టర్కీ - గ్రీస్ మధ్య ఉద్రిక్తతలు.. గ్యాస్ కోసమేనా? వేరే వివాదాలున్నాయా?

టర్కీ యుద్ధ నౌక పహారా నడుమ చమురు నిక్షేపాల కోసం కొనసాగుతున్న డ్రిల్లింగ్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, టర్కీ యుద్ధ నౌక పహారాతో చమురు నిక్షేపాల కోసం డ్రిల్లింగ్ కొనసాగిస్తోంది
    • రచయిత, జోనాథన్‌ మార్కస్‌
    • హోదా, డిప్లమాటిక్‌ కరస్పాండెంట్

ఇటీవలి కాలంలో తూర్పు మధ్యధరా సముద్రంలో ఉద్రిక్తతలు తీవ్రంగా పెరుగుతున్నాయి. సహజ వనరుల కోసం సర్వసాధారణంగా జరిగే ఆధిపత్య పోరులో భాగంగానే ఈ టెన్షన్లు పెరుగుతున్నాయి.

ఈ ప్రాంతంలో సహజవాయువు కోసం టర్కీ పెద్ద ఎత్తున అన్వేషణ, తవ్వకాలు ప్రారంభించింది. పెద్ద ఎత్తున యుద్ధనౌకలు ఈ పనులకు రక్షణగా నిలుస్తున్నాయి. అయితే తన ప్రత్యర్ధి గ్రీస్‌ నుంచి దానికి సవాళ్లు ఎదురవుతున్నాయి. గ్రీస్‌కు మద్ధతుగా ఫ్రాన్స్‌ కూడా ఇందులో తలదూరుస్తోంది.

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ నుంచి F-16 యుద్ధ విమానాలు క్రీట్‌లోని ఎయిర్‌ బేస్‌కు చేరుకున్నాయి. గ్రీస్‌ సైన్యాలతో కలిసి అవి ఇక్కడ విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. అయితే ఈ ప్రాంతంలో ఇలా జరగడం సర్వసాధారణంగా మారింది.

మరి ఇక్కడ ఏం జరుగుతోంది? ఇవన్నీ గ్యాస్‌ నిక్షేపాల కోసం పెరుగుతున్న ఉద్రిక్తతలేనా? ఈ ప్రాంతానికి చాలా దూరంలో ఉన్న దేశాలు కూడా ఈ గొడవల్లో ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం భౌగోళిక రాజకీయ సంక్షోభాలకు కేంద్రంగా మారనుందా?

లిబియాలో ఈజిప్టు మద్దతిస్తున్న దళాలను అడ్డుకున్న టర్కీ

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, లిబియాలో ఈజిప్టు మద్దతిస్తున్న దళాలను అడ్డుకున్న టర్కీ

దూకుడుగా టర్కీ

గ్యాస్‌ నిక్షేపాల అన్వేషణే ప్రధాన కారణంగా కనిపిస్తున్నా, ఈ ఉద్రిక్తతలకు మూలాలు ఇంకా లోతుగానే ఉన్నాయి. చాలా కాలం నుంచి టర్కీ, గ్రీస్‌ల మధ్య ఉన్న విభేదాలు, ఈ కొత్త పరిణామాలతో మరింత తీవ్రంగా మారాయి.

టర్కీ దూకుడుగా వ్యవహరిస్తుండటంతో ఈ ప్రాంతంలో ఆ దేశంతో భౌగోళిక- వ్యూహాత్మక శత్రుత్వం ఉన్న దేశాలు ఈ వివాదంలో అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీంతో ఈ ఉద్రిక్తతలు లిబియా నుంచి సిరియా వరకు ఉన్న మధ్యధరా సముద్రమంతటికీ పాకాయి.

వాస్తవానికి ఈ ప్రాంతంలో టెన్షన్లు రోజురోజుకు పెరుగుతున్నాయి. టర్కీ ప్రాంతీయ ఆకాంక్షలను అడ్డుకోడానికి, దానితో శత్రుత్వం ఉన్న దేశాలన్నీ ఏకమవుతుండగా, టర్కీ ఏకాకిగా మారుతోంది. ఆ దేశానికి సమస్యలు ఇంతకు ముందుకన్నా పెరిగేలా కనిపిస్తున్నాయి.

మధ్యధరా సముద్ర తీరంలో పెరుగుతున్న ఉద్రిక్తతలతో మరో విషయం కూడా ముందుకు వచ్చింది. ఈ ప్రాంతంలో అమెరికా పట్టు తగ్గిపోతోంది. ట్రంప్‌ ప్రభుత్వ వ్యూహాలు ఇక్కడ పూర్తి స్థాయిలో పని చేయకుండా పోయినట్లు కనిపిస్తోంది.

రష్యా నుంచి టర్కీ అత్యాధునిక మిసైళ్లను కొనుగోలు చేశాక.. ట్రంప్‌ ప్రభుత్వం టర్కీకి F-35 యుద్ధ విమానాలను నిలిపేసింది. కానీ టర్కీ మీద అమెరికా పెడుతున్న ఈ ఒత్తిళ్లు నాటోలో, సిరియాలో లేదంటే మరెక్కడైనా అమెరికా విధానాలకు ఏమాత్రం ఉపయోగపడటం లేదు.

అమెరికా పక్కకు తప్పుకోవడం, గ్రీస్‌తో ఫ్రాన్స్‌ చేతులు కలిపిన తరుణంగా టర్కీ-గ్రీస్‌ల మధ్య మధ్యవర్తిత్వానికి జర్మనీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు దేశాల మధ్య అసలు సమస్యలు ఏంటో ఒక్కసారి చూద్దాం.

మధ్యధరా సముద్రంలో ఒక చమురు ఉత్పత్తి కేంద్రం

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, మధ్యధరా సముద్రంలో ఒక చమురు ఉత్పత్తి కేంద్రం

గ్యాస్‌ నిక్షేపాలు

మొదట్లో అంతా సహజ వాయువు (గ్యాస్‌) చుట్టూ నడిచింది. ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున గ్యాస్‌ నిక్షేపాలు కనుగొనగా, కొన్నిదేశాలు నిక్షేపాల వేటను ముమ్మరం చేశాయి.దీంతో పరిణామాలు వేగంగా మారాయి. ప్రాదేశిక జలాలలో హద్దులను అతిక్రమించారన్న ఆరోపణలతో పలుదేశాల మధ్య వైరం పెరిగింది. సముద్రగర్భంలో ఉన్న ఏ ప్రాంతం ఎవరిది అన్న వివాదాలు మొదలయ్యాయి.

అయితే ఎవరి హక్కులు, హద్దులు ఎంత వరకు అన్న విషయంలో జరిగిన ఒప్పందాలు కూడా గొడవలు మరింత ముదరడానికి కారణమయ్యాయి. లిబియాతో ఒప్పందం కుదుర్చుకుని, గ్రీస్‌ తనదిగా చెప్పుకుంటున్న ఎకనామిక్‌ జోన్‌లో టర్కీ తవ్వకాలు మొదలు పెట్టింది.

ఈ నెల ఆరంభంలో టర్కీకి ఆగ్రహం తెప్పించే ఒక సముద్ర జల ఒప్పందంపై గ్రీస్‌, ఈజిప్టులు సంతకాలు చేశాయి. దీంతో ఇక్కడ నిక్షేపాల తవ్వకాల పనులతోపాటు యుద్ధ నౌకల కదలికలు కూడా పెరిగాయి.

ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, ఈ ప్రాంతంలో ఇంధన అన్వేషణ అనివార్యంగా ఉద్రిక్తతలను పెంచుతుంది. దీర్ఘకాలిక నౌకా, ఆయుధ పోటీకి దారి తీసే ప్రమాదం ఉంది. ఈ సహజ వాయువు నుంచి ఆర్ధిక ప్రయోజనాలు పొందాలంటే దీనిపై సంఘటిత చర్య అవసరం.

పైప్‌లైన్‌ ద్వారా సముద్ర గర్భం నుంచి ఈ చమురును సరఫరా చేసుకునే ఏర్పాట్లు చేసుకోవాలి. ముఖ్యంగా యూరోపియన్‌ మార్కెట్లకు వీటిని తరలించాలంటే వివిధ దేశాల సముద్ర గర్భాల గుండా ఈ పైప్‌లైన్లు ప్రయాణించాల్సి ఉంటుంది.

మధ్యధరా సముద్రంలో చమురు వెలికితీతకు అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాల కల్పన జరుగుతుంది. దీని వల్ల ఉద్రిక్తతలు కూడా తగ్గుతాయి. దీనితోపాటు దీర్ఘకాలికంగా కొనసాగుతున్న సైప్రస్‌ వివాదం కూడా పరిష్కారమవుతుంది.

సైప్రస్ వివాదం

సైప్రస్‌ వివాదం ఏంటి?

టర్కీ 1974లో సైన్యాలతో దాడి చేసి, ఆ తర్వాత టర్కిష్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ నార్తర్న్‌ సైప్రస్‌ ఏర్పాటు చేసినప్పటి నుంచి సైప్రస్‌ విషయంలో గ్రీస్‌, టర్కీ దేశాల మధ్య వివాదం నడుస్తోంది. ఆధునిక టర్కీ రాజ్య నిర్మాణానికి ముందు నుంచి ఈ ప్రాంతంపై రెండు దేశాల మధ్య వివాదం నడుస్తోంది.

అంతకు ముందు కూడా అనేక ప్రయత్నాలు జరిగాయి. యూరోపియన్‌ యూనియన్‌లో చేరడానికి టర్కీ చాలా దగ్గరగా వచ్చిన తరుణంలో సైప్రస్ సమస్య పరిష్కారమవుతుందని అంతా భావించారు. కానీ అది అసాధ్యమని తేలిపోయింది.

ఇప్పుడు టర్కీ యూరోపియన్‌ యూనియన్‌లో చేరే అవకాశాలు దాదాపు లేవు. కొత్త ఉద్రిక్తతలు ఈ పాత వివాదాలకు తోడయ్యాయి.

టర్కీ నౌకాదళం రక్షణలో గ్యాస్ నిక్షేపాల అన్వేషణ నౌక పనులు కొనసాగిస్తోంది

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, టర్కీ నౌకాదళం రక్షణలో గ్యాస్ నిక్షేపాల అన్వేషణ నౌక పనులు కొనసాగిస్తోంది

నయా ఒటోమన్‌ రాజ్యం టర్కీ

ఇక్కడ మరో ముఖ్యమైన అంశం టర్కీ అనుసరిస్తున్న విదేశాంగ విధానం. ప్రస్తుత టర్కీ విధానాలు పాత ఒటోమన్‌ సామ్రాజ్యపు విధానాలను పోలి ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు ఎర్దొవాన్‌ దేశ సరిహద్దులను మరింత విస్తరించాలని కోరుకుంటున్నారు.

ప్రచ్ఛన్నయుద్ధం తర్వాత టర్కీ తన వైఖరినీ క్రమంగా మార్చుకుంటూ వచ్చింది. లౌకిక రాజ్యం నుంచి ఇస్లామిక్‌ స్టేట్‌ దిశగా దేశ నాయకత్వం అడుగులు వేస్తోంది.

ప్రస్తుత ఆర్ధికి స్థితిగతులనుబట్టి ఈ ప్రాంతంలో తాము బలమైన శక్తిగా ఎదుగుతామని అధికార ఏకేపీ పార్టీ భావిస్తోంది. అయితే ఇటీవలి కాలంలో టర్కీ ఆర్ధిక పరిస్థితి కాస్త మందగించినట్లు చెబుతున్నా, అధినేత మాత్రం వెనక్కి తగ్గేలా లేరు.

ప్రభుత్వం ఇటీవల రూపొందించిన బ్లూ-హోంల్యాండ్‌ సిద్ధాంతం ప్రకారం తన ప్రాదేశిక జలాలపై పట్టు మరింత పెరుగుతుందని టర్కీ ఊహిస్తోంది.

టర్కీ స్వార్ధపరురాలని, తనకు ప్రయోజనాలను కాపాడుకోవడానికి స్నేహితులను, శత్రువులను సమానంగా చూస్తుందని పలు దేశాలు విమర్శిస్తుంటాయి.

అయితే టర్కీ కూడా తన దేశ ప్రయోజనాలు దెబ్బతిన్నాయని, ముఖ్యంగా సిరియా విషయంలో నాటోతోపాటు అమెరికా కూడా తనను మోసం చేసిందని భావిస్తుంది.

తనకు అవసరమైనచోట రష్యా, ఇరాన్‌లను కలుపుకుపోతోంది టర్కీ. ముఖ్యంగా సిరియాలో టర్కీ ఒకరకంగా ప్రచ్ఛన్న యుద్ధం చేసింది. లిబియా విషయంలో ఈజిప్టు, యునైటెడ్ అరబ్‌ ఎమిరేట్స్‌ టర్కీని తీవ్రంగా వ్యతిరేకించాయి.

ఎర్డోగన్

ఫొటో సోర్స్, EPA

ఐక్యరాజ్యసమితి మద్దతు ఉన్న లిబియా ప్రభుత్వంవైపు టర్కీ మొగ్గుచూపగా, యూఏఈ, ఈజిప్టులు జనరల్ ఖలీఫా హఫ్తార్ నాయకత్వంలోని తూర్పు మిలీషియాలకు మద్దతు ఇచ్చాయి. టర్కీ, యూఏఈలు డ్రోన్‌లతో లిబియా గగనతలంలో ప్రచ్ఛన్న యుద్ధం సాగించాయి.

యూఏఈ చైనా తయారు చేసిన డ్రోన్‌లను వాడుతుండగా, టర్కీ సొంత డ్రోన్‌లు వాడింది. టర్కీ వాయుసేనలు GNAను రక్షించడంలో నిర్ణయాత్మక పాత్ర పోషించాయి.

లిబియా సమస్య టర్కీ-ఈజిప్టుల మధ్య నిప్పు రాజేసింది. ముస్లిం బ్రదర్‌హుడ్‌ నుంచి ఈజిప్టును తప్పించడంతో టర్కీతో ఆ దేశానికి ఉన్న సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.

అదే లిబియా విషయంలోనే ఫ్రాన్స్‌ కూడా టర్కీకి శత్రువుగా మారింది. ఇటీవలి కాలంలో ఆయుధాలతో లిబియాకు వెళుతున్న ఫ్రాన్స్‌ నౌకను టర్కీ తన నౌకలతో అడ్డుకుంది.

ఒకపక్క టర్కీ-గ్రీక్‌ ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే, ఈజిప్టుకు మద్దతుగా ఫ్రాన్స్‌ రెండు యుద్ధ నౌకలను పంపింది.

మధ్యధరా సముద్రంలో ఇప్పుడున్న టెన్షన్‌లకు చమురు నిక్షేపాల అన్వేషణ వ్యవహారమే కారణమైనప్పటికీ,. అంతకు మించిన సమస్యలు కూడా ఉన్నాయి. కొన్ని సమస్యలు అప్పటికప్పుడు పుట్టుకొచ్చినవి కాగా, కొన్ని దీర్ఘకాలిక వివాదాలు.

తక్షణ సంక్షోభ నివారణ ప్రయత్నాలు ఎక్కడ అవసరమంటే అది కచ్చితంగా మధ్యధరా సముద్ర ప్రాంతంలోనే. కానీ దాని పరిష్కారం సాధ్యమవుతుందా? ఇరు వర్గాలు సాధ్యం కానిస్తాయా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)