ఫాజియా కూఫీ: అఫ్గానిస్తాన్ శాంతి చర్చల మహిళా మధ్యవర్తిని చంపాలనుకున్నది ఎవరు

ఫాజియా కూఫీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఫాజియా కూఫీ

తాలిబన్లతో చర్చల ప్రక్రియలో పాల్గొంటున్న ఏకైక మహిళ ఫాజియా కూఫీపై కొందరు కాల్పులు జరపడం చర్చనీయమైంది.

ఈ కాల్పులు పిరికిపంద చర్యని అమెరికా తరఫున చర్చల్లో పాల్గొంటున్న జల్మే ఖలీల్జాద్‌ అన్నారు.

ఇది చర్చల ప్రక్రియను అడ్డుకోడానికి చేసిన ప్రయత్నంగా ఖలీల్జాద్‌ అభివర్ణించారు. ఆమె ఈ కాల్పుల ఘటన నుంచి క్షేమంగా బయటపడటం ఊరటనిచ్చిందని అన్నారు.

కూఫీ తన సోదరితో కలిసి కారులో వెళుతుండగా దుండగులు కాల్పులు జరిపారు.

అయితే ఈ కాల్పుల వెనక తమ పాత్ర ఉందన్న విమర్శలను తాలిబన్‌లు ఖండించారు. చర్చలు రెండువైపులా అంగీకారంతోనే జరుగుతున్నాయని, ఆమెపై కాల్పులు జరపాల్సిన అవసరం తమకు లేదని వారు ప్రకటించారు.

ఫాజియా కూఫీ

ఫొటో సోర్స్, Getty Images

తాలిబన్‌లను వ్యతిరేకించడం వల్లేనా?

20 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సంక్షోభానికి పరిష్కారం కనుగొనేందుకు శాంతి చర్చల ప్రక్రియ ఇటీవలే మొదలైంది. మొదట్లో అఫ్గాన్ ప్రభుత్వంతో నేరుగా చర్చలకు తాలిబన్లు అంగీకరించలేదు. ఫిబ్రవరిలో అమెరికాతో శాంతి చర్చలకు సరేనన్నారు.

ఈ ఒప్పందంలో భాగంగా అఫ్గాన్ ప్రభుత్వం 5,000మంది తాలిబన్‌ మిలిటెంట్లను జైళ్ల నుంచి విడుదల చేయాల్సి ఉంది. చివరి 400మంది తీవ్రవాదుల విడుదల ప్రక్రియ గురువారం మొదలైంది. ఒప్పందంలో భాగంగా చివరి ఖైదీ విడుదల తర్వాత తాలిబన్లకు, అమెరికాకు మధ్య చర్చలు ఖతర్‌లో మొదలవుతాయి.

అయితే ఇప్పుడు కూఫీపై జరిగిన దాడితో ఈ చర్చల ప్రక్రియ ఏమవుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కూఫీ మొదటి నుంచి తాలిబన్‌లకు బద్ధవ్యతిరేకి.

కాబూల్‌లో జరిగిన ఓ సమావేశానికి వెళ్లి వస్తుండగా ఆమెపై కాల్పులు జరిగాయి. దీంతో ఇప్పుడు చర్చల ప్రక్రియ సందిగ్ధంలో పడింది.

"కాల్పులు జరిగిన తీరు, చర్చల ప్రక్రియ మీద ప్రభావం చూపే అవకాశం ఉంది'' అంటూ అఫ్గానిస్తాన్‌లో ఇండిపెండెంట్‌ హ్యూమన్ రైట్స్‌ కమిషన్‌ అధినేత షహర్జాద్‌ అక్బర్‌ ట్వీట్ చేశారు.

"శాంతి కోరుకుంటున్న వారంతా ఈ కాల్పుల ఘటనను ఖండించాలి. చర్చల ప్రక్రియ వీలయినంత త్వరగా ప్రారంభమయ్యేలా చూడాలి'' అని ఖలీల్జాద్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.

ఈ కాల్పుల ఘటనను అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీ ఖండించారు. ఇది పిరికిపంద చర్యగా అభివర్ణించారు.

తాలిబన్లు

ఫొటో సోర్స్, AFP

2001 నుంచీ..

తాలిబన్లతో చర్చల ప్రక్రియలో పాల్గొంటున్న మహిళల్లో ఫాజియా కూఫీ ఒకరు. 2001లో అమెరికా నేతృత్వంలోని సైన్యం అఫ్గానిస్తాన్‌లో తాలిబన్‌ ప్రభుత్వాన్ని కూలదోసింది. అప్పటి నుంచి రెండు వర్గాల మధ్య ఘర్షణలో ప్రజలు నలిగిపోయారు.

తిరిగి పట్టు సాధించడం కోసం తాలిబన్లు ప్రయత్నిస్తూనే ఉన్నారు. గత ఏడాది 3,000మంది సామాన్య పౌరులు ఈ ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయారని ఐక్యరాజ్యసమితి గణాంకాలు చెబుతున్నాయి.

అమెరికా-తాలిబన్‌ల మధ్య జరుగుతున్న ఈ చర్చలపై విమర్శలు కూడా మొదలయ్యాయి. తమ దేశ పౌరుల హత్యతో సంబంధం ఉన్న దాదాపు 400మంది తాలిబన్‌ మిలిటెంట్లను విడుదల చేయడంపై ఫ్రాన్స్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)