ఉత్తర, దక్షిణ కొరియా దేశాల మధ్య చిచ్చు పెడుతున్న బెలూన్లు

ఉత్తర, దక్షిణ కొరియా సరిహద్దుల్లో బెలూన్లు

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, ఈ బెలూన్లను ఆపేందుకు దక్షిణ కొరియా కూడా ప్రయత్నిస్తోంది
    • రచయిత, ఆండ్రియాస్ ఇల్మర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఉత్తర కొరియా, దక్షిణ కొరియా సరిహద్దుల్లో ఇప్పుడు బెలూన్లు ఉద్రిక్తతలకు కారణమవుతున్నాయి.

దక్షిణ కొరియాకు చెందిన యాక్టివిస్ట్‌లు వీటిని ఎగురవేస్తున్నారు.

ఈ బెలూన్ల విషయమై ఉత్తర కొరియా ఆగ్రహం వ్యక్తం చేసింది. దక్షిణ కొరియా కూడా యాక్టివిస్ట్‌లను ఆపేందుకు ప్రయత్నించింది కానీ, ఫలితం లేకపోయింది.

చిరకాల ప్రత్యర్థులుగా ఉన్న దక్షిణ కొరియా, ఉత్తర కొరియా 2018 నుంచి సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందుకోసం సంప్రదింపులు జరుపుతున్నాయి.

అయితే, గత వారం ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు మరోసారి దిగజారినట్లు కనిపించాయి.

ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు ఏర్పాటైన ఇంటర్ కొరియన్ లియాయిసన్ ఆఫీస్‌ను ఉత్తర కొరియా గత శుక్రవారం పేల్చివేసింది.

సంప్రదింపుల్లో తమ మాటకు బలం పెంచుకునేందుకే ఉత్తర కొరియా ప్రభుత్వం కావాలని ఉద్రిక్తతలను పెంచుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

దక్షిణ కొరియావైపు ఓ చెట్టుకు చిక్కుకుపోయిన బెలూన్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, దక్షిణ కొరియావైపు ఓ చెట్టుకు చిక్కుకుపోయిన బెలూన్

సరిహద్దుల్లో ఏం జరుగుతోంది?

ఉత్తర కొరియా ప్రభుత్వానికి వ్యతిరేకమైన సమాచారం, కథనాలు, సీరియళ్లకు సంబంధించిన కరపత్రాలు, డీవీడీలు, పెన్‌డ్రైవ్‌ల వంటివాటిని ఆ దేశంలోని ప్రజలకు బెలూన్ల ద్వారా చేరవేసేందుకు దక్షిణ కొరియాకు చెందిన యాక్టివిస్టులు ప్రయత్నిస్తుంటారు.

ఉత్తర కొరియాలో విపరీతమైన సెన్షార్‌షిప్ ఉంటుంది. దీంతో అక్కడి ప్రజల్లో అవగాహన పెంచి, అంతర్గతంగా తిరుగుబాటు తేవాలన్న ఉద్దేశంతో దక్షిణ కొరియా యాక్టివిస్టులు ఇలాంటి బెలూన్లను పంపుతున్నారు.

ఈ ప్రక్రియ కొన్నేళ్లుగా సాగుతుంది.

ఇలా బెలూన్లు పంపడాన్ని దక్షిణ కొరియా ప్రభుత్వం కూడా తప్పుపడుతోంది. ఇలాంటి చర్యల వల్ల అనవసరపు ఉద్రిక్తతలు ఏర్పడతాయని అంటోంది.

దక్షిణ కొరియా, ఉత్తర కొరియా ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా, యాక్టివిస్టులు లెక్కచేయడం లేదు. ఇటీవల కొన్ని బెలూన్లను పంపించినట్లు వారు తెలిపారు.

‘‘ఉత్తర కొరియా ప్రజలు మానవహక్కులకు దూరంగా బతుకుతున్నారు. ఓ ఆధునిక నియంత వారిని బానిసలుగా చేసుకున్నాడు. వారికి నిజం తెలుసుకునే హక్కు లేదా?’’ అంటూ ఈ బెలూన్లను పంపుతున్న ఓ బృందం ప్రశ్నించింది.

‘‘కరపత్రాలు విషం కాదు. ఆ బెలూన్లతో బాంబులను పంపడం లేదు’’ అని వ్యాఖ్యానించింది.

బెలూన్లు పంపడాన్ని దక్షిణ కొరియా మరోసారి ఖండించింది. రెండు కొరియన్ దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరిచేందుకు, శాంతిని కాపాడుకునేందుకు అలాంటి వాటిని వెంటనే ఆపాలని వ్యాఖ్యానించింది.

‘చర్చలతో ఇప్పటివరకూ ఉత్తర కొరియాకు ఒరిగిందేమీ లేదు’

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ‘చర్చలతో ఇప్పటివరకూ ఉత్తర కొరియాకు ఒరిగిందేమీ లేదు’

ఉత్తర కొరియా ఏమంటోంది?

ఇలా బెలూన్లు పంపడం తమకు ‘భరించలేని అవమానం’ అని ఉత్తర కొరియా ఇదివరకు వ్యాఖ్యానించింది. పంపేవారిని కూడా దూషించింది.

ఎదురుదాడిగా దక్షిణ కొరియాకు పంపేందుకు ప్రచార సమాచారం తాము సిద్ధం చేస్తున్నట్లు ఉత్తర కొరియా తెలిపింది. దక్షిణ కొరియా పౌరులకు ఉత్తర కొరియా గొప్పతనం తెలియజెప్పేలా 1.2 కోట్ల కరపత్రాలు సిద్ధంగా ఉన్నట్లు ఆ దేశ ప్రభుత్వ మీడియా పేర్కొంది.

మరోవైపు ఉత్తర కొరియా సరిహద్దుల్లోకి లౌడ్ స్పీకర్లను కూడా తేవడం మొదలుపెట్టింది. దక్షిణ కొరియా వైపు వినిపించేలా వీటి ద్వారా ఉత్తర కొరియా ప్రచారం చేస్తుంది.

2018లో ఇలాంటి స్పీకర్లు, సీమాంతర ప్రచారం లేకుండా చేసుకోవాలని ఉత్తర కొరియా, దక్షిణ కొరియా అంగీకరించుకున్నాయి.

ఇదివరకు బలగాలను ఉపసంహరించుకున్న బఫర్ జోన్‌లో తిరిగి ఎప్పుడైనా సైనికులను మోహరించేందుకు సిద్ధంగా ఉన్నామని ఉత్తర కొరియా సైన్యం గత వారం ప్రకటించింది.

దక్షిణ కొరియావైపు నదిలో పడిపోయిన బెలూన్‌ను తొలగిస్తున్న పోలీసులు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, దక్షిణ కొరియావైపు నదిలో పడిపోయిన బెలూన్‌ను తొలగిస్తున్న పోలీసులు

బెలూన్లే అసలు కారణమా?

బెలూన్ల ద్వారా జరుగుతున్న ఈ సీమాంతర ప్రచారం, ఈ విషయంలో దక్షిణ కొరియా ఏ చర్యలూ తీసుకోకపోవడం తమ ఆగ్రహానికి కారణాలని ఉత్తర కొరియా అధికారికంగా చెబుతోంది.

కానీ, ఇలా బెలూన్లు పంపడం కొత్త విషయమేం కాదు. అలాంటప్పుడు ఉత్తర కొరియా వైఖరి ఒక్కసారిగా ఎందుకు మారింది?

‘‘బెలూన్లు, కరపత్రాల కారణంగా ఉత్తర కొరియా ఇలా చేస్తోందంటే నాకు సందేహమే. ఉద్రిక్తతలను పెంచేందుకు వారు ఈ సాకును ఉపయోగించుకున్నారని చెప్పేందుకు అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. సంప్రదింపులు మొదలైనప్పటి నుంచి దక్షిణ కొరియాకు వాస్తవికంగా ఎలాంటి ప్రయోజనాలూ దక్కలేదన్నదే అసలు కారణం’’ అని సియోల్‌లోని కూక్మిన్ యూనివర్సిటీకి చెందిన ఫ్యోడోర్ టెర్టిస్కియ్ బీబీసీతో అన్నారు.

చర్చలు మొదలైనప్పటి నుంచి తమపై ఆంక్షలు సడలుతాయని, దక్షిణ కొరియాతో ఆర్థిక సహకారం పెరుగుతుందని ఉత్తర కొరియా ఆశించింది.

కొరియన్ దేశాల మధ్య కొన్ని ప్రాజెక్టులు మొదలవుతాయని భావించింది. ఉదాహరణకు కుమ్‌గాంగ్ పర్వతాల్లో పర్యాటకాన్ని అనుమతించడం వీటిలో ఒకటి. ఈ అంశం గురించి రెండు దేశాలు సంయుక్త ప్రకటనలో కూడా ప్రస్తావించాయి.

కానీ, ఉత్తరకొరియా అణ్వాయుధాలు వదులుకుంటేనే ఆంక్షల సడలింపు విషయంలో చర్చలు ఉంటాయని అమెరికా ఒత్తిడి చేయడంతో పెద్దగా ఏ పురోగతీ లేకుండా పోయింది.

ఈ ప్రతిష్టంభనపై ఉత్తర కొరియా అసంతృప్తితో ఉన్నా, దక్షిణ కొరియా ముందుకు వచ్చి పెద్దగా ఏమీ చేసే అవకాశాలు కనిపించడం లేదు. కాబట్టి, రెండు దేశాల మధ్య ప్రస్తుత ఉద్రిక్తతలు ఇప్పుడప్పుడే చల్లారే అవకాశాలు కనిపించడం లేదు.

‘‘ఉత్తర కొరియా మళ్లీ స్పీకర్లు పెడుతుంది. బలగాలను ముందుకు పంపుతుంది. దక్షిణ కొరియాకు వ్యతిరేకంగా కరపత్రాలను కూడా చూస్తామేమో’’ అని ఎన్‌కే న్యూస్ వార్తా సంస్థ ప్రతినిధి జియోంగ్మిన్ కిమ్ బీబీసీతో చెప్పారు.

‘‘దక్షిణ కొరియా ప్రభుత్వం ఇప్పుడు క్లిష్టమైన పరిస్థితిలో ఉంది. ఇప్పుడు వారు ఉల్లంఘనలకు దీటుగా స్పందించినట్లు కనిపించాలి. సొంత పౌరులనూ రక్షించుకోవాలి. అలా అని ఉత్తర కొరియాను మరీ దూరం చేసుకోకూడదు’’ అని ఆమె అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)