ఉత్తర కొరియా వార్నింగ్: ఆ ప్రాంతంలోకి సైన్యాన్ని పంపిస్తాం

ఫొటో సోర్స్, Reuters
రెండు కొరియాలను విభజించే డీమిలిటరైజ్డ్ జోన్‌లోకి తమ సైన్యం ప్రవేశించేందుకు సిద్ధంగా ఉందని ఉత్తర కొరియా హెచ్చరించింది.
తమ దేశాన్ని వదిలిపెట్టి దక్షిణ కొరియాలో స్థిరపడిన కొన్ని పలాయన బృందాలు దుష్ప్రచారంచేసే సమాచారాన్ని పంపిస్తున్నాయంటూ ఉత్తర కొరియా ఈ హెచ్చరికలు చేసింది.
దీనికి సంబంధించి సైన్యం సిద్ధంగా ఉండాలని కిమ్ జోంగ్-ఉన్ సోదరి కిమ్ యో-జోంగ్ గతవారం ఆదేశాలూ జారీచేశారు.
తాజాగా సరిహద్దులను పటిష్ఠంగా, అత్యంత అప్రమత్తంగా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సైన్యం ప్రకటించింది.
బెలూన్ల సాయంతో సరిహద్దులకు అటువైపు ఉండే ప్రాంతాలకు పంపిస్తున్న కొన్ని కరపత్రాల విషయంలో రెండు దేశాల మధ్య కొంత కాలంగా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి.
ఉత్తర కొరియా చేసిన తాజా హెచ్చరికలపై దక్షిణ కొరియా రక్షణ శాఖ మంగళవారం స్పందించింది. ఉత్తర కొరియాలో సైన్యం కదలికలను జాగ్రత్తగా గమనించేందుకు అమెరికాతో కలిసి పనిచేస్తున్నట్లు వెల్లడించింది.

ఫొటో సోర్స్, Reuters
<bold>ఉత్తర కొరియా ఏమంటోంది? </bold>ఉత్తర కొరియా, దక్షిణ కొరియాలను డీమిలిటరైజ్డ్ జోన్ (డీఎంజెడ్) వేరుచేస్తుంది. దీన్ని 1950లలో ఏర్పాటుచేశారు. ఈ ప్రాంతాల్లో ఎలాంటి సైనిక కదలికలూ ఉండవు. డీమిలిటరైజ్డ్ జోన్లలోకి సైన్యాన్ని పంపే కార్యచరణ ప్రణాళికను అధ్యయనం చేస్తున్నట్లు ఉత్తర కొరియా సైన్యం మంగళవారం తెలిపింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను మెరుపు వేగంతో అత్యంత అప్రమత్తంగా అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సైన్యాధిపతి వ్యాఖ్యానించారు. దక్షిణ కొరియాపై సైనిక చర్యకు సిద్ధంగా ఉన్నామని కిమ్ జోంగ్ ఉన్ సోదరి గత శనివారం హెచ్చరించిన నేపథ్యంలో.. తాజా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. "దక్షిణ కొరియా అధినాయకత్వంతో తెగదెంపులు చేసుకునేందుకు సమయం ఆసన్నమైంది"అని ఆమె వ్యాఖ్యానించారు. కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె ప్రకటనలో చెప్పారు. ఈ విషయంలో సైన్యానికీ ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. "చెత్తను చెత్త బుట్టలోకి తోసెయ్యాలి" అంటూ ఆమె ప్రకటనను ముగించారు.

ఫొటో సోర్స్, AFP
ఉత్తర కొరియా ఎందుకిలా చేస్తోంది?
(దక్షిణ కొరియా వ్యవహారాల ప్రతినిధి లారా బెకర్ విశ్లేషణ)
దక్షిణ కొరియా ఈ హెచ్చరికలను తీవ్రంగా పరిగణిస్తోంది. డీఎంజెడ్ పరిసరాల్లో నిఘా వ్యవస్థను దక్షిణ కొరియా పటిష్ఠంచేసింది. మరోవైపు ఉద్రిక్తతలు తగ్గేలా చూడాలని ఉత్తర కొరియాను దేశ అధ్యక్షుడు మూన్ జే-ఇన్ అభ్యర్థించారు. కరపత్రాలతో ఉద్రిక్తతలు ఈ స్థాయికి ఎలా పెరిగాయి? వీటితో తమ అధినాయకత్వంపై దుష్ప్రచారం చేస్తోందని ఉత్తర కొరియా భావిస్తోంది. సరిహద్దుల వెంబడి బెలూన్ల సాయంతో పంపిస్తున్న వీటిని అడ్డుకుంటామని దక్షిణ కొరియా మాట ఇచ్చింది. దీనికి సంబంధించి 2018లో మూన్, కిమ్‌ల మధ్య ఒప్పందం కూడా కుదిరింది. మరోవైపు కఠిన ఆంక్షలు తప్పనిసరిగా కొనసాగాలంటూ అమెరికా చేస్తున్న ఒత్తిడిపై విభేదించనందుకు దక్షిణ కొరియాపై ఉత్తర కొరియా ఆగ్రహంతో ఉంది. బహుశా రెండు దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల్లో ఇది ఒక చిన్న కోణం మాత్రమే కావొచ్చు. కరపత్రాలు విడుదలైన సమయం, రెండు దేశాల మధ్య తెగదెంపులు చేసుకున్న సమాచార సేవల నుంచి సైనిక చర్యల వరకూ అంతా పక్కా ప్రణాళిక ప్రకారం జరుగుతున్నట్లు అనిపిస్తోంది. ఈ సంక్షోభాన్ని దక్షిణ కొరియాకు బుద్ధి చెప్పేందుకు ఉపయోగించుకోవాలని ఉత్తర కొరియా భావిస్తోంది. మరోవైపు దీన్ని ఉపయోగించుకొని చర్చలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని అనుకుంటోంది. 2018లో దక్షిణ కొరియా నాయకుడు మూన్ కష్టపడి సాధించిన పురోగతిని తుంగలోకి తొక్కడమే లక్ష్యంగా ఈ హెచ్చరికలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. సైన్యంతో పటిష్ఠంగా ఉండే జోన్‌లో శాంతిని స్థాపించడమే లక్ష్యంగా ఇప్పటివరకు మొత్తంగా 20 సైనిక టవర్లను నేలమట్టం చేశారు. కొరియా ద్వీపకల్పంలో సుస్థిర శాంతిని స్థాపించడం కోసం పనిచేస్తున్నట్లు మూన్ చెప్పారు. అయితే ఆయన లక్ష్యాలు అసాధ్యమని నిరూపించేందుకు ఉత్తర కొరియా ప్రయత్నిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
ఏమిటీ కరపత్రాల వివాదం?
గతవారం దక్షిణ కొరియాతో చర్చలను ఉత్తర కొరియా రద్దుచేసింది. రెండు దేశాల నాయకుల మధ్య హాట్‌లైన్‌నూ నిలిపివేసింది.
దక్షిణ కొరియాలో స్థిరపడిన ఉత్తర కొరియా వాసులు పంపిస్తున్న కరపత్రాల విషయంలో ఆగ్రహంతో ఉన్నామని తెలిపింది.
కరపత్రాలతోపాటు రేడియోలు, యూఎస్‌బీ స్టిక్స్, దక్షిణ కొరియా సినిమాలు, వార్తలు సహా పలు సామగ్రిని కలిపి కొన్ని బెలూన్లను డిఫెక్టర్ బృందాలు తరచూ పంపిస్తుంటాయి.
వీటిని అడ్డుకునేందుకు దక్షిణ కొరియా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇలాంటి చర్యల వల్ల సరిహద్దుల్లోని ప్రజలకు ముప్పు పెరుగుతుందని చెబుతోంది.
చర్చలను మళ్లీ ప్రారంభించాలని, ఉద్రిక్తతలు పెరగకుండా చూడాలని ఉత్తర కొరియాను మూన్ కూడా నేరుగా అభ్యర్థించారు.

ఫొటో సోర్స్, Getty Images
<bold>ఏమిటీ డీమిలిటరైజ్డ్ జోన్? </bold>1953లో కొరియా యుద్ధం తర్వాత ఈ డీమిలిటరైజ్డ్ జోన్‌ను ఏర్పాటుచేశారు. రెండు దేశాల మధ్య శాంతి నెలకొల్పడమే దీని లక్ష్యం.
అప్పుడప్పుడు ఈ ప్రాంతంలో ఉత్తర కొరియా సైనికుల తుపాకీ శబ్దాలు వినిపిస్తుంటాయి. ఇక్కడ శాంతి చర్చలు జరుగుతుంటాయి. దక్షిణ కొరియాకు ఇదొక పర్యటక ప్రాంతం. అమెరికా, ఉత్తర కొరియాల మధ్య సన్నిహిత సంబంధాలూ నెలకొల్పడంలోనూ డీఎంజెడ్ కీలకపాత్ర పోషించింది. అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, మూన్‌లతో ఇక్కడ కిమ్ నేరుగా కరచాలనం చేశారు. సైన్యంతో పటిష్ఠమైన ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పాలని గత రెండేళ్లుగా దక్షిణ కొరియా ప్రయత్నిస్తోంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించాలని సెప్టెంబరు 2018లో ప్యాంగ్యాంగ్‌లో జరిగిన సమావేశంలో రెండు దేశాల నాయకులూ అంగీకరించారు. డీమిలిటరైజ్డ్ జోన్ అని పేరు పెట్టినప్పటికీ.. ప్రపంచంలో అత్యధికంగా సైన్యం మోహరించిన ప్రాంతాల్లో ఇది కూడా ఒకటి. <bold>ఇవి కూడా చదవండి:</bold>
- ఎంఎస్ ధోని: ‘నమ్మిన దాని కోసం పోరాడుతూనే ఉండండి’
- మానసిక ఆరోగ్యం గురించి భారతీయులు పట్టించుకోవడం లేదా...
- ఇతరుల పట్ల ప్రేమ, దయ చూపితే ఎక్కువ కాలం జీవిస్తారు ఎందుకు?
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 50 కలలు.. భౌతిక శాస్త్ర ప్రయోగాలు, విశ్వం, ప్రకృతి గురించి కన్న కలల్లో నెరవేరనివి ఎన్నంటే..
- "నీది ఎంత ధనిక కుటుంబం అయినా కావొచ్చు.. కానీ, సమాజం లేకుండా నువ్వు బ్రతకలేవు" - దలైలామా
- కరోనావైరస్: సినిమా థియేటర్లు మళ్లీ హౌస్‌ఫుల్ అవుతాయా?
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- మగాళ్ల ఆత్మహత్యకు ఈ ఐదు విషయాలే కారణమా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








