బెలారుస్‌: విపక్షాల నిరసన ర్యాలీకి వెల్లువలా జనం... అసలు ఏం జరుగుతోంది? ప్రజాగ్రహానికి కారణాలేమిటి?

బెలారస్ నిరసనలు

ఫొటో సోర్స్, Getty Images

బెలారుస్ రాజధాని మినస్క్ విపక్ష మద్దతుదారులు ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు.ప్రస్తుత అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో రిగ్గింగ్ ఆరోపణలతో ఎన్నికై రెండు వారాలు కూడా గడవక ముందే తాజా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆయన సుదీర్ఘ కాలంగా అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నారు.

భారీగా పోలీసులను మోహరించినప్పటికీ సెంట్రల్ స్క్వేర్‌లో వేల మంది నిరసనకారులు గుమిగూడారు. లుకాషెంకో రాజీనామా చేయాలని, ఆయన రిగ్గింగ్ చేశారని వారు నినదిస్తున్నారు.

అయితే, కల్లోల పరిస్థితుల్ని అదుపులోకి తెస్తామని లుకాషెంకో ప్రతినబూనారు. నిరసనలను విదేశీ శక్తుల కుట్రగా ఆయన అభివర్ణించారు.

తాజా నిరసనల్లో నలుగురు మరణించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

వీడియో క్యాప్షన్, బెలారుస్ చరిత్రలో అతిపెద్ద ప్రజా నిరసన, తుపాకితో తిరుగుతున్న అధ్యక్షుడు

తాజా నిరసనల్లో పిల్లల నుంచి వృద్ధుల వరకూ కనిపిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎరుపు, తెలుపు రంగు జెండాలు పట్టుకొని వారు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తున్నారు.

దాదాపు లక్ష మంది నిరసనలో పాల్గొన్నారని విపక్ష మద్దతున్న మీడియా చెబుతోంది. మరోవైపు 20,000 మాత్రమే నిరసనలో పాల్గొన్నారని ప్రభుత్వ మీడియా వెల్లడించింది.

అధ్యక్ష భవనానికి లుకాషెంకో హెలికాప్టర్‌లో వస్తున్న దృశ్యాలు మీడియాలో ప్రసారం అయ్యాయి. ఆయన చేతిలో ఆటోమేటిక్ ఆయుధం కూడా ఉంది.

నిరసనలకు మద్దతుగా లిథ్వేనియాలో కూడా ప్రదర్శనలు జరిగాయి. వీటిలో దేశ అధ్యక్షుడు గిటానాస్ నావుసెడా కూడా పాల్గొన్నారు.

ఎస్తోనియా, ప్రాగ్, చెక్ రిపబ్లిక్‌లలోనూ ప్రదర్శనలు నిర్వహించారు. బెలారస్ రాజధాని మినస్క్‌లో విపక్ష మద్దతుదారులు భారీ ర్యాలీ నిర్వహించారు. సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ప్రస్తుత అధ్యక్షుడు అలెక్జాండర్ లుకాషెంకో రిగ్గింగ్ ఆరోపణలతో రెండోసారి ఎన్నికై రెండు వారాలు గడవక ముందే తాజా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ఎన్నికలకు ముందు పరిస్థితి ఏమిటి?

అధ్యక్షుడు లుకాషెంకో గత 26 సంవత్సరాలుగా బెలారస్ పాలకుడిగా కొనసాగుతున్నారు. యూరప్‌లో అత్యంత సుదీర్ఘ కాలంగా పరిపాలిస్తున్న నాయకుడు ఇతడే.

1990వ దశకం ఆరంభంలో సోవియట్ యూనియన్ కుప్పకూలిన అనంతరం తలెత్తిన అనిశ్చిత పరిస్థితుల్లో ఆయన అధికారంలోకి వచ్చారు. ఆది నుంచీ నిరంకుశ పాలకుడిగా పేరుపడ్డారు. సోవియట్ కమ్యూనిజం లక్షణాలను కాపాడటానికి ప్రయత్నించారు. తయారీ రంగం చాలా వరకూ ప్రభుత్వ సంస్థల యాజమాన్యంలోనే ఉంది. ప్రధాన మీడియా చానళ్లు ప్రభుత్వానికి విధేయంగా ఉన్నాయి. శక్తిమంతమైన రహస్య పోలీసు విభాగాన్ని ఇప్పటికీ కేజీబీ అనే పిలుస్తున్నారు.

అదే సమయంలో తనను తాను కఠోర జాతీయవాదిగా చూపుకోవటానికీ లుకాషెంకో ప్రయత్నించారు. దుష్ట విదేశీ ప్రభావాల నుంచి దేశాన్ని రక్షిస్తున్నట్లు, సుస్థిరతను కాపాడుతున్నట్లు కనిపించటానికి ప్రయత్నించారు.

అలెక్జాండర్ లుకాషెంకో

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రష్యా తనకు భద్రతా సాయం చేయటానికి అంగీకరించిందని అలెగ్జాండర్ లుకాషెంకో చెప్పారు

తద్వారా.. సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న తన పాలనకు ప్రజా మద్దతు ఉన్నట్లు చాటేవారు. అయితే ఆయన పాలనలో జరిగిన ఏ ఎన్నికలూ స్వేచ్ఛాయుతంగా, నిష్పాక్షికంగా జరిగాయని ఎన్నడూ భావించేవారు కాదు.

కానీ.. ఆయనను చూసే దృక్కోణం ఇటీవలి నెలల్లో మారిపోయింది. పాతుకుపోయిన అవినీతి గురించి, పేదరికం కష్టాల గురించి, అవకాశాల లేమి గురించి, తక్కువ వేతనాల గురించి ప్రజలలో అసంతృప్తి పెరిగిపోవటంతో.. ప్రజాభిప్రాయంలో మార్పు రావటాన్ని ప్రతిపక్ష నాయకులు గుర్తించారు.

ఈ పరిస్థితులు కరోనావైరస్ సంక్షోభంతో మరింతగా క్షీణించాయి.

కరోనావైరస్‌ మీద వోడ్కాతో పోరాడవచ్చని, కష్టపడి పనిచేసి తరిమివేయవచ్చని లుకాషెంకో బీరాలు పలకటం ఆయన నిర్లక్ష్య వైఖరిని సూచిస్తోందని, ఆయన ప్రపంచానికి దూరంగా ఉన్నారనటానికి అదొక సంకేతమని ప్రత్యర్థులు వ్యాఖ్యానించారు.

అధ్యక్ష ఎన్నికలకు ముందు ప్రత్యర్థుల మీద విరుచుకుపడ్డారు. ప్రత్యర్థి అభ్యర్థులు ఇద్దరిని జైలులో పెట్టారు. మరొకరు దేశం వదిలి పారిపోయారు. దీంతో ఈ ఉద్యమాల్లో క్రియాశీలంగా ఉన్న ముగ్గురు మహిళలు శక్తిమంతమైన సంకీర్ణంగా ఏర్పడ్డారు.

స్వెత్లానా టిఖనోవ్‌స్కయ (మధ్యలో), మారియా కొలెస్నికోవా (కుడి), వెరోనికా త్సెప్కాలో (ఎడమ)

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, స్వెత్లానా టిఖనోవ్‌స్కయ (మధ్యలో), మారియా కొలెస్నికోవా (కుడి), వెరోనికా త్సెప్కాలో (ఎడమ) బలమైన ప్రతిపక్ష కూటమిగా ఏర్పడ్డారు

ఎన్నికల్లో ఏం జరిగింది?

ముగ్గురు మహిళల్లో ఒకరైన 37 ఏళ్ల స్వెత్లానా టికనోవ్‌స్కయా.. అరెస్టయిన తన భర్త స్థానంలో అభ్యర్థిగా నమోదుచేసుకున్నారు.

ఆమె, ఆమె మిత్రపక్షాల నాయకురాళ్లు ఇద్దరు దేశమంతా పర్యటించారు. సుదీర్ఘ కాలంగా రాజకీయ మార్పు లేకపోవటంతో నిస్పృహలో ఉన్న జనం వీరి సభలకు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఎన్నికల్లో అక్రమాలు జరుగుతాయని ప్రతిపక్షం ఆందోళన చెందింది. ఎన్నికల రోజు వచ్చింది. స్వతంత్ర పరిశీలకులు ఎవరినీ ఆహ్వానించలేదు. దీంతో ప్రతిపక్షాల భయం సహేతుకంగానే కనిపించింది. అనేక అవతవకలు నమోదయ్యాయి. ఇంటర్నెట్‌ను కత్తిరించారు. వారం రోజుల వరకూ ఇదే పరిస్థితి కొనసాగింది.

పోలింగ్ ముగిసింది. లుకాషెంకో 80 శాతం ఓట్లు గెలిచారంటూ ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. ప్రధాన ప్రత్యర్థి టిఖానోవ్‌స్కయాకు కేవలం 10 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయని పేర్కొన్నాయి. మరుసటి రోజు ప్రకటించే ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనేది ఇవి చెప్పాయి. అయితే.. ఓట్లను సరిగ్గా లెక్కించిన చోట తనకు 60-70 శాతం ఓట్లు లభించాయని టిఖానోవ్‌స్కయా బలంగా వాదించారు.

ఫలితాలను బాహాటంగా తారుమారు చేశారనట్లు కనిపించటంతో జనం నమ్మలేకపోయారు. వారిలో పెల్లుబికిన ఆగ్రహం వేగంగా వీధుల్లోకి పాకింది.

ఎన్నికల రోజు రాత్రి మినస్క్‌, ఇతర నగరాల్లో హింసాత్మక ఘర్షణలు తలెత్తాయి. దాదాపు 3,000 మందిని అరెస్ట్ చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టటానికి పోలీసులు బాష్పవాయువు, రబ్బరు బులెట్లు, స్టన్ గ్రెనేడ్లు ప్రయోగించారు. ఇలాంటివి బెలారుస్‌లో గతంలో కనిపించలేదు.

మరికొన్ని రాత్రిళ్లు హింస కొనసాగింది. దేశవ్యాప్తంగా మరో 3,700 మందిని అరెస్ట్ చేశారు.

ఎన్నికల తర్వాతి రోజు.. ఫలితాల్లో అవకతవకల గురించి ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయటానికి టిఖనోవ్‌స్కయ ప్రయత్నించారు. ఆమెను ఏడు గంటల పాటు నిర్బంధించారు. దేశం విడిచి లిథ్వేనియా వెళ్లేలా బలవంతం చేశారు. దీనికి ముందే ఆమె తన పిల్లలను అక్కడికి పంపించారు.

తన మద్దతుదారులను ఉద్దేశించి ఆమె భావోద్వేగంగా మాట్లాడుతూ.. తన సొంత బలాన్ని తాను ఎక్కువగా అంచనా వేసుకున్నానని.. తన పిల్లల క్షేమం కోసం దేశం విడిచి వెళుతున్నానని చెప్పారు.

నిర్బంధం నుంచి విడుదలైన నిరసనకారులు.. పోలీసులు కొట్టిన దెబ్బలను ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు (14 ఆగస్ట్ 2020)

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, నిర్బంధం నుంచి విడుదలైన నిరసనకారులు.. పోలీసులు కొట్టిన దెబ్బలను ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు (14 ఆగస్ట్ 2020)

నిరసనలు ఎలా పెరిగాయి?

కథ అంతటితో ముగియలేదు. ఎన్నికల అనంతర ఘర్షణల్లో పోలీసుల క్రూరత్వం వెలుగులోకి రావటం మొదలైంది. నిర్బంధించిన వారిని తీవ్రంగా కొట్టటంతో పాటు ఇరుకైన జైళ్లలో కుక్కటం వంటి వివరాలు కూడా అందులో ఉన్నాయి.

జైళ్ల నుంచి విడుదల చేసిన తర్వాత చాలా మంది వైద్య సహాయం కోరాల్సి వచ్చింది. తమకు అయిన గాయాల ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

దీంతో మళ్లీ నిరసనల వెల్లువ మొదలైంది. నిర్బంధంలో ఉన్న వారి గురించి సమాచారం తెలియజేయాలని డిమాండ్ చేస్తూ వారి బంధువులు, స్నేహితులు నిర్బంధ కేంద్రాల వద్ద గుమిగూడారు. మహిళలు తెల్లటి దుస్తులు ధరించి గులాబీ పూలు పట్టుకుని చేయి చేయి కలిపి మానవ హారంలా వీధుల్లో ప్రదర్శనలు నిర్వహించారు.

దేశంలో ప్రధాన ప్రభుత్వ సంస్థల్లో.. ఎన్నికల అవకతవకల గురించి, నిరసనకారుల పరిస్థితి గురించి కార్మికులు తమ మేనేజర్లను ప్రశ్నించారు. కొంతమంది సమ్మె చేశారు. నిరసనకారులతో జత కలిశారు.

బెలారస్ కార్మికులు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, కార్మికులు కూడా సమ్మె చేసి నిరసనల్లో పాల్గొన్నారు

ప్రధాన ప్రభుత్వ మీడియా చానల్‌లో ఉన్నత స్థానాల్లోని కొంతమంది.. 'నిజం' చెప్తామని ప్రతిన బూనుతూ రాజీనామా చేశారు. సిబ్బంది సమ్మె చేస్తున్నట్లు ప్రకటించారు. అంతకుముందు.. ఎన్నికలు, నిరసనలకు సంబంధించి ఈ చానల్ ప్రభుత్వ వైఖరినే అనుసరించింది.

పోలీసు అధికారులు సహా అనేక మంది ప్రభుత్వాధికారులు కూడా రాజీనామా చేశారు. స్లొవేకియాకు బెలారుస్ రాయబారిగా ఉన్న ఇగర్ లెష్చెన్యా.. నిరసనకారులకు సంఘీభావం ప్రకటించారు.

బెలారుస్ ప్రధాన ఫుట్‌బాల్ క్లబ్ డైరెక్టర్ తన పాత పోలీస్ యూనిఫాంను చెత్తబుట్టలో పారేశారు. అధ్యక్షుడు లుకాషెంకో వైదొలగే వరకూ తన దేశం తరఫున ఆడబోనని అంతర్జాతీయ ఫుట్‌బాల్ క్రీడాకారుడు ఇల్యా ష్కురిన్ ప్రకటించారు.

బెలారస్ మ్యాప్

ప్రధాన ప్రతిపక్ష నేత స్వెత్లానా టిఖనోవ్‌స్కయా తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడిన కొద్ది రోజుల తర్వాత.. అధికార బదిలీని నిర్వహించటానికి 'సమన్వయ మండలి'ని ఏర్పాటు చేయటానికి పటిష్ట ప్రణాళికను ప్రకటించారు. ''పౌర సమాజ ఉద్యమకారులు, బెలారుస్‌లో గౌరవనీయులు, నిపుణులు'' ఈ మండలిలో ఉంటారని చెప్పారు.

వారాంతంలో శాంతియుతంగా ప్రదర్శనలు చేపట్టాలని ఆమె పిలుపునిచ్చారు. ఆగస్టు 16న నిర్వహించిన నిరసన ప్రదర్శనలో సెంట్రల్ మిన్సిక్‌కు జనం పోటెత్తారు. దీనిముందు.. అదే రోజు లుకాషెంకో మద్దతుదారులు నిర్వహించిన సభ వెలవెలబోయింది.

వీడియో క్యాప్షన్, బెలారస్: ‘‘నా పిలుపుకు స్పందిస్తే.. నా కుమార్తెను శిక్షిస్తారు’’

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)