కమాఠీపురా: హెచ్‌ఐవీతో పోరాడినట్టే మేం కరోనా వైరస్‌తోనూ పోరాడుతాం

సెక్స్ వర్కర్లు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, చింకి సిన్హా
    • హోదా, బీబీసీ కోసం

గదిలోకి అడుగుపెట్టిన వెంటనే ఏదో బంకర్‌లా అనిపిస్తుంది. ఒకదానిపై ఒకటి ఉండే చెక్క గదులు రైల్వే బోగీలను తలపిస్తుంటాయి. ప్రతి గదిలో వేడిగాలిని బయటకు పంపించే ఫ్యాన్లు ఉంటాయి.

సన్నటి పరుపులపై బెడిషీట్లకు బదులు టార్పాలిన్ షీట్లు కనిపిస్తుంటాయి. డోర్ కర్టెన్లు ఉంటాయి.. అయితే అవి చిరిగిపోయి కనిపిస్తాయి. ఈ గదులన్నీ కస్టమర్లు వచ్చి సెక్స్ చేసి వెంటనే వెళ్లిపోవడం కోసం సిద్ధం చేసినవి. ఇవి ఈ పనికి తప్పితే ఇంకెందుకూ ఉపయోగపడవు. అందుకే ఇక్కడ జరిగేది ఒకే పని. దానితో భావోద్వేగాలకు ఎలాంటి సంబంధమూ ఉండదు.

ఈ గదులన్నీ ముంబయిలోని కమాఠీపురా ఒకటో నంబర్ గల్లీలో రామాబాయి చాల్‌కు చెందినవి. దేశంలోని మిగతా ప్రాంతాల్లోని వేశ్యావాటికల్లానే ఇక్కడా ఇరుకు ఇరుకుగా ఉంటుంది. అయితే బిజినెస్ అంటే బిజినెస్సే. అది ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది.

వీటిని సర్వీస్ ఛాంబర్లని పిలవొచ్చు. ఎందుకంటే ఇక్కడ కూడా కార్యాలయాల్లో మాదిరే పని జరుగుతుంటుంది. అయితే వెలుతురు కొంచెం తక్కువగా ఉంటుంది. కానీ ఇది కూడా కార్యాలయమే.

ఏళ్ల క్రితం నిధి(పేరు మార్చాం)ని వాళ్ల కుటుంబ సభ్యులు ఇంటి నుంచి బయటకు పంపించేశారు. ఆమె హిజ్రాగా పుట్టడమే దీనికి కారణం. వీధుల్లో అత్యాచారాలు, హింసకు బలైన ఆమెకు చివరగా ఇక్కడ చోటు దొరికింది. ఈ వేశ్యావాటికే ఆమెను అక్కున చేర్చుకుంది. ''ఇక్కడ నాకు ఏమీ కాదు. నేను సురక్షితంగా ఉంటాను''అని ఆమె వ్యాఖ్యానించారు.

ఆమెకు ఈ పని చేయడం ఇష్టంలేదు. అయితే తనకు వేరే మార్గం లేదు. ఇక్కడుండే చాలా మంది మహిళలదీ ఇదే పరిస్థితి.

కమాఠీపురా

ఫొటో సోర్స్, Chinki Sinha

మనుగడకే కష్టం అవుతోంది

చివరిసారి తనను కలిసినప్పుడు.. తన వీపువై సామాన్లు ఉన్నాయి. తను ఓ ట్యాక్సీ కోసం ఎదురు చూస్తోంది. ఆ చోటును తను ఖాళీ చేయాలని అనుకుంటోంది.

కమాఠీపురాలోని ఒకటో నంబరు వీధిలో గదులన్నీ ఖాళీ చేయమని అధికారులు చెప్పారు. ఎందుకంటే అక్కడ అభివృద్ధి ప్రాజెక్టులు చేపడుతున్నారు. దీంతో చాలా మంది సెక్స్ వర్కర్లు వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది. మహా నగరం నడిబొడ్డున నిజంగా ఈ చోటు వారికి వరంలా దొరికిందనే చెప్పాలి.

''ఈ ప్రాజెక్టు వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి. తమ వేశ్యావాటికలను సెక్స్ వర్కర్లు.. రియల్ ఎస్టేట్ కంపెనీలకు అమ్ముకోవాల్సి వస్తోంది''అని ఆమె చెప్పారు.

ఇది ఈ ఏడాది జనవరిలో జరిగింది. అయితే మార్చిలో లాక్‌డౌన్ వల్ల సెక్స్ వర్కర్ల జీవితాలు అస్తవ్యస్తం అయ్యాయి. ఇప్పుడు వారికి మనుగడే కష్టం అవుతోంది. వారికి ఎలాంటి ప్రభుత్వ పథకాలు వర్తించడం లేదు. ఇక్కడ చాలా మంది వలసవచ్చిన వారే ఉంటారు. వారి దగ్గర ఎలాంటి గుర్తింపు కార్డులూ ఉండవు.

కమాఠీపురా

ఫొటో సోర్స్, Chinki Sinha

పైసా రావడం లేదు

మేలో రెండోసారి లాక్‌డౌన్ విధించినప్పుడు బతుకు భారం అవుతోందని ఇక్కడి ట్రాన్స్‌జెండర్లు ఆవేదన వ్యక్తంచేశారు.

ఇక్కడ పనిచేసే కొన్ని ఎన్‌జీవోలు వీరికి రేషన్ సరకులు ఇస్తున్నాయి.

అయితే, వీరికి ఎలాంటి ప్రభుత్వ పథకాలు వర్తించడం లేదు. ఇటీవల మహారాష్ట్రలో సెక్స్ వర్కర్లకు సాయం చేయాలంటూ ఓ ప్రభుత్వ విభాగం రాసిన లేఖను అన్ని విభాగాలకు పంపించారు.

కమాఠీపురా

హక్కులను గుర్తించేలా

ఈ లేఖలో భాష దాన్ని ఆసాంతం చదివించేలా ఉంది. మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ రిషీకేశ్ యశోద్ దాన్ని రాశారు.

ఇది వరకు సెక్స్ వర్కర్ల గురించి రాసిన లేఖల కంటే ఇది భిన్నంగా ఉంది.

సెక్స్ వర్కర్ల హక్కులను గుర్తించాలని పోరాడుతున్నవారిలో ఈ లేఖ ఆశలు చిగురింప చేసింది.

సెక్స్ వర్క్‌ను కూడా సర్వీసు కింద గుర్తించాలంటున్నవారికి ఇది కొంత సంతృప్తినిచ్చింది. ప్రభుత్వం వీరి సేవలను సర్వీసుగా గుర్తించడానికి కరోనావైరస్ రూపంలో ఒక మహమ్మారి రావాల్సిన అవసరం వచ్చినట్లు అనిపిస్తోంది.

కమాఠీపురా

ఫొటో సోర్స్, Getty Images

జులై 23న మహిళా, శిశు సంక్షేమ శాఖ పంపిన ఈ లేఖలో సబ్జెక్టుగా ''కోవిడ్-19 వ్యాపిస్తున్న సమయంలో సెక్స్ వర్క్‌పై ఆధారపడి జీవిస్తున్న మహిళలకు అత్యవసర సేవలు అందజేత''ను పేర్కొన్నారు.

సెక్క్ వర్కర్ల హక్కులను గుర్తించడంలో ఇది కచ్చితంగా సరైన దిశలో పడిన అడుగే.

''సెక్స్ వర్కర్లుగా పనిచేస్తున్న మహిళల ఆదాయ మార్గాలు నేడు పూర్తిగా మూసుకుపోయాయి'' అని లేఖలో వివరించారు.

''లాక్‌డౌన్ వల్ల వారికి పని దొరకడం లేదు. దీంతో వారు, వారి కుటుంబ సభ్యులు ఆకలితో అలమటిస్తున్నారు. వారికి బతకడమే కష్టం అవుతోంది''

భారత్‌లోని ఓ రాష్ట్ర ప్రభుత్వం.. సెక్స్ వర్కర్ల పనిని ఓ పనిగా గుర్తించడం ఇదే తొలిసారి.

హెచ్‌ఐవీ/ఎయిడ్స్, లైంగిక దోపిడీ, మానవుల అక్రమ రవాణాపై చర్చల్లో మాత్రమే అందరికీ సెక్స్ వర్కర్లు గుర్తుకు వస్తుంటారు. మిగతా సమయాల్లో వారిని పట్టించుకొనేవారు ఎవరూ ఉండరు.

సెక్స్ వర్కర్లు

ఈ లేఖను అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడే సందప గ్రామీణ్ మహిళా సంస్థ (సంగ్రామ్) వ్యవస్థాపకురాలు మీనా శేషు స్వాగతించారు.

మొదటిసారి ఈ లేఖలో సెక్స్ వర్కర్లను శరీరం అమ్ముకొనే మహిళలుగా పేర్కొనకుండా సముచిత గౌరవమిచ్చారు.

ఇదీ వ్యాపారమే

''ఈ లేఖలో సంస్కృత పదం వేశ్యను ఉపయోగించారు. సెక్స్ వర్కర్లకు కూడా ఈ పదాన్నే ఉపయోగిస్తుంటారు. అంతేకాదు సెక్స్ వర్కర్ల పనిని వర్క్‌గా లేఖలో పేర్కొన్నారు. ప్రాస్టిట్యూట్ బిజినెస్‌పై ఆధారపడిన మహిళలు లాంటి పదాలనూ ఉపయోగించారు''అని శేషు వివరించారు.

హిందీలో పేషా అని లేఖలో రాశారు. దీన్ని ఇంగ్లిష్‌లో ప్రొఫెషన్‌గా అనువదించొచ్చు.

శేషు సంగ్లిలో నివసిస్తారు. అక్కడ దాదాపు 250 మంది సెక్స్ వర్కర్లు ఉంటారు. హెచ్ఐవీ నియంత్రణ పథకాల్లో మాత్రమే వీరి పేర్లు కనిపిస్తుంటాయి.

కమాఠీపురా

ఫొటో సోర్స్, Chinki Sinha

ఇదివ‌ర‌కు కూడా..

సెక్స్ వ‌ర్క‌ర్ల‌కు ఇలాంటి క‌ష్ట‌కాలం ఇదివ‌ర‌కు కూడా వ‌చ్చింది. 90ల్లో కమాఠీపురా ఎయిడ్స్‌కు కేంద్ర బిందువులా మారింది.దీంతో ఎయిడ్స్ నియంత్ర‌ణ‌కు భార‌త వైద్య ప‌రిశోధ‌న మండ‌లి (ఐసీఎంఆర్) ఓ ప్ర‌త్యేక ప్ర‌ణాళిక‌ను సిద్ధంచేసింది. అప్పుడు ఎయిడ్స్ కొంత‌వ‌ర‌కూ అదుపులోకి వ‌చ్చింది.అయితే, ఆ ప్ర‌భావం వీరిపై తొల‌గేందుకు ఏళ్లు ప‌ట్టింది. వీరి ద‌గ్గ‌ర‌కు కస్టమర్లు ఎవ‌రూ రాక‌పోవ‌డంతో ఆక‌లితో చాలా ఇబ్బందులు ప‌డ్డారు. మ‌ళ్లీ నేడు క‌రోనావైర‌స్ రూపంలో అలాంటి ప‌రిస్థితే వ‌చ్చింది.ఇప్పుడు త‌మ ఇబ్బందులు మ‌రింత ఎక్క‌ువ‌య్యాయ‌ని నిధి వివ‌రించారు.

కమాఠీపురా

ఫొటో సోర్స్, Chinki sinha

భవిష్యత్ అర్థం కావడంలేదు

''మనకు ఎయిడ్స్ గురించి తెలుసు. ఏం చేస్తే.. దాన్ని నియంత్రణలోకి తీసుకురావొచ్చో అవగాహన ఉంది. కానీ కరోనావైరస్ గురించి ఏమీ తెలియట్లేదు''అని నిధి అన్నారు.

''టచ్ చేసినా కరోనావైరస్ అంటుకుంటోంది. దీంతో భవిష్యత్‌లో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు''

కంటైన్‌మెంట్ జోన్ల జాబితాలో కమాఠీపురాలోని రెడ్‌లైట్ ఏరియా లేదు. ఇక్కడ ఒక్క కేసు కూడా నమోదు కాలేదని సెక్స్ వర్కర్లు చెబుతున్నారు.

పేర్లు ఉండవు

కరోనావైరస్‌తో అన్ని మార్గాలూ మూసుకుపోయినా.. ప్రభుత్వం నుంచి వీరికి సాయం అందడం లేదు.

పేద ప్రజల కోసం ప్రవేశ పెడుతున్న పథకాల్లో వీరి పేర్లు కనిపించడం లేదు.

కరోనావైరస్‌పై పోరాటంలో భాగంగా 11 బృందాలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసింది.

అందులో ఆరో బృందం సంగ్రామ్‌ను సంప్రదించినట్లు శేషు చెప్పారు. సెక్స్ వర్కర్ల సమస్యల గురించి వారు అడిగి తెలుసుకున్నారని వివరించారు. అనంతరం ఈ బృందం కేంద్రానికి లేఖ రాసింది.

''పీడీఎస్ పథకాల కింద సెక్స్ వర్కర్లకు ఆహార ధాన్యాలను సరఫరా చేయాలని మేం కోరాం. పీడీఎస్ కింద వీరికి ప్రయోజనాలు చేకూర్చకపోతే.. ఇతర సంక్షేమ పథకాల కింద అయినా ఆహార ధాన్యాలు ఇవ్వాలని అభ్యర్థించాం''

అందని సాయం

''లేఖ రాసినప్పటికీ.. సెక్స్ వర్కర్ల కోసం ఇప్పటివరకూ ఎలాంటి సాయమూ అందలేదు. వారిని ఎవరూ పట్టించుకోవడం లేదు''

దేశ రాజధానిలోని సెక్స్ వర్కర్లతోపాటు ఎల్‌జీబీటీక్యూఐఏ+ సభ్యులకూ కేంద్ర, దిల్లీ ప్రభుత్వాలు ఆర్థిక సాయం అందించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలైంది.

కమాఠీపురా

ఫొటో సోర్స్, Chinki Sinha

చట్ట విరుద్ధమే

ప్రివెన్షన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్ ప్రకారం.. వేశ్యావాటికల నిర్వహణ చట్ట విరుద్ధం. అయితే మహానగరాలు, నగరాల్లో ఏళ్ల నుంచీ ఇవి నడుస్తున్నాయి. కొన్నిసార్లు ఇక్కడ పనిచేసే అమ్మాయిలను షెల్టర్ హోమ్‌లకు పంపిస్తుంటారు. కొన్నిసార్లు పోలీసులు వీరిని హెచ్చరించి వదిలేస్తుంటారు.

చాలా మంది ఇష్ట పూర్వకంగానే ఈ పని చేస్తున్నట్లు చెబుతున్నారు. నేషనల్ సెక్స్ వర్కర్స్ అసోసియేషన్‌లో సభ్యురాలిగానున్న ఆయేషా కూడా వారిలో ఒకరు.

సంగ్లిలో ఆమె నివసిస్తున్నారు. భర్త మరణించిన అనంతరం పేదరికం వల్ల పశ్చిమ బెంగాల్‌లోని తన గ్రామంలో ఆమె ఈ పని మొదలుపెట్టారు. ఆమెకు చాలా చిన్న కొడుకు ఉన్నాడు. కొన్ని రోజుల తర్వాత ఆమె స్నేహితురాలితో కలిసి అసన్‌సోల్ వచ్చేసింది. ఎనిమిదేళ్ల క్రితమే ఆమె సంగ్లి వచ్చింది. ఇక్కడి వేశ్యావాటికలో ఆమె పని చేస్తోంది.

ప్రాథమిక హక్కు...

ఇప్పుడు సెక్స్ వారికి ఓ సర్వీస్‌లా మారింది. స్పాలో మసాజ్ చేసినట్లే.. దీన్ని వారు భావిస్తున్నారు. అయితే ఏళ్ల నుంచీ సెక్స్ వర్కర్లపై ఓ ముద్ర ఉంది. హింస, మనోవ్యథలకు వారు బాధితులు. వారిని సమాజంలో చెడు మహిళలుగా చూపిస్తుంటారు. ఇదే ప్రాథమిక హక్కుల్లో భాగమైన తమ పని తాము చేసుకొనే హక్కు వారికి లేకుండా అడ్డుకుంటోంది.

కానీ ఆయేషా లాంటి కొందరు సెక్స్ వర్కర్లు తమకు ఎదురవుతున్న వేధింపులను తట్టుకుంటూ ఈ వృత్తిని కొనసాగిస్తున్నారు. అయితే కరోనావైరస్ సమయంలో వారి జీవితాలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి.

''మా కస్టమర్లలో చాలా మంది వలస కూలీలే ఉంటారు. వారు కర్నాటక లాంటి రాష్ట్రాల నుంచి వస్తుంటారు. మాకు రోజుకు ఒకరు లేదా ఇద్దరు కస్టమర్లు మాత్రమే వస్తారు. సెక్స్ సమయంలో మేం తగిన జాగ్రత్తలు తీసుకుంటాం. అయితే నేడు అవి సరిపోవడం లేదు''

కమాఠీపురా

ఫొటో సోర్స్, Chinki Sinha

లాక్‌డౌన్ విధించేటప్పుడు.. అసలు ఏం జరుగుతుందో ఆయేషాకు అర్థంకాలేదు. కరోనావైరస్ ఇన్ఫెక్షన్ గురించి ఆమె అప్పటికే విన్నారు. అయితే ఆమెతోపాటు మిగతా సెక్స్ వర్కర్లు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.

''మేం విస్మయానికి గురయ్యాం. కానీ ఒకరికి ఒకరం సాయం చేసుకున్నాం. ఆకలితో చనిపోకూడదని మేం నిర్ణయించుకున్నాం. మేం సాయం కోసం అభ్యర్థించాం''

''ఇప్పుడు బ్యూటీ పార్లర్లు, స్పాలను తెరిచారు. అందరూ తమ పనులు తాము చేసుకోవడం మొదలుపెట్టారు. మేం కూడా కోవిడ్-19తో పోరాడేందుకు సిద్ధమయ్యాం. హెచ్‌ఐవీతో పోరాడినట్టే మేం కోవిడ్-19తోనూ పోరాడతాం''

అదే ఆకాంక్ష

యశోధ్ రాసిన లేఖను అన్ని జిల్లాల కలెక్టర్లకు పంపించారు. ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లోని అధికారులనూ ఆయేషా సంస్థ సంప్రదిస్తోంది. ఇతర రాష్ట్రాల్లోని సెక్స్ వర్కర్లకూ సాయం అందాలని వీరు ఆకాంక్షిస్తున్నారు.

''మమ్మల్ని సేవలు అందించే వారిగా గుర్తించాలని మేం కోరుకుంటున్నాం'' అని ఆయేషా చెప్పారు.

సెక్స్ వర్కర్లకు సంబంధించిన చట్టాలు ప్రపంచ దేశాల్లో ఒక్కోచోట ఒక్కోలా ఉన్నాయి. ప్రస్తుతం వలస కూలీలు, వీధి వ్యాపారులకు ప్రభుత్వం పథకాలు తీసుకొచ్చింది. కానీ సెక్స్ వర్కర్లకు ఎలాంటి ప్యాకేజీ ఇవ్వలేదు.

సెక్స్ వర్కర్లు కూడా వలస కూలీలు లాంటివారే. అయితే అత్యవసర సేవలు అందుకోవడంలో వీరు ఎన్నో అవరోధాలు ఎదుర్కొంటున్నారు. వీరి మార్గాల్లో సామాజిక, సాంస్కృతిక, చట్టపరమైన సమస్యలు అడ్డుగా వస్తున్నాయి.

కమాఠీపురా

ఫొటో సోర్స్, Chinki Sinha

భారత్‌లో సెక్స్ వర్క్ చట్ట విరుద్ధం కాదు. అయితే వేశ్యావాటికలను మాత్రం నడపకూడదు. సెక్స్‌పై వచ్చే ఆదాయంపైనే ఆధారపడి జీవించకూడదు.

మహిళా, శిశు సంక్షేమ శాఖ రాసిన లేఖ కేవలం సూచన ప్రాయమే అయినప్పటికీ.. ఇదివరకు ఇలాంటి లేఖలు ఎవరూ రాయలేదని అణగారిన వర్గాల కోసం పనిచేస్తున్న న్యాయవాది ఆర్తి పాయ్ చెప్పారు.

''ఇందులో రెండు కేటగిరీల గురించి స్పష్టంగా ప్రస్తావించారు. వాటిలో ఒకటి స్వతహాగా ఈ పని చేసేవారు. రెండోది తమకు ఇష్టంలేకున్నా బలవంతంగా ఈ పని చేస్తుండేవారు''.

''ఇలాంటి చర్యలతో కొంత మార్పు వస్తుంది. ప్రభుత్వం నుంచి ఇలాంటివి రావడంతో ఇది చాలా ముఖ్యమైన పరిణామంగా మారింది. సామాజిక పథకాల్లో సెక్స్ వర్కర్లకు చోటు కల్పించాలని దీనిలో స్పష్టంగా పేర్కొన్నారు''

కుటుంబ సాయం

ఇక్కడ పనిచేసే చాలా మంది సెక్స్ వర్కర్లపై తమ కుటుంబాలు ఆధారపడి జీవిస్తుంటాయి. నేడు చాలా మంది కనీసం కమాఠీపురాలో ఇంటి అద్దె కూడా కట్టలేకపోతున్నారు. ఇక్కడ ఒక బెడ్‌కు అద్దె కేవలం రూ.250. కానీ, చాలామంది ఇక్కడి నుంచి బలవంతంగా వెళ్లిపోవాల్సి వస్తోంది.

ప్రస్తుతం కమాఠీపురాలో దాదాపు 3500 మంది సెక్స్ వర్కర్లు ఉన్నారు. ముంబయిలోని ఇతర ప్రాంతాల్లోనూ వీరు వేల సంఖ్యలో ఉంటారు. వీరికి రేషన్‌తోపాటు మందులు కూడా అవసరం అవుతాయి. ఔషధాలు, యాంటీరెట్రోవైరల్(ఏఆర్‌టీ) మందులు వీరికి చేరవేయాలని రాష్ట్రాలకు ఎన్‌ఏసీవో ఆదేశాలు కూడా జారీచేసింది.

కమాఠీపురా

ఫొటో సోర్స్, Chinki Sinha

కరోనావైరస్ వ్యాప్తికి ముందు కూడా కమాఠీపురాను వదిలి వేరే ప్రాంతాలకు వెళ్లిన వారు కస్టమర్ల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉండేది. కస్టమర్లకు సేవలు అందించేందుకు వారు రూ.50 పెట్టి ఇక్కడి గదులను అద్దెకు తీసుకుంటారు. సర్వీసు పూర్తయిన అనంతరం తమ ఇంటికి వెళ్లిపోతారు.

గత కొన్నేళ్లుగా సెక్స్ వర్కర్లు ఇక్కడి నుంచి వెళ్లిపోతూ ఉన్నారు. కొన్ని రోజులు పోతే ఇక్కడ కేవలం ట్రాన్స్‌జెండర్ వర్కర్లు మాత్రమే మిగులుతారేమో.

ఎంతో దూరం

సెక్స్ వర్కర్ల హక్కులను గుర్తించే దిశగా పడిన తొలి అడుగుగా తాజా లేఖను అభివర్ణిస్తున్నారు. అయితే వారికి పూర్తి హక్కులు వచ్చేందుకు చాలా దూరమే ప్రయాణించాల్సి ఉంటుంది.

''మేం ఎవరికీ భయపడట్లేదు. మా కుటుంబాల కోసమ మేం కష్టపడుతున్నాం. బతకడం కోసం మేం ఈ పని చేస్తున్నాం. ఇందులో ఎలాంటి తప్పూలేదు''అని నిధి అన్నారు.

కమాఠీపురా

''ఆమె మతాన్ని ఎంత గుడ్డిగా నమ్మేదో నాకు గుర్తుంది. శుక్రవారం ప్రేయర్ల కోసం మసీదుకు కూడా వెళ్లడ‍ం నేను చూశాను. ఆమె దగ్గర చిన్న చిన్న దేవుడి బొమ్మలు కూడా ఉన్నాయి''అంటూ షబ్నం గురించి నిధి చెప్పారు.

దుఖాణదారులు ఎలా అయితే సాయంత్రం షాపులో అగరబత్తులు వెలిగిస్తారో.. షబ్నం (పేరు మార్చాం) కూడా అలానే తన పని మొదలయ్యే ముందు అగరబత్తులు వెలిగిస్తారు.

పనిలోని నైతిక‍‍‍త.. అనైతికత, వివక్ష, పేదరికం పక్కన పెడితే, తాము చేసే పనిలో నిజాయితీ ఉందని ఆ పని చేసేవారు చెబుతున్నారు. తమ శరీరాన్ని అమ్ముకోవడం లేదని, కేవలం కస్టమర్లకు సేవలు అందిస్తున్నామని అంటున్నారు.‌ వారు స్వతహాగా ఈ పని చేస్తున్నారు.

''మేం కూడా మీ లాగే పనిచేసుకుంటున్నాం'' అని నిధి అన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)