హయా సోఫియా: 1500 సంవత్సరాల పురాతనమైన ప్రపంచ వారసత్వ సంపద.. ఇకపై మసీదు

ఫొటో సోర్స్, Getty Images
ఇస్తాంబుల్‌లోని చారిత్రక కట్టడం హయా సోఫియాని మసీదుగా మార్చేందుకు అనుమతించే అధికారిక ఆదేశాలపై టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగన్ శుక్రవారం సంతకం చేశారు.
గతంలో ఈ మ్యూజియం ప్రపంచ ప్రఖ్యాత సాంస్కృతిక ప్రదేశంగానే ఉండాలని టర్కీ అత్యున్నత న్యాయస్థానం అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది.
ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిన ఈ కట్టడం స్థాయిని ఎవరితో చర్చించకుండా మార్చవద్దని యునెస్కో టర్కీని కోరింది.
హయా సోఫియా మసీదుగా టర్కీ ప్రజలకు పరిచితమైన ఈ కట్టడం నిర్వహణ బాధ్యతలు ఎర్డోగన్ జారీ చేసిన ఆదేశాలతో టర్కీ రిలీజియస్ డైరెక్టరేట్ చేతుల్లోకి వెళతాయి. వీరి ఆధ్వర్యంలో మసీదు తలుపులు ప్రార్థనల కోసం తెరుచుకుంటాయి.
ఆధునిక టర్కీ రూపకర్త ముస్తఫా కెమాల్ అతాతుర్క్ 1934లో హయా సోఫియాని మ్యూజియంగా ఉంచేందుకు ఆమోదం తెలిపారు. అప్పటి నుంచి ఈ కట్టడం అన్ని మతాల వారికి ప్రవేశం కల్పిస్తోంది.
టర్కీ అత్యున్నత న్యాయ స్థానం కౌన్సిల్ ఆఫ్ స్టేట్ శుక్రవారం దీనిపై ఆదేశాలు జారీ చేస్తూ.. "ఈ కట్టడం సెటిల్మెంట్ విల్లు ప్రకారం మసీదుగానే ఉంది, దీనిని మరే విధంగానూ వాడేందుకు వీలు లేదు" అని పేర్కొంది.
కానీ, 1934లో మసీదుని మ్యూజియంగా మార్చడం చట్టానికి అనుగుణంగా లేదని న్యాయ స్థానం పేర్కొంది. హయా సోఫియాపై తీర్పును ప్రకటిస్తూ కోర్టు తమ భావాలను పరిగణనలోకి తీసుకోలేదని, సంప్రదాయ రష్యా చర్చి అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు టాస్ వార్తా సంస్థ ప్రచురించింది.
ఈ నిర్ణయం సమాజంలో విభజనలను మరింత పెంచుతుందని పేర్కొంది.
1500 సంవత్సరాల పురాతనమైన ఈ కట్టడాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఇది 1930లలో మ్యూజియంగా మారక ముందు మసీదుగా, అంత కన్నా ముందు చర్చిగా ఉండేది.
గత సంవత్సరం జరిగిన ఎన్నికల ప్రచారంలో టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగన్ దీనిని మసీదుగా మార్చాలనే ప్రతిపాదనను తెచ్చారు.
ఇస్లాం మద్దతుదారులు దీనిని ఎప్పటినుంచో మసీదుగా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, సెక్యులర్ వర్గాలు ఈ డిమాండ్ ని వ్యతిరేకిస్తూ వచ్చాయి. ఈ ప్రతిపాదన అంతర్జాతీయ రాజకీయ, మత నాయకుల విమర్శలు ఎదుర్కొంది.
గ్రీస్ సాంస్కృతిక శాఖా మంత్రి లీన మెండోని ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. టర్కీ ప్రభుత్వం జాతీయ, మత వాదాన్ని ప్రేరేపిస్తోందని ఆమె ఆరోపించారు.
హయా సోఫియాను మసీదుగా మార్చాలంటే అన్ని వర్గాల నుంచి ఆమోదం లభించాలని యునెస్కో డెప్యుటీ డైరెక్టర్ ఎర్నెస్టో ఒట్టోన్ రామిరెజ్ గతంలో గ్రీక్ వార్తా పత్రిక టా నియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పారు.
ఈ ప్రతిపాదనపై యునెస్కో టర్కీకి లేఖ రాసిందని, కానీ వారినుంచి ఎటువంటి జవాబూ రాలేదని చెప్పారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
హయా సోఫియా చరిత్ర ఏమిటి?
ఇస్తాంబుల్‌లోని ఫతిః జిల్లాలో బోస్పోరస్ పశ్చిమ భాగాన హయా సోఫియా నెలకొని ఉంది.
హయా సోఫియాను ఆరవ శతాబ్దంలో బైజాంటిన్ చక్రవర్తి జస్టీనియన్ I ఆదేశాలమేరకు నిర్మించారు. తరువాత దాదాపు 1,000 సంవత్సరాలు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద క్రైస్తవ మత కేంద్రంగా కొనసాగింది.
అప్పట్లో ఈ నగరాన్ని కాన్స్టాంటినోపుల్ అని పిలిచేవారు. అప్పటి బైజాంటిన్ సామ్రాజ్యానికి ఇదే రాజధానిగా ఉండేది.
1453 లో ఒట్టోమన్ చక్రవర్తి ఈ నగరాన్ని ఆక్రమించుకున్నప్పుడు దీన్ని మసీదుగా మార్చేశారు. 1930లలో ఈ మసీదు మ్యూజియంగా మారింది.
ఇది ఇప్పుడు ఎందుకు చర్చనీయాంశమయింది ? 1500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కట్టడం టర్కీ దేశస్థులకు మాత్రమే కాకుండా ప్రపంచంలో మరెన్నో వర్గాల వారికి రాజకీయ, ఆధ్యాత్మిక, మత పరమైన అంశంగా మారింది.
1934లో చేసిన చట్టప్రకారం ఈ భవనంలో ఎటువంటి మతపరమైన కార్యక్రమాలు జరగడానికి వీలు లేదు.
అయితే, దీన్ని తిరిగి మసీదుగా మార్చాలని, మత ప్రార్థనలకు అనుమతివ్వాలని ముస్లింలు, ఇస్లాంవాదులు నిరసనలు నిర్వహించారు.
ఈ ప్రతిపాదనలకు టర్కీ అధ్యక్షుడి మద్దతు కూడా తోడయింది.
గత ఏడాది ఎన్నికల ప్రచార సమయంలో మసీదుని మ్యూజియంగా మార్చడం చాలా పెద్ద తప్పని, తిరిగి దాన్ని మసీదుగా మార్చే అవకాశాలని పరిశీలించాలని అన్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఈస్ట్రన్ ఆర్థడాక్స్ చర్చి ప్రధాన కార్యాలయం, ఎక్యుమెనికల్ పాట్రియార్క్ ఆఫ్ కాన్స్టాంటినోపుల్ ఇప్పటికీ ఇస్తాంబుల్ లోనే ఉంది.
హయా సోఫియాను మసీదుగా మారిస్తే ఇక్కడి క్రైస్తవుల మనోభావాలు దెబ్బతింటాయని, దేశం రెండు ముక్కలుగా విడిపోయే ప్రమాదం ఉందని ఆర్చ్‌బిషప్ పాట్రియార్క్ బర్థోలమ్యూ గతంలో హెచ్చరించారు.
హయా సోఫియాను మసీదుగా మారిస్తే భిన్న మతాల, సంస్కృతుల మధ్య సామరస్యం పెంపొందించగలిగే సామర్థ్యం తగ్గిపోతుందని, మానవాళికి ఇది మంచిది కాదని యూఎస్ సెక్రటరీ ఆఫ స్టేట్ మైక్ పాంపేయో హెచ్చరించారు.
యుఎస్ రాయబారి శామ్ బ్రౌన్బ్యాక్ గత వారం లార్జ్ ఫర్ ఇంటర్నేషనల్ రెలిజియస్ ఫ్రీడమ్ లో మాట్లాడుతూ హయా సోఫియాను యథాతథంగా కొనసాగించాలని పిలుపునిచ్చారు.
"హయా సోఫియా ఎంతో ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ యునెస్కో వారసత్వ సంపద భిన్న విశ్వాసాల ప్రజలకు అందుబాటులో ఉంటూ యథాతథంగా మ్యూజియంగానే కొనసాగించాలని టర్కీ ప్రభుత్వాన్ని కోరుతున్నాను" అని ట్వీట్ చేసారు.
కానీ, ఈ కట్టడం టర్కీ భూభాగంలో ఉంది కాబట్టి దీనిపై తీసుకునే నిర్ణయంలో ఏథెన్స్‌కు ఎలాంటి సంబంధం లేదని టర్కీ విదేశాంగశాఖ మంత్రి మెవ్లట్ కవుసోగ్లు అన్నారు.
"మా దేశం, సంపదపై నిర్ణయాధికారం మాకు మాత్రమే ఉంది" అని టర్కిష్ బ్రాడ్‌కాస్ట్ 24 టీవీతో ఆయన అన్నారు.
ఇవికూడా చదవండి:
- బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించిన తండ్రీకూతుళ్లు
- ‘ముంబయి టైటానిక్’: భారత నౌకా చరిత్రలోనే అతి పెద్ద ప్రమాదం ఎలా జరిగింది?
- మొదటి ప్రపంచ యుద్ధం: శత్రు సేనలను హడలెత్తించిన బుల్లి యుద్ధ ట్యాంక్
- భవిష్యత్తులో అన్నీ రసాయన యుద్ధాలేనా?
- ‘ఇండియాలోని భారతీయులకంటే బ్రిటన్‌లోని భారతీయులే సంప్రదాయబద్ధంగా బతుకుతున్నారు’
- జలియాన్‌వాలా బాగ్ నరమేధం: ‘వందేళ్ల ఆ గాయాలు క్షమాపణలతో మానవు’
- ఆపరేషన్ బ్లూ స్టార్: ‘కాల్పుల శబ్దం ఇప్పటికీ చెవుల్లో మార్మోగుతోంది’
- వెయ్యేళ్ల పాత్ర.. వెల రూ.248 కోట్లు
- జీసస్: నిజంగా నల్లగా ఉండేవాడా?
- తొలి కంచి పీఠాధిపతి ఆది శంకరుడేనా?
- నిజాం నవాబూ కాదు, బిల్ గేట్సూ కాదు.. చరిత్రలో అత్యంత ధనికుడు ఇతనేనా!!
- హైదరాబాద్ పేరెత్తకుంటే.. కశ్మీర్‌ను పాకిస్తాన్‌కు వదిలేస్తామని పటేల్ చెప్పింది నిజమేనా?
- చరిత్ర: ‘విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు’ ఎలా సాధించుకున్నారు?
- ‘అమరజీవి’ పొట్టి శ్రీరాములు: బహుశా.. ఈ తరానికి పెద్దగా తెలియని చరిత్ర ఇది
- వారెన్ బఫెట్ భారతదేశంలో ఎందుకు పెట్టుబడులు పెట్టడం లేదు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









