ఎస్‌డీపీఐ: భారత్‌లో ఎక్కడ హింస జరిగినా అదే పేరు వినిపిస్తోంది.. కారణమేంటి

ఫొటో సోర్స్, MANJUNATH KIRAN
- రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
- హోదా, బీబీసీ కోసం
అది బెంగళూరు అల్లర్లు కావచ్చు, రాజస్థాన్, ఝార్ఖండ్‌లలో హింసాత్మక ఘటనలు కావచ్చు, ఎక్కడ మతపరమైన ఉద్రిక్తతలు కనిపించినా అక్కడ సోషల్ డెమొక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా పేరు వినిపిస్తోంది.
ఇటీవల ఈశాన్య బెంగళూరులో ఉద్రిక్తతల తర్వాత కర్ణాటక ప్రభుత్వం కూడా ఆ పార్టీని నిషేధించాలని నిర్ణయించింది.
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మంగళూరులో జరిగిన హింసాత్మక ఘటనల్లో ఆ పార్టీ పేరు వినిపించినప్పటి నుంచి దాన్ని నిషేధించే ఆలోచనలో ఉంది కన్నడ సర్కారు.
‘‘మాపై వచ్చిన ఆరోపణల్లో ఒక్కటి కూడా రుజువు కాలేదు. ఆరోపణలు రావడం వల్ల మా పార్టీ ఇంకా బలపడుతుంది’’ అని సోషల్ డెమొక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్డీపీఐ) నేత తస్లీమ్ అహ్మద్ రెహమాని అన్నారు.
“మా నాయకులు కొందరు పార్టీపై వస్తున్న ఆరోపణలకు భయ పడుతున్నారు. కానీ కింది స్థాయి కార్యకర్తలు మాత్రం ఉత్సాహంగా పని చేస్తున్నారు’’ అని ఆయన బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, IMRAN QURESHI/BBC
ఎస్డీపీఐ అంటే ఏంటి ?
ముస్లిం సభ్యత్వం ఎక్కువగా ఉన్న ఈ పార్టీ దళిత, గిరిజన, అణగారిన వర్గాల వారి కోసం ఏర్పడిన పార్టీ అని దాని నాయకులు చెబుతున్నారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) దీనికి మాతృసంస్థ అని అంటున్నారు.
“దేశంలో హిందుత్వ సంస్థలైన హిందూ జాగరణ్ మంచ్, బజరంగ్‌దళ్, హిందు మున్నానిలాగే ఎస్డీపీఐకి కూడా పలు విద్యార్ధి సంఘాలున్నాయి. ఈ సంస్థ అనేక క్యాంపస్‌లలో యాక్టివ్‌గా ఉంది’’ అని కాలికట్ యూనివర్సిటీ రిటైర్ట్ ప్రొఫెసర్ మొహియుద్దీన్ వెల్లడించారు.
ఎస్డీపీఐకి అనుబంధంగా అనేక ట్రేడ్ యూనియన్‌లు, పాఠశాల విద్యార్ధుల కోసం పనిచేసే సంస్థలు కూడా ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ హిందుత్వను గురించి బోధించినట్లే, ఇస్లామిక్ భావజాలం గురించి ఈ సంస్థ ఎక్కువగా ప్రచారం చేస్తుంది.
అయితే ఆ సంస్థ నేత రెహమాని మాత్రం “ మేం భిన్నవర్గాలు, నేపథ్యాల నుంచి వచ్చాం. పీఎఫ్‌ఐ నాయకత్వం సిద్దాంతమే మా సిద్ధాంతం. కానీ మేం వారితో కలిసి పని చేయం. మాకు ఆరెస్సెస్, బీజేపీ కలిసి పనిచేస్తాయో లేదో తెలియదు. కానీ వాటి ఐడియాలజీ మాత్రం ఒకటే. మా సిద్ధాంతం మాత్రం ఆకలి నుంచి, భయం నుంచి స్వేచ్ఛ పొందడం’’ అన్నారు.
“పీఎఫ్‌ఐ రాజకీయాల్లోకి రావాలని పదకొండేళ్ల కిందట నిర్ణయించుకుంది. అందుకోసమే ఎస్డీపీఐని రాజకీయ పార్టీగా రిజిస్టర్ చేసింది’’ అని కర్ణాటక పోలీసుల ఇంటెలిజెన్స్ విభాగంలో ఐజీపీగా పనిచేసిన గోపాల్ హోసూర్ వెల్లడించారు.
“ ఆ పార్టీకి ప్రధానంగా ముస్లింలలోనే ఎక్కువగా మద్దతు ఉంది. అందులో కొందరు రాడికల్ భావజాలం ఉన్నవారు ఉంటారు. అందులో కొందరు మితవాదులు కూడా ఉన్నారు, ఈ సంస్థ ఇప్పుడు ఉత్తరప్రదేశ్, బిహార్‌లలో కూడా వ్యాపించింది’’ అని గోపాల్ హోసూర్ తెలిపారు.
ఆరంభంలో ఈ పార్టీ కర్ణాటక కోస్తా ప్రాంతంలో ఎక్కువ విస్తరించిందని ఆ రాష్ట్ర మాజీ మంత్రి యు.టి. ఖాదిర్ అన్నారు. “ ఇందులో సభ్యులైనవారిని మసీదులకు పిలవడం ప్రారంభించారు. తరచూ సమావేశాలు జరుగుతుంటాయి. యువతకు బ్రెయిన్‌వాష్ చేస్తుంటారు.

ఫొటో సోర్స్, IMRAN QURESHI/BBC
మొదట్లో కార్యకర్తలుగా కేఎఫ్‌డీ( కర్ణాటక ఫోరం ఫర్ డిగ్నిటీ) అనే ఇస్లామిక్ సంస్థ సభ్యులను చేర్చుకున్నారు. తర్వాత కేరళ, తమిళనాడుల నుంచి ప్రచారం చేయడం కోసం నైపుణ్యం గల కార్యకర్తలను ఏర్పాటు చేసుకున్నారు’’ అని ఖాదిర్ తెలిపారు.
ముస్లిం ఓట్లపైనే ప్రధానంగా దృష్టి పెట్టింది ఎస్డీపీఐ. తాము ముస్లిం వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్పుకోడానికి ప్రయత్నించింది.
"వాస్తవానికి ఈ సంస్థ ఆర్థికంగా బలహీనమైన ముస్లింలను చేరదీస్తుంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ ముస్లింల కోసం ఏమీ చేయలేదని చెప్పడం ద్వారా వారిని దగ్గర చేసుకుంటుంది. అదే మధ్య తరగతి ముస్లింలు ఈ మాటలను తొందరగా నమ్మరు. పేద ముస్లింల మద్దతు కారణంగానే అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో గణనీయం ఓట్లను గెలుచుకోగలిగింది" అని మైసూర్ విశ్వవిద్యాలయంలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ ముజఫర్ అసది అన్నారు.
"ఈ పార్టీ కొన్ని స్థానాల్లో వెయ్యి నుంచి రెండు మూడు వేల ఓట్ల వరకు పొందగలిగింది. కానీ ఆ ఓట్లన్నీ కాంగ్రెస్ ఓట్లు. బీజేపీతో నేరుగా తలపడితే ఇంకా మరిన్ని ఓట్లు వచ్చేవి. దాని ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల స్థానిక ఎన్నికల్లో కొన్ని సీట్లను ఆ పార్టీ పొందగలిగింది” అని ప్రొఫెసర్ ముజఫర్ అన్నారు.
2018లో కర్ణాటకలోని మూడు అసెంబ్లీ స్థానాలకు జరిగి ఎన్నికల్లో ఎస్డీపీఐ వల్ల కాంగ్రెస్ బాగా నష్టపోయింది.
అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడానికి ముందే, మూడు సీట్లు మినహా ప్రతిచోటా లౌకిక శక్తులకు మద్దతు ఇస్తామని ఎస్డీపీఐ ప్రకటించింది. దీంతో కోస్తా ప్రాంతంలో బీజేపీ భారీ మెజారిటీతో గెలిచింది.
అసలు ఎస్డీపీఐ ఎవరిపక్షం?
ఈశాన్య బెంగళూరు హింసాకాండ ప్రాంతాలను సందర్శించిన మాజీ హోంమంత్రి రామలింగారెడ్డి బీజేపీ, ఎస్డీపీఐ ఒక్కటై హింసకు కారణమయ్యాయని ఆరోపించారు.
కాంగ్రెస్‌ను దెబ్బకొట్టడానికి బీజేపీ ఎస్డీపీఐతో కుమ్మక్కయ్యిందన్నారు. అయితే కాంగ్రెస్ ఆరోపణలను బీజేపీ ఖండించింది. “రామలింగారెడ్డి హోంమంత్రిగా ఉన్నప్పుడు ఆ పార్టీ మీద ఉన్న 1500 కేసులను ఉపసంహరించుకున్నారు. ఎస్డీపీఐ కాంగ్రెస్‌కు అనుబంధ పార్టీ’’ అని బీజేపీ మంత్రి సీటీ రవి బీబీసీతో అన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం తన ఎమ్మెల్యేపై దాడిని ఎందుకు ఖండించలేదో చెప్పాలని రవి డిమాండ్ చేశారు.

ఫొటో సోర్స్, SDPI.IN
బెంగళూరు హింస తర్వాత ఆరోపణలు
ఆగస్టు 8 నుంచి జరిగిన హింసాకాండతో అందరి దృష్టి ఎస్టీపీఐ మీదే కేంద్రీకృతమైంది. ఈ అల్లర్లలో ఆ పార్టీ పాత్ర గురించి అంతా వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఈశాన్య బెంగళూరులో హింసాకాండ కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనల్లుడి సోషల్ మీడియా పోస్ట్ వల్ల మొదలైంది. ఈ పోస్టులపై అనేక ఫిర్యాదులు వచ్చాయి.
నిరసన తెలపడానికి వచ్చినవారు ఒక్కసారిగా హింసకు దిగారు. అక్కడున్న పోలీస్‌స్టేషన్‌తోపాటు, ఎమ్మెల్యే ఇంటికి నిప్పంటించారు. రెండు పోలీస్ స్టేషన్ల పరిధిలో కర్ప్యూ పెట్టాల్సి వచ్చింది.
"బెంగళూరు కార్పొరేషన్ ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ ఈఎత్తు వేసింది. ఓట్ల కోసం మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు’’ అని ఎస్డీపీఐ నేత రెహమానీ అన్నారు. “ఈ ఎన్నికల్లో మేం ఒకట్రెండు స్థానాలు గెలవగలం. కానీ హిందూ ముస్లింల మధ్య చిచ్చుపెడుతోందని మాపై ఆరోపణలు చేస్తున్నారు” అని రెహమానీ అన్నారు.
అయితే ఎస్డీపీఐ ఆరోపణలను బీజేపీ మంత్రి రవి తప్పుబట్టారు. “వాట్సప్ సందేశం పంపిన కాంగ్రెస్‌కు బీజేపీ మద్దతుదారు కాదు. ఎస్డీపీఐ, కాంగ్రెస్ మధ్య అంతర్గత విభేదాల వల్ల ఇది జరిగింది’’ అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ‘నేను 420’ అంటూ నగ్న చిత్రాలతో బ్లాక్మెయిల్.. గుంటూరులో ఇంజినీరింగ్ విద్యార్థుల దారుణం
- మనిషి మెదడు తినే అమీబా మళ్లీ కనిపించింది
- మహిళలు వీర్యాన్ని దాచుకుని, తమకి కావలసినప్పుడు గర్భం ధరించే అవకాశం వస్తే ఈ ప్రపంచం ఎలా మారుతుంది?
- భారత్‌లో పెరుగుతున్న కోవిడ్ కేసులు: ఐదు ప్రశ్నలు
- గాల్వన్ వ్యాలీ ఘర్షణల్లో భారతీయ సైనికులు మిస్సయ్యారా? ‘పది మందిని విడుదల చేసిన చైనా’
- జాన్ బోల్టన్ పుస్తకం: ‘డోనల్డ్ ట్రంప్ మళ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సహాయం కోరారు’
- కరోనావైరస్: ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వం పిసినారితనం చూపిందా?
- రాగి వస్తువులపై బ్యాక్టీరియా బతకలేదు.. మరి అన్నిచోట్లా రాగి పూత పూస్తే వైరస్‌లను ఎదుర్కోవచ్చా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








