కిమ్ జోంగ్ ఉన్ ప్రత్యక్షమైన తరువాత ఉత్తర - దక్షిణ కొరియాల మధ్య కాల్పులు

ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య కాల్పులు

ఫొటో సోర్స్, Getty Images

ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఇరుదేశాల మధ్య డీమిలిటరైజ్డ్ జోన్‌లో ఈ ఘటన జరిగింది.

స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7.41 గంటలకు ఉత్తర కొరియా వైపు నుంచి వచ్చిన తుపాకి గుళ్లు సరిహద్దు నగరం చేర్వొన్ దగ్గరున్న దక్షిణ కొరియా సైనిక శిబిరానికి తాకాయని సోల్ మిలిటరీ అధికారులు తెలిపారు.

అయితే, దక్షిణ కొరియాలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

"ఈ దాడికి ప్రతిగా దక్షిణ కొరియా కూడా రెండు రౌండ్ల కాల్పులు జరిపింది. తమ నిబంధనల ప్రకారం హెచ్చరిక ప్రకటన కూడా జారీ చేసింది" అని మిలిటరీ ప్రకటించింది.

అయితే, ముందుగా కాల్పులు జరిపేందుకు దారితీసిన కారణాలు ఏమిటనేది తెలియలేదు. తాము ఉత్తర కొరియాతో మిలిటరీ హాట్‌లైన్ ద్వారా మాట్లాడి ఈ ఘటనకు దారితీసిన కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ఉత్తర కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ (జేసీఎస్) తెలిపారు.

అయితే, ఉత్తర కొరియా వైపు నుంచి జరిగిన కాల్పులు 'ప్రమాదవశాత్తు' జరిగినవేనని, ఉద్దేశపూర్వకమైనవి కాకపోవచ్చని భావిస్తున్నామని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపెయో మీడియాకు చెప్పారు.

దక్షిణ కొరియాపై ఉత్తర కొరియా బలగాలు నేరుగా కాల్పులు జరపడం గత ఐదేళ్లలో ఇదే తొలిసారి. చివరిసారిగా... ఉత్తర కొరియా సైనికుడొకరు దక్షిణ కొరియాలో చొరబడేందుకు మిలిటరీ సరిహద్దును దాటేందుకు ప్రయత్నించిన సందర్భంలో కాల్పులు జరిగాయి.

కొరియా యుద్ధం తర్వాత 1953లో డీఎంజడ్ ఏర్పాటైంది. ఈ ప్రాంతాన్ని శాంతియుత ప్రదేశంగా మార్చేందుకు గత రెండేళ్లుగా సోల్ నాయకత్వం ప్రయత్నిస్తోంది.

2018 సెప్టెంబర్‌లో ప్యాంగ్‌యాంగ్‌లో ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందాల్లో సరిహద్దుల్లో సైన్యాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించడం కూడా ఓ ప్రధానాంశం.

కిమ్ జోంగ్-ఉన్‌

ఫొటో సోర్స్, Reuters

కాల్పులు జరిగిన సమయం ఆసక్తిగా ఉంది

సోల్ నుంచి బీబీసీ ప్రతినిధి లారా బికర్ విశ్లేషణ

దక్షిణ కొరియా మిలిటరీ అధికారుల అభిప్రాయం ప్రకారం ఉత్తర కొరియా ఉద్దేశపూర్వకంగా కాల్పులు జరిపేందుకు చాలా తక్కువ అవకాశాలున్నాయి. కానీ, వాళ్లు ఈ అంచనాకు రావడానికి కారణాలేంటనేది ప్రస్తుతం అస్పష్టం.

ఒకవేళ ఇది అనుకోకుండా జరిగినదే అయినప్పటికీ డీఎంజెడ్‌లో పరిస్థితి మరింత తీవ్రం కాకుండా చూడాల్సిన అవసరం ఉంది.

ఒకవేళ ఇది ఉత్తర కొరియా వ్యూహాత్మకంగా తీసుకున్న నిర్ణయమే అయితే అది వేరే సంగతి.

ఈ ఘటన జరిగిన సమయం ఆసక్తిగా ఉంది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ 21 రోజుల తర్వాత ప్రజలకు కనిపించిన 24 గంటల్లోనే ఈ కాల్పుల ఘటన జరిగింది. నిజమైన యుద్ధం తలెత్తితే దాన్ని సమర్థంగా ఎదుర్కొనే చర్యల్లో భాగంగా ఈ దేశంలో ఇటీవల కొన్ని నెలలుగా భారీ సంఖ్యలో మిలటరీ డ్రిల్స్ జరుగుతున్నాయని జాతీయ మీడియా తెలిపింది.

ప్యాంగ్‌యాంగ్ నాయకత్వం కొన్నిసార్లు మిలిటరీని మోహరించి ఉద్రిక్తతలు పెంచడం ద్వారా తర్వాత జరిగే చర్చల్లో తమపై ఒత్తిడిని తగ్గించుకునే వ్యూహాలను అమలు చేస్తుంటుంది.

కానీ ఈ కాల్పులు ఉద్దేశపూర్వకమైతే మాత్రం దక్షిణ కొరియాకు అసంతృప్తిని మిగిల్చే అవకాశం ఉంది. ఇరు దేశాల అధ్యక్షులు మూన్ జే-ఇన్, కిమ్ జోంగ్-ఉన్‌ల సమావేశం అనంతరం గత రెండేళ్లుగా ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఎన్నో రకాల చర్యలు చేపట్టారు. ఇరుదేశాలు ఓ మిలిటరీ ఒప్పందంపై సంతకాలు కూడా చేశాయి. ఉద్దేశపూర్వక కాల్పులు చోటుచేసుకుంటే ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లే.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)