సౌదీ అరేబియాకు పాకిస్తాన్ కన్నా భారత్ ఎందుకు మిన్న?

ఫొటో సోర్స్, GETTY IMAGES
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా సౌదీ అరేబియాలో పర్యటిస్తున్నారు. ఆయన సోమవారం నాడు పలువురు సౌదీ అధికారులను కలిశారు.
వాస్తవానికి పాకిస్తాన్‌కు, సౌది అరేబియాకు మధ్య సంబంధాలు అంత మెరుగ్గా లేవు. కశ్మీర్ విషయంలో ఈ రెండు దేశాల మధ్య భేదాభిప్రాయాలున్నాయి. వీటిని తగ్గించే క్రమంలోనే పాక్ ఆర్మీ చీఫ్ సౌదీ పర్యటన పెట్టుకున్నారని అంటున్నారు.
కశ్మీర్ విషయంలో భారత వైఖరిని ఖండించాలని పాకిస్తాన్ సౌదీ అరేబియాను పదేపదే కోరుతోంది. కానీ, పాకిస్తాన్‌కు ఇచ్చే ఆర్ధిక సాయాన్ని నిలిపేస్తున్నట్లు సౌదీ అరేబియా ప్రకటించింది.
బజ్వా సౌదీ పర్యటన సైనిక వ్యవహారాలపై చర్చ కోసమేనని పాక్ ఆర్మీ ప్రతినిధి వెల్లడించారు. అయితే సౌదీ అరేబియాను శాంతింపజేయడానికి కూడా ఆయన ప్రయత్నిస్తారని సైన్యం, ప్రభుత్వంతో సంబంధం ఉన్న అధికారులు రాయిటర్స్ వార్తా సంస్థకు వెల్లడించారు.
సౌదీ అరేబియా తాను పాకిస్తాన్‌కు ఇచ్చే ఆర్ధిక సాయం విషయంలో మనసు మార్చుకోకపోతే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ విదేశీ మారక నిల్వలు పూర్తిగా పడిపోతాయని అధికారులు చెబుతున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
సౌదీ అరేబియా రక్షణశాఖ ఉపమంత్రి ఖలీద్ బిన్ సల్మాన్‌తో బజ్వా సమావేశమయ్యారు. “ఈ రోజు నేను నా సోదరుడు, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వాతో భేటీ అయ్యాను. ద్వైపాక్షిక సంబంధాలు, సైనిక సహకారం, ప్రాంతీయ శాంతి అంశాలపై మేం చర్చించాం’’ అని ఖలీద్ బిన్ సల్మాన్ ట్విటర్‌లో తెలిపారు.
పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా సౌదీ ఆర్మీ చీఫ్ మేజర్ జనరల్ ఫయాద్ బిన్ హమద్ అల్ రువాయిలీతో కూడా చర్చలు జరిపారని రక్షణ శాఖ తన వెబ్‌సైట్‌లో తెలిపింది. ఈ సమావేశంలో సైనిక సహకారం, ఉమ్మడి ప్రయోజనాల గురించి చర్చించారు.
పాకిస్తాన్, సౌదీ అరేబియా సంప్రదాయకంగా మిత్రదేశాలు. చమురు కొనుగోలు కోసం 3.2 బిలియన్ డాలర్లను రుణంగా ఇస్తామని 2018 సంవత్సరం చివరిలో సౌదీ అరేబియా పాకిస్తాన్‌కు హామీ ఇచ్చింది.

ఫొటో సోర్స్, ANADOLU AGENCY
భారత్‌తో సౌదీ వాణిజ్యం ఎక్కువ
కశ్మీర్ సమస్యపై జోక్యం చేసుకోవాలని పాకిస్తాన్ తనపై ఒత్తిడి చేయడంతో ఈ రుణంలో బిలియన్ డాలర్లను వెనక్కి తీసుకుంటున్నట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. మరో బిలియన్ డాలర్లను కూడా వెనక్కివ్వాలని కోరింది.
అయితే ఈ అంశంపై స్పందించాలని రాయిటర్స్ కోరగా, సౌదీ ప్రభుత్వ మీడియా కార్యాలయం నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.
చమురు కొనుగోలుకు రుణాన్ని పెంచాలన్న పాకిస్తాన్ విజ్జప్తిని కూడా సౌదీ అరేబియా పట్టించుకోలేదు. ఈ సమాచారాన్ని ఆ దేశ సైనిక, ఆర్ధిక మంత్రిత్వ శాఖలు రాయిటర్స్ వార్తా సంస్థకు తెలిపాయి.
“మా విదేశాంగ విధానం మారలేదని వారిని (సౌదీ అరేబియా) ఒప్పించడమే మా లక్ష్యం’’ అని పాకిస్తాన్‌కు చెందిన ఒక సైనిక ఉన్నతాధికారి వెల్లడించారు.
కశ్మీర్ మాదంటే మాదని భారత్, పాకిస్తాన్ రెండూ వాదిస్తున్నాయి. ఈ ప్రాంతం ఇప్పుడు రెండు దేశాల ఆధీనంలో ఉంది. కశ్మీర్‌పై నియంత్రణ కోసం రెండు దేశాలు మూడుసార్లు యుద్ధం చేశాయి.
పాకిస్తాన్ పదే పదే విజ్జప్తి చేస్తున్నప్పటికీ సౌదీ అరేబియా నేతృత్వంలోని ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (OIC) చాలా తక్కువసార్లు కశ్మీర్ సమస్యపై చర్చించింది.
కశ్మీర్ విషయంలో పాకిస్తాన్‌కు మద్దతు ఇవ్వడం ద్వారా భారత్‌తో తనకున్న వ్యాపార ప్రయోజనాలను సౌదీ అరేబియా దెబ్బతీసుకోదని నిపుణులు అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
‘పోట్లాడుకునేంత పెద్దవి కావు’
చైనా-పాకిస్తాన్ కారిడార్‌లో తన ప్రత్యర్ధి అయిన ఇరాన్ కూడా పాల్గొనడంపై సౌదీ అరేబియా అసంతృప్తితో ఉంది. సౌదీ-పాకిస్తాన్ దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం విలువ 3.6 బిలియన్ డాలర్లుకాగా, భారత్-సౌదీ అరేబియాల మధ్య వాణిజ్యం 27 బిలియన్ డాలర్లు ఉంటుంది. అలాంటప్పుడు భారత్‌ను ఇబ్బంది పెట్టేలా సౌదీ అరేబియా ఎలా వ్యవహరించ గలుగుతుంది?
ఒకవేళ సౌదీ అరేబియా కశ్మీర్ సమస్యపై స్పందించకపోతే పాకిస్తాన్ మిగిలిన ఇస్లామిక్ దేశాలతో చర్చలు జరుపుతుందని పాక్ విదేశాంగ మంత్రి షా మొహమ్మద్ ఖురేషీ ఇటీవల వ్యాఖ్యానించారు.
సౌదీ అరేబియా అభ్యర్ధనతో ఫోరమ్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ సమావేశానికి వెళ్లకుండా చివరి నిమిషంలో పాకిస్తాన్ తప్పుకుంది. ఈ ఇస్లామిక్ దేశాల ఫోరమ్‌ను ఓఐసీలో తనకు ప్రత్యర్ధిగా భావిస్తోంది సౌదీ అరేబియా.
“రెండు దేశాల మధ్య స్నేహం కొనసాగుతుందని నేను భావిస్తున్నా. ఎందుకంటే వీటి మధ్య సంబంధాలు పోట్లాడుకునేంత ఘోరంగా ఏమీ లేవు’’ అని పాకిస్తాన్‌కు చెందిన మత నాయకుడు హఫీజ్ తాహిర్ అష్రఫ్ అన్నారు.
సౌదీ రాజు సల్మాన్, యువ రాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌లకు పాకిస్తాన్‌తో మంచి సంబంధాలున్నాయని అష్రఫ్ రాయిటర్స్‌తో అన్నారు.
“విమర్శలు చేసే ముందు దాని నుంచి పొందుతున్న సాయం గురించి ఆలోచించాలి. మమ్మల్ని అమెరికా నాశనం చేసింది, సౌదీ అరేబియా నాశనం చేసిందని అంటూనే ఉంటాం. మళ్లీ సాయం కోరుతూనే ఉంటాం’’ అని అమెరికాలో పాకిస్తాన్ మాజీ రాయబారిగా పనిచేస్తున్న హుస్సేన్ హక్కానీ ట్విటర్‌లో వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
- జునాగఢ్ ఆశతో పాకిస్తాన్ కశ్మీర్‌ను చేజార్చుకుందా, ఈ సంస్థానం భారత్‌లో ఎలా కలిసింది?
- అమ్మోనియం నైట్రేట్ అంటే ఏమిటి.. అది ఎంత ప్రమాదకరం
- 'నా భర్త నన్ను కొడుతుంటే అందరూ ఇది
- చిన్న మార్పుతో చైనాను భారీ దెబ్బకొట్టిన ఇండియా
- ఆంధ్రప్రదేశ్‌లో బొగ్గు గనులు: తక్కువ లోతులోనే బొగ్గు ఉన్నా ఎందుకు తవ్వట్లేదు?
- భారత్‌లో నాలుగు దశాబ్దాల్లో తొలిసారిగా భారీగా తగ్గిన కర్బన ఉద్గారాలు
- పాకిస్తాన్ కొత్త మ్యాప్ గురించి చైనా ఎందుకు నోరు మెదపలేదు
- భారత్-చైనా సరిహద్దుల్లో భారీ రవాణా సదుపాయాలు ఎందుకు నిర్మిస్తున్నారు?
- చైనా - భారత్ సరిహద్దు సంఘర్షణ: 21వ శతాబ్దపు అతిపెద్ద జగడం ఇదేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








