సౌదీ అరేబియా: టర్కీని బహిష్కరించాలని ఎందుకు అనుకుంటోంది?

ఇస్లామిక్ దేశాలకు నాయకత్వం వహించే విషయంలో టర్కీ, సౌదీ అరేబియాల మధ్య వైరం పెరుగుతోంది

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఇస్లామిక్ దేశాలకు నాయకత్వం వహించే విషయంలో టర్కీ, సౌదీ అరేబియాల మధ్య వైరం పెరుగుతోంది
    • రచయిత, మహ్మద్ షాహిద్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఇస్లామిక్‌ రాజ్యాలలో రెండు ప్రధాన శక్తులైన సౌదీ అరేబియా, టర్కీ ఇప్పటి వరకు ఒకరి మీద ఒకరు కాలు దువ్వుకున్నాయి. ఇప్పుడు ప్రత్యక్ష యుద్ధానికి దిగాయి.

ఇరు దేశాల మధ్య సంబంధాలు సరిగాలేవని, మధ్య ప్రాచ్యంమీద పట్టు కోసం రెండు దేశాలు కుమ్ములాటను వేగవంతం చేశాయన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఆ రెండు దేశాల నుంచి వస్తున్న ప్రకటనలు వారి దౌత్య సంబంధాలను ఇంతకు ముందుకన్నా భిన్నమైన మార్గంలో నడుస్తున్నాయని చెప్పకనే చెబుతున్నాయి.

టర్కీ అధ్యక్షుడు తయ్యిప్‌ ఎర్దవాన్ ఇటీవల చేసిన ఒక ప్రకటనపై సౌదీ అరేబియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ తీవ్రంగా ఖండించింది. టర్కీని అన్ని విధాలుగా బహిష్కరించాలని ఆ సంస్థ ప్రభుత్వానికి, ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

“ప్రతిపౌరుడు, వ్యాపారీ, వినియోగదారుడు కూడా టర్కీని బహిష్కరించాల్సిన అవసరం ఉంది. అది దిగుమతులు కావచ్చు, ఎగుమతులు కావచ్చు, పర్యాటకం కావచ్చు. టర్కీ మనదేశాన్ని నిరంతరం వ్యతిరేకిస్తోంది. దీనిని మనం తీవ్రంగా పరిగణించాలి’’ అని కౌన్సిల్‌ ఆఫ్‌ సౌదీ ఛాంబర్స్ చైర్మన్ అజ్లాన్ అల్ అజ్లాన్ ట్వీట్‌లో పిలుపునిచ్చారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ఈ ట్వీట్‌ ఎందుకు చేయాల్సి వచ్చింది?

ఇటీవల టర్కీ అధ్యక్షుడు తయ్యిప్‌ ఎర్దవాన్ నిర్ణయానికి ప్రతిస్పందనగా ఈ ట్వీట్‌ వెలువడిందని భావిస్తున్నారు. ఐక్యరాజ్య సమితిలో మాట్లాడిన ఎర్దవాన్‌, కొన్ని గల్ఫ్‌దేశాలు టర్కీని టార్గెట్ చేసుకున్నాయని, ఇది అస్థిరతకు దారి తీస్తుందని పరోక్షంగా సౌదీఅరేబియాపై విమర్శలు చేశారు.

“ఈ రోజు సవాళ్లు విసురుతున్న దేశాలు నిన్నటి వరకు ఉనికిలో లేవు. రేపు ఉండవు కూడా. అల్లా దయతో మేం చిరకాలం ఉంటాం. మా జెండా ఎగురుతూనే ఉంటుంది’’ అని టర్కీ అధినేత వ్యాఖ్యానించారు. సౌదీ అరేబియా లక్ష్యంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

బహిష్కరణ ఎలాంటి ప్రభావం చూపుతుంది?

సౌదీ అరేబియా ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధిపతి చేసిన ప్రకటన టర్కీపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నదానికి కాలమే సమాధానం చెబుతుంది. అయితే ప్రభావం చూపితే మాత్రం టర్కీ నష్టపోవడం ఖాయం. ఇప్పటికే టర్కీ కరెన్సీ లీరా విలువ పడిపోతోంది.

వరసగా ఎనిమిది సంవత్సరాలుగా టర్కీ కరెన్సీ విలువ తగ్గుతూ వస్తోందని రాయిటర్స్‌ వార్తా సంస్థ తెలిపింది. గత దశాబ్ద కాలంలో టర్కీ కరెన్సీ విలువ 80% పడిపోయింది.

ఈ బహిష్కరణ నిర్ణయం నిజమైతే సౌదీకి చెందిన అనేక కంపెనీలు ఆ దేశంలో పని చేస్తున్నందున్న టర్కీ మీద దాని ప్రభావం తీవ్రంగానే ఉంటుందని మిడిల్‌ ఈస్ట్‌ వ్యవహారాల నిపుణులు కమర్‌ ఆగా అన్నారు.

ప్రతియేటా సౌదీ పౌరులు పెద్ద ఎత్తున టర్కీ సందర్శిస్తుంటారు. "టర్కీ, సౌదీ అరేబియాల మధ్య రాజకీయ విభేదాలు పెరుగుతున్నాయి. ఇస్లామిక్‌ దేశాల నాయకుడిగా ఎదగాలన్న టర్కీ ఆకాంక్షలపై ప్రాంతీయ స్థాయిలో యెమెన్‌, లిబియా, ఇరాక్, సూడాన్‌లు కూడా ఆగ్రహంగా ఉన్నాయి" అన్నారు కమర్‌ ఆగా.

అయితే సౌదీ ప్రభుత్వం అధికారికంగా ఇంత వరకు అలాంటి నిర్ణయం ప్రకటించలేదు. అదే జరిగితే బహ్రయిన్‌, యూఏఈ కూడా అదే బాటలో నడుస్తాయని, అప్పుడు టర్కీకి ఇబ్బందులు మరింత పెరుగుతాయని కమర్‌ ఆగా అన్నారు.

సౌదీ అరేబియాను తక్కువ చేసి చూపించడానికి టర్కీ అధినేత ప్రయత్నిస్తున్నారని ఆరోపణలున్నాయి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సౌదీ అరేబియాను తక్కువ చేసి చూపించడానికి టర్కీ అధినేత ప్రయత్నిస్తున్నారని ఆరోపణలున్నాయి

టర్కీ- సౌదీల మధ్య వ్యాపారం విలువెంత?

ఈ ఏడాది రెండో త్రైమాసికంనాటికి ఎగుమతులలో సౌదీ అరేబియాకు టర్కీ 12వ అతిపెద్ద భాగస్వామి అని రాయిటర్స్‌ వార్తా సంస్థ వెల్లడించింది. తాజా గణాంకాల ప్రకారం టర్కీ నుండి సౌదీ అరేబియాకు ఎగుమతులు జూన్‌లో 180 మిలియన్‌ డాలర్లు కాగా, జూలైలో 185 మిలియన్‌ డాలర్లకు పెరిగాయి.

ఈ ప్రకటన సౌదీ అరేబియా అసహనానికి నిదర్శనమని టర్కీలోని అంకారా ఇల్డిర్మ్‌ బెయజిత్ యూనివర్సీటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న ఒమర్ అనాస్ అన్నారు.

“ఇది ఆవేశంలో చేసిన ప్రకటన. ఎందుకంటే అదే అమలు చేస్తే ప్రపంచ వాణిజ్య సంస్థ ద్వారా కుదుర్చుకున్న అనేక ఒప్పందాలను ఉల్లంఘించినట్లవుతుంది. ఖతార్‌ మాదిరిగా టర్కీని బహిష్కరిస్తే, టర్కీ దాన్ని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్‌లో సవాల్ చేస్తుంది. ఖతార్‌ తీసుకున్న నిర్ణయాన్ని డబ్ల్యూటీఓ తప్పుబట్టింది. సౌదీ విషయంలో కూడా టర్కీకి అనుకూలంగా నిర్ణయం వస్తుంది” అని అనాస్‌ వెల్లడించారు.

“ ప్రపంచ వాణిజ్య సంస్థ నియమాల ప్రకారం తమ దేశ జాతీయ భద్రతకు ముప్పు ఉందని తెలిస్తే తప్ప ఆర్ధికంగా మరొక దేశాన్ని బహిష్కరించడం కుదరదు.ఈ ప్రకటన టర్కీపై రాజకీయంగా ఒత్తిడి తీసుకురావడానికి చేసిన ప్రయత్నం. సౌదీ ప్రజలు దీనిని ఎలా స్వీకరిస్తారో చూడాలి’’ అన్నారు అనాస్‌.

సౌదీ అరేబియా, టర్కీల మధ్య 5 బిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతోందని ఒమర్ అనాస్ వెల్లడించారు. ఇందులో చెరి రెండున్నర బిలియన్‌ల డాలర్ల సంపద ఉందని ఆయన అన్నారు.

"సౌదీ అరేబియా నుంచి టర్కీ పెద్ద ఎత్తున చమురు దిగుమతి చేసుకుంటుంది. అలాగే సౌదీకి అనేక వస్తువులను ఎగుమతి చేస్తుంది. సౌదీ అరేబియా వ్యాపారులు భారీ ఎత్తున టర్కీలో పెట్టుబడులు పెట్టారు. ఇక్కడ వాళ్ల ఇళ్లు, కంపెనీలు అనేకం ఉన్నాయి. గత 5 సంవత్సరాలలో సౌదీకి చెందిన వ్యక్తులు టర్కీలో 5-6 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడి పెట్టారు" అని వివరించారు ఒమర్‌ అనాస్‌.

"సౌదీ నుంచి ప్రతి సంవత్సరం సుమారు 8 లక్షల మంది పర్యాటకులు టర్కీకి వస్తారు. అయితే సౌదీ ప్రభుత్వం ఆర్ధిక బహిష్కరణను అధికారికంగా నిర్ణయం తీసుకుంటే తప్ప టర్కీని దూరంగా పెట్టడం సాధ్యం కాదు. ప్రస్తుతం వెలువడిన ప్రకటన పెద్దగా ప్రభావం చూపదు’’ అన్నారు ఒమర్‌ అనాస్‌.

జర్నలిస్ట్ జమాల్ ఖషోగీ హత్య సౌదీ అరేబియా, టర్కీల మధ్య చిచ్చు రాజేసింది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జర్నలిస్ట్ జమాల్ ఖషోగీ హత్య సౌదీ అరేబియా, టర్కీల మధ్య చిచ్చు రాజేసింది

సంబంధాలు ఎప్పటి నుంచి దెబ్బతింటున్నాయి?

2018లో జర్నలిస్ట్‌ జమాల్ ఖషోగీ హత్య తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించడం మొదలు పెట్టాయి. ఇస్తాంబుల్‌లోని సౌదీ రాయబార కార్యాలయంలో సౌదీ రాజరికాన్ని విమర్శించే జర్నలిస్ట్‌ జమాల్‌ ఖషోగీపై సౌదీ ఏజెంట్ల బృందం దాడి చేసింది. అతని శరీరాన్ని ఖండఖండాలుగా నరికేసినట్లు ఆరోపణలు వినిపించాయి.

ఖషోగీ హత్యకు, సౌదీ అధినాయకత్వానికి సంబంధం ఉందని టర్కీ అధినేత ఎర్దవాన్‌ ఆరోపించారు. ఖషోగీ హత్య కేసులో దోషులకు శిక్షలు మార్చడంపై కూడా టర్కీ ఆగ్రహంగా ఉంది. ఈ కేసులో ఐదుగురికి విధించిన మరణ శిక్షను సౌదీ అరేబియా కోర్టు 7 నుంచి 20 సంవత్సరాల జైలుశిక్షగా మార్చింది.

దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన టర్కీ నిందితులపై గత వారమే పునర్విచారణ ప్రారంభించింది. నిందితులలో టర్కీకి చెందిన వారెవరూ లేకపోవడంతో ఈ కేసు విచారణపై ఆసక్తి నెలకొంది.

ఇదే కాకుండా ఖషోగీ హత్య కేసులో 20మంది సౌదీ పౌరులపై ఇస్తాంబుల్ కోర్టులో విచారణ కొనసాగుతోంది. కొన్ని మధ్య ప్రాచ్య దేశాలు ఇజ్రాయెల్‌తో సంబంధాలు పెట్టుకోవడంపై కూడా టర్కీ అధ్యక్షుడు ఎర్దవాన్‌ అసంతృప్తిగా ఉన్నారు.

యూఏఈ, బహ్రెయిన్ ఇటీవల ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలను పునరిద్ధరించాయి. సౌదీ అరేబియా కూడా త్వరలో అలాంటి ప్రకటన చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

సౌదీ-టర్కీ మధ్య విభేదాలు

టర్కీ అధ్యక్షుడు తయ్యప్‌ ఎర్దవాన్‌ ఆ దేశాన్ని పాలించిన నాయకులలో అతి శక్తివంతమైన రెండో వ్యక్తిగా నిలిచారు. అంతకు ముందు అటాటర్క్‌గా ప్రసిద్ధిగాంచిన టర్కీ వ్యవస్థాపకుడు ముస్తఫా కెమాల్‌ పాషా ఇప్పటి వరకు ఆ దేశంలో అత్యంత శక్తివంతమైన నాయకుడిగా పేరుంది.

ప్రస్తుతం సౌదీ అరేబియా, టర్కీ రెండు ప్రపంచ ఇస్లామిక్‌ దేశాలకు నాయకత్వం వహించాలని గట్టిగా కోరుకుంటున్నాయి. ఒక సమస్యపై సౌదీ అరేబియా స్పందించినప్పుడల్లా టర్కీ దానిని తక్కువ చేసి చూపించడానికి ప్రయత్నిస్తోందన్న ఆరోపణలున్నాయి.

టర్కీ

ఫొటో సోర్స్, MARWAN NAAMANI

మక్కా తమదేశంలోనే ఉందని, మహ్మద్‌ ప్రవక్త ఇక్కడే జన్మించారని, అందువల్ల ఇస్లామిక్‌ దేశాలకు తానే నాయకత్వం వహించాలని సౌదీ భావిస్తోంది. అయితే సౌదీ అరేబియాకంటే తానే శక్తివంతమైన దేశాన్ని కాబట్టి ముస్లిం రాజ్యాలకు తానే నిజమైన నేతనని టర్కీ భావిస్తోంది.

సౌదీ జర్నలిస్ట్‌ జమాల్‌ ఖషోగీ హత్యకు వ్యతిరేకంగా టర్కీ తీవ్రంగా స్పందించింది. ఇప్పుడు ఇజ్రాయెల్‌తో సౌదీ సంబంధాలు ట్టుకోబోతోందన్న వార్తపై కూడా టర్కీ తీవ్రంగానే స్పందిస్తోంది.

ఒక్క సౌదీ విషయంలోనే కాకుండా ఏ ముస్లిం దేశం ఇజ్రాయెల్‌తో సంబంధాలకు ప్రయత్నించినా టర్కీ దానిని వ్యతిరేకిస్తోంది. అయితే టర్కీతో సుదీర్ఘ కాలంపాటు వైరం కొనసాగించడం సాధ్యంకాదని ప్రొఫెసర్‌ ఒమర్‌ అనాస్‌ అంటున్నారు.

“ఖషోగీ కేసు మినహాయించి సౌదీ అరేబియా, టర్కీల మధ్య తీవ్రమైన విభేదాలు ఏమీ లేవు. సౌదీ అరేబియాకు క్రౌన్‌ప్రిన్స్‌ మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్ ఇటీవల ఒక మాట చెప్పారు. సౌదీ అరేబియాలో రాజు సల్మాన్‌, టర్కీలో ఎర్దవాన్‌ ఉన్నంతకాలం వరకు రెండు దేశాల మధ్య సంబంధాలు మాత్రం ఉండవు అన్నారు. ఇరుదేశాల మధ్య సఖ్యత కుదర్చడానికి ఇంకా సమయం ఉంది. ఎందుకంటే రెండు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా చెడిపోలేదు’’ అన్నారు ఒమర్‌ అనాస్‌.

అయితే ముస్లిం దేశాలకు నాయకత్వం వహించేందుకు టర్కీ తహతహలాడుతోందన్న వాదనను ఒమర్ అనాస్ కూడా అంగీకరించలేదు.

"టర్కీ విదేశాంగ విధానం, దాని చరిత్రను చూస్తే టర్కీ ముస్లిం దేశాలకు నాయకత్వం కోరుకుంటోందని చెప్పలేం. టర్కీకి ఐరోపా దేశంగా పేరుంది. అది ఫ్రాన్స్‌, జర్మనీ, ఈజిప్ట్‌లతో పోటీపడాల్సి ఉంది. యూరోపియన్ యూనియన్‌లో సభ్యురాలిగా, నాటో సభ్యురాలిగా కొనసాగాలని టర్కీ కోరుకుంటుంది" అంటారు ఒమర్‌.

“ సౌదీ అరేబియా, ఇరాన్, ఈజిప్టులు ముస్లిం ప్రపంచంలో పాత ఆటగాళ్లు. టర్కీని ఈ క్రీడలో కొత్త ఆటగాడిగా పరిగణించాలి’’ అన్నారు ఒమర్‌ అనాస్‌

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)