది పశ్చిమ నేపాల్‌లోని అపీ, నంపా. వ్యాస్ పర్వతాల చుట్టూ ఉన్న పర్యావరణాన్ని కాపాడుతుంది.

ఈ పర్వత శిఖరాలు ఆ ప్రాంతం అందాలను రెట్టింపు చేస్తాయి.

ధార్‌చులా నుంచి లిపులేఖ్ పాస్ దాటి తీసుకెళ్లే ఈ దారులన్నీ సాక్షాత్తూ దేవతలు కొలువై ఉంటారని భక్తులు భావించే కైలాస మానస సరోవరం దగ్గరకు తీసుకెళ్తాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)