బెల్జియం: వాటర్ ఫౌంటెయిన్‌లో దొరికిన పెట్టెలో మనిషి గుండె.. 180 ఏళ్లుగా భద్రం

ఫొటో సోర్స్, VERVIERS.BE
బెల్జియంలోని వెర్వర్స్ నగరం నడిబొడ్డున ఉన్న ఓ ఫౌంటెయిన్ మధ్యలో ఒక పెట్టె ఉంది. అందులో ఆ నగరానికి మొట్టమొదటి మేయర్‌గా పనిచేసిన పియరీ డేవిడ్ గుండె భద్రపరిచి ఉంది.
ఆల్కాహాల్‌లో పియరీ గుండెను భద్రపరిచి దానిని ఒక జింకుపెట్టెలో ఉంచారు. ఫౌంటెన్‌ను రిపేర్ చేస్తుండగా ఈ పెట్టె రాళ్ల మధ్యలో బయటపడడంతో వందల ఏళ్ల కిందటి విషయం వెలుగు చూసింది.
ప్రస్తుతం ఈ పెట్టెను నగరంలోని మ్యూజియం ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌లో ఉంచారు. మేయర్ పియరీ డేవిడ్ 1839లో మరణించారు. 1883లో ప్రారంభించిన ఈ ఫౌంటెయిన్‌కు ఆయన పేరు పెట్టారు.
ఫౌంటెయిన్ మధ్యలో దాచి ఉంచుతున్నట్లు ఈ పెట్టె మీద రాశారు. “జూన్ 25, 1883న పియరీ డేవిడ్ గుండెను ఈ స్మారక చిహ్నంలో భద్రపరిచాం’’ ఆని దానిపై రాసి ఉంది.

ఫొటో సోర్స్, VERVIERS.BE
గుండెను దాయడంపై స్థానికంగా ప్రచారంలో ఎన్నో కథలు
“ఈ ప్రాంతంలో వినిపించే ఒక గాథ నిజమైంది. ఈ పెట్టే ఫౌంటెయిన్‌లో ఉంది. దానికి దగ్గర్లోనే పియరీ డేవిడ్ విగ్రహం ఉంది. దాని వెనక ఉన్న ఒక రాయిని మరమ్మతు సందర్బంగా తొలగించినప్పడు ఈ పెట్టె బయటపడింది’’ అని నగర ప్రజాపనుల విభాగం అధ్యక్షుడు మాగ్జైమ్ డీగే వెల్లడించారు.
ఆగస్టు 20న RTBF ఛానల్‌తో మాట్లాడుతూ “ ఆ పెట్టె చెక్కుచెదరకుండా ఉంది’’ అని మాగ్జైమ్ వ్యాఖ్యానించారు.
1839లో పియరీ డేవిడ్ తన 68ఏట మరణించారు. ఆయన స్మారక చిహ్నం నిర్మించడానికి నగర ప్రజలు విరాళాలు సేకరించారు. పియరీ కుటుంబ సభ్యుల అంగీకారంతో ఒక డాక్టర్ ఆయన శరీరం నుంచి గుండెను వేరు చేశారు.
అయితే ఈ స్మారక చిహ్నం నిర్మాణానికి అవసరమైన విరాళాల సేకరణ దశాబ్దాలపాటు కొనసాగిందని www.verviers.be వెబ్‌సైట్ పేర్కొంది. ప్లేస్‌వెర్టే ప్రాంతంలో ఈ స్మారక స్థూపాన్ని ఏర్పాటు చేయడానికి ముందు దీన్ని ఎంత అందంగా నిర్మించాలన్న దానిపై చర్చోపచర్చలు జరిగాయి.

ఫొటో సోర్స్, verviers.be
ఎవరీ పియరీ డేవిడ్ ?
పియరీ డేవిడ్ 1830లో బెల్జియం స్వతంత్ర దేశంగా మారే వరకు అనేక ఇబ్బందులను, కష్టనష్టాలను చవిచూశారు.
1800-1808 మధ్యకాలంలో ఆయన వెర్వెర్స్ నగరానికి మేయర్‌గా పని చేశారు. అప్పట్లో బెల్జియం ఫ్రాన్స్ పాలనలో ఉండేది.1830లో డచ్ వారి మీద పోరాడి బెల్జియ స్వాతంత్ర్యం పొందాక మళ్లీ వెర్వెర్స్ నగరానికి పియరీ డేవిడ్ మేయర్‌గా ఎన్నికయ్యారు.
1802లో అప్పటికి కొత్త ఆవిష్కరణ అయిన ఫైరింజన్ సర్వీసును వెర్వెర్స్ నగరంలో ఏర్పాటు చేశారు డేవిడ్.
ఫ్రాన్స్ స్వేచ్ఛా విధానాలను, ఫ్రెంచ్ విప్లవాన్ని ఎంతో ఇష్టపడే డేవిడ్ 1815 నుంచి 1830 వరకు డచ్ పాలనలో గడపాల్సి వచ్చింది.
1830 నాటి ఉద్యమంలో వెర్వెర్స్ నగరం తీవ్రంగా ధ్వంసం కాగా, దానిని బాగు చేసే బాధ్యతలు పియరీ డేవిడ్‌కు అప్పజెప్పారు.
ఇవి కూడా చదవండి:
- కోనసీమకు కొబ్బరి ఎలా వచ్చింది, ఎలా విస్తరించింది
- ‘బొమ్మలాట’లో భారత్ చైనాను ఓడించగలదా
- అన్‌లాక్-4 తరువాత దేశ ఆర్థిక పరిస్థితి ఎలా మారబోతోంది..
- 139 మంది తనపై అత్యాచారం చేశారన్న యువతి కేసులో.. అండగా ఉన్నవాడే అసలు నిందితుడా?
- జీడీపీ అంటే ఏమిటి? ఎలా లెక్కిస్తారు? ఈ గణాంకాలు ఎందుకంత కీలకం
- లిరా పడిపోతోంది.. రూపాయినీ లాక్కెళుతోంది
- జీడీపీ భారీ పతనం.. తొలి త్రైమాసికంలో 23.9 శాతం కుదేలు.. మాంద్యం ముంచుకొస్తోందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








